మారువేషాల మొనగాడు, 'రబ్బర్ ఫేస్' మాఫియా కింగ్‌ మీద ఆ ఊరి ప్రజల కన్ను పడింది, తీగ లాగితే డొంకంతా కదిలింది...

సోయరెన్ బర్గ్ ఆర్న్‌బక్‌, ఆయన మారువేషాలు
ఫొటో క్యాప్షన్, సోయరెన్ బర్గ్ ఆర్న్‌బక్‌, ఆయన మారువేషాలు
    • రచయిత, మ్యాట్ ముర్రే
    • హోదా, బీబీసీ న్యూస్

పదకొండేళ్ళుగా పరారీలో ఉన్న 'రబ్బర్ ముఖం మనిషి' పట్టుబడ్డాడు. ఆ మారుమూల పల్లెలో తమ కార్యకలాపాలు ఎవరూ గుర్తించరనే నమ్మకం ఆ దెబ్బతో పటాపంచలైంది. వెస్ట్‌వేల్స్‌లోని గ్రామీణ ప్రాంతంలో నలభై ఏళ్ళ కిందట ఈ ఘటన జరిగింది.

ఆపరేషన్ సీల్ బేలో భాగంగా 1983లో ఓ సీక్రెట్ బంకర్‌ను కనుగొన్నప్పుడు అంతర్జాతీయ డ్రగ్ రింగ్ గుట్టు రట్టయింది.

రాబిన్ బాస్‌వెల్, సోయరెన్ బర్గ్ ఆర్న్‌బక్‌ను రింగ్ లీడర్లుగా గుర్తించారు. అప్పటికి 11 ఏళ్లుగా సోయరెన్ పరారీలో ఉన్నాడు. మారువేషాల మొనగాడుగా పేరుగాంచిన 35 ఏళ్ల సోయరెన్, యూరప్‌లో మోస్ట్ వాంటెడ్ మాదకద్రవ్యాల వ్యాపారి.

1983లో ఇతను విలాసవంతమైన పడవలు, విల్లాలతో ఇటలీ, స్విజ్జర్లాండ్‌లో రాజభోగాలు అనుభవిస్తుండేవాడు.

అయితే పెంబ్రోక్‌షైర్లోని వేల్స్‌కు వెళుతున్నప్పుడు అతని పరారీ ముగిసింది. డైఫెడ్ పౌస్ పోలీసు స్టేషన్‌లో డాన్‌ఎవాన్స్ డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు.

డిటెక్టివ్ సూపరింటెండెంట్ డెరిక్ డేవిస్‌తో కలిసి ఆపరేషన్ సీల్ బే వ్యవహారాలు చూస్తున్నారు. నలభై ఏళ్ల తరువాత ఎవాన్స్ బీబీసీతో మాట్లాడుతూ డ్రగ్స్ రింగ్‌ను ఎలా పట్టుకోగలిగారో వివరించారు.

తీరప్రాంత పట్టణమైన న్యూపోర్టులోని ప్రజల సహజమైన ఉత్సుకతే వారిని పట్టించింది.

‘ఈ నేరగాళ్లు స్థానికులు వారినేమీ పట్టించుకోరని తక్కువగా అంచనా వేశారు. మేము ఆ ప్రాంతంలో నివసించే దాదాపు 540మంది నుంచి స్టేట్‌మెంట్స్ తీసుకున్నాం’ అని ఎవాన్స్ చెప్పారు.

సోయరెన్ బర్గ్ ఆర్న్‌బక్‌
ఫొటో క్యాప్షన్, యూరప్‌లో మోస్ట్ వాంటెడ్ మాదకద్రవ్యాల వ్యాపారి సోయరెన్ బర్గ్ ఆర్న్‌బక్‌

అన్ని లీడ్స్‌ను కలిపాం...

న్యూపోర్టుకు సమీపంలోని సముద్రానికి దగ్గరగా స్యూవార్నర్ తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. తీరంలో అనుమానస్పదమైన కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా వీరు పోలీసులకు రిపోర్ట్ చేశారు.

స్థానిక బార్‌లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం ద్వారా డ్రగ్ డీలర్లు అక్కడి స్థానికుల దృష్టిలో పడ్డారు. ‘‘అక్కడ కొంతమంది విలాసవంతమైన హోటళ్లలో ఉంటూ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేసేవారు’’ అని వార్నర్ చెప్పారు.

‘‘వారు డ్రింక్స్ కోసం 50 పౌండ్ల నోటు చెల్లించారు. అనేక పార్టీలు చేసుకున్నారు. బోలెడు డబ్బు, ఖరీదైన కార్లు... వీటిని చూసి జనం వీరి గుట్టును కనుగొనే పనిలో పడ్డారు’’ అని తెలిపారు.

‘‘ఆరోజు రాత్రి మానాన్న ఇరుగుపొరుగువారితో కలిసి కొండపైన క్యాంప్ వేశారు. మాదకద్రవ్యాల వ్యాపారులు డ్రగ్స్‌ను దాచాలనుకున్న ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు నిద్రపోతుండటాన్ని గమనించారు. ఇక అక్కడి నుంచి అన్ని విషయాలు వెలుగులోకి రావడం మొదలైంది’’ అని వార్నర్ చెప్పారు.

పీతలు పట్టుకునే వారు కూడా తీరంలో ఏదో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు న్యూపోర్టు తీర రక్షణ దళానికి చెప్పారు. డ్రగ్స్ ముఠా సభ్యులు నౌకా సిబ్బందికి తాము గ్రీన్‌ల్యాండ్ యాత్రకు వచ్చినట్టుగా తెలిపారు.

తీరంలో అనుమానస్పదమైన కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా పోలీసులకు చెప్పిన వార్నర్, ఆమె కుటుంబం
ఫొటో క్యాప్షన్, తీరంలో అనుమానస్పదమైన కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా పోలీసులకు చెప్పిన వార్నర్, ఆమె కుటుంబం

బోలు శబ్దం... బంకర్ రహస్యం

అయితే, నౌకా సిబ్బంది వీరి మాటలను నమ్మలేదు. వెనక్కి తిరిగొచ్చి డైఫెడ్ పౌస్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తీర ప్రాంతంలో ఓ రైతుసాయంతో ఈ ముఠాని వెదకాలని నిర్ణయించుకున్నారు. ఈ వెదుకులాటలో ఓ రాయి తీసుకుని అక్కడున్న గుహలో విసరగా అది నేలను తాకి బోలుశబ్దం చేసింది. దీంతో లోపల ఏదో ఉందనే అనుమానం కలిగింది. అక్కడున్న రాళ్లను తొలగించాక ఓ అండర్‌ గ్రౌండ్ బంకర్‌కు వెళ్ళే దారిని కనుగొన్నారు.

డాన్‌ ఎవాన్స్ అయితే తాము చూసిన దానిని నమ్మలేకపోయారు. ‘‘ దానిని కట్టడానికి కచ్చితంగా చాలా సమయం పట్టి ఉంటుంది. దుంగలు, ఫైబర్‌ గ్లాస్ పూతతో దానిని నిర్మించారు. బహుశా ఇసుక, రాళ్లను తొలగించడానికి వారికి సంవత్సరాలు పట్టి ఉంటుంది. నిర్మాణానికి కావాల్సిన సామాగ్రినంతటిని పడవల్లోనే తీసుకువచ్చి ఉంటారు’’ అని ఆయన చెప్పారు.

పోలీసులు లక్షడాలర్ల విలువైన సామాగ్రిని కనుగొన్నారు. వీటిలో పడవల మోటార్లు, పెద్ద బోట్లు, నిర్మాణ సామాగ్రి ఉన్నాయి.

అండర్‌గ్రౌండ్ బంకర్
ఫొటో క్యాప్షన్, అండర్‌గ్రౌండ్ బంకర్

ఆయుధాల సరఫరాా?

తొలుత అధికారులు ఈ బంకర్‌కు ఆయుధాల సరఫరాతో సంబంధం ఉందని భావించారు. కానీ, కొన్నినెలల తరువాత పెద్దమొత్తంలో గంజాయి బేళ్ళు న్యూపోర్టు బీచ్‌ వద్దకు కొట్టుకొచ్చాయి.

దీంతో ఈ డ్రగ్స్ బంకర్‌కు సంబంధించినవై ఉంటాయని పోలీసులు భావించడం మొదలుపెట్టారు. ఆ వాటర్ ప్రూఫ్ బంకర్‌లో సుమారు 8 మిలియన్ల విలువైన డ్రగ్స్ ఉండి ఉంటాయని ఆపరేషన్ సీల్ బే భావించింది.

సోయరెన్ బర్గ్ ఆర్న్‌బక్‌తో పాటు రాబిన్ బోస్‌వెల్ పనిచేస్తున్నారు. లండన్‌కు చెందిన ఇతన్ని బ్రెయిన్ ఆఫ్ గ్యాంగ్స్‌గా చెపుతారు. ఇద్దరు పిల్లలు, వారి తల్లి ఓ అపరిచితుడు బోస్‌వెల్ పోలికలకు దగ్గరగా ఉన్నాడంటూ పోలీసులకు చెప్పడంతో ఆయన పట్టుబడ్డారు.

‘‘రాబిన్‌ బోస్‌వెల్ అరెస్టయ్యారు. అతను మాకు 17 తప్పుడు చిరునామాలు ఇచ్చారు. అతనికే మాత్రం మంచి ఉద్దేశాలు లేవు’’ అని రిటైర్డ్ డిటెక్టివ్ ఎవాన్స్ చెప్పారు.

రాబిన్ బోస్‌వెల్
ఫొటో క్యాప్షన్, పోలీసులకు 17 తప్పుడు పేర్లు, అడ్రస్‌లు ఇచ్చిన రాబిన్ బోస్‌వెల్

‘‘బోస్‌వెల్ అరెస్టయ్యాక అతను మాకేమీ చెప్పడని అర్థమైంది. కానీ ఒక విషయం మా కంట పడింది. అతను వేసుకున్న బూట్లపై చిన్న చిన్న ఫైబర్‌ గ్లాస్ ముక్కలు కనిపించాయి. ఇవి బంకర్‌కు ఎలా లింక్ అవుతాయా అని ఆలోచించాం’’ అని తెలిపారు.

తరువాత రోజు ఫిష్‌గార్డ్ వద్ద గస్తీ కాస్తున్న పోలీసులు బర్గ్ ఆర్న్‌బక్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులను చూడగానే అతను తన వీపున ఉన్న సంచి వదిలేసి పొలాల్లోకి పరుగుతీశారు. అక్కడో పొదమీదుగా, ముళ్ళకంచె పై నుంచి దూకారు.

కానీ, అవతలవైపు 21 అడుగుల క్వారీ గుంత ఉందనే విషయాన్ని గుర్తించలేకపోయారు. కిందకు పడుతున్నప్పుడు ఓ చెట్టుకొమ్మను పట్టుకున్నారు. ఇదే అతని 11 ఏళ్ళ పరారీని ముగించింది.

బంకర్ లోపలున్న సామాగ్రి
ఫొటో క్యాప్షన్, బంకర్ లోపలున్న సామాగ్రి

పోలీసులు ఆర్న్‌బక్‌ వదిలేసిన బ్యాక్‌ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో హైపవర్డ్ రేడియో ఉంది.

దీనిని పెద్ద పెద్ద స్మగ్లింగ్ కార్యకలాపాలకు వాడతారు. చాలాసేపు వేచి చూశాకా వారు రేడియోలో మాటలు విన్నారు. రేడియో పనిచేయడం మొదలుకాగానే ‘‘ అమ్మా అమ్మా నేను లోపలికి వెళ్లి నా చేతుల్లోని మురికి పోగొట్టుకుంటాను’’ అనే సందేశం వచ్చిందని ఎవాన్స్ చెప్పారు.

ఈ మాత్రం సమాచారం చాలు. తీరంలో ఓ షిప్ ఉందని, అందులో ఉన్న డ్రగ్స్‌ను అన్‌లోడ్ చేయాలనుకుంటోందని మాకు తెలిసిపోయింది.

ఇదో గ్లోబల్ ఆపరేషన్. న్యూపోర్టు బీచ్‌లో మొదలైన పోలీసు విచారణ లండన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్కాండనేవియన్ దేశాలకు విస్తరించిందని మాజీ సార్జంట్ జాన్ డేనియల్స్ అన్నారు.

’’మాదక ద్రవ్యాలను రవాణా చేసే కీలకమైన గ్రూపును మేము అరెస్ట్ చేశామని తెలిసిపోయింది. మేము ఆ పడవ దగ్గరకు వెళ్లలేదు కానీ, శవం లేకుండానే హత్యకేసు పరిష్కరించామని చెప్పడానికి ఇదో మంచి కేసు’’ అని డేనియల్స్ చెప్పారు. అతి చిన్న పోలీసు బలగం ఆ సమయంలో ఉన్న అతిపెద్ద డ్రగ్ గ్యాంగ్ ను పట్టుకోవడం నిజంగా అద్భుతమేనని అన్నారాయన.

డాన్ ఎవాన్స్
ఫొటో క్యాప్షన్, డాన్ ఎవాన్స్

ఆపరేషన్ సీల్ టీమ్ ఐస్లే ఆఫ్ మ్యాన్ బ్యాంక్‌లో బోస్‌వెల్ దాచిన డబ్బును కనుగొంది.

1982 డిసెంబరులో బోస్‌వెల్ రెండు సూట్‌కేసులతో ఐస్లే ఆఫ్ మ్యాన్‌లోని బ్యాంకుకు వెళ్ళి పది లక్షల డాలర్ల నోట్లను డిపాజిట్ చేశాడు అని ఎవాన్స్ గుర్తు చేసుకున్నారు.

‘‘మేం బ్యాంకు మేనేజర్‌ని దీనిపై రిపోర్టు చేయాలనిపించలేదా అని ప్రశ్నిస్తే ఆయన మొహం కందగడ్డలా మారింది’’ అని ఎవాన్స్ తెలిపారు.

‘‘ఇదేమీ అసాధారణ విషయం కాదు. సహజంగా చాలామంది ప్రజలు షాపింగ్ బ్యాగ్‌లలో 50వేల డాలర్లను నగదురూపంలో తీసుకు వస్తుంటారు’’ అని చెప్పారు.

పోలీసులు ఈ కేసులో 1,27,000వేల డాలర్ల విలువైన కార్లను కూడా సీజ్ చేశారు. వీటిల్లో ఫెర్రారీ, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ కూడా ఉన్నాయి.

బర్గ్ ఆర్న్‌బాక్‌కు 8 ఏళ్ళ జైలు శిక్ష పడింది. బోస్‌వెల్‌కు 10 ఏళ్ళ శిక్ష పడింది. గ్యాంగ్‌లోని మిగిలిన ఆరుగురికి కూడా జైలు శిక్షలు పడ్డాయి.

ట్రయల్ జడ్జి మాదకద్రవ్యాల వ్యాపారులను చట్టం ముందు నిలబెట్టినందుకు న్యూపోర్టు ప్రజలను, పోలీసులను అభినందించారు.

ప్రాసిక్యూషన్ కూడా న్యూపోర్టు వాసులను అభినందించింది. ‘‘ఈ నేరగాళ్ళ పథకాలు వెలుగులోకి రావడానికి స్థానికుల ఆసక్తి, ఉత్సుకతే కారణం. ఏదో జరుగుతోందనే అనుమానంతోనే వారు తీగ లాగారు. డొంకంతా కదిలింది’’ అని ప్రాసిక్యూషన్ ప్రశంసించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)