‘ప్రతి భారత సైనికుడూ మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలి’ – బీబీసీ ఇంటర్వ్యూలో మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్బరాసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
‘‘మాల్దీవుల గడ్డపై ఏ విదేశీ సైనికుడూ ఉండకూడదు. ఇదే విషయంపై దేశ ప్రజలకు నేను హామీ ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకునేందుకు మొదటి రోజు నుంచీ నేను పనిచేస్తాను.’’
గత నెలలో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డా. మహమ్మద్ ముయిజ్జూ వ్యాఖ్యలివీ. తమ సైనికులను వెనక్కి పిలిపించాలని భారత్‌కు ఆయన సూచిస్తున్నారు.
నవంబరులో పదవీ బాధ్యతలు తీసుకోబోతున్న ఆయన బీబీసీతో మాట్లాడారు. ‘‘నేను ఎన్నికల్లో గెలిచిన కొన్ని రోజుల తరువాత భారత రాయబారిని కలిశాను. ఇక్కడున్న ప్రతి ఒక్క భారత సైనికుడూ వెళ్లిపోవాలని సూచించాను’’ అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.
మాల్దీవుల్లో ఎప్పటినుంచో భారత సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ముయిజ్జూ తాజా డిమాండ్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముంది.
వాస్తవానికి ముయిజ్జూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడాన్ని భారత్‌కు ఎదురుదెబ్బగా నిపుణులు విశ్లేషించారు. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ 2018లో అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచీ మాల్దీవులను భారత్‌కు చేరువచేస్తూ వచ్చారు.
అయితే, సోలిహ్ ‘ఇండియా ఫస్ట్ పాలసీ’తో మాల్దీవుల సార్వభౌమత్వం, భద్రతకు ముప్పని ముయిజ్జూ కూటమి మొదట్నుంచీ చెబుతూ వచ్చింది.
ముయిజ్జూ కూటమి చైనాతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. మాల్దీవుల్లో మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాజెక్టులకు రుణాలు, నిధుల పేరుతో చైనా కూడా భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది.
అయితే, హిందూ మహా సముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో నుండే మాల్దీవులపై పట్టు కోసం భారత్‌కు రెండు బిలియన్ డాలర్లు వరకూ సాయాన్ని అందించింది.
ఇక్కడి నుంచి భారత్ బలగాలు వెళ్లిపోవాల్సి వస్తే, ఇది భారత్‌కు ఎదురుదెబ్బే.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, మాల్దీవులకు భారత్ ఇచ్చిన కొన్ని గిఫ్టులు (2010, 2013లో ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, 2020లో ఒక చిన్న విమానం) ప్రస్తుతం ‘‘ఇండియా అవుట్’’ ప్రచారానికి కేంద్ర బిందువు అవుతున్నాయి.
సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు, వైద్య సాయం అందించేందుకు ఆ హెలికాప్టర్లు, విమానాన్ని ఇచ్చినట్లు భారత్ చెబుతోంది.
కానీ, వాటి నిర్వహణ, ఆపరేషన్ల కోసం మాల్దీవుల్లో 75 మంది భారత సైనికులు పనిచేస్తున్నారని 2021లో మాల్దీవుల సైన్యం తెలిపింది. దీంతో సాయం పేరుతో నిఘా హెలికాప్టర్లు, విమానాలను ఇక్కడ మోహరిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఈ మోహరింపులతో మాల్దీవుల సార్వభౌమత్వం, భద్రతకు ముప్పుందని ముయిజ్జూ కూడా చెప్పారు. హిమాలయ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘‘ప్రపంచ దేశాల ఉద్రిక్తతల్లో చిక్కుకొనేందుకు మేం సిద్ధంగా లేం. మాది చాలా చిన్న దేశం’’ అని తాజా ఇంటర్వ్యూలో ముయిజ్జూ చెప్పారు.
అధ్యక్ష ఎన్నికలకు ముందు సోలిహ్ బీబీసీతో మాట్లాడుతూ.. మాల్దీవుల్లో భారత సైనికుల మోహరింపుల గురించి చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు.
‘‘మాల్దీవుల్లో ఏ విదేశీ సిబ్బందీ క్రియాశీలంగా సైనిక విధులు నిర్వహించడం లేదు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న భారత సిబ్బంది మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషనల్ కమాండ్ కింద పనిచేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, @PPMYOUTHS
అయితే, ప్రస్తుతం విమానాలు మాత్రమే కాదు. ఇటీవల కాలంలో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ సమీక్షించాలని ముయిజ్జూ భావిస్తున్నారు.
‘‘అసలు వాటిలో ఏముందో తెలియదు. పార్లమెంటులో చర్చ సమయంలోనూ కొందరు ఎంపీలు ఇదే సందేహాన్ని వ్యక్తంచేశారు. అసలు వాటిలో ఏముందో మేం తేలుస్తాం’’ అని ముయిజ్జూ చెప్పారు.
ముయిజ్జూ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వెంటనే అభినందనలు తెలిపిన వారిలో చైనా రాయబారి కూడా ఒకరు.
మరోవైపు ముయిజ్జూ కూడా మాల్దీవుల్లో చైనా పెట్టుబడుల ప్రాజెక్టులపై తరచూ ప్రశంసలు కురిపించేవారు. ‘‘మాలె సిటీని ఆ పెట్టుబడులు ఆధునికంగా తీర్చిదిద్దాయి. ఈ ప్రతిఫలాలు ప్రజల చేతికి అందుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.
అయితే, తను ‘ప్రో-చైనా’ వ్యక్తిననే వాదనను ముయిజ్జూ ఖండించారు. ‘‘నేను ప్రో మాల్దీవుల వ్యక్తిని. నాకు మాల్దీవులే తొలి ప్రాధాన్యం. మా స్వతంత్రతే ముఖ్యం’’ అని ఆయన చెప్పారు. తాను ఏ దేశానికి అనుకూలుడిని లేదా వ్యతిరేకుడిని కాదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @PPM_HULHUMALE
అయితే, మాల్దీవులను చైనాకు చేరువచేసిన మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ సహా చాలా మంది ముయిజ్జూ కూటమిలో ఉన్నారు.
మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో భారత్‌తోపాటు పశ్చిమ దేశాలు రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేయడంతో, ప్రస్తుతం అవినీతి కేసులో అరెస్టైన యమీన్ చైనాను ఆశ్రయించారు.
అప్పుడే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ‘‘బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’’లో ఆయన చేరారు.
ముయిజ్జూకు యమీన్ గురువుగా భావిస్తున్నారు. ఎన్నికల్లో తాను విజయం సాధించిన వెంటనే యమీన్‌ను జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించాలని ముయిజ్జూ సూచించారు.
తాజా ఎన్నికల్లో విజయం అనంతరం ఆయనకు మొదట్లో దేశీయంగా ఎలాంటి అవరోధాలు ఎదురుకాకపోవచ్చు.
అదే సమయంలో ఇక్కడి నుంచి భారత్ సేనలను వెనక్కి పంపేందుకు ఆయన పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, దీనికి భారత్‌ను ఒప్పించడమే ఆయనకు ఎదురయ్యే తొలి సవాల్ కావచ్చు.
ఇవి కూడా చదవండి:
- రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















