తెలంగాణ ఎన్నికలు: రైతుబంధును రూ.15 వేలకు పెంచడం సాధ్యమేనా... హామీల అమలుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి?

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఆదాయ వనరులను పట్టించుకోకుండా హామీలు ప్రకటిస్తున్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ తన మేనిఫెస్టో ప్రకటించింది. కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీలను వెల్లడి చేసింది.
వీటిని అమలు చేయాలంటే బడ్జెట్ భారీగా కావాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రైతుబంధు నిధుల విషయంలో అంత తేడా
బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధానంగా రైతులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని హామీలు ప్రకటించాయి.
ఈ రెండు పార్టీలూ ఆ వర్గాల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నాయి. వీరి కోసం ప్రకటించిన హామీలకు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ రెండు పార్టీలు ప్రధానంగా ప్రస్తావించిన రైతుబంధు విషయానికి వద్దాం.
ఈ ఏడాది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.15,075 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.
ప్రస్తుతం ఎకరానికి ఏడాదికి రూ.పది వేలు చొప్పున రైతులకు రైతుబంధు సాయంగా ఇస్తోంది.
ఇదే హామీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటనను పరిశీలిద్దాం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించింది.
అంటే ప్రస్తుతం ఇస్తున్నట్లుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు అమలు చేయాలంటే దాదాపు రూ.22 వేల కోట్లు కావాలి.
అదే బీఆర్ఎస్ మాత్రం వచ్చే ఐదేళ్లలో సాయాన్ని రూ.16వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.
ఇప్పటికిప్పుడు వచ్చే ఏడాది నుంచి మాత్రం రూ.12వేలు చేస్తామని ప్రకటించింది.
ఇలా పెంచేందుకు దాదాపు రూ.18వేల కోట్లకు బడ్జెట్ పెంచాల్సి ఉంటుంది.
ఈ లెక్కన రైతుబంధు విషయంలో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చే దాన్ని బట్టి ప్రస్తుతం కేటాయిస్తున్న బడ్జెట్ కంటే అధికంగా రూ.3 నుంచి 7వేల కోట్లు అవసరమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ విషయంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ మేనిఫెస్టోల ఆధారంగా ఏ మేరకు నిధులు అవసరం అవుతాయో మేం అంచనా వేశాం. ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ 2023-24 సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.2.90 లక్షల కోట్లకు అదనంగా మరో రూ.90వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశాం. అంత బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకువస్తారనేది అసలు ప్రశ్న. దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసరా పింఛన్ల విషయంలో ఇలా..
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రూ.2,016ను రూ.4,000కు పెంచుతామని ప్రకటించింది.
ఆసరా పింఛన్ల అర్హత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. దీని ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 53,09,474 మంది పింఛనుదారులున్నారు. ప్రస్తుతం దీని కోసం ఏటా పెడుతున్న ఖర్చు రూ.11,628 కోట్లు.
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలో భాగంగా లెక్కలు వేసుకుంటే రూ.21,237కోట్లు కావాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికిప్పుడు వచ్చే ఏడాది నుంచి పింఛన్లు రూ.3,016కు పెంచుతామని ప్రకటించింది. తర్వాత నాలుగేళ్లలో రూ.5,00 ఏటా పెంచుతూ రూ.5,016 చేస్తామని ప్రకటించింది.
ఈ లెక్కన ఇప్పటికిప్పుడు వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో రూ.16,013 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.
వికలాంగుల పింఛన్లు మరో రూ.1000 పెంచుతామని కూడా పార్టీలు ప్రకటించాయి. కాబట్టి దానికి అదనపు నిధులు అవసరం.
మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ ధర రూ.500కు తగ్గించడం వంటి హామీలున్నాయి.
ఈ హామీలు అమలు చేయాలంటే రూ.5-6వేల కోట్లు అవసరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.
ఈ విషయంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘పార్టీలు ప్రకటిస్తున్న హామీలు అమలు చేయాలంటే ఆర్థికంగా పెద్దఎత్తున భారం పడటం ఖాయం. అధికారంలోకి రావాలనే కాంక్షతో హామీలు ఇస్తున్నారే తప్ప ఆదాయం ఎలా వస్తుందనేది ఆలోచన చేయడం లేదని అనిపిస్తోంది.
ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితులు దాటుకుని అప్పులు చేశారు. కొత్త పథకాలు తీసుకువచ్చినా, కొత్త పథకాలు ప్రవేశపెట్టిన అప్పులు మరింత చేయాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, BRS
ఒకరిని మించి మరొకరు..
ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించడం సహజం.
కాంగ్రెస్, బీఆర్ఎస్ విషయంలోనూ అదే పోటాపోటీ కనిపిస్తోంది.
రేపో మాపో బీజేపీ కూడా మేనిఫెస్టో విడుదల చేయనుంది.
వీరు ప్రకటిస్తున్న పథకాలను పరిశీలిస్తే.. ఒకరిని మించి మరొకరు పథకాలకు నిధులు పెంచి ప్రకటిస్తున్నారు.
దాదాపు ఇవన్నీ కూడా నగదు బదిలీ పథకాలే కావడం మరో విశేషం.
ఓటర్లను ఆకర్షించేందుకు ఒకరు ఒక పథకం ప్రకటిస్తే.. మరొక పార్టీ దానికి మరింత హంగులు అద్ది ప్రకటిస్తోంది.
ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955గా తెలంగాణలో ఉంది. రూ.455 సబ్సిడీని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భరిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
తర్వాత బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏకంగా గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తామని చెప్పింది.
అలాగే అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు పథకాన్ని వర్తింపజేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది.
ఇలా ఒకరు ఒక పథకం ప్రకటిస్తే.. దాన్ని మరింతగా పెంచి మరొక పార్టీ ప్రకటించడం ఆనవాయితీగా మారింది.

ఫొటో సోర్స్, INC
రెండు పథకాలకే రూ.2.50లక్షల కోట్లు
ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్ మొత్తం రూ.2,90,396 కోట్లుగా ఉంది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూస్తేనే నికర వ్యయం రూ.2,77,690గా ఉందని చెప్పారు చిట్టెడి కృష్ణారెడ్డి.
‘‘నా అంచనా ప్రకారం దళితబంధు, బీసీ బంధు వంటి పథకాల కింద లబ్ధిదారులందరికీ ఒకేసారి ఇవ్వాలనుకుంటే రూ.2.50లక్షల కోట్లు కావాలి. ఈ ఏడాది ఆర్థిక లోటు రూ.38,235 కోట్లుగా ఉంది. ఈ పరిస్థితుల్లో నీటి పారుదల ప్రాజెక్టులు, ఇతరత్రా ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూనే కొత్త పథకాలకు నిధులు కేటాయించాలి. కేవలం రూ.4,882 కోట్ల రెవెన్యూ మిగులుతో రూ.లక్ష కోట్ల విలువైన పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందనేది ప్రభుత్వం చెప్పాలి. అంతిమంగా అప్పులు చేసి పథకాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’’ అని చిట్టెడి కృష్ణారెడ్డి బీబీసీకి వివరించారు.
ఇదే విషయంపై ఫోరం గుడ్ గవర్నెన్స్ అంచనా మేరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దాదాపు రూ.3 లక్షల 80 వేల కోట్లకు పెంచాల్సి ఉంటుందని చెప్పారు పద్మనాభరెడ్డి.
రైతుబంధు, ఆసరా పింఛన్లు, దళితబంధు, బీసీ బంధు సహా ప్రస్తుతం ప్రకటించిన హామీలను లెక్కగట్టి అంచనా వేసినట్లు చెప్పారు.
పన్నుల భారం ప్రజలపైనే
రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు అంతిమంగా ప్రజలపైనే పన్నుల భారం పడుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి చెప్పారు.
‘‘రైతు బంధు పది ఎకరాలకే పరిమితం చేయాలని, సాగులో ఉన్న భూమికే ఇవ్వాలని ప్రభుత్వానికి వినతులు ఇస్తున్నాం. రైతు బంధు అనేది పెట్టుబడిసాయం. అసలు సాగు చేయనప్పుడు పెట్టుబడిసాయం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇలా చాలా విషయాల్లో ఖర్చు తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పన్నుల భారం కచ్చితంగా ప్రజలపై ఉంటుందని చెప్పారు పద్మనాభరెడ్డి.
ప్రధాన పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని అంటున్నారు.
దీనికి తగ్గట్టుగా నిధుల సమీకరణ వచ్చే ప్రభుత్వానికి ఎంతో అవసరం.
‘‘ప్రస్తుతం రాష్ర్టంలో సొంత పన్ను ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1.31 లక్షల కోట్ల అంచనాగా ఉంది. ఇది కేవలం అంచనా మాత్రమే. పూర్తిగా వసూలు అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ నిధులు జీతాలకే సరిపోవు. అలాంటప్పుడు పథకాలకు నిధులు కావాలంటే అప్పులు, పన్నులు, రుణాలపై ఆధారపడాలి. ఇది ప్రజలపై భారం మోపడమే. ప్రభుత్వాలు ఒకచేత్తో పెడుతూ.. మరో చేత్తో లాక్కొంటున్నట్లుగా ఉంది’’ అని పద్మనాభ రెడ్డి బీబీసీకి చెప్పారు.
రెండింతలు చేయగలరా..?
కాంగ్రెస్ గానీ, బీఆర్ఎస్ గానీ, ఏ ప్రభుత్వం వచ్చినా వారు ప్రకటించిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే బడ్జెట్ రెండితలు చేయాలని చిట్టెడి కృష్ణారెడ్డి బీబీసీకి చెప్పారు.
‘‘రైతుబంధు, రైతు బీమా, పింఛన్లు, దళితబంధు, బీసీ, గిరిజన బంధు.. ఇలా అన్ని పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించేవే. ఈ పథకాలు కొనసాగించడంతోపాటు కొత్తగా అనుకున్న హామీలు నెరవేర్చడానికి ఇప్పుడున్న బడ్జెట్‌ను రెండింతలు చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.
మరి దీనికి తగ్గట్టుగా ఆదాయం రెండింతలు చేయగలరా.. అంటే సమాధానం చెప్పే రాజకీయ పార్టీలు లేవని కృష్ణారెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















