‘ది మ్యాన్ విత్ ఎక్స్‌రే ఐస్’: విదేశీయుల మతి పోగొట్టిన భారతీయ మెజీషియన్

కుడా బక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిప్పుల గుండంలో నడిచినా కాళ్లు కాలేవి కాదని కుడా బక్స్ చెప్పేవారు.
    • రచయిత, చెరిలాన్ మొలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రద్దీగా ఉండే వీధిలో ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం అద్భుతమైతే కాదు. కానీ, అదే అతని కళ్లకు గంతలు కట్టి, ముక్కు రంధ్రాలు మాత్రమే వదిలి మిగతా ముఖానికి బట్ట చుట్టి ఉంటే..అప్పుడది కచ్చితంగా అద్భుతమే.

1930-40లలో ఇంగ్లండ్, యూరప్ వీధుల్లో భారత్‌కు చెందిన ఇంద్రజాలికుడు కుడా బక్స్ ఈ సైక్లింగ్ ఫీట్‌ ప్రదర్శించి ఫేమస్ అయ్యారు. ఆయన 1905లో కశ్మీర్‌లో జన్మించారు.

కళ్లు లేకున్నా చూడగలనని అంటూ ఆయన ఆ ఫీట్ ప్రదర్శించారు. ఈ షోలకు ఆయన 'ది మ్యాన్ విత్ ఎక్స్‌రే ఐస్ (ఎక్స్ రే కళ్లు ఉన్న వ్యక్తి)' అనే పేరు పెట్టారు.

అంతేకాదు కుడా బక్స్ కళ్లకు గంతలు కట్టుకొని....పుస్తకాలను చదవడం, సూదిలో దారం ఎక్కించడం సహా చాలా పనులు చేశారు.

1977లో రోల్డ్ డాల్ రాసిన "ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్" అనే కథకు బక్స్ జీవితమే ప్రేరణ. ఈ కథను అదే పేరుతో సినిమాగా వెస్ ఆండర్సన్ అనే దర్శకుడు రూపొందించారు.

చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి....

బక్స్ అసలు పేరు ఖుదా బక్స్. ఆయన కశ్మీర్‌లోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు.

ప్రొఫెసర్ మూర్ పేరుతో భారతీయ మాంత్రికుడు చేసిన ప్రదర్శన చూసి మాయాజాలంపై ఆకర్షితుడినయ్యానని 1952లో ఆర్గోసీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు బక్స్.

మ్యాజిక్ షో చూసిన రెండు రోజుల తరువాత, ఇంటి నుంచి పారిపోయానన్నారు బక్స్. అప్పటికాయన వయసు 13 ఏళ్లే. మూర్ సహాయకుడిగా పనిచేయడానికి లాహోర్‌కు వెళ్లారు బక్స్.

తరువాతి సంవత్సరాలలో ఆయన మియన్మార్, శ్రీలంక‌ దేశాలతోపాటు ముంబయిలాంటి నగరాలను సందర్శించారు. ఇంద్రజాలికులు, యోగులు, థియేటర్ ఆర్టిస్టుల నుంచి ఉపాయాలు, నైపుణ్యాలు నేర్చుకున్నారు బక్స్.

ఆయన తన పేరును ప్రొఫెసర్ కేబీ డ్యూక్‌గా, ఆ తర్వాత కుడా బక్స్‌గా మార్చుకున్నారని రచయిత జాన్ జుబ్రిజికి తన పుస్తకం 'ఎంపైర్ ఆఫ్ ఎంచాంట్‌మెంట్: ది స్టోరీ ఆఫ్ ఇండియన్ మ్యాజిక్‌' లో రాశారు.

కుడా బక్స్

ఫొటో సోర్స్, BRITISH PATHÉ

ఫొటో క్యాప్షన్, కుడా బక్స్ నైపుణ్యాలకు టెస్టు పెట్టారు హ్యారీ ప్రైస్

ఇంగ్లాండ్ వెళ్లిన కుడా బక్స్

1935 మే నెలలో కుడా బక్స్ ఇంగ్లండ్ వెళ్లారు. ఆ సమయంలో ఇంగ్లండ్‌ ప్రజలు భారత్ వంటి ప్రపంచంలోని తూర్పు భాగం నుంచి వచ్చిన ఇంద్రజాలికులంటే ఆసక్తి కనబరిచేవారు. ఇండియా ఇంద్రజాలికుల దేశమని అక్కడివారు భావించేవారు.

''భారతదేశ పర్యటనకు వచ్చిన కొందరు తమ ప్రయాణంలో చూసిన ఇంద్రజాలం గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటేవారు. మిషనరీలు, వ్యాపారులు, చరిత్రకారుల గురించి రాసిన పుస్తకాలే ఇందుకు కారణం. అందుకే భారతదేశాన్ని ఇంద్రజాల నిలయంగా చూస్తారు.'' అని బీబీసీతో రచయిత జాన్ బుబ్రిజీకి చెప్పారు.

భారతీయ ఇంద్రజాలికులు చాలావరకు పాశ్చాత్య ప్రపంచం ఆకర్షణను సద్వినియోగం చేసుకునేవారు. వారిలో బక్స్ కూడా ఒకరు.

ఆయన ఆంగ్లేయుడిలా దుస్తులు ధరిస్తూనే, మ్యాజిక్ నైపుణ్యాలను ప్రపంచంలోని తూర్పు ప్రాంత ఆధ్యాత్మికతకు అనుసంధానించేవారు.

"పారిస్‌లో కళ్లకు గంతలు కట్టుకుని సైకిలు తొక్కిన భారత వ్యక్తి" అని మ్యాజిక్ మ్యాగజైన్ 'ది లింకింగ్ రింగ్‌'లో బక్స్ గురించి చరిత్రకారుడు జాన్ బూత్ రాశారు.

బక్స్ ఇంగ్లాండ్‌లో "ఎక్స్-రే విజన్" అని పిలిచే ఒక మ్యాజిక్‌ను ప్రదర్శించి బాగా ఫేమస్ అయ్యారు. ఇది చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఆయన చాలాపనులు కళ్లకు గంతలు కట్టుకునే చేసేవారు.

అయితే, బక్స్ సామర్థ్యాలపై సందేహమున్న కొందరు ఆయనను పరీక్షించాలనుకున్నారు.

కుడా బక్స్

ఫొటో సోర్స్, PICTURE: BRITISH PATHÉ

ఘోస్ట్ హంటర్ ఎంట్రీతో మరో మలుపు..

హ్యారీ ప్రైస్ అనే వ్యక్తి బ్రిటన్‌లో ప్రసిద్ధ "ఘోస్ట్ హంటర్". ఆయన 1935 జూలైలో కొంతమంది వైద్యులతో కలిసి ఎక్స్-రే చూపు ఉందని చెబుతున్న బక్స్‌ను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు.

సర్జికల్ బ్యాండేజీలు, టేపు, కాటన్ ఉన్ని, నల్లని పత్తి, దూదితో బక్స్ కళ్లకు గంతలు కట్టారు హ్యారీ. అయితే ఆ గంతలు ఉన్నా కూడా బక్స్ పుస్తకం చదవగలిగారు.

అప్పుడు, మరో వైద్యుడు బక్స్‌కు మళ్లీ గంతలు కట్టారు. అయినా కూడా అక్కడ రాసిన పదాలను చదవగలిగాడు.

అంతేకాదు 1935 సెప్టెంబర్‌లో హ్యారీ ప్రైస్ మళ్లీ బక్స్‌కు మరొక పరీక్ష పెట్టారు. ఇది బక్స్‌ను ఇంగ్లండే కాదు ఏకంగా యూరప్ అంతటా ఫేమస్ అయ్యేలా చేసింది.

సర్రే గ్రామీణ ప్రాంతంలో నిప్పులపై (ఫైర్-వాకింగ్) నడిచారు బక్స్. వైద్యులు, సైకాలజిస్టులు, జర్నలిస్టులు ఆ ప్రదర్శన వీక్షించడానికి, పరిశీలించడానికి అక్కడికొచ్చారు.

‘‘ప్రదర్శనకు ముందు, తర్వాత బక్స్ పాదాలను కూడా చెక్ చేశారు. అంతేకాదు ఇంగ్లండ్‌లో ఫైర్ వాకింగ్ చేయడం ఇదే తొలిసారి.

నిప్పులు వేయడానికి ఒక గొయ్యి తవ్వారు. దానిలో కలప, బొగ్గు, పారాఫిన్, వార్తాపత్రికలు వేసి నిప్పంటించారు.

కొన్ని గంటల తర్వాత బక్స్ మెరుస్తున్న అగ్నిగుండం మీదుగా ఒకసారి కాదు ఏకంగా నాలుగు సార్లు నడిచారు.

ఆయన పాదాలపై "బొబ్బలు లేవు" అని ప్రైస్ తన పుస్తకం 'కన్ఫెషన్స్ ఆఫ్ ఎ ఘోస్ట్-హంటర్‌'లో పేర్కొన్నారు.

జెని మ్యాగజైన్

ఫొటో సోర్స్, CAITLYN RENEE MILLER

బక్స్‌కు ఎలా సాధ్యమైంది?

9 రోజుల తరువాత మరింత మంది పరిశీలకుల సమక్షంలో బక్స్ ఉక్కును కరిగించేంత వేడిగా ఉన్న అగ్నిగుండంపై రెండుసార్లు నడిచాడు. ఈసారి కూడా బక్స్ పాదాలకు ఏమీ కాలేదు.

"భౌతిక, మానసిక శక్తుల మధ్య కొంత అస్పష్టమైన సంబంధం ఉంటుంది. గాయం నుంచి బక్స్ కోలుకునేలా అది సహాయపడింది" అని జుబ్రిజికి తన పుస్తకంలో రాశారు.

నిప్పులపై నడవడంపై డహ్ల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మంట తప్ప మరేది చూడలేదు, అది చల్లగా ఉంది' అని బక్స్ చెప్పారు.

కళ్లు మూసుకొని చదవడంపై బక్స్ వివరిస్తూ తనకు అంతర్ దృష్టి ఉందని చెప్పారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఒక యోగి (ఆధ్యాత్మిక గురువు) నుంచి ఆ విద్య నేర్చుకున్నానన్నారు.

అంతర్ దృష్టిని మెరుగుపరచడానికి యోగి కొన్ని వ్యాయామాలు నేర్పించారని బక్స్ వివరించారు.

ఆ వ్యాయామంలో కొవ్వొత్తి జ్వాలలోని నల్లని భాగాన్ని పరిసరాల్లోని ప్రతిదీ అదృశ్యమయ్యే వరకు చూస్తూ ఉండిపోయానని, చివరికి తనకు ఇష్టమైన సోదరుడి ముఖం దృశ్యరూపంలో కనిపించిందని బక్స్‌ వెల్లడించారు.

చాలా ఏళ్లపాటు రాత్రిళ్లు ఈ క్యాండిల్ సాధన చేశానని తెలిపారు బక్స్. 24 ఏళ్ల వయస్సులో ఉండగా కళ్లు మూసుకుని, దృష్టి కేంద్రీకరిస్తే, ఆలోచనల ఆకారాన్ని అస్పష్టంగా, మసకగా చూడగలిగానని చెప్పారు.

28 సంవత్సరాల వయస్సు వచ్చాక కళ్లకు గంతలు కట్టుకుని పుస్తకాన్ని కూడా చదవగలనని ఆయన పేర్కొన్నారు.

బక్స్ దగ్గర గదులొద్దు: మహిళలు

బక్స్ చెప్పిన మాటలను సవాల్ చేసిన వారు కూడా ఉన్నారు. బక్స్ షోలను అధ్యయనం చేసిన కొంతమంది ఆయన ముక్కు వైపు నుంచి చూస్తున్నారని ఆరోపించారని కైట్లిన్ రెనీ మిల్లర్ అనే పరిశోధకురాలు తెలిపారు.

అయినప్పటికీ బక్స్ అప్పటికే చాలా ప్రజాదరణ సంపాదించారు.

''బక్స్ ప్రదర్శనలు చూడటానికి చాలామంది వచ్చేవారు. పత్రికలు ఆయన్ను శతాబ్ధపు అద్భుతమని, ప్రపంచంలోని ఎనిమిదో వింత అని అభివర్ణించాయి'' అని జెని అనే మ్యాజిక్ మ్యాగజైన్‌లో మెజీషియన్ బిల్ లార్సెన్ పేర్కొన్నారు.

బక్స్ "రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్" టీవీ షోలోని మొదటి ఎపిసోడ్‌లో కూడా కనిపించారు. ఆయన "కుడా బక్స్, హిందూ మిస్టిక్" అనే సొంత టెలివిజన్ ప్రోగ్రాం కూడా నడిపేవారు.

బక్స్ నిజంగా కళ్లు మూసుకొని చూడగలరని చాలామంది విశ్వసించారు.

బక్స్ శక్తి సామర్ధ్యాలు ముగ్గురు మహిళా ఆర్టిస్టులను ఎలా భయాందోళనకు గురిచేశాయో జాన్ బూత్ గుర్తుచేశారు. అదే విషయాన్ని పత్రికలు కూడా ఎక్కువగా కవర్ చేశాయి. బక్స్ తన ఎక్స్‌రే కళ్లతో తమను చూడగలడని, ఆయన గదికి, తమ గదికి మధ్య ఒక వరుస ఇటుక గోడ మాత్రమే ఉందని, అందుకే దూరంగా గదులను కేటాయించాలని సదరు మహిళలు డిమాండ్ చేశారు.

లండన్‌ తర్వాత, అమెరికా వెళ్లారు బక్స్. అనంతరం హాలీవుడ్‌లోని ప్రసిద్ధ మ్యాజిక్ క్యాజిల్ క్లబ్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు చేశారు.

బక్స్ 1981లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో మరణించారు. ఆయన తన చివరి రోజులను మ్యాజిక్ కాజిల్‌లోని ఇంద్రజాలికులతో కార్డులు ఆడుతూ గడిపారు.

ఈ ఇంద్రజాలికులు కార్డ్ గేమ్‌లలో బక్స్‌ కళ్లకు గంతలు కట్టుకోని సందర్భంలోనే ఆయన్ను ఓడించగలమని అనుకునేవారని జాన్ బూత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)