గిన్నిస్ రికార్డు కోసం 7 రోజులు ఏడ్చాడు, చివరకు ఏమైందంటే....

ఫొటో సోర్స్, FACEBOOK/TOWNCRYER
- రచయిత, ఎండుక ఒర్జిన్మో
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు ఈ కథనాన్ని చదివే సమయానికి ఆఫ్రికాలోని అత్యధిక జనాభా ఉన్న నైజీరియా దేశంలో మరొక వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.
రికార్డు కోసం ఒక వ్యక్తి 200 గంటలపాటు పాటలు పాడారు. మరో వ్యక్తి నాన్‌స్టాప్‌గా ఏడుస్తూ ఉన్నారు. మరొకరు "రికార్డ్-ఎ-థాన్" క్రేజ్‌లో భాగంగా ఎక్కువ సంఖ్యలో నత్తలను వేయించడానికి ప్రయత్నిస్తున్నారు.
దేశంలోని 20 కోట్ల మంది ప్రజలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నప్పుడు మీకు ఇలాంటివన్నీ కంటపడతాయి మరి.
లాగోస్‌లోని వేదిక వద్ద మే నెలలో రికార్డు కోసం 4 రోజుల పాటు వంట చేసిన హిల్డా బాసిని ప్రజలు వీక్షించారు.
ఆమె 100 గంటల పాటు వంట చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR) మాత్రం అధికారికంగా 93 గంటల 11 నిమిషాలకు ధ్రువీకరించింది. అయినా కూడా అది కొత్త రికార్డును నెలకొల్పడానికి సరిపోతుంది.
అప్పటి నుంచి ఆ దేశంలో ఎవరో ఒకరు గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
నైజీరియన్లు బాసీ చేసిన ఫీట్‌ను ఆసక్తిగా ఫాలో అయ్యారు. అలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆ దేశంలో చాలామందిని ఆకర్షించింది.
అయితే ఇపుడు కార్యక్రమం కొనసాగించడానికి గిన్నీస్ సంస్థ కష్టపడుతోంది.

ఫొటో సోర్స్, JOYCE IJEOMA
స్టవ్ ఆన్ చేసి నిద్రపోతున్నారు..
పలువురు "ఐడియా-ఎ-థాన్ ", "పఫ్-పఫ్-ఎ-థాన్" కార్యక్రమాల కోసం రిక్వెస్ట్ చేస్తుండటంతో " రికార్డ్-ఎ-థాన్స్ ఇక చాలు" అని మంగళవారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ సరదాగా ట్వీట్ చేసింది.
రికార్డ్ సెట్ చేయడానికి ప్రయత్నించే ముందు పోటీదారులు మొదట దరఖాస్తు చేసుకోవాలని గతంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (జీడబ్ల్యూఆర్) ట్వీట్ చేసింది.
ఓ కొత్త రికార్డు నెలకొల్పడానికి ఓ వ్యక్తి నాన్‌స్టాప్‌గా మసాజ్ చేసి చేసి కుప్పకూలిపోయారు. దీంతో గిన్నీస్ చేసిన ఈ ట్వీట్ ఆ ఘటనపై మర్యాదపూర్వకమైన రిమైండర్ మాదిరి కనిపించింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిబంధనలు పాటించకుండా, కనీసం దానికి దరఖాస్తు చేసుకోకుండా ఇటీవల ఇలాంటి అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు చాలామంది.
అంతేకాదు గిన్నీస్ రికార్డు సాధిస్తానని ఇద్దరు షెఫ్‌లు మధ్యలో తమ స్టవ్‌లను ఆపివేసి, నిద్ర పోయారు, దీంతో వారు అనర్హతకు గురయ్యారు.
"మీరు ప్రయత్నించాలనుకుంటున్న రికార్డు చెల్లుబాటు అయ్యేదా? కాదా తెలుసుకోవాలి, అంతేకాకుండా మార్గదర్శకాలను అర్థం చేసుకోవడం ముఖ్యం" అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
నైజీరియన్ల నుంచి దరఖాస్తులలో పెరుగుదల చూసినట్లు గిన్నిస్ సంస్థ తెలిపింది. అయితే ఒక దేశం నుంచి వచ్చిన ప్రయత్నాల సంఖ్యలో ఇది రికార్డు అని నిర్ధరించలేమని ఆ సంస్థ చెబుతోంది.

ఫొటో సోర్స్, FAROMINIYI KEMI
'నైజీరియర్లు ఫన్నీ వ్యక్తులు'
"నైజీరియన్లు సరదా మనుషులు. ఇప్పుడు ఏది ట్రెండ్‌లో ఉందో అందులోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాం. మూడు నెలల్లోపు ఈ క్రేజ్ తగ్గిపోతుంది" అని గిన్నిస్‌కు రెండుసార్లు ప్రయత్నించి, నిర్వహకులకు చికాకు తెప్పించిన ఫరోమిని కెమి అన్నారు.
రికార్డు కోసం తాను చేసిన రెండు ప్రయత్నాలు ఒక జోక్ అని ఆమె బీబీసీకి చెప్పారు. కానీ పఫ్-పఫ్ - డోనట్ వంటి గుండ్రని డీప్-ఫ్రైడ్ డౌ ఇప్పుడు ఆమె మనస్సులో స్థిరంగా పాతుకుపోయింది.
సెకండరీ స్కూల్ టీచర్ జాన్ ఒబోట్ తన ప్రయత్నాన్ని ఖచ్చితంగా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆయన వచ్చే సెప్టెంబర్‌లో ఎక్కువసేపు బిగ్గరగా (పుస్తక పఠనం) చదవబోతున్నారు.
పోటీ కోసం జాన్ గిన్నిస్ సంస్థ నుంచి అనుమతి కూడా పొందారు. గత సంవత్సరం తుర్కియేలో కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన రిస్‌బాయి ఇసాకోవ్ నెలకొల్పిన 124 గంటల రికార్డును బద్దలు కొట్టేందుకు జాన్ రిహార్సల్ చేస్తున్నారు.
జాన్ ఒబోట్ దక్షిణ నైజీరియాలోని కోస్టల్ సిటీ ఉయోలో 140 గంటల పాటు నాన్‌స్టాప్‌గా బిగ్గరగా చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
"నైజీరియాలో చదివే సంస్కృతిని ప్రోత్సహించడమే దీనికి ప్రేరణ" అని జాన్ అంటున్నారు. తన సామర్థ్యం గురించి ఆయనకు సందేహం లేదు.
"నేను అర్ధవంతమైన రికార్డ్‌ను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను" అని జాన్ వెల్లడించారు. కొన్ని రికార్డులలో పళ్లను ఉపయోగించి కొబ్బరి పీచును తీయడం కూడా ఉంది.
‘‘ఈ రికార్డులకు అర్ధమేముంది, ముద్దులు పెట్టుకోవడంలో రికార్డు ఎవరికి ఉపయోగపడుతుంది?’’ అని ప్రశ్నిస్తున్న జాన్, తాను చేయబోయే ఇంగ్లీష్ క్లాసిక్‌ల రీడింగ్ రికార్డ్ చాలా ఉన్నతమైందని భావిస్తున్నారు.
ముద్దుపై నిషేధం విధించిన ప్రభుత్వం
రికార్డు కోసం ముద్దులు పెట్టుకునే ప్రయత్నాన్ని ఎకిటి రాష్ట్రంలో నిషేధించారు. నాన్‌స్టాప్‌గా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
గతంలో ఇలాంటి ప్రయత్నాలలో (నైజీరియా వెలుపల) పోటీదారులు కుప్పకూలడంతో గిన్నీస్ ఈ విభాగాన్ని రికార్డుల నుంచి తీసేసింది.
"కిస్-ఎ-థాన్ అనేది అసంబద్ధం, అనైతికం, అనారోగ్యకరమైనది మాత్రమే కాదు, ఎకిటి ప్రతిష్టను కించపరిచే విధంగా ఉంటుంది" అని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
మసాజ్ మాదిరి కొన్ని ప్రయత్నాలలో శారీరక శ్రమ కూడా ఆందోళనకు ఒక కారణం.
ఎకిటీలో ఇటీవలి రికార్డులపై క్రేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ షెఫ్ డామీ, షెఫ్ బాసీ గిన్నిస్ రికార్డును అధిగమించడానికి ప్రయత్నించారు.
రికార్డుల వేటలో ఆరోగ్య సమస్యలు
ఏడు రోజులుగా నాన్‌స్టాప్‌గా ఏడుస్తున్న టెంబు ఎబెరే తాను తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని బీబీసీకి తెలిపారు.
తలనొప్పి వచ్చిందని, ముఖం ఉబ్బిపోయిందని, 45 నిమిషాల పాటు పాక్షికంగా అంధుడిగా మారానని, కళ్లు వాచినట్లుగా మారాయని చెప్పారు.
"నేను ఏడుపును తగ్గించుకోవలసి వచ్చింది" అని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను రికార్డు సాధించాలనుకున్నా, గిన్నీస్‌కి దరఖాస్తు చేయకపోవడంతో అది అధికారిక రికార్డుకు నోచుకోలేదు.
అయితే దేశంలో రికార్డు హోల్డర్ల కొరత ఉన్నట్లు కాదు. కొన్ని రికార్డులు ఇలా ఉన్నాయి.
టోబి అముసన్ - మహిళల 100 మీటర్ల హర్డిల్స్
జిబెంగాఎజెకిల్ - ఒక కాలు మీద ఒక నిమిషంలో అత్యధిక గెంతులు.
చినోన్సో ఈచే- ఏడాదిలో అత్యధిక సార్లు ఫుట్‌బాల్‌ను తాకడం
తలపై ఫుట్‌బాల్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఒక నిమిషంలో అత్యధిక సార్లు మరో ఫుట్‌బాల్‌ను టచ్ చేశారు చినోన్సో.

ఫొటో సోర్స్, HILDA BACI
బాసీ కథ వేరు..
అయితే షెఫ్ బాసీ మాదిరి ఎవరూ పెద్దగా సంచలనం సృష్టించలేదు. "మేం చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశాం" అని బ్రాండింగ్‌ను నిర్వహించే పబ్లిక్ రిలేషన్స్ ఫర్మ్ హెడ్ నేనే బెజిడే అంటున్నారు.
బాసీకి దేశ మాజీ ఉపాధ్యక్షుడి నుంచి కాల్ వచ్చింది. లాగోస్ రాష్ట్ర గవర్నర్‌ను కలిసే అవకాశం దక్కింది. ఆమెను కలవడానికి, మద్దతును తెలియజేయడానికి సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు నిరంతరం వచ్చేవారు.
స్టార్‌డమ్, కీర్తిని పక్కన పెడితే సోషల్ మీడియా ఫాలోవర్ల పెరుగుదల కనిపిస్తుంది.
బాసీకి నైజీరియన్ ఎయిర్‌లైన్ ఒక సంవత్సరం పాటు ఉచిత ప్రయాణాన్ని అందించింది. షెఫ్ డామీ నగదు బహుమతులు అందుకున్నారు.
ఇతర పోటీదారులు తమ ప్రయత్నాల సమయంలో బహిరంగంగా విరాళాలు కోరారు.
" నాకు, నైజీరియాకు ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకురావడానికి అసాధారణమైన పని చేయాల్సి వచ్చింది" అని బాసీ తన ఫీట్ తర్వాత బీబీసీకి చెప్పారు. ఆమె రెండూ సాధించినట్లు అనిపిస్తుంది.
ఇవి కూడ చదవండి
- మండువా ఇల్లు : ఏసీలు అక్కర్లేనంత చల్లదనం ఇందులో ఉంటుందా, ఏమిటీ టెక్నాలజీ?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అవతార్ 3, ద లయన్ కింగ్: హాలీవుడ్లో సమ్మెతో ఈ సినిమాల భవిష్యత్ ఏం కాబోతోంది?
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














