రాజస్థాన్: కోటా కోచింగ్ సెంటర్లకు కఠినమైన నిబంధనలు... విద్యార్థుల ఆత్మహత్యలను ఇవి అడ్డుకోగలవా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, కోటా నుంచి బీబీసీ ప్రతినిధి
విద్యార్థుల ఆత్మహత్యల కారణంగా రాజస్థాన్‌లో కోటా నగరంలోని కోచింగ్ సెంటర్ల నిబంధనలను కఠినతరం చేశారు.
మంచి కాలేజీల్లో సీట్లు సాధించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కోచింగ్ కోసం కోటాకు వచ్చిన విద్యార్థులతో బీబీసీ ప్రతినిధి మాట్లాడారు. పరీక్షల్లో విజయం సాధించేందుకు విద్యార్థులపై చాలా ఒత్తిడి ఉంటున్నట్లు గుర్తించారు.
22 ఏళ్ల విజయ్ (అతని పేరు మార్చాం) మూడుసార్లు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అర్హత సాధించలేకపోయారు. రాజస్ధాన్‌లోని ఓ ఖరీదైన కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న విజయ్ ఈసారి తనకు సీటు తప్పకుండా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.
ఎంతో మంది విద్యార్థుల్లాగే విజయ్ కూడా కోటాలో కోచింగ్ ద్వారా తన కలలను సాకారం చేసుకోవచ్చని భావిస్తున్నారు.
నగరంలో ఎక్కడచూసినా పోటీ పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. సుమారు 2 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఇక్కడ హాస్టళ్లలో, లేదా ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటూ చదువుకుంటున్నారు. వారిలో 13 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు.
కోటా నగరం కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందింది. భారత్‌లో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో సీటు సాధించేందుకు ఇక్కడ కోచింగ్ ఇస్తారు. ఈ నగరంలో 12 పెద్ద కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మరో 50 వరకూ చిన్నచిన్న కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
గౌరవం, ఒత్తిడి, ఆందోళన
ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో సీటు దొరకడాన్ని భారత్‌లో చాలా మంది తల్లిదండ్రులు గౌరవంగా భావిస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆగ్రహానికి గురవుతారు.
ఈ కోచింగ్ సెంటర్లు ఏడాదికి దాదాపు లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తాయి. అది చాలా కుటుంబాలకు భారం కూడా. అయితే, అత్యుత్తమ మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటొస్తే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వచ్చినట్టే.
విజయ్ కుటుంబం ఒక పల్లెటూళ్లో ఉంటుంది. ఆర్థికంగా అంత స్తోమత కలిగిన కుటుంబం కాదు. ఆయన తండ్రి ఒక సాధారణ రైతు. ఎక్కడ తన తల్లిదండ్రులను నిరాశపరచాల్సి వస్తుందోననే ఒత్తిడి ఆయనపై విపరీతంగా ఉంది.
''పరీక్షల్లో మార్కులు సరిగ్గా రానప్పుడు ఇంట్లో అబద్ధాలు చెబుతుంటా'' అని ఆయన ఒప్పుకున్నారు.
రోజురోజుకీ తనలో పెరిగిపోతున్న ఆందోళన కారణంగా తలనొప్పి, ఛాతీ నొప్పి వస్తాయని, రెండోసారి ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్యకు యత్నించే వరకూ వెళ్లానని విజయ్ చెప్పారు.
''నాకు మరో ఆప్షన్ లేదనిపించింది'' అని ఆయన అన్నారు.
''నా తల్లిదండ్రులు కడుతున్న డబ్బులు వృథా చేస్తున్నా. వాళ్ల పరువు తీస్తున్నాననే ఒత్తిడి నన్ను ఆత్మహత్య ఆలోచనల వైపు ప్రేరేపించింది. కానీ, నేను వాటిని బయటకు రానీయలేదు'' అని చెప్పారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తాను డిప్రెషన్‌ను ఎలా జయించారో చెబుతున్న వీడియో చూసిన తర్వాత తన మనస్సు మార్చుకున్నట్లు విజయ్ చెప్పారు. ఎక్కువగా పనిచేసినప్పుడు ప్రశంసలు లభించినా, అది మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో దీపిక బహిరంగంగా చెప్పారు.
ఒత్తిడి గురించి బహిరంగంగా చెప్పడం చూసి విజయ్ స్ఫూర్తి పొందారు. ప్రస్తుతం ఆయన తన మానసిక సమస్యకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉంటే, అలాగే తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు.
అలాగే, ఒంటరిగా ఉండాల్సి రావడం, రోజుకి 14 గంటల చదువు, తల్లిదండ్రుల అంచనాలు, విపరీతమైన ఒత్తిడి, బయట ఉన్న పోటీ వంటి కష్టాల గురించి మరికొందరు విద్యార్థులు మాతో చెప్పారు.
గత పదేళ్లలో కోటాలో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది అత్యధికంగా 25 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
నేను కోటాలో పర్యటిస్తున్న సమయంలోనే ఒక 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
''చదువు వల్ల ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె మాకు ఎప్పుడూ చెప్పలేదు'' అని ఆమె తండ్రి ఫోన్‌లో మాతో చెప్పారు. తన కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి కోటాకి వస్తూ ఆయన ఫోన్‌లో మాట్లాడారు.
''కానీ, కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఆమె చెప్పింది. అవన్నీ పట్టించుకోకుండా చదువుపైనే శ్రద్ధ పెట్టాలని చెప్పా'' అని ఆయన అన్నారు.

కోటాలో ఆత్మహత్యలపై ప్రభుత్వ డేటాను విశ్లేషిస్తూ హిందుస్తాన్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. 2023లో కోటాలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల్లో 18 ఏళ్లలోపు బాలురు ఎక్కువగా ఉన్నారని, వారిలో ఎక్కువ మంది మెడికల్ ఎంట్రన్స్ టెస్టుకి సన్నద్ధమవుతున్నవారేనని పేర్కొంది. బలవన్మరణానికి పాల్పడిన వారిలో చాలా మంది విద్యార్థులు అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాల్లోని వారేనని కథనంలో పేర్కొంది.
డాక్టర్ కావాలని కలలుగన్న రైతు కుటుంబానికి చెందిన 18 ఏళ్ల ఆదర్శ్ రాజ్ ఆగస్టులో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన కుటుంబం చిన్నాభిన్నమైంది.
''మేమేం ఒత్తిడి చేయలేదు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో డిప్రెషన్‌కి గురైనట్టున్నాడు. అదే అలాంటి ఘోరమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉంటుంది'' అని అతని మేనమామ హరిశంకర్ నాతో చెప్పారు. ''కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు'' అని ఆయన అన్నారు.
హెల్ప్‌లైన్లు, మెంటల్ హెల్త్ వర్క్‌షాపులు
కోటాలో ఇటీవల ఆత్మహత్య ఘటనలు పెరగడంతో రాజస్థాన్ ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
అందులో భాగంగా తొమ్మిదో తరగతిలోపు ( 14 ఏళ్ల లోపు) విద్యార్థులను చేర్చుకోవద్దని, పరీక్షల ఫలితాలను బహిరంగంగా ప్రకటించవద్దంటూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మెంటల్ హెల్త్ వర్క్‌షాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపేలా ఎక్కడికక్కడ పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది.
డిప్రెషన్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు సీనియర్ పోలీస్ అధికారి చంద్రశీల్ నేతృత్వంలో 11 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.
''మేం హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ ప్రవర్తనలో తేడా ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వారిని గుర్తించి, వారితో మాట్లాడడం, హాస్టల్ వార్డెన్‌తో చర్చించడం, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం వంటివి చేస్తున్నాం'' అని చంద్రశీల్ చెప్పారు.

కోవిడ్, ఐసోలేషన్ తర్వాత..
ప్రపంచ వ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల యువత మరణాల్లో ఆత్మహత్య నాలుగో ప్రధాన కారణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ - డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.
2021లో భారత్‌లో 13 వేల మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అది 2020తో పోలిస్తే 4.5 శాతం ఎక్కువని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కోచింగ్ సెంటర్లలో ఒక్కో క్లాసులో దాదాపు 300 మంది వరకూ విద్యార్థులు ఉంటారని ఒక టీచర్ నాతో చెప్పారు. కొన్నిసార్లు వారికి విద్యార్థుల పేర్లు కూడా తెలియవు. ఇది వారిలో ఒంటరితనానికి దారితీస్తుందని అన్నారు.
అలాగే, కోవిడ్, లాక్‌డౌన్‌లది కూడా ఇందులో ప్రధాన పాత్రే.
''కోవిడ్ తర్వాత విద్యార్థుల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం గతంతో పోలిస్తే తక్కువగా ఉంది'' అని భారత్‌లో ప్రముఖ కోచింగ్ సెంటర్లలో ఒకటైన మోషన్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ విజయ్ అన్నారు. అయితే అది క్రమంగా మారుతోందని ఆయన అన్నారు.
ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో సంబంధాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపించిందని ఊర్మిళ బక్షి అభిప్రాయపడ్డారు. ఆమె దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. దానికి తోడు కోటాలో కోచింగ్ వ్యాపారంగా మారిపోయిందని, అది కూడా ఒక కారణమన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
''ఒక్కో క్లాసులో వందల మందిని కుక్కుతున్నారు. ఉపాధ్యాయులకు కనీసం వారి పేర్లు కూడా తెలియవు. కనీసం స్నేహితులు కూడా దొరకడం లేదు. ఎవరితోనైనా మాట్లాడితే అతను ఎలా చదువుతున్నాడో తెలుసుకుని తనను ఎక్కడ దాటేస్తాడేమోనన్న భయం. దీంతో ఒంటరితనానికి గురవుతున్నారు'' అని ఆమె చెప్పారు.
కోటాలో విద్యార్థుల కోసం దాదాపు 3,500కి పైగా హాస్టళ్లు, ప్రైవేటు అద్దె ఇళ్లు ఉన్నాయి. నగర ఆర్థిక వ్యవస్థకు ఇవే భారీ మొత్తంలో నిధులు సమకూరుస్తున్నాయి.
కోటాలోని విజ్ఞాన్ నగర్‌లో ఉన్న విద్యార్థుల వసతి సముదాయాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నా. చీకటిగా ఉన్న భవనం మెట్లు ఎక్కి రెండో ఫ్లోర్‌లో విద్యార్థులు ఉంటున్న ఫ్లాట్‌కి వెళ్లాను. శిథిలావస్థలో కనిపిస్తున్న ఆ భవనంలో ఓ ఇరుకు గది, డోర్ పక్కనే టాయిలెట్ ఉంది.
ఆ గదిలో 18 ఏళ్ల అర్ణవ్ అనురాగ్ ఉంటున్నారు. డాక్టర్ కావాలనేది చిన్నప్పటి నుంచీ అర్ణవ్ కోరిక. అందుకోసమే ఆయన కోటాకి వచ్చి హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు.

కొన్ని పుస్తకాలు అలమరాలో పెట్టి ఉన్నాయి. మరికొన్ని మంచంమీద పడేసి ఉన్నాయి. ఆ గదిలో ఒకవైపు ల్యాప్‌టాప్, మరోవైపు కూలర్ ఉన్నాయి. డోర్ వెనక బట్టలు వేలాడదీసి ఉన్నాయి. గోడమీద టైం టేబుల్ వేసి ఉంది.
''ఇక్కడ సరిగ్గా ఊపిరాడదు. పరీక్షలు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిపోతాను'' అని అర్ణవ్ చెప్పారు.
హాస్టల్ వార్డెన్లు, ఇతర సిబ్బంది, కోచింగ్ సెంటర్లలోని టీచర్లు, మేనేజర్లకు శిక్షణ తప్పనిసరి అని ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.
విద్యార్థులు ఏవైనా ఇబ్బందులు ఉండి వెళ్లిపోవాలనుకుంటే, సులభంగా వెళ్లిపోయేందుకు అవకాశం కల్పించడంతో పాటు డబ్బులు వాపసు చేయాలని ప్రభుత్వం సూచించింది. దానిని ఒక విధానంగా పాటించాలని తెలిపింది.
ఈ సంస్కృతి పూర్తిగా మారాలని విజయ్ అభిప్రాయపడ్డారు. పిల్లలను వారి అభిరుచికి తగినట్టుగా ఉండనివ్వాలని ఆయన అన్నారు.
''ఇంజినీరింగ్, మెడిసిన్ ఒక్కటే జీవితం కాదని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. పిల్లల ప్రాణాలు అన్నింటికంటే ముఖ్యం'' అన్నారు.
ముఖ్యమైన సమాచారం:
మెడిసిన్, థెరపీతో మానసిక సమస్యలకు చికిత్స ఇస్తారు. దీని కోసం సైకియాట్రిస్ట్ నుంచి సాయం తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ హెల్ప్‌లైన్లను సంప్రదించవచ్చు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ - 1800-599-0019(13 భాషల్లో అందుబాటులో..)
హ్యూమన్ బిహేవియర్, అలయిడ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ - 9868396824, 9868396841, 011-22574820
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరోసైన్స్ - 080 – 26995000
హిట్‌గుజ్ హెల్ప్‌లైన్, ముంబై - 022- 24131212
ఇవి కూడా చదవండి:
- వృద్ధ నాయకులు అధికారంలో ఉంటే ఆ దేశం ఏమవుతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- ప్రాంక్ వీడియోలు పసిపిల్లలతోనా... ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా?
- ఆత్మహత్యలకు, వాయు కాలుష్యానికి ఏమిటి సంబంధం?
- ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఏం జరుగుతుంది, ఆ ఆలోచనలను ఎలా పసిగట్టాలి?
- ఆడవాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి... భావోద్వేగాలను బాగా వ్యక్తం చేసే వాళ్ళు దర్పంగా, దూకుడుగా ఉంటారా?














