తెలంగాణ: బైక్‌పై ఆరు దేశాలు చుట్టొచ్చిన యువతులు!

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో నలుగురు యువతులు పెద్ద సాహసమే చేశారు.
వీరు బైక్‌లపై మొత్తం ఆరు దేశాలు చుట్టొచ్చారు. 17000 కిలోమీటర్లు ప్రయాణించారు.
జయభారతి నేతృత్వంలోని మహిళా బృందం భారత్‌తో పాటు మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కాంబోడియా, వియత్నాం దేశాల్లో ప్రయాణించి తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలపై ప్రచారం నిర్వహించారు.
ఫిబ్రవరిలో ప్రారంభమైన వీరి యాత్ర దాదాపు రెండు నెలలు సాగింది. ఏప్రిల్ 8న ఈ బృందం తిరిగి హైదరాబాద్ చేరుకుంది.
ఈ సందర్భంగా విజయవంతంగా ఆరు దేశాలు బైక్ పై చుట్టివచ్చిన మహిళా బృందాన్ని తెలంగాణ పర్యాటక శాఖ ఘనంగా సత్కరించింది.
రాష్ట్ర క్రీడా పాఠశాల విద్యార్థులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, Telangana Tourism/Facebook
ఈ యాత్రలో పాల్గొన్న బైకర్ శాంతి రాష్ట్ర పోలీస్ శాఖలోని షీ టీంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
బైక్ యాత్రపై ఆమె మాట్లాడుతూ, ''మేం ఎక్కడికి వెళ్లిన మాకు మంచి ఆదరణ లభించింది. ఇది మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. టీ తాగడగానికి వెళ్లినప్పుడు, మా బైక్‌లలో పెట్రోల్ కొట్టించుకునేందుకు కాసేపు ఆగినప్పుడు స్థానికులు మమ్మల్ని కలవడానికి వచ్చేవారు. తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం మాకు ఈ పని అప్పగించడం పట్ల చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 18న ఈ బృందం ఆరు దేశాల పర్యటనకు వెళ్లింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఈ బృందానికి ప్రభుత్వం సహకారం అందించింది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








