పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?

పులులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత చట్టాల ప్రకారం పులి గోరును ధరించడం శిక్షించదగ్గ నేరం

పులి గోరుతో తయారు చేసిన పెండెంట్‌ను ధరించి, రియాల్టీ టీవీ ప్రోగ్రామ్‌ బిగ్‌ బాస్ షోలో పాల్గొన్న ఒక పోటీదారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వ్యాపారవేత్త వర్తూర్ సంతోష్ కన్నడ భాషలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో కంటెస్టెంట్. ఆయన్ను అక్టోబర్ 22న పోలీసులు అరెస్ట్ చేశారు.

భారత చట్టాల ప్రకారం పులి గోరును ధరించడం శిక్షార్హైన నేరం. పులి గోరును ఆయన ధరించడమే కాకుండా, దాన్ని బయటకు ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ పెండెంట్‌ కుటుంబ వారసత్వంగా తనకు వచ్చిందని సంతోష్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

లావుపాటి బంగారు చెయిన్‌కు పులి గోరుతో తయారు చేసిన పెండెంట్‌ ధరించి బిగ్‌బాస్‌ షోలో సంతోష్ కనిపించారని తమకు ఫిర్యాదు అందించినట్లు కర్ణాటక అటవీశాఖ చెప్పింది.

ఈ షో నిర్వాహకుల ద్వారా సంతోష్‌ను అటవీ అధికారులు సంప్రదించి, ఆయన్ను ప్రశ్నించారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపింది.

‘‘పెండెంట్‌ను మేం తనిఖీ చేసినప్పుడు, అది పులి గోరు అని ధ్రువీకరణ అయింది’’ అని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్.రవీంద్ర కుమార్ తెలిపారు.

ఈ పెండెంట్ తన పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తోందని సంతోష్ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద జంతువుల శరీర భాగాలను ప్రదర్శించడం శిక్షార్హమైన నేరం. రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది.

పులులు అంతరించిపోయే ముప్పున్న జీవులు.

గత శతాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య సుమారు 95 శాతం తగ్గిందని వరల్డ్ వైడ్ ఫండ్ గణాంకాలు చెబుతున్నాయి.

పులి భారత జాతీయ జంతువు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో సుమారు 75 శాతం భారత్‌లోనే ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

పులుల జనాభా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత్‌లో 2006 నుంచి ఆరోగ్యకరమైన స్థాయిలో పెరుగుతున్న పులుల సంఖ్య

పులుల సంఖ్య బాగా తగ్గిపోతుండటంతో, 1970ల్లో భారత్ ‘ప్రాజెక్ట్ టైగర్‌’ను ప్రారంభించింది.

అప్పటి నుంచి పులులను సంరక్షించేందుకు భారత ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతూనే ఉంది. వీటి వేటపై నిషేధం, వీటిని సంరక్షించేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చేస్తోంది.

2006 నుంచి పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పులుల గణన నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదికలో 2018లో 200కి పైగా పులులు ఉంటే, ప్రస్తుతం ఈ సంఖ్య 3,167కి పెరిగినట్లు తెలిపింది.

అయితే, కొన్ని రిజర్వులతో పాటు పలు ప్రాంతాల్లో స్థానిక పులుల సంఖ్య క్షీణించిపోయిందని గుర్తుంచుకోవాలి.

ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పులల సంరక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)