అజయ్ జడేజా: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ విజయం వెనకున్న భారతీయుడు

ఫొటో సోర్స్, AFGHANISTAN CRICKET BOARD
- రచయిత, బీబీసీ గుజరాతీ టీమ్
- హోదా, దిల్లీ
ప్రపంచ కప్‌లో పాకిస్తాన్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌లను ఓడించిన అఫ్గానిస్తాన్ అందరి చూపును తన వైపు తిప్పుకుంది.
అఫ్గానిస్తాన్ అసాధారణ ప్రదర్శన వెనుక ఆటగాళ్ల కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే ఈ అద్భుత విజయాల వెనక బయటకు కనిపించని వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు. వారిలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు అఫ్గానిస్తాన్ కోచ్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రోట్, మరొకరు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.
అఫ్గాన్ జట్టుకు జడేజా మెంటార్‌గా, గైడ్‌గా వ్యవహరిస్తున్నారు.
పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ విజయం సాధించిన తర్వాత, వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మాట్లాడుకొంటున్నారు.
పాకిస్తాన్‌పై అక్టోబరు 23న చెన్నైలో ఎనిమిది వికెట్ల తేడాతో, ఇంగ్లండ్‌పై అక్టోబరు 15న దిల్లీలో 69 పరుగుల తేడాతో అఫ్గాన్ గెలుపొందింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అఫ్గానిస్తాన్ మెంటార్‌గా అజయ్ జడేజా
ప్రపంచ కప్ మొదలు కావడానికి కొన్ని రోజుల ముందు, అఫ్గానిస్తాన్ టీమ్‌కు మెంటార్‌గా అజయ్ జడేజా నియమితులయ్యారు.
కోచ్‌తో పోలిస్తే మెంటార్ బాధ్యత చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు.
ఎందుకంటే, ప్రతి ఒక్క ఆటగాడితో ఆయన వ్యక్తిగతంగా పనిచేయాల్సి ఉంటుంది.
వారిని మానసికంగా సిద్ధం చేయడం అత్యంత ముఖ్యం. ఆటలో ప్రతి అంశంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలి.
అఫ్గానిస్తాన్ విజయానికి జడేజా అందించిన సహకారం కీలకమైనదని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు.
అజయ్ జడేజా ఒక అంతర్జాతీయ క్రికెట్ జట్టుతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి.
ఈ విజయం ఆయనకు కూడా మంచి ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
అఫ్గానిస్తాన్ జట్టు విజయంలో అజయ్ జడేజా ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆయన మాజీ సహచరుడైన సచిన్ తెందూల్కర్ చెప్పారు. ఆయన్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
‘‘ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్ ఆట తీరు కేవలం గ్రేట్ కాదు, అద్భుతం. క్రమశిక్షణగా చేసిన బ్యాటింగ్, వారు పాటించిన నిబ్బరం నిజంగా మెచ్చుకోదగ్గవి. పిచ్‌పై దూకుడుగా వారు చేసిన పరుగులు, జట్టు కష్టపడేతత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అజయ్ జడేజాతో వారు ప్రభావితులై ఉండొచ్చు’’ అని సచిన్ తెందూల్కర్ అఫ్గానిస్తాన్ టీమ్‌ను ప్రశంసించారు.
‘‘అఫ్గాన్ జట్టు చూపించిన ప్రదర్శనలో నేను అజయ్ జడేజాను చూశాను. 2015లోనే నేను ఆయనతో కలిసి పనిచేశాను. ఆయనకు నిజంగా ఎంతో ఉన్నతమైన క్రికెట్ మైండ్ ఉంది’’ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్, వార్తా చానల్ ‘ఏ స్పోర్ట్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మూడు ప్రపంచ కప్‌లలో ఆడిన అజయ్ జడేజా
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పుట్టిన అజయ్ జడేజా, 1992 నుంచి 2000 మధ్య కాలంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నారు.
భారత్ తరపున 1992, 1996, 1999 మొత్తం మూడు ప్రపంచ కప్‌లలో ఆయన ఆడారు.
1992 ప్రపంచ కప్ సమయంలో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు.
గ్రూప్ దశలో ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలాన్ బోర్డర్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా డైవ్ చేసి, పట్టుకొని, క్రికెట్ అభిమానులందరి దృష్టిని ఆయన ఆకర్షించారు.
అప్పట్లో అజయ్ జడేజాను భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్‌గా భావించేవారు.
భారత్ తరపున ఆయన 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడారు.
వన్డేల్లో 37.47 సగటుతో 5,359 పరుగులు చేశారు. వీటిలో ఆరు సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
వన్డేల్లో ఆయన 20 వికెట్లను తీశారు.
1996 ప్రపంచ కప్‌లో బెంగుళూరులో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌పై జడేజా ఆడిన అద్భుత ఇన్నింగ్స్ చాలా మంది క్రికెట్ అభిమానులకు గుర్తు ఉండొచ్చు.
ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ వకార్ యూనిస్ బౌలింగ్‌లో అజయ్ జడేజా చెలరేగి ఆడారు. ఆ మ్యాచ్‌లో 25 బంతుల్లో 45 పరుగులు చేశారు.
జడేజా భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సీబీఐ నివేదిక ఆధారంగా అజయ్ జడేజా మీద బీసీసీఐ ఐదేళ్ల నిషేధం విధించింది. తర్వాత రెండున్నరేళ్లకు ఈ నిషేధాన్ని దిల్లీ హైకోర్టు ఎత్తివేసింది.
అయితే ఆ తర్వాత అజయ్ జడేజా మళ్లీ భారత జట్టులోకి తిరిగి రాలేకపోయారు.
చాలా కాలం ఆయన కామెంటేటర్‌గా పనిచేశారు. సినిమాల్లో కూడా ప్రయత్నించారు.
అజయ్ జడేజా చాలా రీజనల్ క్రికెట్ టీమ్‌లతో కలిసి పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే...
- వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగు వారా? శత్రువులు కూడా మెచ్చుకున్న ఆయన్ను ఎందుకు ఉరి తీశారు?
- క్రికెట్ వరల్డ్ కప్: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఎలా గెలిచింది... అదీ చేజ్ చేసి?
- రాజమహేంద్రవరం జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖపై వివాదం... అందులో ఏముంది, అసలు అలా రాయవచ్చా?
- తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లున్న అసెంబ్లీ నియోజకవర్గం, తక్కువ మంది ఓటర్లున్న సీటు ఏవో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














