వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగువారా, బందిపోటు అని ముద్రవేసి ఆయనను ఉరి తీశారా... అపోహలేంటి, వాస్తవాలేంటి?

- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ కోసం
భారత జాతి విముక్తి కోసం జరిగిన తొలి తిరుగుబాటుగా చెప్పే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారిలో వీరపాండ్య కట్టబొమ్మన్ ఒకరు.
దక్షిణాదిపై దండెత్తిన మాలిక్ కాఫుర్ తమిళనాడులోని మదురై నుంచి 612 ఏనుగులు, 20 వేల గుర్రాలు, 96 వేల పెట్టెల బంగారం, ముత్యాలు, ఆభరణాలను దోచుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
''అయినా మాలిక్ కాఫూర్ గురించి 'బందిపోటు మాలిక్ కాఫూర్' అని ఎవరూ రాయలేదు. కానీ తెల్లజాతీయుల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరపాండ్య కట్టబొమ్మన్‌పై మాత్రం బందిపోటు అనే నిందలు మోపారు. బ్రిటిష్ వారు జరిపిన చివరి విచారణలోనూ ఆయనపై దోపిడీ నేరం లేకపోయినా బందిపోటు అని నిందించారు'' అని ఆవేదనతో చెప్పారు రచయిత వి.మాణిక్కం.
తమిళనాడులోని ఒక చిన్నపట్టణం పాంజాలకురిచ్చి పాలకుడు వీరపాండ్య కట్టబొమ్మన్. అంత చిన్న రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చాలా యుద్ధాలే చేయాల్సి వచ్చింది.
వీరపాండ్య కట్టబొమ్మన్‌ను అరెస్టు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1799 అక్టోబర్ 16న గయత్తర్‌లో ఉరి తీసింది.

కట్టబొమ్మన్‌ను ఎందుకు ఉరి తీశారు?
''బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను కట్టకపోవడం, సైన్యంతో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతోపాటు బ్రిటిష్ సైనికులను హతమార్చడం, తిరుగుబాటు చేసేలా ప్రజలను రెచ్చగొట్టడం వంటి అనేక కారణాలతో కట్టబొమ్మన్‌ను అరెస్టు చేసి మరణ శిక్ష విధించారు. గయత్తర్ పాత కోట సమీపంలో తిరుగుబాటుదారులు, ప్రజలందరూ చూస్తుండగా ఆయన్ను ఉరి తీశారు'' అని రాబర్ట్ కాల్డ్‌వెల్ రాసిన 'పొలిటికల్ అండ్ జనరల్ హిస్టరీ ఆఫ్ తిరునల్వేలి డిస్ట్రిక్ట్'లో నమోదై ఉంది.
దీనిని 1881లో మద్రాసు ప్రభుత్వం ప్రచురించింది.
అయితే, కొందరు వీరపాండ్య కట్టబొమ్మన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదు, బందిపోటు అని చెబుతారు. దీనిపై సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడూ వివాదం రేగుతూ ఉంటుంది.
నిజానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినందుకే కట్టబొమ్మన్‌ను ఉరితీశారా? అసలు వీటి వెనుక ఉన్న కారణాలేంటని రచయిత మాణిక్కం తెలుసుకోవాలనుకున్నారు.
మాణిక్కం ఓ రిటైర్డ్ తమిళ్ టీచర్. బలయాన్‌కోట్‌లోని యోన్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. కట్టబొమ్మన్‌పై ఆయన చేసిన పరిశోధనకు గానూ పీహెచ్‌డీ పట్టా కూడా పొందారు.
కట్టబొమ్మన్ కుమ్మిప్పడాల్, వీరపాండ్య కట్టబొమ్మన్ డిస్కషన్ ప్లాట్‌ఫాం, వీరపాండ్య కట్టబొమ్మన్ హిస్టరీ, ధనపతి పిళ్లై హిస్టరీ, కట్టబొమ్మన్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఉమదురై హిస్టరీ వంటి అనేక పుస్తకాలు రాశారు.
కట్టబొమ్మన్ చరిత్ర గురించి తెలుసుకునేందుకు బీబీసీ మాణిక్కంతో మాట్లాడింది.

కట్టబొమ్మన్‌పై వచ్చిన నేరారోపణలేంటి?
తుది విచారణ సమయంలో కట్టబొమ్మన్‌పై నాలుగు నేరాలు మోపారు.
- సరిగ్గా పన్నులు కట్టకపోవడం.
- కలెక్టర్ పిలిపించినా కలిసేందుకు నిరాకరించడం.
- శివగిరి కొడుక్కి మద్దతుగా సైన్యాన్ని పంపడం.
- అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, లొంగిపోకపోవడం.
''వీరపాండ్య కట్టబొమ్మన్‌పై దోపిడీ ఆరోపణలు లేవు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కొంత మంది ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు'' అని మాణిక్కం అన్నారు.
''బ్రిటిష్ అధికారి మ్యాక్స్‌వెల్ భూ సర్వే పేరుతో తమ అధీనంలోని భూభాగాన్ని ఎట్టాయపురానికి ఇవ్వడాన్ని కట్టబొమ్మన్ అంగీకరించలేదు. తండ్రి తరహాలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించారు. పన్నులు కట్టడాన్ని వ్యతిరేకించారు. కలెక్టర్ జాక్సన్ ఎన్ని లేఖలు రాసినా కట్టబొమ్మన్ ఆయన్ను కలవలేదు'' అని ఆయన చెప్పారు.
''దీంతో ఆగ్రహం చెందిన కలెక్టర్ జాక్సన్, కట్టబొమ్మన్‌ను అరెస్టు చేసేందుకు వెంటనే బలగాలను పంపించాలని గవర్నర్‌కు లేఖ రాశారు. అయితే, కట్టబొమ్మన్‌ను పిలిపించుకుని మాట్లాడాలని జాక్సన్‌కు గవర్నర్ సూచించారు. దీంతో చర్చలు జరిపేందుకు 15 రోజుల్లోగా రామనాథపురం రావాల్సిందిగా కట్టబొమ్మన్‌కు లేఖ రాసిన జాక్సన్, అక్కడి నుంచి కుర్తాళం వెళ్లారు.
ఆ లేఖ అందుకుని తనను కలిసేందుకు వచ్చిన కట్టబొమ్మన్‌ను రెచ్చగొట్టేందుకు జాక్సన్ పథకం పన్నారు. ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి తిరుగుతూ తనను కలిసే అవకాశం లేకుండా చేయాలనుకున్నారు. అప్పుడు అదే సాకుగా చూపించి కట్టబొమ్మన్‌ను పదవి నుంచి తొలగించాలని భావించారు. అయితే, కట్టబొమ్మన్ కూడా కుర్తాళం, చొక్కంబట్టి, సేత్తూర్, ఇలా ప్రతి ఊరూ తిరుగుతూ చివరికి రామనాథపురంలో జాక్సన్‌ను కలిశారు.''

కలెక్టర్ జాక్సన్‌తో గొడవ
''రామనాథపురంలో కలెక్టర్ జాక్సన్‌తో జరిగిన సమావేశం కట్టబొమ్మన్ జీవితంలో చాలా ప్రధానం. జాక్సన్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు కట్టబొమ్మన్ ఒక్కరినే కోట లోపలికి అనుమతించారు. ఆయన సోదరులు, బావాబామ్మర్దులు, మామ, సైన్యాన్ని బయటే నిలిపివేశారు.
వాళ్లకు మూడు గంటల పాటు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కోట లోపలికి వెళ్లిన కట్టబొమ్మన్‌కు కలెక్టర్ పిలిచేవరకూ వేచిఉండాలని చెప్పారు. తనను బంధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రహించిన కట్టబొమ్మన్ కోట లోపలి నుంచి బయటికి వచ్చేశారు. అప్పుడు జరిగిన గొడవలో కట్టబొమ్మన్.. లెఫ్టినెంట్ క్లార్క్ అనే బ్రిటిష్ అధికారిని చంపేశారు'' అని మాణిక్కం చెప్పారు.
''ఈ ఘటనకు బ్రిటిష్ అధికారి డేవిడ్‌సన్, అలాగే బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదికలే ఆధారాలు. రామనాథపురంలో జరిగిన గొడవకు జాక్సన్ ప్రవర్తనే కారణమని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని డిస్మిస్ చేసి, లాసింగ్టన్‌ను కొత్త కలెక్టర్‌గా నియమించింది'' అని 1881లో ప్రచురితమైన 'పొలిటికల్ అండ్ జనరల్ హిస్టరీ ఆఫ్ తిరునల్వేలి డిస్ట్రిక్ట్'లో 177, 178 పేజీల్లో ఉంది.

రామనాథపురం మార్కెట్‌ను కట్టబొమ్మన్ దోచుకున్నారా?
మాణిక్కం మాట్లాడుతూ, ''రామనాథపురంలో చర్చల సందర్భంగా జరిగిన గొడవతో పాటు దానికి ముందు, దాని తర్వాత జరిగిన ఘటనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ జాక్సన్‌ను కలిసేందుకు బయలుదేరిన కట్టబొమ్మన్, ఆయన సైన్యాన్ని వేటాడేందుకు ప్రయత్నించారు. చివరికి కట్టబొమ్మన్‌ను అవమానించారు.
ఈ చర్చలకు ముందే పెళ్లికొడుకు అయిన కట్టబొమ్మన్ తమ్ముడిపై దాడి జరిగింది. వారి వద్ద నుంచి వస్తువులను స్వాధీనం చేసుకుని బ్రిటిష్ సైనికులు వేలం వేశారు. అప్పుడు జరిగిన ఘర్షణల్లో పాంజాలకురిచ్చికి చెందిన చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
వారి ముట్టడి నుంచి తప్పించుకుని బయటపడ్డ కట్టబొమ్మన్ సైన్యంలో ఆగ్రహం పెల్లుబికింది. తిరిగి వెళ్తూ వెళ్తూ రామనాథపురం వ్యాపార వీధి(మార్కెట్)ని ధ్వంసం చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన చర్యగా దీన్ని చూడొచ్చు'' అని అన్నారు.
ఈ ఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
''ఈ అల్లర్లకు కట్టబొమ్మన్‌ను తప్పుబట్టలేం. ఆయనకు అవమానం జరిగినప్పుడు పిరికివాడిలా పారిపోతాడని అనుకోవడం పొరపాటు. అలాగే తమ నాయకుడు ప్రమాదంలో ఉంటే ఆయన సైన్యం ఊరికే ఉంటుందని అనుకోలేం. వారిలో భావోద్వేగాలు చెలరేగే అవకాశం ఉంది'' అని ఆ కమిటీ నివేదికలో రాసినట్లు పొలిటికల్ అండ్ జనరల్ హిస్టరీ ఆఫ్ తిరునల్వేలి డిస్ట్రిక్ట్‌లో173 నుంచి 177 మధ్య పేజీల్లో ఉంది.
''ఎట్టాయపురానికి చెందిన ఆరుంకుళం, సుపలపురం అనే రెండు ఊళ్లను కట్టబొమ్మన్ దోచుకున్నాడని అందులో రాశారు. అయితే, భూ సర్వే పేరుతో ఆ ప్రాంతాలను తన రాజ్యం నుంచి లాక్కోవడంతో ఆగ్రహం చెందిన కట్టబొమ్మన్ తన మనుషులతో అక్కడ సాగు చేయించారు. దానినే ఆయన దోచుకున్నాడని కొందరు వక్రీకరించి రాశారు'' అని మాణిక్కం చెప్పారు.

కట్టబొమ్మన్ తెలుగువారా?
''కట్టబొమ్మన్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. కానీ, కట్టబొమ్మన్ పుట్టింది తమిళ నేలలోనే'' అని మాణిక్కం చెప్పారు.
తమిళనాడు రైతులు చాలా మంది కట్టబొమ్మన్ నాయకత్వంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలనుకున్నారు. కట్టబొమ్మన్ జాతి, భాష, కుల వివక్ష లేని రైతు కావడం వల్లే అది సాధ్యమైంది.
ఎట్టువాడిలో వీరపాండ్య కట్టబొమ్మన్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.
పాంజాలకురిచ్చితో యుద్ధం చేసి నష్టపోయిన వారు, తిరుగుబాటుదారులు కూడా కట్టబొమ్మన్‌ను ధైర్యవంతుడిగా ప్రశంసించారు. (తిరుగుబాటుదారులు గవర్నర్‌కు రాసిన లేఖలో కూడా పేర్కొన్నారు.)
''శత్రువులు కూడా మెచ్చుకున్న హీరో కట్టబొమ్మన్. ఆయనపై ప్రచారంలో ఉన్న తప్పుడు ఆరోపణలను పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ వాస్తవ చరిత్రను తెలుసుకోవాలి'' అని రచయిత మాణిక్కం అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని కాలి నడకన భారత్ చేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కథ..
- హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'
- యూదుల ఊచకోతకు నాజీలు పన్నిన కుట్రల గురించి పోప్‌కు ముందే తెలుసా... 1942 నాటి రహస్య లేఖలో ఏముంది?
- 'సనాతన ధర్మమే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చింద'న్న మోదీ మాటల్లో నిజమెంత?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














