ఈ వింత శిలల మిస్టరీ ఏమిటి? మేఘాలయలోని ఈ ప్రాంతానికి ఎవరు తెచ్చారు?

ఫొటో సోర్స్, Satarupa Paul
- రచయిత, సతరూప పాల్
- హోదా, బీబీసీ ట్రావెల్
ఫిబ్రవరి నెలలో ఒక రోజు మధ్యాహ్నం మేం అనుకోకుండా, అదృష్టవశాత్తు మేఘాలయా నార్తియాంగ్ శిలల దగ్గరకు వచ్చాం.
కొన్ని ఏళ్ల ముందువరకూ మేఘాలయతోపాటు ఈశాన్య రాష్ట్రాలను పర్యటకులు మారుమూల ప్రాంతాలుగా భావించేవారు. అయితే, నేడు భారత్‌లో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ప్రాంతాల్లో ఇవి కూడా ఉన్నాయి. పరిస్థితి ఎంతలా మారిందంటే పర్యటకుల తాకిడితో నేడు ఇక్కడ ట్రాఫిక్ ఊహించనిరీతిలో విపరీతంగా పెరుగుతోంది. ఆ రోజు మధ్యాహ్నం కూడా అదే జరిగింది.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి భూమిపై అతిఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటైన చిరపుంజి పట్టణానికి కుటుంబంతో కలిసి వెళ్లాలని మేం అనుకున్నాం. అయితే, ఆ మార్గంతోపాటు డాకీ, మావ్లినాంన్ లాంటి ప్రాంతాలకు వెళ్లే దారిలో అడుగడుగునా కార్లతో ట్రాఫిక్ మా సహనాన్ని పరీక్షించింది.
ట్రాఫిక్‌లో దాదాపు నాలుగు గంటలు చిక్కుకోవడంతో రోజులో మిగిలిన సమయాన్నైనా ఆనందంగా గడిపేందుకు వెనక్కి వెళ్లిపోవాలని మేం అనుకున్నాం. ఆ తర్వాత షిల్లాంగ్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రాంతాల గురించి గూగుల్‌లో వెతికాం. దాదాపు ఆ జాబితాలో అన్ని ప్రాంతాలూ మాకు సుపరిచితమైనవే. కానీ, పరిచయంలేని ఒక పేరు మాత్రం మా దృష్టిని ఆకర్షించింది.
‘‘అంతుచిక్కని ఏకరూప శిలలను చూసేందుకు నార్తియాంగ్ వెళ్లండి’’ అనే ఒక శీర్షికపై మా దృష్టి పడింది. అయితే, పొడవైన రాళ్లతో వింతగా కనిపించే ఫోటో, వీటి వెనుక మిస్టరీ కోణం మాలో మరింత ఆసక్తిని రేక్తెత్తించాయి. కానీ, అక్కడ మాకు మరిన్ని వివరాలు లభించలేదు.
అక్కడికి వెళ్లేందుకు గూగుల్స్ మ్యాప్స్ సాయం చేశాయి. షిల్లాంగ్‌కు దక్షిణాన రెండు గంటల దూరంలో ఆ ప్రాంతముంది. పైగా అక్కడికి వెళ్లే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ లేదు.

ఫొటో సోర్స్, Satarupa Paul
అలా నార్తియాంగ్‌లోని భారీ శిలల నీడలోకి మేం చేరుకున్నాం. ఒకరకమైన గ్రానైట్ బ్లాక్ నుంచి పొడుగ్గా స్తంభాల్లా తయారుచేసిన లేదా శ్లాబ్‌లా రూపొందించిన ఇలాంటి రాళ్లను మేఘాలయలో చాలా చోట్ల మీరు చూడొచ్చు. అయితే, భారీ స్థాయిలో, పక్కపక్కనే ఇలా కనిపించడం నార్తియాంగ్ ప్రత్యేకత.
మేం ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన వెంటనే, కాస్త ఎత్తుగా ఉన్న ఒక చోట భిన్న పరిమాణాల్లో వందల సంఖ్యలలో ఈ ఏకరూప శిలలు కనిపించాయి. పెద్దచెట్ల పక్కన కొన్నింటిని పడుకోబెట్టినట్లు, మరికొన్నింటిని నిలుచోబెట్టినట్లుగా కనిపించే ఈ శిలలు అటుగా వచ్చే వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చుట్టూ పొగమంచు, చల్లనిగాలి పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి.
చుట్టుపక్కల సిబ్బంది ఎవరూ కనిపించలేదు. అక్కడక్కడా దుమ్ముతో కూడిన కొన్ని సైన్‌బోర్డులు ఉన్నాయి. వీటిపై రాసిన అంశాల్లో ఒకటి నా దృష్టిని ఆకర్షించింది. ‘‘అన్నింటికంటే పొడవైన ఈ శిల ఎనిమిది మీటర్ల ఎత్తులో, 18 అంగుళాల మందంలో ఉంది. దీన్ని మార్ ఫాలింకి అనే భారీకాయుడు స్థాపించినట్లు జైంతియా జానపద కథల్లో చెబుతుంటారు’’ అని దానిపై రాసి ఉంది.
అవి చదివిన తర్వాత నాలో ఆసక్తి మరింత ఎక్కువైంది. ఈ శిలల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాను. అయితే, పక్కనే ఉన్న ఓ పార్కులో ఫుట్‌బాల్ ఆడే పిల్లలు మినహా ఇక్కడెవరూ కనిపించలేదు. ఆ రోజు సాయంత్రం గ్రామపెద్ద మర్యో సింబలాయ్‌ను కలిశాను. తరతరాల నుంచి కథల రూపంలో చెప్పుకునే ఈ శిలల కథను ఆమె నాకు చెప్పారు.
‘‘ఒకప్పుడు నార్తియాంగ్‌లో బజార్ ఉండేది కాదు. ఏం కావాలన్నా కొనుక్కోవడానికి రలియాంగ్‌కు వెళ్లేవాళ్లం’’ అని ఆమె నాకు చెప్పారు.
‘‘ఒక రోజు అలా బజార్‌కు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు జైంతియా భారీకాయుడు మార్ ఫాలింకీ భారీ వర్షంలో చిక్కుకున్నాడు. తనకు ఒక గొడుకు తీసుకురావాలని రలియాంగ్ పాలకుడి చిన్న కుమార్తెను ఆయన కోరాడు. కానీ, ఆయన శక్తిని ఆమె పరీక్షించాలని అనుకుంది. ‘వెంటనే, బజార్‌లోని ఆ పెద్ద రాయిని ఎత్తి గొడుగులా మీరు ఎందుకు పెట్టుకోకూడదు’ అని ఆమె అంది. ఆ మాటలను ఆయన సవాల్‌గా భావించాడు. వెంటనే ఒక రాయిని గొడుగులా పెట్టుకున్నాడు. అయితే, నార్తియాంగ్‌కు రాకముందే వర్షం తగ్గిపోయింది. దీంతో ఎక్కడైతే వర్షం ఆగిపోయిందో అక్కడ అటవీ ప్రాంతంలో ఆ రాయిని ఆయన పెట్టేశారు’’ అని ఆమె చెప్పారు.
సింబలాయ్ చెప్పిన కథ నాకు కల్పనలా అనిపించింది. అయితే, ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘‘నేడు మేఘాలయలో కనిపిస్తున్నట్లు మా పూర్వీకులేమీ ఐదడుగుల ఎత్తులో ఉండేవారు కాదు. వారు భారీకాయులు’’ అని చెప్పారు. నమ్మశక్యం కానట్లుగా నా మొహంలో కనిపిస్తున్న హావభావాలను చూస్తూ.. ‘‘మార్ ఫాలింకీ ఏడడుగుల ఎత్తు ఉండేవారు. అంతేకాదు ఆయన సియామ్. శక్తిమంతమైన, నిజాయతీగల నాయకులను మాత్రమే సియామ్‌గా పిలుస్తారు’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Satarupa Paul
ఇన్ని శిలలు ఎలా వచ్చాయి?
ఇన్ని ఏకరూప శిలలు ఒకేచోటకు ఎలా వచ్చాయని నేను ప్రశ్నించాను.
సింబలాయ్ స్పందిస్తూ.. ‘‘మీరు మార్ ఫాలింకీ పెట్టిన ఆ రాయి పక్క నుంచి వెళ్తే రద్దీగా ఉండే మార్కెట్‌లో కనిపించే కోలాహలం వినిపిస్తుంది. ఇవి మాకు చాలా పవిత్రమైన రాళ్లు. ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని చదునుచేసి బజార్ ఏర్పాటుచేయాలని మా పూర్వీకులకు ఆదేశాలు అందాయి. మార్ ఫాలింకీ రాయి చుట్టుపక్కల ప్రాంతాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మా పూర్వీకులే చాలా ఏకశిలలను తెచ్చిపెట్టారు. ఫలితంగా నేడు మీకు ఇన్ని శిలలు కనిపిస్తున్నాయి’’ అన్నారు.
పురాతన ఏకరూప శిలలు వారి జీవితంలో ఎంతో ముఖ్యమైనవని ఆమె చెప్పిన కథను విన్న తర్వాత అర్థమైంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనిపించింది. అప్పుడే జైంతియా ప్రజలు, ఈ రాళ్ల గురించి నేను ఆన్‌లైన్‌లో వెతికాను.
జైంతీపుర్ మాతృవంశ రాజ్యం (మ్యాట్రిలీనియల్ కింగ్డమ్). ఇది ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని సిల్హట్ ప్రావిన్స్ నుంచి మేఘాలయ పర్వతాల వరకూ విస్తరించి ఉండేది. అయితే, ఇక్కడ జీవించినవారు చాలా పొడుగ్గా, శక్తిమంతంగా ఉండేవారని చెబుతారు. కానీ, ఈ విషయాలను ధ్రువీకరించే సాక్ష్యాలేమీ కనపడలేదు.
చల్లని వాతావరణంతోపాటు పర్వతాల్లో నివసించేందుకు అనువుగా ఉండే నార్తియాంగ్.. జైంతీపుర్ రాజ్యానికి వేసవి రాజధానిగా ఉండేది. ఇక్కడి ఏకరూప శిలలను క్రీ.శ. 1,500 నుంచి క్రీ.శ.1835 మధ్య స్థాపించినట్లుగా భావిస్తున్నారు.
నార్తియాంగ్‌తోపాటు మేఘాలయలో కనిపించే ఈ ఏకరూప శిలలు మేగాలిత్ కాలంలో సమాధుల కోసం ఏర్పాటుచేసి ఉండొచ్చని బనారస్ హిందూ యూనివర్సిటీలోని పురాతన భారత చరిత్ర, సంస్కృతీ, పురాతత్వ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
‘‘మేఘాలయకు చెందిన ఖాసీ, జైంతియాలు, అస్సాంకు చెందిన నాగాల పూర్వీకులు మరణించిన వారి గౌరవార్థం ఇలాంటి ఏకరూప శిలలను ఏర్పాటుచేశారు’’ అని ఆన్‌లైన్ అకడమిక్ పబ్లికేషన్ ‘ద ట్రైబల్ ట్రిబ్యూన్’లో ఆయన రాసుకొచ్చారు.
19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన రూపంలో ఇక్కడకు క్రైస్తవం రాక ముందు, జైంతియాల్లో చాలా వరకూ హిందువులే ఉండేవారు. అంటే వీరిలో మరణించినవారికి హిందూ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేవారు. అనంతరం అస్థికలను పొడుగ్గా ఏకరూప శిలలతో ఏర్పాటుచేసిన సమాధుల్లో పెట్టేవారని, వీటిలో కొన్ని సమాధులు చిన్న ఇళ్లంత పెద్దగా కూడా ఉండేవని కుమార్ రాసుకొచ్చారు. ప్రస్తుతం నార్తియాంగ్, చిరపుంజి, జోవాయ్, మావోఫ్లాంగ్, లయిలుకోట్ లాంటి ప్రాంతాల్లో కనిపిస్తున్న ఏకరూప శిలలన్నీ అలాంటి సమాధుల రాళ్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘రెండు ఏకరూప శిలలపై పైకప్పులా మరో శిలను పెట్టినట్లు కనిపించేవి లేదా అడ్డంగా ఉండేవి మహిళల సమాధులు. అదే పొడుగ్గా ఉండేవి పురుషులవి’’ అని కుమార్ రాశారు.
అయితే, నార్తియాంగ్‌లో ఒకేచోట ఇంత పెద్దమొత్తంలో ఏకరూప శిలలు ఎలా వచ్చాయో చెప్పే ఎలాంటి ఆధారాలూ ఇప్పటికీ లభించలేదని, దీంతో నేటికీ ఈ ప్రాంతం ఒక మర్మంగానే మిగిలిపోయిందని ట్రావెల్ కంపెనీ నడిపిస్తున్న శామ్యూల్ శావియాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Thierry Falise/LightRocket via Getty Images
‘‘బహుశా ఆ పొడుగైన శిలను తమలో ముఖ్యమైన వారి కోసం ఏర్పాటుచేసి ఉండొచ్చు. ఆ మిగతా రాళ్లను ఆ వంశంలో కొన్ని తరాల వారి కోసం వరుసగా ఏర్పాటుచేసి ఉండొచ్చు. ఇదివరకు ఈ ప్రాంతం ఒక బజారులా ఉండేది. ఈ రాళ్లపై వస్తువులు పెట్టి అమ్మేవారు. వీటిలో కొన్నింటిపై అక్కడకు వచ్చేవారు కూర్చొని విశ్రాంతి కూడా తీసుకునేవారు’’ అని ఆయన అన్నారు.
అయితే, బ్రిటిష్ పాలనతో జైంతియా రాజ్యం తన అధికారాన్ని కోల్పోయినప్పటికీ జైంతియాల సంస్కృతిలో ఈ ఏకరూప శిలలు ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చాయి.
1880లో బెంగాల్‌పై ఈస్ట్ ఇండియా కంపెనీ పట్టు సాధించిన తర్వాత, తన రెవెన్యూను పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తూ వెళ్లింది. అలా నెమ్మదిగా వీరు తూర్పున జైంతియా రాజ్యం వరకూ వచ్చారు. 1835లో బ్రిటిష్ పాలకుల నుంచి తప్పించుకునేందుకు జైంతియా రాజు కొండల్లోకి అజ్ఞాతంలోకి పోయారు. ఆ తర్వాత ఆయన పాలనా కేంద్రంగా నార్తియాంగ్ ఉండేది.
‘‘అప్పట్లో సిల్హట్‌లోని తన రాజ్యాన్ని వదిలి రాజు నార్తియాంగ్‌కు వచ్చేశారు. దీంతో ఈ ప్రాంతానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. ఈ ఏకరూప శిలల ప్రాంతం కూడా అప్పట్లో రాజుల పట్టాభిషేకాలు, తీర్పులు చెప్పడం లాంటివాటి కోసం ఉపయోగించుకునేవారు’’ అని ప్లేసింగ్ ద ఫ్రంటియర్ ఇన్ బ్రిటిష్ నార్త్-ఈస్ట్ ఇండియా పుస్తక రచయిత, చరిత్రకారుడు డాక్టర్ రాజు రే చెప్పారు. ‘‘దీన్ని బట్టి చూస్తే నార్తియాంగ్ ఏకరూప శిలలకు రాజకీయంగానూ ప్రాముఖ్యముంది’’ అని ఆయన అన్నారు.
నార్తియాంగ్ జానపద కథల్లో అతిశయోక్తులు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని నిజాలు కూడా ఉండొచ్చని చరిత్రకారులు అంటున్నారు.
‘‘నార్తియాంగ్ విషయానికి వస్తే, కొన్నిసార్లు జానపదాలు, ఆధారాలు కలుస్తుంటాయి. ఆ ప్రాంతాల చుట్టూ జైంతియాల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, అదే సమయంలో ఒకప్పుడు వారాంతపు బజారులా, రాజకీయ చర్చలకు కేంద్రంగా ఈ ప్రాంతం ఉండేదని ఆ కథల్లో చెబుతుంటారు. నోటి ద్వారా చెప్పే చరిత్ర ఇలానే ఉంటుంది. ఇక్కడ వాస్తవాలు, కల్పనలు కలిపి కథగా చెబుతుంటారు’’ అని రే అన్నారు.
నేడు నార్తియాంగ్ ఏకరూప శిలలు చరిత్రకు సాక్ష్యంగా అలా నిలబడి కనిపిస్తున్నాయి. వీటిని ఎందుకు ఇక్కడ పెట్టారో సమగ్ర పరిశోధన జరగాల్సి ఉంది. జానపద కథలు, కొన్ని పరిశోధనలు ఈ విషయంలో కొన్ని వివరాలు చెబుతున్నాయి. అయినా వీటి వెనుక మిస్టరీ మాత్రం నేటికీ అలానే మిగిలిపోయింది.
ఇవి కూడా చదవండి:
- హమాస్, ఫతాల మధ్య ఘర్షణకు మూలం ఏంటి... పాలస్తీనా కలను ఈ కలహమే చిదిమేస్తోందా?
- గాజా: తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత... అక్కడి ప్రతి కథా విషాదమే
- IND vs PAK మ్యాచ్ గురించి సచిన్ టెండూల్కర్, షోయబ్ అఖ్తర్ మధ్య మాటల పోటీ... పాక్‌కు టాలెంట్ లేదని షోయబ్ ఎందుకు అన్నాడు?
- కిబ్బుట్జ్: ఇజ్రాయెల్ దశ దిశ మార్చిన ఈ కమ్యూనిటీ కథేంటి?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















