ఎవరెస్ట్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్... నేపాలీ పైలట్, అయిదుగురు మెక్సికో పర్యాటకులు మృతి

ఎవరెస్ట్ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎవరెస్ట్ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్

నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్ట్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్ ప్రమాదంలో అయిదుగురు మెక్సికో పర్యాటకులు, నేపాలీ పైలట్ మరణించారు.

నేపాల్ రాజధాని కఠ్మాండూకు ఉత్తరాన ఉన్న లిఖు ప్రాంతంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదానికి కారణాలేంటన్నది ఇంకా తెలియలేదు.

పర్యాటకులందరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీరిలో ఒక జంట, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు బీబీసీ నేపాలీ సర్వీస్‌ తెలిపింది.

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఈ ఆరుగురి మృతదేహాలను నేపాలీ అథారిటీలు వెలికితీశారు.

ఈ హెలికాప్టర్‌ మనంగ్ ఎయిర్‌కి చెందినది. ఎవరెస్ట్‌తో పాటు హిమాలయాల శిఖరాలను పర్యాటకులకు చూపించేందుకు ఈ కంపెనీ తన ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపుతోంది.

సోలుకుంభు జిల్లా నుంచి కఠ్మాండూకు తిరిగి బయల్దేరిన ఈ హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగింది.

సోలుకుంభు ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలకు నెలవు.

నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ గుర్తించిన మృతదేహాల్లో.. ఫెర్నాండో సిఫుయెంటెస్ జీ, గొంజాలెజ్ అబ్రిక్, గొంజాలెజ్ ఒలాసియో లుజ్, మారియా జోస్ సిఫుయెంటెస్ జీ, ఇస్మాయిల్ రింకాన్, నేపాలీ పైలట్ సీబీ గురుంగ్ ఉన్నారు.

ఉదయం 10.04కి బయలుదేరిన ఈ హెలికాప్టర్‌కు 10 నిమిషాల తర్వాత టవర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు నేపాలీ అధికారులు ఏఎఫ్‌పీకి తెలిపారు.

కుప్పకూలిన విమానాన్ని వెతికేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు రెండు హెలికాప్టర్లలో టీమ్‌లను పంపించామని అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్నవారందరూ మరణించారని తెలిపారు.

హెలికాప్టర్ ప్రమాదం
ఫొటో క్యాప్షన్, నేపాల్‌లో హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతం

ప్రమాదానికి గల కారణాలు విచారించాలి

ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించ లేదని నేపాల్ సివిల్ అథారిటీ అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర భుల్ చెప్పారు.

మృతదేహాలను వెలికితీసేందుకు తమ టీమ్‌ సభ్యులు నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్లారని ఆయన ఏఎఫ్‌పీకి వివరించారు.

‘‘ఈ ప్రమాదంలో మృతదేహాలు ముక్కలు ముక్కలుగా తెగిపడ్డాయి’’ అని విమానం కుప్పకూలిన ప్రాంతానికి చెందిన స్థానిక అధికారి సీతా అధికారి రాయిటర్స్‌కి తెలిపారు.

‘‘హెలికాప్టర్ కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించింది. మేఘాల కమ్ముకోవడంతో మేం ఏం చూడలేకపోయాం. ఆ తర్వాత మా ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న చెట్లుపైన హెలికాప్టర్ క్రాష్ అయింది.’’ అని ఆ ప్రాంతానికి చెందిన ఒక నివాసి బీబీసీ నేపాలీ సర్వీస్‌కి తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఈ మెక్సికన్ ఫ్యామిలీ ఆదివారం భారత రాజధాని దిల్లీ నుంచి నేపాల్‌కి వెళ్లింది. ఆ తర్వాత సోమవారం హెలికాప్టర్‌లోనే లుక్లాకి ప్రయాణించింది.

కానీ, వాతావరణం బాగోలేకపోవడంతో, ఆ రోజు వారు తిరిగి రాలేకపోయారు. తిరిగి వెనక్కి రావడానికి వారు మంగళవారం వరకు వేచిచూడాల్సి వచ్చింది.

వాతావరణం బాగున్న సమయంలోనే హెలికాప్టర్‌ను నడపామని ఈ విమానయాన సంస్థ తెలిపింది.

‘‘వాతావరణం అంత ప్రతికూలంగా ఏమీ లేదు. కానీ, ప్రమాదానికి కారణమేంటన్నది మేం చెప్పలేకపోతున్నాం. ఈ ప్రమాద కారణాన్ని విచారించాల్సి ఉంది’’ అని మనంగ్ ఎయిర్ అధికార ప్రతినిధి రాజు న్యూపానే చెప్పారు.

పర్యాటకుల హెలికాప్టర్ విమానాలకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా నేపాల్ ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లలేని ప్రాంతాలకు ప్రయాణికులు చేరుకునేందుకు ఈ హెలికాప్టర్లు సహకరిస్తున్నాయి.

అయితే, ఈ విమానాలు ఎల్లప్పుడూ సురక్షితమైన పరిస్థితుల్లోనే ప్రయాణించడం లేదు. ఈ కారణంతోనే, ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌స్ట్రిప్‌లు కొన్ని నేపాల్‌లోనే ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో రాజధాని కఠ్మండూ నుంచి పోఖరాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో 72 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)