'దమ్ మారో దమ్' హిప్పీలు ఏమయ్యారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ముస్తాఫా వకార్
- హోదా, జర్నలిస్ట్, పరిశోధకుడు
హిప్పీలు... ఈ మాట 1950 నుంచి 1970వ దశకం వరకు బాగా పాపులర్. భౌతిక ప్రపంచంలోని అసమానతలు, అంతులేని సంపద పోగేసుకోవాలనే ఆశను చూసి విసుగుచెందిన యువత హిప్పీలుగా మారారు. తమదైన ప్రపంచాన్ని వెతికే పనిలో పడ్డారు.
అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా హిప్పీలు ఒక ఉద్యమంలా తిరిగారు. గంజాయి తాగడం వీరి స్వేచ్ఛా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అందుకే 1971లో వచ్చిన బాలీవుడ్ సినిమా హరేరామ హరే కృష్ణ సినిమాలోని 'దమ్ మారో దమ్' అనేపాట యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపింది. ఈ పాటలో జీనత్ అమన్ నటించారు. ఇక పాకిస్తాన్‌లోని ఒక గుహలో చేతిలో సిగరెట్‌తో షబ్నమ్ కూడా దమ్ దమా దమ్ మస్త్ పైకే జరా దేఖో అనే పాటలో నటించారు.
ఈ పాట 1974 నాటి పాకిస్తానీ సినిమా ‘మిస్‌హిప్పీ’ లోది. దమ్మారో దమ్ హిందీపాటను ఆశాభోంస్లే పాడగా, పాకిస్తానీ పాటను నీరా నూర్ పాడారు.
ఈ రెండు పాటలను గుర్తుతెలియని ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ పాటలలో కనిపించినవారంతా యువతీయువకులే. వారు తమ దుస్తులు, ప్రవర్తన విషయంలో స్వేచ్ఛగా ఉన్నట్టు కనిపిస్తారు. ఎందుకంటే వారంతా హిప్పీలు.
1960వ దశకంలో హిప్పీలను అమెరికన్ మీడియా బిత్నిక్ అని పిలిచింది. సంప్రదాయ సమాజాన్ని వ్యతిరేకించి కళాతృష్ణతో జీవించేవారిని బిత్నిక్ గా పిలిచేవారు.
బిత్నిక్‌లు అమెరికన్ సంస్కృతిని వ్యతిరేకించారు. 1950,60ల మధ్యన వారు తమను తాము సాహిత్యం, కవిత్వం, సంగీతం, చిత్రకళ ద్వారా వ్యక్తపరుచుకున్నారు.
వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా, అమెరికా తీరును నిరసిస్తూ వీరంతా గంజాయికి అలవాటుపడ్డారు. జట్టు కత్తిరించుకునేవారు కాదు, లైంగిక స్వేచ్ఛతో జీవించడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, RICHARD GREGORY IN KABUL IN 1974 (PRIVATE COLLECTION)
గంజాయి యాత్ర?
1965 నుంచి 1980 దాకా హిప్పీలు డ్రగ్స్ కోసం యూరోప్ నుంచి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్ (శీతాకాలంలో గోవా) దాకా చేసిన యాత్రను బ్రిటన్‌లో హిప్పీ ట్రైల్ గా పిలిచారు.
అందుకే, అమెరికన్ మీడియా దీనిని గంజాయి యాత్ర గా అభివర్ణించింది. ఏదేమైనా 1967 నాటికి బిత్నిక్ స్థానంలో హీప్పీ పదం స్థిరపడిపోయింది.
1968లో ఈ సంగీత బృందం భారత పర్యటనకు వచ్చినప్పుడు వారితో పశ్చిమ యూరోప్‌కు చెందిన యువకులు ఎక్కువగా రావడం కనిపించింది. వీరిలో కొంతమంది ప్రపంచాన్ని చుట్టాలనే ఆశతో వచ్చినవారు ఉన్నారు.
హీప్పీలు యాత్ర సాగించే రోజులలో ఎంత మొత్తం డబ్బు తమతోపాటు తీసుకురావచ్చనే విషయంలో నియంత్రణ ఉండేది. 1974లో బ్రిటన్ లో 25 పౌండ్లవరకు అనుమతి ఉండేది. దీంతోపాటు బ్యాంకులో కమిషన్ చెల్లించి ప్రతి ఒక్కరు ట్రావెలర్స్ చెక్కులు కొనుగోలుచేయాల్సి ఉండేది. చాలామంది యూఎస్ డాలర్లను అక్రమంగా తీసుకువచ్చేవారు.
హిప్పీల జీవితంలో గంజాయి ఒక భాగం. హిప్పీలలో ఎక్కువభాగం యువతే. వారి దుస్తులు, ప్రవర్తన చాలా స్వేచ్ఛగా ఉండేవి. వారు ప్రశాంతంగానూ, స్థిరమైన ఆలోచనలతోనూ ఉండేవారు.
ఫారుఖ్ సోహైల్ గోయిండీ వీరితోపాటు దేశమంతటా తిరిగారు. ఈయన యాత్రికుడు, రచయిత కూడా. ఆయన ఇలా రాశారు:
‘‘సంపద, పెట్టుబడిదారీ సమాజ జీవనశైలికి వ్యతిరేకమైన వీరంతా ఎక్కడికి వెళ్ళినా తమదైన ముద్ర వేశారు. కృత్రిమ ఆహారం అంటే నిల్వచేసిన పదార్థాలను, రసాయనాలను వాడే ఆహారం తినడాన్ని పాపంగా భావించేవారు. స్నానం కూడా అప్పుడప్పుడు చేసేవారు. వీలైనంత తక్కువ దుస్తులు ధరించేవారు. జుట్టు కత్తిరించుకోవడాన్ని తప్పుగా భావించేవారు. ’’
‘‘వీరి ఉద్యమం విచిత్రమైనది. నాయకుడు లేడు, కార్యాలయాలు, కార్యదర్శులు లేరు, రహస్య విమానాలు లేవు, అధికారులు లేరు, సభ్యులు లేరు. ఇది పూర్తిగా స్వేచ్ఛతోనూ, స్వతంత్రంగా సాగిన ఉద్యమం. ప్రపంచ రాజకీయాలు, సంస్కృతిపై ప్రపంచ అగ్రదేశాలు తమ వనరులు, ప్రచారంతో వేయలేని ముద్రను ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఊపిరి పోసుకున్న ఈ ఉద్యమం వేసిందని’’ ఫారుఖ్ రాశారు.

ఫొటో సోర్స్, FACEBOOK/US CONSULATE GENERAL KARACH
అఫ్గానిస్తాన్‌లో కొందరు ఎందుకు ఆగిపోయారు?
రిచర్డ్ గ్రెగరీ కూడా యుక్తవయసులోనే హిప్పీలలో చేరారు. హిప్పీల యాత్ర యూరోప్ దారులన్నీ కలిసే ఇస్తాంబుల్‌లో మొదలైందని ఆయన రాశారు.
ఇస్తాంబుల్‌లో గుల్హానే, తెహ్రాన్‌లో అమిర్ కబిర్, కాబుల్ లో ముస్తాఫా, పెషావర్‌లో రాంబో, లాహోర్‌లో ఆసియా హోటల్, దిల్లీలో క్రౌన్, బొంబాయిలో రెక్స్ అండ్ స్టిఫిల్స్ హిప్పీల యాత్రలో ప్రసిద్ధ హోటళ్ళు. ఈ హోటళ్ళో బస చేయడం చాలా చౌక, ఉత్తమమైన పని గ్రెగరీ చెప్పారు.
కాందహార్‌లో న్యూటూరిస్టు, కాబుల్‌లో పీస్, నేపాల్‌లోని పోక్రాలో వైట్ హౌస్, శ్రీనగర్‌లో ఎక్కువగా ఉపయోగించే హౌస్ బోట్లు, గోవాలో అద్దెకు తీసుకునే ఇళ్ళు, పెషావర్, లాహోర్‌లలో మోడ్రన్ లగ్జరీ హోటళ్ళు నాకు గుర్తున్న పేర్లు అని ఆయన తెలిపారు.
‘‘నేను ఇస్తాంబుల్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి గుల్హనే హోటల్ పోలీసుల దాడులకు ప్రసిద్ధిచెందిందని తెలిసింది. అయితే అక్కడ ఇంకా ఇతర బస ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని నేను ఉపయోగించుకున్నాను’’ అని గ్రెగరీ చెప్పారు.
1957లో ఇస్తాంబుల్ సుల్తాన్ ప్రారంభించిన లేల్ రెస్టారెంట్ పుడ్డింగ్ షాప్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
దీనికి దగ్గరలోనే బ్లూమాస్క్, హగియా సోఫియా ప్రాంతాలు ఉండేవి. కఠ్మాండుకు ఇస్తాంబుల్ మీదుగా వెళ్ళేవారు, బస్సులలో ప్రయాణించేవారు చౌక హోటళ్ల దగ్గర ఆగేవారు.
ఇస్తాంబుల్‌లో చాలా ఆకర్షణలు ఉన్నాయని గ్రెగరీ చెప్పారు, అయితే, అవి యూరప్‌లో కూడా ఉన్నాయి. హిప్పీల బాటలో మీ సాహసం మీరు అన్నింటిని వదిలిపెట్టేవరకు మొదలుకాదంటారు ఆయన.
కొంతమంది మధ్యప్రాచ్యంలో పెద్ద ఎత్తున గంజాయి ఉత్పత్తి చేసే లెబనాన్ వైపు వెళ్లేవారు. లేదంటే అప్పట్లో షా పరిపాలనలో లౌకికవాద దేశంగా ఉన్న టర్కీ నుంచి ఇరాన్ మీదుగా అప్ఘానిస్తాన్ వెళ్ళేవారు.
అప్ఘానిస్తాన్‌లోని ప్రధాన నగరాలలో కొన్ని హోటళ్ళు, కేఫ్‌లు ప్రత్యేకంగా హిప్పీల కోసమే నడిచేవి.

ఫొటో సోర్స్, Getty Images
హిప్పీల స్థావరంగా పాకిస్తాన్
అఫ్గానిస్తాన్ తరువాత హిప్పీలు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన తరువాత ఉత్తరాన స్వాత్, చిత్రాల్ వైపు వెళ్ళారు.
పాకిస్తాన్ హిప్పీలకు ప్రధాన స్థావరం అయ్యాక పెషావర్, స్వాత్, లాహోర్, కరాచీ ముఖ్యమైన ప్రాంతాలుగా మారాయని రచయిత నదీమ్ ఫారూఖ్ పరాచ చెప్పారు.
హిప్పీలు ఖైబర్ పాస్ మీదుగా రావల్పిండికి వచ్చేవారు. అక్కడి నుంచి లాహోర్ ఆపైన బస్సులో చేరుకునేవారు. చాలా మంది హీప్పీలు కరాచీలోని బీచ్‌లను చూడటానికి వెళ్ళేవారు.
లాహోర్, కరాచీలలోని సూఫీ ఆలయాలకు ఈయన ఎక్కువగా వెళ్ళేవారు. అదే సమయంలో మధ్యతరగతి యువత కూడా ఆలయాల సందర్శనకు రావడం ఎక్కువైంది. ముఖ్యంగా, గురువారం రాత్రి చాలా ఆలయాలలో సంప్రదాయ సూఫీ సంగీతం, ఖవ్వాలి జరిగేవి.
‘‘పాకిస్తాన్‌లో హిప్పీల దుస్తులు యువతను బాగా ఆకట్టుకున్నాయి. 60ల చివర్లలో యువతకు పొట్టిజుట్టు ఉండేది. కానీ, 70ల ప్రారంభంలో జట్టును ఝటాధారిలా పొడవుగా పెంచుకోవడం మొదలుపెట్టారు. మహిళల దుస్తులు మురికిగా మారడం మొదలైంది’’ అని ఫారూఖ్ రాశారు.
అప్పట్లో విదేశీయులు ఇక్కడికి రావడానికి ఎంతమాత్రం భయపడేవారు కాదు. పైగా ఇక్కడ తాము సురక్షితంగా ఉండగలమని నమ్మేవారు.
‘లాహోర్‌లోని కంటోన్మెంట్‌లోని నా ఇంటికి సమీపంలోని ఓ పార్కు వద్ద నాలుగురోజులుగా ఓ హిప్పీ పడి ఉండటాన్ని గమనించాను. అయిదవరోజు నేనతని దగ్గరికి వెళ్ళినపుడు అతను అర్థాకలితో ఉన్నాడు. ఈ యువ హిప్పీ ఒకనాటి యుగోస్లోవియాకు చెందినవాడు. అతను నాతో నాలుగురోజులపాటు ఉన్నాడు. నాతోనే తిన్నాడు, తాగాడు, నిద్రపోయాడు. నేను అతనితో బలవంతంగా స్నానం చేయించి అతని బట్టలు ఉతికించాను. అప్పటి నుంచి అతను నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. ప్రపంచం ఎంతో మారింది. కానీ, మా స్నేహంలో ఎటువంటి మార్పు రాలేదు’ అని ఫారూక్ గుర్తు చేసుకున్నారు.
చౌకైన హోటళ్ళు హిప్పీలకు వసతి ఇవ్వడానికి పోటీపడేవి. అప్పట్లో పెషావర్, లాహోర్, కరాచీలో పర్యాటక పరిశ్రమ విలసిల్లేది.
పెషావర్‌లోని రాంబో గెస్ట్ హౌస్ హిప్పీలకు ఓ అసాధరణ అభిమాన స్థలం. లాహోర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ది ఆసియా హోటల్ లో ఎక్కువభాగం విదేశీయులు దిగుతుండేవారని గ్రెగరీ చెప్పారు.
బస్సులు లేకపోవడంతో కొంతమంది చిత్రాల్‌ను సందర్శించారు. అయితే అక్కడ మౌంటెయిన్ ఇన్ అనే హోటల్ ఉండేది. దానిని 1968 నుంచి హైదర్ అలీషా నడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇండియాలో మద్యం వద్దు, లస్సీ ముద్దు'
హిప్పీలలో ఎక్కువభాగం పాకిస్తాన్ మీదుగా ఇండియాకు వచ్చేవారు. డ్రగ్స్ కావాలనుకునేవారు కశ్మీర్ కు వెళ్ళేవారు. హిప్పీలకు ఇండియాలో మరో ప్రసిద్ధ గమ్యస్థానం ఉత్తరభారతంలోని కులుమనాలీ. ఇక్కడ గంజాయిని ఎక్కువగా సాగుచేసేవారు.
శీతాకాలంలో హిప్పీలలో ఎక్కువమంది ఎప్పుడూ గంజాయి లభించే గోవాకు వెళుతుండేవారు.
‘‘బీడీ చాలా చౌకగా ఉండేది. అదే పనిగా తాగేవాడిని. కాస్త దూరప్రాంతాలకు నేను సైకిల్ టాక్సీలను, ఆటోలలో ప్రయాణించేవాడిని’ అని రిచర్డ్ గ్రెగరీ చెప్పారు.
భారతదేశంలోని గుళ్ళలో అన్నదానం, నిద్రపోవడానికి అవకాశం ఉండటాన్ని హిప్పీలు వాడుకున్నారు.
గ్రెగరీ దిల్లోని పహార్‌గంజ్‌లోని వికాస్ హోటల్లో బస చేశారు. దిల్లీలోని క్రౌన్ హోటల్ గురించి కూడా నేను విన్నాను. బ్రిటీషు గిటారిస్టు, కవి విల్కో జాన్సన్ 1970లో ఆ హోటల్లో బస చేశారు.

బాంబే చాలా ఖరీదైన నగరం, విక్టోరియా టెర్మినల్‌లో నిద్రపోయానని విల్కో చెప్పారు.
బాంబేలోని మిస్టన్ రోడ్డులో ఉన్న దీప్తి హౌసెస్ ఆఫ్ ప్యూర్ డ్రింక్స్ కూడా హిప్పీలకు అభిమాన స్థలం.
‘ఓ శాకాహారిగా ఇండియాను అద్భుతమైన ప్రదేశంగా భావించా. బాంబే చర్చిగేటు వద్ద ఉన్న రెస్టారెంట్ చక్కని దోసెలు, తాలీని అందించేది. కాలన్‌గూట్‌లోని భేల్ పూరి దుకాణం కూడా నాకు బాగా గుర్తుంది’ అని గ్రెగరీ చెప్పారు.
‘రాత్రి భోజనం సహజంగా చపాతీ లేదా పూరీ, కూర ఉండేది. అల్పాహారంగా భాజీ, సమోసా, కచోరి, చాట్ ఉండేవి. వేయించిన పప్పులు, మిక్చర్‌ను నములుతుండేవాడిని. నాకు స్వీట్స్ కూడా ఇష్టం. హల్వా, బర్ఫీ, లడ్డూ, గులాబ్ జాం తినేవాడిని. లస్సీ నాకు ఇష్టమైన పానీయం. కానీ, నేను భోజనంతోపాటు ఓ గ్లాసు మంచినీళ్ళు తాగేవాడిని. నేనెప్పుడు ఇండియాలో మద్యం సేవించలేదు’ అని తెలిపారు.
‘తరువాత నా గోవా ప్రయాణంలో భేల్‌పూరి, దోశ, తాలీ తిని సంతోషించాను. కుల్ఫీ, శిర్కంద్, ఫలూదా, రోజ్ మిల్క్ అప్పుడప్పుడే పరిచయమవుతున్నాయి. బాంబే వీధులలో తాజా చెరకురసం తాగాను’ అని చెప్పారు.
కాన్పూర్‌లో రైల్వే స్టేషన్ సమీపంలో ఓ టీస్టాల్ ఉండేది. ప్రపంచంలో టీ రకరకాలుగా తయారుచేస్తారు కానీ, నా ఫేవరేట్ టీ మాత్రం ఇండియాలో ట్రక్ డ్రైవర్ పాలతో తయారుచేసే టీనే. తేయాకు, యాలకులు, లవంగాలను పాలల్లో ఉడికించి, బోలెడంత పంచదార వేసి వేడి వేడిగా ఇచ్చే టీ అద్భుతంగా ఉండేది అంటారు గ్రెగరీ.
‘స్టేషన్ ముందు తలపాగా ధరించిన ఓ ముసలాయన నాకు సైగ చేశాడు. నేను అతని వద్దకు వెళ్ళాకా పొగాకు పైపు తీశాడు. మేమిద్దరం అక్కడు కూర్చుని పొగ పీల్చుతుంటే పెద్దసంఖ్లో జనం గుమిగూడి చూశారు. బ్రిటీషువాళ్ళకు బెనారస్ గా తెలిసిన వారణాసిలో మేం కొన్నిరోజులు ఉన్నాం అని తెలిపారు గ్రెగరీ.
ఆ తరువాత రోజు మేం ప్రభుత్వ గంజాయి దుకాణం గురించి తెలుసుకున్నాం. అక్కడ మీరు చట్టబద్ధంగా గంజాయి కొనుగోలు చేయవచ్చు. అక్కడ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
హిప్పీల అద్భుత ప్రయాణం కఠ్మాండూలో ముగిసింది. టిబెట్, యార్కాండ్ మీదుగా రావాలంటే అవి చాలా మారుమూలప్రాంతాలు. బర్మా మీదుగా రోడ్డు మార్గం మూసివేశారు. దాంతో, ఎవరైనా సరే బ్యాంకాక్‌కు విమానంలో వెళ్ళాలి లేదంటే ఇంటిముఖం పట్టాలి.
కఠ్మాండూ చాలా అందమైన నగరం. ఇక్కడి చాలా భవనాలు చెక్కతో నిర్మించినవే.
కేఫ్ ది గ్లోబ్ కాఠ్మాండ్‌లో బిత్నిక్‌లకు శాశ్వత బస కేంద్రంగా మారింది. కానీ 1969 నాటికి పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి.
ఫ్రీక్ వీధిలోని ది ఓరియంటల్ లాడ్జి మొదటి హోటల్ గా ఉండేది. కానీ తరువాత చాలా భవనాలు ఈ స్థానాన్ని భర్తీ చేశాయని నేపాల్ నిపుణుడు మార్క్ లిచీ తన ఫార్ అవుట్ పుస్తకంలో పేర్కొన్నాడు.
ఫ్రీక్ స్ట్రీట్ అసలు పేరు ‘జోచాన్ టోల్’. ఈ వీధిలోని చాలా హోటళ్ళు తరచుగా హిప్పీలతో నిండిపోతుండేవి. ‘‘1973 ప్రాంతానికల్లా ఇక్కడ చట్టబద్ధంగానే గంజాయి లభించేది. ప్రపంచంలోనే అత్యుత్తమ గంజాయిని ఇక్కడ పొందడం కష్టమయ్యేది కాదు.’
హిప్పీలు ఎక్కువగా సంప్రదాయ యాత్రికులకంటే కూడా స్థానికులతోనే సంభాషించేవారు. వారు విలాసవంతమైన హోటళ్లలో బసచేయగల అవకాశం ఉన్నా, వారు అందుకు ఇష్టపడేవారు కాదు.
‘మాట్లాడకుండా కేవలం సైగలతోనే ఎలా సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలో నేను నేర్చుకున్నాను. ఇంగ్లీషు మాట్లాడలేని, నేపాల్ నుంచి వచ్చిన టిబెటన్ శరణార్థులతో సైగలతో చక్కగా మాట్లాడగలిగాను. ఇలా నేను నా జీవితంలో అత్యుత్తమ సమయాన్ని గడిపాను’ అని గ్రెగరీ చెపారు.

ఫొటో సోర్స్, Getty Images
జాన్ భట్ లాంటి హిప్పీలు ఎక్కడి నుంచి వచ్చారంటే..
1986లో ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ గోవాలో అరెస్టయ్యారు
1975లో శోభరాజ్ కాఠ్మండూలో ఇద్దరు టూరిస్టులను చంపిన కేసులో నేపాల్ జైలులో 19 సంవత్సరాల జైలు జీవితం గడిపారు. ఇండియాలో ఇతర టూరిస్టులను చంపడంతోపాటు, 1970లో ఫ్రెంచ్ టూరిస్టుకు విషం పెట్టడానికి ప్రయత్నించిన కేసులో 20 ఏళ్ళ జైలు జీవితం గడిపాడు.
1972, 1982 మధ్య 20కు పైగా హత్యలతో ఆయనకు సంబంధం ఉంది. ఇండియా, థాయ్ లాండ్ లో పాశ్చ్యాత హిప్పీ బ్యాక్ ప్యాకర్లతో కలిసి శోభరాజ్ పాల్గొనేవాడు. దీంతోపాటు అతను కొన్ని హత్యలు చేశాడు.
అప్ఘానిస్తాన్‌లో ఆరోగ్యంగా ఉండటం చాలా కష్టం. హిప్పీలు కూడా అక్కడి సంస్కృతి చూసి దిగ్భ్రాంతి చెందారు అని గ్రెగరీ రాశారు.
‘కొంతమంది తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. కొందరి వద్ద డబ్బు అయిపోయింది. కొంతమంది జైలుపాలయ్యారు కూడా. కానీ చాలామంది బతికి బట్టకలిగారు’
ఇతరులు తమను అనుసరించేలా హిప్పీలు తరచూ ప్రోత్సహించేవారు. కొందరు హిప్పీలు తమను తాము పోషించుకోవడానికి మార్గాలు వెదుక్కుని భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడిపోయారు.
ఇక పరిశోధకుడు, బీబీసీ జర్నలిస్టు జాన్ మహమ్మద్ భట్ కథ ఏమిటో తెలుసుకోండి.
జాన్ మైకేల్ భట్ పేరుతో అతను 60లలో హిప్పీల యాత్రలో భాగమయ్యాడు. కానీ, పాకిస్తాన్‌లో ఇస్లామ్ ను స్వీకరించాడు. తరువాత ఇండియాలో మత విద్యను అభ్యసించాడు. తన జ్ఞాపకాలతో ‘ఏక్ తలాబ్ కీ కహానీ: ది లైఫ్ ఆఫ్ పక్తూన్ ఇంగ్లీషు మ్యాన్’ పుస్తకాన్ని ప్రచురించాడు.
ఈ పుస్తకాన్ని విశ్లేషకులు ప్రత్యేకమైన పక్తూన్ జీవితాలను ఆవిష్కరించిందని కొనియాడారు.
హిప్పీల యాత్ర ఎలా ముగిసింది?
1979లో రష్యా అఫ్గానిస్తాన్‌పై దండయాత్ర చేసి పశ్చిమ యాత్రికులు రావడానికి వీలులేకుండా సరిహద్దులను మూసివేసింది.
1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం భూమార్గాలను వెంటనే మూసివేయలేదు కానీ, చాలామంది బస్సు ఆపరేటర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు.
1980లో ఇరాక్ ఇరాన్ పై దండయాత్ర చేసినప్పుడు ఈ సర్వీసులన్నీ మూతపడ్డాయి. బలూచిస్తాన్ కు దక్షిణ మార్గాన్ని ఎంచుకోవడం ఎంతమాత్రం అనుకూలం కాదు. లెబనాన్ పౌరయుద్ధంలో విల్లవిల్లాడుతోంది. కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. నేపాల్‌లో ప్రశాంతత కరువైంది.
ఈ పరిణామాల వల్ల హిప్పీల యాత్ర ముగిసింది. విమానయానం చౌకగా మారడంతో గోవా హిప్పీలకు కేంద్రంగా మారింది. దీంతో వాయుమార్గంలో హిప్పీల యాత్ర కొనసాగింది.
ఓ హిప్పీ జంటకు స్నేహితుడైన గోయిండ్, ‘‘ఈ ఇటాలియన్ జంటను ఇస్తాంబుల్‌లోని హగీయా సోఫియాకు సమీపంలోని శివారు ప్రాంతంలో చూశాను. తాము పెళ్ళి చేసుకోకముందు హిప్పీలమని ఈ జంట చెప్పింది’ అని రాశారు.
‘‘మేం ఖాళీజేబులతో ప్రపంచమంతా తిరిగాం. మా ప్రయాణంలో మేం మంచి స్నేహితులమయ్యాం. ఒకరోజు హరేరామ హరేకృష్ణ అంటూ దమ్ దమ్ మస్త్ కలందర్ పాటలు పాడుకున్నాం. మేం ముస్లిములుగా మారాం. కానీ, మేం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణిస్తుంటాం. వీలుంటే మా స్వస్థలం ఇటలీకి కూడా వెళతాం. ప్రపంచమంతా మాదే’’ అని ఆ జంట చెప్పినట్టు గోయిండీ రాశారు.
ప్రపంచంలో అత్యంత కష్టమైన పని మనల్ని మనం కనుక్కోవడమే.
ఇవి కూడా చదవండి:
- ‘చంద్రబాబు చస్తారు’ అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఎందుకన్నారు? వైసీపీ, టీడీపీల్లో కొందరు ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారు?
- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్: ఏఐ దెబ్బకు కోట్ల ఉద్యోగాలు గల్లంతవుతాయా... భారత్‌లో ఈ భయాలు ఎలా ఉన్నాయి?
- హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ ఎందుకు ప్రకటించలేదు?
- స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చదివితే మెదడుకు ఏమవుతుంది?
- షాపులో బంగారం చోరీ.. ‘బొమ్మ’ అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్: పరవాడ ఫార్మా సిటీ దెబ్బకు మంచం పట్టిన తాడి గ్రామం... వారం రోజుల్లోగా ఊరిని తరలిస్తామన్న సీఎం జగన్ ఏడాది కిందటి హామీ ఏమైంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














