స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌‌పై చదివితే మెదడుకు ఏమవుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అంజలి దాస్
    • హోదా, బీబీసీ కోసం

తనను తాను తెలుసుకోవడానికి, తనను తాను తీర్చిదిద్దుకోవడానికి పఠనం చాలా ఉపయోగపడిందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

చదివే అలవాటు ఒత్తిడిని తగ్గించడం, మెదడును చురుగ్గా ఉంచడంతోపాటు అర్థం చేసుకునే స్థాయిని పెంచుతుంది. అలాగే, పుస్తకాల్లోని కొత్త విషయాలను కూడా తెలుసుకోవచ్చు.

పుస్తకాలు చదివే అలవాటు ఒక వ్యక్తి సిద్ధాంతాలను కూడా మార్చేస్తుందని న్యూయార్క్‌లోని ది న్యూ స్కూల్ ఫర్ సోషల్ రీసర్చ్ నిర్వహించిన పరిశోధనలో తేలింది.

అయితే ఈ రోజుల్లో పేపర్లు, పుస్తకాలకు బదులుగా కంప్యూటర్లు, ట్యాబ్లెట్స్, మొబైల్‌ ఫోన్ స్క్రీన్‌పై చదివే అలవాటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ ధోరణి బాగా పెరిగింది.

స్క్రీన్‌పై చదివే అలవాటు వల్ల కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి. ఒక పుస్తకం కొనుక్కుని చదవాలంటే చాలా ఖర్చవుతుంది. అదే స్క్రీన్‌పై అయితే తక్కువ ఖర్చుతో చదువుకోవచ్చు.

అయితే, దీని వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.

అశ్విక భట్టాచార్య

ఫొటో సోర్స్, AASIMA

స్క్రీన్‌ వల్ల దుష్ప్రయోజనాలు

‘‘స్క్రీన్‌పై చదవడం మెదడుపై ఎలా ప్రభావం చూపుతుంది’’ అనే బీబీసీ రీల్‌లో పబ్లిష్ చేసిన కథనం ప్రకారం, స్క్రీన్‌పై చదవడం వల్ల మెదడు ఎలా ప్రభావితమవుతుందనే విషయంపై పరిశోధన జరిపేందుకు దాదాపు 30 దేశాల స్కాలర్స్, సైంటిస్టులను ఒక చోటుకు చేర్చారు.

ఈ పరిశోధన గురించి రచయిత, నార్వేలోని స్టావెంజర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన అన్నె మాంజెన్ మాట్లాడుతూ- ''న్యూస్ అప్డేట్స్‌ సహా స్ట్మార్ట్‌ఫోన్స్‌లో చదువుకునేందుకు చాలా ఉంటాయి. అయితే, పేపర్‌పై ముద్రితమైనవి చదవడంతో పోలిస్తే స్క్రీన్‌పై చదివినప్పుడు విషయాలు అంత సులువుగా అర్థం కావని తేలింది'' అన్నారు.

అలాగే, ''చిన్నతనంలోనే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వారి యవ్వనంలో కనిపిస్తాయి'' అని అమెరికాకి చెందిన సేపియన్ ల్యాబ్స్ ఒక నివేదికలో పేర్కొంది.

పేపర్‌పై చదివేటప్పుడు కంటే స్క్రీన్‌పై చదివేటప్పుడు మెదడు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని, అలా స్క్రీన్‌పై చదివిన విషయాలను ఎక్కువసేపు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టమని అమెరికాలో జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

అయితే, మనం చదివే మాధ్యమం కంటే ఏది చదివాం, ఎంత చదివామనేదే ప్రధానం.

ఎందుకంటే చదువు మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. అది మనం చదివిన విషయాన్ని దృశ్యరూపంలో ఊహించుకోవడాన్ని, భాష అంతరార్థాన్ని గ్రహించడంతోపాటు మనిషి ఆలోచనలను, భావోద్వేగాలను మిళితం చేస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

'పిల్లలు గ్యాడ్జెట్స్ వాడకాన్ని నివారించాలి'

అశ్విక భట్టాచార్య తొమ్మిదో తరగతి చదువుతోంది. పుస్తకాలు చదివే అశ్విక ఎప్పుడూ క్లాస్‌లో అందరికంటే ముందుంటుంది. ఇటీవల ఆమె అలవాటు స్క్రీన్‌ వైపు మళ్లుతోంది.

చదువుకునేందుకు తల్లిదండ్రులు ట్యాబ్లెట్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆమె తిరిగి పుస్తక పఠనం వైపు రావాలనుకుంటోంది.

''నిత్యం గ్యాడ్జెట్స్ స్క్రీన్‌పై చదువుతూ ఉండడం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతోందని, అందుకే మా అమ్మాయిని మళ్లీ పుస్తకాల వైపు మళ్లించాలని అనుకుంటున్నా'' అని అశ్విక తల్లి ఆసిమా చెప్పారు.

పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలని ఇన్ఫోసిస్ గ్రూప్ డైరెక్టర్ సుధా మూర్తి కూడా అన్నారు.

''ఈ రోజుల్లో పిల్లల దృష్టి మరల్చేందుకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రూపంలో చాలా మార్గాలు ఉన్నాయి. గ్యాడ్జెట్స్ వల్ల పిల్లల కళ్లకు హాని కలగకుండా నివారించాలి'' అని ఆమె అన్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన సుధా మూర్తి జైపూర్‌ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ, ''కనీసం 14 ఏళ్లు వచ్చే వరకూ మీ పిల్లలు పుస్తకాలు చదివేలా చూడండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండేలా చూసుకోండి. వాళ్లకు 16 ఏళ్లు వచ్చిన తర్వాత పుస్తకాలు చదవాలనుకుంటున్నారో, లేదో వారికే వదిలేయండి'' అని ఆమె అన్నారు.

క్రెస్పిడా కొవెల్

ఫొటో సోర్స్, CRESSIDA COWELL

పఠనం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

చదవడం అనే అలవాటు సృజనాత్మకత, జ్ఞానం, అర్థం చేసుకునే సామర్థ్యం అనే అద్భుతమైన లక్షణాలను పెంపొందిస్తుందని బ్రిటిష్ రచయిత, చిత్రకారిణి క్రెస్సిడా కొవెల్ చెప్పారు.

''ఒక చిన్నారికి చదువుపై ఆసక్తి ఉంటే రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి జ్ఞానాన్ని పెంచుకోవడం, రెండోది భవిష్యత్తులో ఆర్థిక పరిపుష్టి సాధించడం'' అని ఆమె అన్నారు.

పఠనం అనేది ఒక కళ అని, అది ఆరు వేల ఏళ్ల కిందటే మొదలైందని రీసర్చ్ స్కాలర్ మరియాన్నె వోల్ఫ్ బీబీసీ రీల్‌లో చెప్పారు.

''మన దగ్గర ఎన్ని ద్రాక్షరసం పాత్రలు, ఎన్ని గొర్రెలు ఉన్నాయనే దగ్గరి నుంచి చదువు ప్రారంభమైంది. వర్ణమాల ప్రారంభమైన తర్వాత ఏదైనా చదవడం, దానిని గుర్తుంచుకోవడం, దాని ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకోవడం అనే కళను నేర్చుకున్నారు'' అని ఆమె అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

పుస్తకాలు ఎందుకు చదవాలి?

''పుస్తకాలు జీవితానుభవాలను నేర్పిస్తాయి. వాటిలో పూర్తి సమాచారం ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలియజేస్తాయి'' అని బ్లాక్ గర్ల్స్ బుక్ క్లబ్ ఫౌండర్ నటాలీ కార్టర్ అన్నారు.

''భవిష్యత్తులో మరిన్ని చిన్న చిన్న కథల పుస్తకాలు వస్తాయి. పుస్తకాల పరిమాణం కూడా తగ్గుతుందని అనుకుంటున్నా. పుస్తకాలు లేకపోతే బతకలేం. జీవితం చాలా విసుగ్గా అనిపిస్తుంది'' అన్నారు.

''పుస్తకాలే లేకపోతే మనం ఇవాళ ఇలా ఉండేవాళ్లం కాదు. అగ్గి పుట్టించడం ఎలా, చదువుకునే నైపుణ్యం అనే విషయాలు మానవ జీవితాన్నే మార్చేశాయి'' అని బిబ్లియోథెరపిస్ట్ ఎలా బర్తోడ్ అభిప్రాయపడ్డారు.

బిబ్లియోథెరపీతో మానసిక సమస్యలకు చికిత్స అందించొచ్చు. క్రియేటివ్ ఆర్ట్ థెరపీగా కూడా చెప్పొచ్చు. ఇతర సంప్రదాయ పద్ధతుల మాదిరిగా పుస్తకాలను చదవడం ద్వారా సమస్యకు చికిత్స అందించడాన్ని బిబ్లియోథెరపీ అంటారు.

ఒక మంచి కథ చదవడం వినోదం కంటే ఎక్కువేనని, పఠనానికి సమస్యలను నయం చేసే శక్తి ఉందని ఎల్లా చెప్పారు. ఉదాహరణకు, ఏదైనా ప్రదేశంలో ఇబ్బందిగా అనిపించడం, అలసట, కోపం అనిపించినప్పుడు ‘జోబ్రా ది గ్రీక్‌’ చదవాలని సూచిస్తారని చెప్పారు.

''దీని వల్ల మీ మెదడు ధ్యాన స్థితికి వస్తుంది. హృదయ స్పందనల్లో ఇది లయను తీసుకొస్తుంది. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ మెదడులో ఆందోళనలను తగ్గిస్తుంది'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)