చైనీయుల కోసం పంగోలిన్, చిరుతపులుల శరీర భాగాలతో ఔషధాలు.. తయారీ సంస్థల్లో ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాల పెట్టుబడులు

పంగోలిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరించిపోతున్న జీవుల్లో పంగోలిన్ ఒకటి
    • రచయిత, అలెక్స్ బిన్లే
    • హోదా, బీబీసీ న్యూస్

అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్, చిరుతపులు శరీర భాగాల నుంచి ఔషధాలు తయారు చేస్తున్న సంప్రదాయ చైనా ఔషధ తయారీ సంస్థల్లో అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టినట్లు ఓ నివేదికలో వెల్లడైంది.

‘ది ఎన్విరాన్మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ (ఈఐఏ) విడుదల చేసిన నివేదికలో మొత్తం 62 బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇలా చిరుతపులి(లెపర్డ్), పంగోలిన్ల నుంచి తొమ్మిది రకాల మందులు తయారుచేస్తున్న ఫార్మాసిటికల్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. దీనిపై స్పందించాల్సిందిగా బీబీసీ ఆయా సంస్థలను కూడా కోరింది.

పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో యూకే ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజాలు హెచ్ఎస్‌బీసీ, ప్రుడెన్షియల్ అండ్ లీగల్&జనరల్, గ్లోబల్ ఇన్వస్ట్‌మెంట్ సంస్థలైన గోల్డ్‌మాన్ సాచ్స్, యూబీఎస్, డచ్ బ్యాంక్ బ్లాక్ రాక్‌ల వంటి సంస్థలు కూడా ఉన్నాయి.

చిరుతపులి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరించిపోతున్న జీవుల జాబితాలో చిరుతపులి

వాటి ఎముకలు నరాలను పటిష్టం చేస్తాయని చైనీయుల నమ్మకం

చిరుతపులి, పంగోలిన్లు రెండూ సీఐటీఈఎస్ (కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసిస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా) జాబితాలో కూడా ఉన్నాయి.

సీఐటీఈఎస్‌ను అనుసరించి, జాబితాలో పేర్కొన్న జీవులు, వాటి శరీర భాగాలపై అంతర్జాతీయ వాణిజ్యం నిషిద్ధం.

అయితే, చైనాకు చెందిన టోంగ్ రెన్ టాంగ్ గ్రూప్, టియాంజిన్ ఫార్మా గ్రూప్, జిలిన్ అవోడోంగ్ ఫార్మా గ్రూప్ సంస్థలు ఈ సంప్రదాయ చైనా ఔషధాలను తయారు చేస్తున్నాయి.

ఈ మూడు సంస్థల్లో కనీసం ఒక సంస్థలో ఆయా ఫైనాన్స్ సంస్థలకు పెట్టుబడులు ఉన్నాయని నివేదికలో ఉంది.

సంప్రదాయ చైనా ఔషధాల తయారీలో పులి ఎముకకు బదులుగా చిరుతపులి ఎముకలను వినియోగిస్తున్నారు. పులి ఎముక.. మానవుల శరీరంలోని ఎముకలు, నరాలను పటిష్టం చేయడంలో ఉపయోగపడుతుందని, నొప్పులను దూరం చేస్తుందని, పంగోలిన్ పొలుసులు శరీరంలో రక్తప్రసరణ మెరుగవడానికి, రుమాటిక్ నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయని చైనీయుల నమ్మకం. అయితే, దీనికి శాస్త్రీయపరమైన ధృవీకరణ ఏదీ లేదు.

పంగోలిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పంగోలిన్ పొలుసులతో మందుల తయారీ

పెట్టుబడులు ఉపసహరించుకోవాలి..

ఈఐఏ నివేదికను ప్రచురించిన సందర్భంలో లీగల్ & పాలసీ స్పెషలిస్ట్ అవినాష్ భాస్కర్ మాట్లాడుతూ- “చైనా ప్రభుత్వం వెంటనే సీఐటీఈఎస్‌కు కట్టుబడి చిరుత, పంగోలిన్, పులి, రైనోలను వాణిజ్య వనరులుగా పరిగణించకుండా చర్యలు తీసుకోవాలి. దేశీయ మార్కెట్‌లోనూ వీటిపై అన్ని రకాల వ్యాపారాలను నిషేధించాలి” అని కోరారు.

“అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జీవులను సంరక్షించే ఉద్దేశంతో ఏర్పాటైన సీఐటీఈఎస్‌ నిబంధనలు పాటించాలి. సంప్రదాయ ఔషధాల తయారీ కోసం అంతరించిపోతున్న జీవులను వాణిజ్య వనరుగా చూడటం ఆపాలి. అలా చేయకపోతే జీవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇదే కొనసాగితే, వినియోగదారులు ఈ తరహా ఔషధాలు ఫలితాలను ఇస్తున్నాయని నమ్మి, మార్కెట్‌లో ఈ జీవులు లేదా వాటి శరీర భాగాలకో సం ప్రయత్నాలు చేస్తారు. ఇది ప్రమాదకరం” అన్నారు.

“ప్రముఖ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఇలా పర్యావరణానికి కీడు చేసే విధంగా, ఇలాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం శోచనీయం.

ఫైనాన్స్ సంస్థలన్నీ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటే, ఆ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలి” అని అవినాష్ కోరారు.

ఫైనాన్స్ సంస్థల స్పందన ఏమిటి?

హెఎస్‌బీసీ సంస్థ దీనిపై ఓ ప్రకటనలో స్పందించింది. “మేం నేరుగా పెట్టుబడులు పెట్టలేదు. ఆ సంస్థలకు మాకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధమూ లేదు” అని తెలిపింది.

అయితే నివేదికలో హెచ్ఎస్‌బీసీ గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ కెనడా సంస్థ స్పందనను జోడించింది. అందులో “సంప్రదాయ చైనా ఔషధ కంపెనీల్లోని పెట్టుబడులను పాసివ్ ఫండ్స్‌గా పేర్కొంది. సంబంధిత సూచీలా ఆధారంగా ఆటోమెటిక్‌గా షేర్స్‌లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది” అని తెలిపింది.

మరో బ్యాంకింగ్ దిగ్గజం డచ్ బ్యాంక్ ఈ నివేదికపై స్పందించాల్సింది తాము కాదని, తమ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ డీడబ్ల్యూఎస్ అని తెలిపింది. ఈ సంస్థ డచ్ బ్యాంక్‌కు సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్‌ కార్యకలాపాలను చూస్తుంది.

డీడబ్ల్యూఎస్ దీనిపై విడుదల చేసిన ప్రకటనలో, ఈ పెట్టుబడుల వెనుక చాలా అంశాలు ఉంటాయని తెలిపింది.

‘‘పర్యావరణ, సామాజిక, పాలన పరమైన విధానాలను అనుసరించి, ప్రాక్సీ ఓటింగ్ ద్వారా యాక్టివ్, పాసివ్ ఫండ్స్‌పై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా డీడబ్ల్యూఎస్ యాక్టివ్ ఫండ్స్‌ ద్వారా చైనా సంప్రదాయ ఔషధ సంస్థల్లో పెట్టుబడి పెట్టలేదు” అని చెప్పింది.

“క్లైంట్ డిమాండ్‌లను అనుసరించి, వివిధ సూచీల ఆధారంగా ఆయా నిధుల నిర్వహణ చేపడుతున్నాం” అని లీగల్&జనరల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ తెలిపింది.

“ఐపీబీఈఎస్ (ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్-పాలసీ ప్లాట్‌ఫాం ఆన్ బయో డైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ సర్వీస్) పేర్కొన్నవాటిలో ముఖ్యంగా ‘సహజ వనరుల వినియోగం, దోపిడీ’ అన్న అంశంలో క్రూర జంతువుల వినియోగంపై కూడా ఆంక్షలు ఉన్నట్లు మాకు తెలుసు. అయితే వీటిని ప్రత్యేకంగా గుర్తించేలా, కొత్త పనివిధానాల రూపకల్పనకు కృషి చేస్తున్నాం” అని ఆ సంస్థ తెలిపింది.

బ్లాక్ రాక్ సంస్థ స్పందించడానికి నిరాకరించింది.

కామెంట్ కోసం యూబీఎస్, టోంగ్ రెన్ టాంగ్ గ్రూప్, టియాంజిన్ ఫార్మా గ్రూప్, జిలిన్ ఫార్మా గ్రూప్‌లను కూడా బీబీసీ సంప్రదించింది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)