ప్రొస్టేట్ కేన్సర్‌కు ఇక ఐదు రేడియోథెరపీ సెషన్లతోనే చికిత్స

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ఫెర్గూస్ వాల్ష్
- హోదా, మెడిసిన్ ఎడిటర్, బీబీసీ న్యూస్
ప్రొస్టేట్ కేన్సర్‌కు చికిత్స తీసుకునే వ్యక్తులు, ఇక నుంచి తక్కువ రేడియేషన్ థెరపీనే తీసుకోవచ్చు.
ప్రొస్టేట్ కేన్సర్‌కు చెక్ పెట్టే సరికొత్త అధునాతన చికిత్సా విధానం త్వరలోనే అందుబాటులోకి రానుంది.
బ్రిటిష్ మెడికల్ సెంటర్ రాయల్ మార్స్‌డెన్ హాస్పిటల్‌కు చెందిన ప్రొఫెసర్ నికోలస్ వాన్ అస్ జరిపిన సరికొత్త అధ్యయనంలో ఈ ట్రీట్‌మెంట్‌ను కనుగొన్నారు.
ప్రస్తుతం 20 సార్లు జరుపుతున్న రేడియోథెరపీ చికిత్సను మూడో వంతు తగ్గించి, కేవలం ఐదు ఎక్కువ డోసులతో కూడిన మల్టీబీమ్ రేడియోథెరపీ చికిత్సతో ప్రొస్టేట్ కేన్సర్‌ను నయం చేయొచ్చని ఈ అధ్యయనంలో తేలింది.
అంటే, వేల మంది పురుషులు కేవలం కొన్ని సెషన్లలోనే దీనిని పూర్తి చేసుకోవచ్చు.
బ్రిటన్, ఐర్లాండ్, కెనడాల్లోని 38 ఆసుపత్రుల్లో జరిగిన ఈ ట్రయల్‌లో దాదాపు 900 మంది పురుషులు పాల్గొన్నారు.
వారందరూ ఇంకా వ్యాప్తి చెందని మీడియం రిస్క్ ప్రోస్టేట్ కేన్సర్ పీడితులే.
మల్టీబీమ్ రేడియోథెరపీ చికిత్సను ఐదు ఎక్కువ డోసుల్లో తీసుకున్న వారిలో 96 శాతం మంది ఐదేళ్ల తర్వాత కేన్సర్ నుంచి సంపూర్ణంగా విముక్తి పొందారు.
అదే సమయంలో, సాధారణ రేడియోథెరపీ కనీసం 20 డోసులు తీసుకున్న వారిలో 95 శాతం మందికి ఐదేళ్ల తర్వాత కేన్సర్ నయమైంది.
తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ రెండు బృందాల్లో తక్కువగా కనిపించాయి.
‘‘ఈ ఫలితాలు రోగులకు అత్యుత్తమమైనవి. వైద్య సేవలందించే వారికి కూడా ఇదొక అద్భుతమైన వార్త’’ అని చీఫ్ ట్రయల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ నికోలస్ వాన్ అస్ అన్నారు.
ప్రొస్టేట్ కేన్సర్ చికిత్సలో అతిపెద్ద మార్పును ఇది సూచిస్తోందని అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ చెప్పింది.

‘నాకు చాలా వేగంగా చికిత్స చేశారు’
బ్రిటన్‌కు చెందిన 64 ఏళ్ల అలిస్టయిర్ కెన్నెడీ రోజ్‌కు 2014లో ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధరణ అయింది.
తన రక్తపరీక్షల్లో ప్రొస్టేట్ స్పెషిఫిక్ యాంటీజెన్(పీఎస్ఏ) స్థాయులు అధికంగా ఉన్నట్లు చూపించింది.
‘‘ముందు ఎలాంటి లక్షణాలు నాకు కనిపించలేదు. అందుకే కేన్సర్ ఉన్నట్లు బయటపడటం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.
ఈ అధ్యయనంలో భాగంగా రోబోటిక్ రేడియోథెరపీ మెషిన్ సైబర్‌నైఫ్ సిస్టమ్‌ను వాడుతూ రాయల్ మార్స్‌డెన్ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందించారు.
ఒకే వారంలో ఐదు సెషన్లను ఆయనకు అందించారు. హార్మోన్ థెరపీని ఆయన పొందలేదు.
‘‘ఈ చికిత్స చాలా తేలిగ్గా అనిపించింది. నాకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. ప్రతిదీ చాలా వేగంగా అయిపోయింది. నా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ బతికేలా ఈ చికిత్స నాకు సాయపడింది’’ అని అలిస్టయిర్ కెన్నెడీ రోజ్ తెలిపారు.
‘‘వారు నాకు చాలా వేగంగా చికిత్స చేశారు. నాకు కేన్సర్ ఉందనే వాస్తవాన్ని అంగీకరించడం చాలా కష్టమైంది’’ అని అన్నారు. ఆయన పీఎస్ఏ లెవల్స్‌పై పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం తగ్గినట్లు చెప్పారు.
ఈ చికిత్స వల్ల తాను కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకునే అవకాశముందని డాక్టర్లు చెప్పినట్లు కెన్నెడీ రోజ్ తెలిపారు.
సరైన సమయంలో గుర్తిస్తే మేలు
బ్రిటన్‌లో ప్రామాణిక చికిత్సలో 20 మోతాదుల రేడియోథెరపీ అవసరం ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో 40 డోసుల వరకు వాడుతున్నారు.
ప్రొస్టేట్ కేన్సర్‌కు కారణమయ్యే టెస్టోస్టెరోన్‌ను బ్లాక్ చేసేందుకు 874 మంది పురుషుల్లో ఎవరూ కూడా హార్మోన్ థెరపీని పొందకపోవడం ఈ పరిశోధనలో మరో కీలక అంశం.
భవిష్యత్తులో ఇక హార్మోన్ థెరపీని తక్కువగా ఉపయోగించాల్సి రావచ్చు.
ఈ ట్రయల్‌లో ఎవరికీ హార్మోన్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. దాంతో విపరీతమైన అలసట, శరీరంలో సెగలు, సెక్సువల్ కోరికలు తగ్గడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరిలోనూ కనిపించలేదు.
‘‘సంప్రదాయ రేడియోథెరపీతో పోలిస్తే ఈ కొత్త రకం థెరపీ సమర్థవంతంగా కనిపించడం అద్భుతం. పురుషులు మరింత సమర్థవంతంగా, వేగంగా, కొన్నిసార్లు మాత్రమే ఆస్పత్రికి రావడం ద్వారా ఈ చికిత్సను పొందగలరు’’ అని ప్రొస్టేట్ క్యాన్సర్ యూకేలో సంస్థ రీసర్చ్ డిప్యూటీ డైరెక్టర్ సిమోన్ గ్రీవ్సన్ చెప్పారు.
అలిస్టెయిర్‌కు ప్రొస్టేట్ కేన్సర్ ఉందని ఒక మామూలు రక్తపరీక్షతో తెలిసింది. కాబట్టి 50 ఏళ్లు దాటిన పురుషులంతా తరచూ ఈ పరీక్ష చేయించుకోవాలని ఆయన కోరుతున్నారు.
‘‘సరైన సమయంలో ఈ కేన్సర్‌ను గుర్తిస్తే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌తోనే సులభతరమైన చికిత్సను పొందొచ్చు. దీని నుంచి అదృష్టవశాత్తు నేను బయటపడ్డాను’’ అని కెన్నెడీ రోజ్ ముగించారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














