ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఎలాన్ మస్క్ 'టెస్లా'ను షేక్ చేస్తున్న చైనా కంపెనీ

బీవైడీ చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీవైడీ ఎలక్ట్రిక్ కార్లు
    • రచయిత, మోనికా మిల్లర్
    • హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్

ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)ల ప్రస్తావన వచ్చిందంటే అంతా టక్కున ‘టెస్లా’ పేరు చెప్పేస్తారు. కానీ, టెస్లాకు గట్టిపోటీనిస్తోంది చైనాకు చెందిన ‘బిల్డ్ యువర్ డ్రీమ్స్’ లేదా బీవైడీ (BYD) సంస్థ.

గత ఏడాదితో పోల్చిచూస్తే ఈ మూడో త్రైమాసికంలో రెట్టింపు లాభాలు ఆశిస్తున్నట్లు బీవైడీ వెల్లడించడంతో కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి.

త్రైమాసిక కార్ల ఉత్పిత్తిలోనూ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాను దాటేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా ఉన్న జపాన్‌ను కూడా వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా విస్తరించింది.

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగంలో కూరుకుపోతున్న చైనాకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

బీవైడీ చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యుటివ్‌తో జాన్ లీ తో బీవైడీ వ్యవస్థాపకులు వాంగ్ చౌవాన్‌ఫు (ఎడమ)

బ్యాటరీల తయారీ సంస్థగా మొదలై..

తొలి నుంచే బీవైడీ ప్రణాళిక బద్ధంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఇతర కార్ల కంపెనీల్లా కార్ల ఉత్పత్తి లక్ష్యంగా బీవైడీ ప్రారంభం కాలేదు. బ్యాటరీల తయారీ సంస్థగా మొదలై, క్రమంగా కార్ల తయారీలోనూ అడుగుపెట్టింది.

సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాంగ్ చౌవాన్ ఫు సంపద ప్రసుతం 18.7 బిలియన్ డాలర్లు. కానీ వాంగ్ చౌవాన్ ప్రయాణం మాత్రం సున్నా నుంచే మొదలైంది. 1966లో చైనాలోని వువై కౌంటీలో రైతు కుటుంబంలో జన్మించారు వాంగ్ చౌవాన్. టీనేజ్‌లో తల్లిదండ్రులను కోల్పోయి, సోదరుల సంరక్షణలో పెరిగాడు.

మెటలర్జీ, ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ పూర్తి చేసిన వాంగ్, తన సోదరుడితో కలిసి షెన్‌జెన్‌లో1955లో బీవైడీ సంస్థను నెలకొల్పాడు.

జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించే బ్యాటరీలు జపాన్ నుంచి దిగుమతి అయ్యేవి. ఆ శ్రేణిలో జపాన్ దిగుమతులకు పోటీగా, ఆ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించారు. అలా బీవైడీ ప్రయాణం మొదలైంది.

2002లో సంస్థ పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీగా మారింది. ఆ సమయంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘క్విన్‌చౌన్ అటోమొబైల్’ సంస్థను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.

అప్పటికి ఎలక్ట్రిక్ వాహనాల గురించి అందరికీ తెలిసినా, మార్కెట్‌ అంతగా లేదు. మార్కెట్‌లో నెలకొన్న ఖాళీని భర్తీ చేయాలని చైనా నిర్ణయించుకుంది. పర్యావరణ హిత వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ, అలాంటి సంస్థలకు సబ్సిడీలు, ట్యాక్స్ రిబేట్లను ప్రకటించింది.

బీవైడీ సంస్థకు ఇది అనుకూలంగా మారింది. వారు తయారుచేస్తున్న బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఇంధనాలుగా మారాయి.

2008లో అమెరికా బిలియనియర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ బీవైడీలో 10% షేర్లను కొనుగోలు చేశారు. ఆ సమయంలోనే “ భవిష్యత్తులో ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌లో అతిపెద్ద సంస్థగా బీవైడీ మారుతుంది” అన్నారు.

ఆయన చెప్పిందే నిజమైంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే చైనా తొలిస్థానంలో ఉందంటే, అందులో బీవైడీ పాత్ర ఎక్కువే.

ప్రపంచ మార్కెట్‌లో తన ప్రాధాన్యతను నిలుపుకునేందుకు చైనా కట్టుబడే ఉంది. ఇందులో భాగంగానే గతే జూన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మందగించిన సమయంలో వచ్చే నాలుగేళ్లకు గాను, సుమారు 73 బిలియన్ డాలర్ల విలువైన పన్ను మినహాయింపులు ప్రకటించి, సంస్థలకు ప్రోత్సాహాన్నిచ్చింది.

బీవైడీ తన తొలి అడుగు అయిన బ్యాటరీల ఉత్పత్తి ఆలోచనకు ఎప్పటికీ రుణపడి ఉండాలని విశ్లేషకులు అంటుంటారు. అందుకు కారణమూ లేకపోలేదు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బ్యాటరీయే అన్నింటికన్నా ఖరీదైనది. మార్కెట్‌లో ఉన్న అన్ని సంస్థలు ఈ బ్యాటరీల కొనుగోలుకే ఎక్కువ ఖర్చు చేస్తుంటాయి.

దిగ్గజ సంస్థ టెస్లాతోె సహా సంస్థలన్ని థర్డ్ పార్టీ సంస్థలపైనే ఆధారపడతాయి. కానీ బీవైడీకి ఆ ఇబ్బంది లేదు. తయారీ తమదే కావడంతో చాలా వరకు ఖర్చుని ఆదా అవుతోంది.

యూబీఎస్ నివేదిక ప్రకారం టెస్లా రూపొందించిన మోడల్ 3 సెడాన్‌తో పోల్చితే బీవైడీ సీల్ మోడల్ కారు గట్టి పోటీనిస్తోంది.

బీవైడీ ప్రారంభ శ్రేణి మోడల్ సీగల్ కారు 11000 డాలర్ల ధరకు( సుమారు రూ. 915636 ) విక్రయిస్తుంటే, టెస్లా తాజాగా విడుదల చేసిన మోడల్ 3 సెడాన్ కారు ధర చైనా మార్కెట్‌లో సుమారు 33000 డాలర్లు( సుమారు రూ.2746908) పలుకుతోంది.

మరోవైపు చైనా మార్కెట్‌లో అత్యధిక విక్రయాల కార్ బ్రాండ్‌గా నిలిచిన జర్మనీ కార్ల సంస్థ వోక్స్ వాగన్‌కు కూడా గట్టిపోటీనిస్తోంది.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్

బీవైడీ వర్సెస్ టెస్లా

2011లో ఓ టెలివిజన్ ఇంటర్వ్యూ సమయంలో బీవైడీతోపాటు చైనా సంస్థలు టెస్లాకు పోటీనిస్తాయాన్న అన్న ప్రశ్నకు ఎలాన్ మస్క్ నవ్వారు. ఆ సమయానికి టెస్లా సంస్థ పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీగా అవతరించి ఎంతో కాలం కాలేదు. పైగా మోడల్-S కారుకు సంబంధించిన ప్రొటోటైప్ కారును అప్పుడే ఆవిష్కరించింది.

కానీ, ఇప్పుడు తన స్పందనని గనుక మస్క్ గుర్తుచేసుకుంటే, బహుశా బాధపడొచ్చుమో.

చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం సెప్టెంబర్ నెలలో టెస్లా 74,073 కార్లను విక్రయించింది. గతేడాది విక్రయాలతో పోల్చిచూస్తే, 11% తగ్గుదల కనిపించింది.

కానీ, బీవైడీ మాత్రం గణనీయమైన వృద్ధి సాధించింది. అదే సమయానికి 2,86,903 కార్లను విక్రయించింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ మోడల్స్ విక్రయాల్లో 43% వృద్ధి సాధించినట్లు లెక్క.

అయితే, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విస్తరిస్తున్నకొద్దీ టెస్లా క్రెడిబిలీటీ పెరుగుతూ వస్తోంది. టెస్లా చైనా మార్కెట్‌లోకి అడుగు పెట్టేవరకు గ్రీన్ ఇన్సెంటివ్స్ వినియోగదారులను ఏమాత్రం ఆకర్షించలేకపోయాయి.

“ఇప్పటికీ ఫేవరెట్ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్‌లలో టెస్లా అందరికీ ఫేవరెట్” అన్నారు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థకు చెందిన ఇవాన్ లామ్. “యువ కొనుగోలు దారులు టెస్లాపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు”అని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ మార్కెట్ అయిన చైనా, విదేశీ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలను దేశీయ మార్కెట్‌లోకి ఆహ్వానించేందుకు వీలుగా నిబంధనలను కూడా సడలించింది.

విదేశీ సంస్థలు నేరుగా దేశంలోనే ఉత్పత్తి, విక్రయాలు జరుపుకునేందుకు అవసరమైన వెసులుబాట్లు కల్పించింది. అంతకుముందు పరిస్థితి అలా లేదు. విదేశీ సంస్థలు దేశంలో అడుగుపెట్టాలంటే, దేశీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ మోటార్స్, టయోటా వంటి సంస్థలు ఇదే నిబంధనలను పాటించాయి.

ఈ నిబంధనల సడలింపును టెస్లా సమర్థవంతంగా వినియోగించుకుంది. ఇప్పటికీ చైనాలో ఉత్పత్తి అయిన కార్లను ఎగుమతి చేయడంలో టెస్లానే ముందు స్థానంలో ఉంది. అంతేకాకుండా చైనాలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో రెండో స్థానంలో ఉంది.

చైనాలో టెస్లా ప్రణాళికలను మరింత విస్తృతం చేయాలని మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో బ్యాటరీ వేర్‌హౌస్‌లను నిర్మించనున్నారు.

అయితే, వాషింగ్టన్, బీజింగ్‌ల మధ్య ఉద్రిక్తతలు మొదలైన నేపథ్యంలో మస్క్ భారత మార్కెట్‌పై దృష్టి సారించారు. చైనా తర్వాత భారత్ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉంది.

జూన్‌లో ప్రధాని మోదీతో భేటీ అనంతరం భారత్‌లో సాధ్యమైనంత త్వరగా టెస్లా పరుగులు పెడుతుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు.

చైనా మార్కెట్ విజేతగా మారుతుందా?

ప్రస్తుతం ఇంధన ఇంజన్ల కార్ల తయారీ దిగ్గజాలే మార్కెట్‌లో సింహభాగాన్ని ఆక్రమించుకున్నప్పటికీ, 2030 నాటికి పరిస్థితి మారిపోంతుదని విశ్లేషకులు అంటున్నారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పర్యావరణహిత వాహనాలకే ప్రాధన్యం పెరిగి, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే, చైనా నుంచి వస్తున్న గట్టిపోటీని తట్టుకోవడానికి యూరప్, యూకే సంస్థలు శ్రమించాల్సి వస్తోంది. యూరప్ మార్కెట్‌లో చైనా సంస్థల ప్రవేశాన్ని కట్టడి చేయడం ద్వారా చైనా దూకుడుకి కళ్లెం వేయాలని ప్రయత్నిస్తున్నారు.

బీజింగ్ అందిస్తున్న సబ్సిడీ పాలసీల లబ్ధిని వినియోగించుకుని మార్కెట్‌‌లో స్థానాన్ని సంపాదిస్తున్న చైనా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలపై దృష్టి సారించారు.

ఇప్పటికే దిగుమతులపై పన్ను విధించే విషయమమై యూరోపియన్ కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది.

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొన్‌దెర్ లెయెన్ మాట్లాడుతూ “తప్పుడు వాణిజ్య విధానాలతో చైనా సోలార్ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసింది” అని అన్నారు.

ఇవన్ని అటుంచితే, బీవైడీ మాత్రం అటు జపాన్‌లోనూ కార్ల విక్రయాలలో విజయవంతమైంది.

ప్రముఖ సంస్థలైన మెర్సిడిస్ బెంజ్, బీఎండబ్ల్యూ, వోక్స్‌వాగన్ వంటి దిగ్గజాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో ప్రపంచ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సెప్టెంబర్‌లో మ్యూనిక్‌లో జరిగిన అతిపెద్ద యూరప్ కార్ ఎక్స్‌పోలో ఆ సంస్థలు ప్రదర్శించిన మోడళ్లను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

“వాహనాలను తక్కువ ధరలో ఎవరు అందిస్తున్నారో వారికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఆ ధరకు చైనా విక్రయించగలుగుతోంది. ఆ ఫలితమే ఇది” అన్నారు ఆటోమొబిలిటీ సంస్థ సీఈవో బిల్ రుస్సో .

వీడియో క్యాప్షన్, ఇండోనేషియాలో ప్రారంభమైన.. అత్యంత వేగంగా నడిచే మూడో ఏషియన్ రైల్వే నెట్‌వర్క్

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)