ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ పర్యటనకు వస్తే స్కూల్స్ ఎందుకు మూసేస్తున్నారు?

ఫొటో సోర్స్, APCMO/FB
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ పెళ్ళి రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు.
రాజానగరం మండలం దివాన్ చెరువులో జరిగిన ఈ కార్యక్రమం కోసం సీఎం రావడంతో చుట్టుపక్కల మూడు మండలాల్లో పాఠశాలలు మూతపడ్డాయి.
గతంలో ఎవరైనా ప్రముఖులు లేదా అధికారులు ఆయా ప్రాంతాలకు వస్తున్నారని తెలిస్తే పాఠశాలల నిర్వహణ పకడ్బందీగా చేసేవారు. పిల్లలంతా క్రమశిక్షణతో ఉండాలంటూ అప్రమత్తం చేసేవారు. అధికారులు ఎవరైనా తరగతి గదికి వచ్చి ఏదైనా ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పాలని విద్యార్థులను సన్నద్ధం చేసేవారు.
కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే ఆ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇచ్చేస్తున్నారు. స్కూళ్లు మూసేస్తున్నారు.
అధికారిక పర్యటనలకు మాత్రమే కాకుండా తాజాగా ఓ వివాహ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతున్న తరుణంలోనూ ఆ నియోజకవర్గంలోని అన్ని బడులూ మూతపడ్డాయి.
దీంతో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే స్కూళ్లు మూసేయాలా? అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే, అధికారులు మాత్రం భిన్న రీతిలో స్పందిస్తున్నారు.

ఫొటో సోర్స్, ysrcp
సీఎం రాకతో మూడు మండలాల్లో స్కూళ్లకు సెలవు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహం జరిగింది. ఈ సందర్భంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఆయన గురువారం తాడేపల్లి నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్‌లో బయలుదేరి రాజానగరం మండలం దివాన్ చెరువు చేరుకున్నారు.
దివాన్ చెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. అనంతరం మధ్యాహ్నానికే తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు.
అయితే, సీఎం రాక నేపథ్యంలో నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లోని వివిధ స్కూళ్లన్నింటికీ సెలవులు ప్రకటించారు.
ఓ ఎమ్మెల్యే ఇంట జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వస్తే స్కూళ్లకు సెలవులు ప్రకటించడం ఏంటని విస్మయం వ్యక్తమవుతోంది.
ఈ నెల 12న కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న కాలనీల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఆ జిల్లాలో ఇదే రీతిలో సెలవు ప్రకటించారు. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. నిడదవోలు రాక సందర్భంగా జిల్లా అంతటా సెలవు ప్రకటించారు.
ఇటీవల శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల పర్యటనల కోసం సీఎం వెళ్లిన సందర్భంలో సైతం ఆ ప్రాంతంలో ఇదే విధానం అమలు చేశారు.

స్కూల్ బస్సుల కోసమేనా...
చివరకు, వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా నిరుడు సీఎం నివాసం ఉంటున్న తాడేపల్లిలో సైతం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అనుభవం ఉంది.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా నిర్వహించే సభలకు స్థానికులను తరలించే లక్ష్యంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. స్కూల్ బస్సుల్లో డ్వాక్రా మహిళలు, ఇతరులను తరలించడం అధికారులకు ఆనవాయితీగా మారినట్లు కనిపిస్తోంది.
ప్రజలను తరలించేందుకు వాహనాల సమీకరణలో భాగంగా స్కూల్ యాజమాన్యాలకు అధికారుల నుంచి వస్తున్న మౌఖిక ఆదేశాలతో సెలవులు ప్రకటించేసి, బస్సులను అటు మళ్లిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
సీఎం హాజరవుతున్న సభల కోసం జనాలను తరలించే వాహనాల్లో స్కూల్ బస్సుల సంఖ్య అత్యధికంగా ఉండడమే దానికి నిదర్శనం.

పిల్లలతో ఆటలాడుతున్నారు...
విద్యార్థులకు ప్రతీ తరగతికి సంబంధించిన సిలబస్ దానికి సంబంధించిన షెడ్యూల్, టైమ్ టేబుల్ ఉంటుంది. కానీ, నాయకుల పర్యటనల పేరుతో అర్థాంతరంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చేసి బస్సులు అటు మళ్లించడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
అందులోనూ దసరా సెలవుల తర్వాత బడులు తెరిచిన వెంటనే మళ్లీ మూసేయాలనడం ఏమిటంటూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
"ఇదేం సంప్రదాయమో మాకైతే అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి వస్తుంటే బడి పిల్లలను ఇంటికే పరిమితం చేయడం ఏంటి? దానివల్ల పిల్లలకు సమస్య అవుతుంది. విద్యాబోధనలో ఆటంకం ఏర్పడుతుంది. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు.
దసరా సెలవులు ముగిసి మళ్లీ బడులు తెరిచిన మరునాడే సెలవు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఎమ్మెల్యే తమ్ముళ్లు, చెల్లెళ్ల పెళ్లిళ్లకు కూడా సెలవులు ఇచ్చేయడం శ్రేయస్కరం కాదని గుర్తించాలి" అని ఉపాధ్యాయుడు రవిబాబు అన్నారు.
నేతల పర్యటనల కోసం పాఠశాలలు మూతవేసే ధోరణి అదుపు చేయాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, UGC
ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి..
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఏటా 5 ఆప్షనల్ హాలిడేస్, మరో మూడు లోకల్ హాలిడేస్ కూడా ఉంటాయి. వాటిని స్థానిక అవసరాల నిమిత్తం వినియోగించుకుంటారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఆమోదంతో వాటిని వాడుకుంటారు. జిల్లా వ్యాప్తంగా అలాంటి ఆప్షనల్ హాలిడేస్ అమలవుతూ ఉంటాయి.
అధికారిక నివేదిక ప్రకారం, అక్టోబర్ 26న కూడా యాజ్ దహూమ్ షరీఫ్ పేరుతో ఆప్షనల్ హాలిడేగా ఉంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించే వారి కోసం, వారు అధికంగా ఉండే ప్రాంతాల్లో దానిని సెలవుగా ప్రకటిస్తారు.
కానీ, రాజానగరం నియోజకవర్గంలో ఆ పేరు కూడా తెలియని వారే ఎక్కువ అయినప్పటికీ ఆప్షనల్ హాలిడే తీసుకున్నారంటూ జిల్లా విద్యాశాఖ చెబుతోంది.
"మండల విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఆప్షనల్ హాలిడే తీసుకొవచ్చు. దానినే అనుసరించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు డీఈవో ఆదేశాల మేరకు సెలవు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్‌లు ఇచ్చారు. మేము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. స్థానికంగా తీసుకున్న నిర్ణయమే. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆప్షనల్ హాలిడేస్ అమలవుతూ ఉంటాయి" అని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎస్. అబ్రహాం తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా, అవసరాల నిమిత్తం కొన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడం అన్నిచోట్లా అమలవుతున్నదేనని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి..
సీఎం పర్యటనల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరాల కోసం కొన్నిచోట్ల చెట్లు తొలగించడం, కొమ్మలు నరకడం వంటివి వివాదాస్పదమయ్యాయి. మరికొన్ని చోట్ల పరదాలు కట్టడం, ఆయా రోడ్ల వెంబడి ఎవరూ రాకుండా రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు కూడా చేపట్టిన సందర్భాలున్నాయి.
ఇప్పుడు ఏకంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించి, బస్సుల్లో ప్రజలను తరలించడానికి ప్రాధాన్యం ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
"ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అధికారిక కార్యక్రమాలకు ప్రజలను తరలించే ఏర్పాట్లు వాళ్లు చేసుకోవాలి. అంతే తప్ప స్కూల్ బస్సుల కోసం పిల్లలను ఇంటికే పరిమితం చేసేసే ధోరణి సరికాదు. సరిదిద్దుకోవాలి. పదే పదే ఇలా చేయడం పిల్లల చదువులను ప్రభావితం చేస్తుంది. రెండు నెలల వ్యవధిలో రెండు రోజులు రాజానగరం నియోజకవర్గంలో సెలవులు ఇచ్చేశారు. ఇలా అన్ని చోట్లా జరగడం సమంజసం కాదు.
రవాణా, పోలీస్, విద్యాశాఖ యంత్రాంగం ఆదేశాలు కాదనలేక స్కూల్ యాజమాన్యాలు బస్సులు అప్పగిస్తుంటారు. దాని కారణంగా పిల్లలు ఇబ్బంది పాలవుతున్నారు. గతంలో సెలవు రోజుల్లో స్కూల్ బస్సుల వాడకం ఉంది గానీ, స్కూళ్లకు సెలవులు ఇచ్చేసి మరీ బస్సులు తీసుకుపోయే ఆనవాయితీ లేదు" అని రిటైర్డ్ డీఈవో ఆర్.రామలింగేశ్వర రావు అన్నారు.
స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఇక్కట్లు పాలయ్యే పరిస్థితి తీసుకురావడం మంచిది కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయం మీద విద్యాశాఖను, వైసీపీ నేతలను బీబీసీ సంప్రదించింది. కానీ వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
ఇవి కూడా చదవండి:
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- గుంటూరు జిల్లాలో ‘యూదులు’.. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై వీరు ఏమంటున్నారు?
- సైబర్ నేరాలు: ఆన్లైన్ దొంగలు మీ డబ్బు కొట్టేస్తే తిరిగి పొందడం సాధ్యమేనా?
- ఆంధ్రప్రదేశ్: ఇద్దరు సీఎంలు శంకుస్థాపన చేసిన వరికపూడిసెల ప్రాజెక్ట్‌కు ఏమైంది?
- రోజాపై బండారు వ్యాఖ్యల వివాదం: రాజకీయాల్లో మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














