కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు విశాఖలో పెట్టడంపై అభ్యంతరాలేంటి, ప్రభుత్వం ఏం చెబుతోంది

కృష్ణా బోర్డు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ)ని విశాఖపట్నం తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సన్నాహాలు కూడా చేస్తోంది.

అయితే కృష్ణా నదితో గానీ, నదీ జలాలతో గానీ కనీస సంబంధం లేని విశాఖలో కేఆర్ఎంబీ ఏర్పాటు చేయడం ఏమిటంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద రాయలసీమ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం ఇప్పటికే విశాఖలో కేఆర్ఎంబీ ఏర్పాటు కోసం భవనాలు సిద్ధం చేసింది. కేఆర్ఎంబీ అధికారులు పరిశీలించి, అంగీకారం తెలిపితే తరలింపు జరుగుతుందని చెబుతోంది.

కృష్ణా నది పరివాహక ప్రాంతానికి గానీ, కానీ కృష్ణా జలాల ఆయకట్టు పరిధికి కానీ సంబంధం లేని చోట కేఆర్ఎంబీ ఏర్పాటులో ప్రభుత్వం ఎందుకు ఆతృత చూపుతోందన్నది ఆసక్తిగా మారింది. అధికార పార్టీ నేతల వినతులు కూడా బేఖాతరు చేస్తూ ముందుకెళుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.

కృష్ణా బోర్డు

బోర్డు ఏం చేస్తుంది

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 85 ప్రకారం నదీ జలాల పంపిణీ, వాటి నిర్వహణ కోసం రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు ఏర్పాటయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో వాటిని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు తెలంగాణ పరిధిలోనూ, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనూ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

తొలుత రెండు బోర్డులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. 2015 నుంచి వీటి కార్యకలాపాలు సాగుతున్నాయి.

బోర్డుల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు సహా మొత్తం ఖర్చులన్నీ రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా భరించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే సాగుతోంది.

రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులతో పాటుగా ఏపీకి చెందిన 15, తెలంగాణ పరిధిలోని 17 ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పర్యవేక్షిస్తోంది.

కృష్ణా బోర్డు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కృష్ణా బోర్డు తరలింపుున నిరసిస్తూ గతంలో దిల్లిలో ఆందోళన నిర్వహించిన బైరెడ్డి

వివాదాలన్నీ కేఆర్ఎంబీకే...

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాల నదీ జలాల వివాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. అందులో ఎక్కువగా కృష్ణా జలాల పంపిణీపైనే వివాదాలు ఏర్పడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా జలాలను విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించడంపై తెలంగాణ, ఆంధ్రాలకు భిన్నాభిప్రాయాలున్నాయి.

ఇక్కడ అన్ని వివాదాల పరిష్కారం కేఆర్ఎంబీ ద్వారానే సాగాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది.

దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారిని చైర్‌పర్సన్‌గానూ , ఇరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ఇద్దరు అధికారులను సభ్యులుగా బోర్డు ఏర్పాటయ్యింది.

వారితో పాటుగా సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్ అధికారి మెంబర్‌గా, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ అధికారి మెంబర్ సెక్రటరీగా బోర్డు ఉంటుంది.

ఈ కాలంలో దాదాపు 15 సార్లు బోర్డు సమావేశాలు నిర్వహించారు. నదీ జలాలు, ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాల్లో ఉభయ రాష్ట్రాల వాదనలు వినిపించగా, వాటిలో కొన్నింటినీ బోర్డు పరిధిలో పరిష్కారం కూడా చేశారు. కొన్ని అంశాలు అపెక్స్ కౌన్సిల్‌కు నివేదించారు.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా నిర్వహించారు.

కృష్ణా బోర్డు

ఫొటో సోర్స్, KRMB

తెలంగాణ విముఖత..

పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించిన కేఆర్ఎంబీని విజయవాడలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ అది ఆచరణ రూపం దాల్చలేదు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2020 డిసెంబర్ 25న ఈ బోర్డుని విశాఖలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దానిని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. విశాఖ పట్నానికి బోర్డును తరలించడాన్ని తెలంగాణ ప్రభుత్వం నాడు వ్యతిరేకించింది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే బోర్డు ఉండాలని కోరుతూ కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది.

‘‘గతంలో విజయవాడలో కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి విరుద్ధంగా విశాఖపట్నానికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో విశాఖపట్నం లేదు. పైగా హైదరాబాద్‌కు అది సుమారు 618 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమావేశాలకు వెళ్లాలంటే అధికారులకు కూడా కష్టమే. విశాఖపట్నంలో పెట్టడం వల్ల బోర్డు సభ్యులు, సీనియర్ ఇంజినీర్ల ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. వారికి బస ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే సహాయక సిబ్బందికి విమానంలో ప్రయాణించే సదుపాయం లేదు. కాబట్టి వారు ఒక రోజు ముందు రైలులో ప్రయాణించాల్సి ఉంటుంది’’ అని 2021 జనవరిలో రాసిన లేఖలో తెలంగాణ ముఖ్య ఇంజినీరు (నీటిపారుదల) సి.మురళీధర్ పేర్కొన్నారు.

కృష్ణా బోర్డు

ఫొటో సోర్స్, ANI

అయితే ఆ తరువాత కేఆర్‌ఎంబీ తరలింపు మీద తెలంగాణ తటస్థంగా ఉండిపోయింది.

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఈ విషయాన్ని గతంలోనే ప్రస్తావించారు. విజయవాడ కేంద్రంగా కేఆర్ఎంబీ ఏర్పాటు అవసరం ఉందని ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు.

"కృష్ణా నీటి వివాదాల ట్రైబ్యునల్ 3 ప్రోసీడింగ్స్‌లో ఉంది. అందుకే నదీ పరివాహక ప్రాంతంలోనే కేఆర్ఎంబీ ఉండాలి. కానీ విశాఖకి తరలించడం జగన్ ప్రభుత్వానికి తగదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదన మీద తొలుత విముఖత వ్యక్తం చేసింది. 2021 జనవరిలో లేఖ కూడా రాసింది. అయినా జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ఇది సమంజసం కాదు. కృష్ణా పరివాహక ప్రాంతంలోనే బోర్డు ఉండాలి" అని ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు.

తెలుగుదేశం నేతలు కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేఆర్ఎంబీని విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరారు.

కృష్ణా బోర్డు

రాయలసీమకు అన్యాయం

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కృష్ణా జలాల వినియోగంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అందుకు అనుగుణంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రాయలసీమ కేంద్రంగా ఉన్న కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ వాదులు కోరుతున్నారు.

విశాఖకు కేఆర్ఎంబీ తరలించాలన్న ప్రతిపాదన విరమించుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు.

వైఎస్సార్సీపీకి చెందిన ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎంకి లేఖ రాశారు. అయినప్పటికీ ప్రభుత్వం పునరాలోచన చేయకపోవడాన్ని రాయలసీమ నేతలు తప్పుబడుతున్నారు.

"మూడు రాజధానులు అన్నారు. కర్నూలు న్యాయ రాజధాని అంటూ గొప్పగా ప్రకటించారు. మరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డుని తీసుకెళ్లి కృష్ణా నదికి సంబంధం లేని చోట ఏర్పాటు చేయడం ఏమిటి? రాయలసీమకు అన్యాయం చేయడం కాదా? కృష్ణా జలాల పంపిణీలో, వినియోగంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడితో రాయలసీమ రైతాంగం అవస్థల్లో ఉన్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు. కానీ కేఆర్ఎంబీ మాత్రం విశాఖ తరలించే ప్రయత్నంలో ఉంది. దీనిని విరమించుకోవాలి" అని మాజీ మంత్రి, బీజేపీకి చెందిన రాయలసీమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

వీడియో క్యాప్షన్, ’ఈ గ్రామానికి కరువు తెలీదు, 15 ఏళ్ల వరకు కరువు రాదు’

విశాఖలో అంతా సిద్ధం

కేంద్ర జలశక్తి శాఖ కూడా 2022లోనే తరలింపునకు అంగీకారం తెలిపింది.

దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనను విశాఖపట్నం నుంచే చేపడతామంటున్న వైసీపీ ప్రభుత్వం అక్కడ అనేక భవనాలను పరిశీలించి, కేఆర్ఎంబీ ఏర్పాటుకు అనుగుణంగా ఉండే వాటిని ఎంపిక చేసింది.

విశాఖ సీఈ కార్యాలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో వసతి ఏర్పాట్లు, 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ రాసిన లేఖకు కేఆర్ఎంబీ స్పందించింది. అక్టోబర్ నెలాఖరులోగా కేఆర్ఎంబీ అధికారులు విశాఖలో పర్యటించబోతున్నారు. ఆ భవనాలకు ఆమోదం తెలిపితే తరలింపు ప్రక్రియకు రంగం సిద్ధమవుతుంది.

మహారాష్ట్రలో మొదలయ్యి కర్ణాటక మీదుగా ఏపీలో ప్రవేశించే కృష్ణా నదీ ప్రవాహం నంద్యాల, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలను తాకుతూ కృష్ణా జిల్లాలో సముద్రంలో కలుస్తుంది. ఈ జిల్లాలకు సంబంధం లేకుండా ప్రస్తుతం కేఆర్ఎంబీ మాత్రం సుదూరంగా విశాఖలో ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం అవుతోంది.

ప్రభుత్వం ఏమంటోంది?

ఏపీ ప్రభుత్వం భిన్నమైన వాదన చేస్తోంది. నదీ యాజమాన్య బోర్డులు సంంబంధిత పరివాహక ప్రాంతంలోనే ఉండాల్సిన అవసరం లేదని అంటోంది.

గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు హైదరాబాద్‌లో ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తోంది.

గతంలోనే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ దీనిపై స్పందించారు. ఏపీ ‘పరిపాలనా’ కేంద్రంలో కేఆర్ఎంబీ ఉండడం ప్రయోజనమని భావిస్తున్నట్టు అప్పట్లో ఆయన తెలిపారు. రాజకీయ విమర్శల కన్నా పాలనాపరమైన సదుపాయాల రీత్యా నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు.

మరోవైపు కేఆర్ఎంబీ తరలింపు విషయంలో ఈ నెలలోనే స్పష్టత వస్తుందని ఏపీ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు.

"కేఆర్ఎంబీ అధికారులు బృందం పరిశీలించిన తర్వాత వారి అవసరాలను అనుగుణంగా కార్యాలయం, వసతి ఏర్పాట్లు పూర్తి చేస్తాం. తదుపరి విశాఖకు తరలింపు ఉంటుంది. పరిపాలన కేంద్రంగా విశాఖను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా పరిపాలన వ్యవహారాలు చూసే కేఆర్ఎంబీ కూడా అందుబాటులో ఉండడం అవసరమని భావించి విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం" అని ఆయన బీబీసీకి వివరించారు.

వీడియో క్యాప్షన్, పనికెళ్లే పెద్దలైనా, బడికెళ్లే చిన్నారులైనా రోజూ ఈ సాహసం చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)