మగవారి కోసం కు.ని. ఇంజెక్షన్ తెచ్చిన ఐసీఎంఆర్, ఇది వైద్య రంగంలో మలుపు అవుతుందా...

వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమన్ యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన ఒక ప్రయోగం వైద్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

ఏడు సంవత్సరాల పరిశోధన తర్వాత తయారైన రివర్సిబుల్ ఇంజెక్టబుల్ మేల్ కాంట్రసెప్టివ్ ఇంజెక్షన్ (మగవారి కోసం గర్భనిరోధక ఇంజెక్షన్) క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి.

అంటే, ఈ ఇంజక్షన్ వినియోగానికి ఆమోదం లభించిందన్నమాట.

ఈ ఇంజెక్షన్ వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశం లేదని, ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్ పేర్కొంది.

ఐసీఎంఆర్

ఫొటో సోర్స్, Getty Images

క్లినికల్ ట్రయల్స్ ఎలా నిర్వహించారు?

ఈ ఇంజెక్షన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆండ్రాలజీ జర్నల్‌లో గత నెలలో ప్రచురితమయ్యాయి.

రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్‌ఐఎస్‌యూజీ)గా పిలిచే ఈ ఇంజెక్షన్, మూడు దశల్లో ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఆమోదం పొందింది.

దిల్లీ, ఉధంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్‌పూర్‌ ప్రాంతాలకు చెందిన కొందరిపై ఈ ట్రయల్స్ నిర్వహించారు.

ఇందులో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న 303 మంది ఆరోగ్యవంతులను, లైంగిక సామర్థ్యమున్న వివాహిత పురుషులపై ఈ పరీక్షలు నిర్వహించారు. వారి భార్యలను కూడా ఈ పరీక్షల్లో భాగస్వాములను చేశారు.

కుటుంబ నియంత్రణ కోసం ఆస్పత్రులను సంప్రదించిన జంటలను మాత్రమే ఈ ట్రయల్స్‌లో చేర్చారు. వారికి వేసెక్టమీ, లేదా నో స్కాల్పెల్ వేసెక్టమీ చేయాల్సి ఉంది. అంటే, మున్ముందు పిల్లలను కనాలని అనుకోని జంటలను గుర్తించి వారిపై పరీక్షలు నిర్వహించారు.

ఈ ట్రయల్స్‌లో భాగంగా పురుషులకు రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్(ఆర్‌ఐఎస్‌యూజీ)ని 60 ఎంజీ ఇంజెక్ట్ చేశారు.

ఇప్పటి వరకూ మహిళలు, పురుషుల కోసం అందుబాటులో ఉన్న గర్భ నిరోధక ఔషధాల్లో ఆర్‌ఐఎస్‌యూజీ ఇంజెక్షన్ ప్రభావవంతమైనదని పరిశోధన సమయంలోనూ, క్లినికల్ ట్రయల్స్‌లోనూ ఐసీఎంఆర్ గుర్తించింది.

అజోస్పెర్మియా (స్కలనం జరిగినా వీర్యం లేకపోవడం) లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఇంజెక్షన్ 97.3 శాతం విజయవంతమైందని పరిశోధనలో తేలింది. అలాగే, గర్భం రాకుండా నివారించడంలో 99.02 శాతం ప్రభావవంతంగా పనిచేసిందని గుర్తించారు.

వీర్యం విడుదల కాకుండా అజోస్పెర్మియా అడ్డుకుంటుంది. ఈ ఇంజెక్షన్ ఒక్కసారి చేస్తే 13 ఏళ్లు పనిచేస్తుంది. దీని వల్ల ఈ ఇంజెక్షన్ చేయించుకున్న వారి మహిళా భాగస్వామికి గర్భం రాదని తేలింది.

కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు (కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్) పరిమిత సమయం వరకూ మాత్రమే మహిళలు గర్భం దాల్చకుండా నివారించగలవు. అలాగే, కాపర్ టీ కూడా గర్భం రాకుండా ఎక్కువ కాలం నివారించగలదు.

ఇక వేసెక్టమీ అనేది పిల్లలు పుట్టకుండా చేసే శాశ్వత ఆపరేషన్.

అయితే, ఇది పురుషుల్లో కొంత గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే, ఇది శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా నివారించలేకపోవడం, లేదా కొద్దికాలం మాత్రమే పిల్లలు వద్దనుకునే వారికి ఉపయోగకరంగా లేకపోవడవమే అందుకు కారణం.

వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఇది మార్పుకి ఆరంభమా?

మహిళల కోసం అందుబాటులోకి వచ్చిన గర్భనిరోధక ఔషధాలు కుటుంబ నియంత్రణ స్వేచ్ఛను మహిళలకు మాత్రమే ఇచ్చాయని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో, గర్భనిరోధకత బాధ్యత కూడా మహిళలపైనే ఉంది.

భారత్‌లో గణాంకాలను పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలపైనే ఆ బాధ్యత ఎక్కువగా ఉంటోంది. అలాగని, పురుషుల కోసం కుటుంబ నియంత్రణ మార్గాలు లేవని కాదు.

మగవారి కోసం కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కొన్ని మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం, ప్రతి పది మందిలో కేవలం ఒక్కరు, అంటే 0.5 శాతం కంటే తక్కువ మంది మగవారు కండోమ్స్ వాడుతున్నారు. అందువల్ల పిల్లలు పుట్టకుండా మహిళలకు ఆపరేషన్లు చేయించడం ఇంకా కొనసాగుతోంది.

అయినప్పటికీ వేసెక్టమీ చాలా సులభం, సురక్షితం. దానికంటే ప్రభావవంతమైనది ఏదీ లేదని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం ఆడవాళ్ల పని అని ఈ సర్వేలో పాల్గొన్న ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, బిహార్‌కు చెందిన పురుషుల్లో సగం మంది అభిప్రాయపడ్డారు.

గర్భ నిరోధకత గురించి పురుషుల్లో చాలా అపోహలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఉదాహరణకు, కండోమ్ వాడితే లైంగిక అనుభూతి తగ్గుతుందని, ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆ తర్వాత లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే అపోహలు ఉన్నాయి.

వేసెక్టమీ‌పై భారతీయ సమాజంలో చాలా అపోహలు, దురభిప్రాయాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెరిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ ఎస్. శాంతకుమారి అన్నారు.

భార్యభర్తలు

ఫొటో సోర్స్, Getty Images

మహిళలే ముందున్నారు

పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడాన్ని పురుషులు వారి మగతనంపై దాడిగా భావిస్తారు. అందువల్ల ఆ భారం మహిళలే మోయాల్సి వస్తోంది.

భారత్‌లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకుంటున్న వారిలో మహిళల సంఖ్య చాలా ఎక్కువని ఇన్‌స్టిట్యూట్ ఫర్ వాట్ వర్క్స్ టు అడ్వాన్స్ జెండర్ ఈక్వాలిటీకి చెందిన పరిశోధకురాలు విదిశా మొండల్ బీబీసీతో అన్నారు.

ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ గణాంకాల ప్రకారం మగవారితో పోలిస్తే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటున్న మహిళల సంఖ్య 93 శాతంగా ఉందని ఆమె చెప్పారు.

చరిత్రపరంగానూ గర్భనిరోధకత గురించి మగవారిలో చాలా భయాలున్నాయి.

1975లో బలవంతంగా జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మగవారిలో భయాన్ని సృష్టించిందని, అందువల్ల అది సామాజిక నిషేధంగా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, ఆపరేషన్‌ను పురుషులు వారి మగతనానికి సంబంధించిన విషయంగా చూస్తారు. ఆపరేషన్ మగతనాన్ని నాశనం చేస్తుందనే భయం వారిలో ఉంది.

ఇదిలా ఉంటే, ఐసీఎంఆర్ పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ గురించి తమకు సమాచరం లేదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ అధిపతి ఎస్పీ సింగ్ బీబీసీతో చెప్పారు.

అయితే, భారత దేశ జనాభాను నియంత్రించడంలో ఈ ఇంజెక్షన్ ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందో భవిష్యత్తులో తేలనుంది.

వీడియో క్యాప్షన్, పాక్ ఫ్యామిలీ ప్లానింగ్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)