'అది సొరంగాల సాలెగూడు'.. హమాస్ చెర నుంచి విడుదలైన మహిళ వ్యాఖ్యలు

హమాస్

ఫొటో సోర్స్, Getty Images/Reuters

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఈ దాడిలో వందలాది పౌరులు మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో కొంతమంది హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడి పలువురిని బందీలుగా చేసుకొని గాజా తీసుకెళ్లారు. అప్పటినుంచి వారిని అక్కడి సొరంగాల్లో బందీ చేశారు. అయితే అందులో ఇద్దరిని సోమవారం విడుదల చేసింది హమాస్.

'నాకు నరకంలో ఉన్నట్లు అనిపించింది' అని హమాస్ చెర నుంచి విముక్తి పొందిన 85 ఏళ్ల ఇజ్రాయెల్ సిటిజన్ యెకెవెడ్ లిఫ్‌షిట్జ్‌‌ అంటున్నారు.

రెండు వారాలపాటు బందీలుగా ఉన్న లిఫ్‌షిట్జ్‌‌, న్యూరిట్ కూపర్ (79)లను హమాస్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది.

మోటార్‌ సైకిళ్లపై వచ్చిన హమాస్ మిలిటెంట్లు తననూ, తన భర్త ఓడెడ్ (85)ను కిడ్నాప్ చేసి గాజా దిగువన ఉన్న సొరంగాల నెట్‌వర్క్‌లోకి తీసుకెళ్లారని లిఫ్‌షిట్జ్‌‌ అన్నారు.

మార్గమధ్యంలో తనను కర్రతో కొట్టారని, అయితే చాలామంది బందీలకు అవసరమైన వైద్యం అందించారని తెలిపారు.

లిఫ్‌షిట్జ్‌‌ విడుదలకు ముందు ఆమెతో ఒక హమాస్ మిలిటెంట్ కరచాలనం చేస్తున్న వీడియో విడుదలైంది.

గాజా, ఈజిప్టుల మధ్య గల రఫా క్రాసింగ్ వద్ద అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌కు ఇరువురిని అప్పగించింది హమాస్.

ఆమె ఆ సాయుధుడిని 'షాలోమ్' అని పిలుస్తూ కనిపించారు. ఈ హీబ్రూ పదానికి శాంతి అని అర్థం.

లిఫ్‌షిట్జ్‌‌

ఫొటో సోర్స్, EPA

అది 'సొరంగాల సాలెగూడు'

లిఫ్‌షిట్జ్‌‌తో పాటు ఆమె భర్తను అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌లోని కిబ్బుట్జ్‌లో కిడ్నాప్ చేశారు.

కిబ్బుట్జ్‌పై హమాస్ తెల్లవారుజామున దాడి చేసింది. ఇక్కడి ప్రతి నలుగురిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు లేదా కిడ్నాప్‌ అయ్యారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు.

విడుదలైన కొన్ని గంటల తర్వాత టెల్ అవీవ్‌లోని ఆసుపత్రిలో లిఫ్‌షిట్జ్‌‌ విలేకరులతో మాట్లాడారు. కిడ్నాప్ తర్వాత తనకు ఏం జరిగిందో ఆమె వివరించారు.

గాజాకు తీసుకెళ్తుండగా తనను కర్రతో కొట్టారని, దీంతో గాయాలయ్యాయని తెలిపారు లిఫ్‌షిట్జ్‌‌. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉందన్నారు.

నేల బాగా తడిగా ఉందని, అయినా తనను కిలోమీటర్లు నడిపించారని ఆమె చెప్పారు.

గాజా దిగువన సాలె గూడు మాదిరి కనిపించే భారీ సొరంగంలోకి తనను తీసుకువెళ్లారని తెలిపారు లిఫ్‌షిట్జ్‌‌. తనతో పాటు ఓ 25 మంది బందీలను వాటిలోకి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు.

అనంతరం కిబ్బుట్జ్‌కు చెందిన ఐదుగురితో పాటు, తనను ప్రత్యేక గదికి తీసుకెళ్లారని తెలిపారు లిఫ్‌షిట్జ్‌‌.

ఇజ్రాయెలీలు

ఫొటో సోర్స్, JENNY YERUSHALMI, ICHILOV HOSPITAL

బందీలను ఎలా చూసుకుంటున్నారు?

ప్రతి గదిలో ఒక గార్డు ఉన్నారని, బందీలకు వైద్య సౌకర్యం కూడా కల్పించారని లిఫ్‌షిట్జ్‌‌ చెప్పారు. లోపల శుభ్రంగా ఉందని, పడుకోవడానికి నేలపై పరుపులు ఉన్నాయన్నారు.

ఒక బందీని తరలిస్తుండగా బైక్ ప్రమాదంలో గాయపడ్డారని, గాజాలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని తెలిపారామె.

"మేం జబ్బు పడకుండా వారు చూసుకున్నారు" అని లిఫ్‌షిట్జ్‌‌ చెప్పారు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి ఒక వైద్యుడు వచ్చేవారని ఆమె తెలిపారు.

అవసరమైన మందులు కూడా ఇచ్చారన్నారు. బందీలుగా ఉన్న మహిళల అవసరాలను చూసుకునేందుకు వేరే మహిళల (పని వాళ్ల)ను ఏర్పాటుచేశారని తెలిపారు.

హమాస్ గార్డులు తినే ఆహారాన్నే తమకూ ఇచ్చారని, ఇందులో రొట్టె, చీజ్, దోసకాయ ఉన్నాయన్నారు లిఫ్‌షిట్జ్‌‌.

సాయుధుడితో ఎందుకు కరచాలనం చేశారని ఒక విలేఖరి లిఫ్షిట్జ్‌ని అడిగితే వాళ్లు 'నన్ను బాగా చూసుకున్నారు, మిగతావారి పరిస్థితీ బాగానే ఉంది' అని బదులిచ్చారు.

లిఫ్‌షిట్జ్‌‌ దంపతులు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఓడెడ్, లిఫ్‌షిట్జ్‌‌

ఇద్దరూ శాంతి కార్యకర్తలు

లిఫ్‌షిట్జ్‌‌, న్యూరిట్ కూపర్‌‌ల విడుదలకు కొన్ని గంటల ముందు, హమాస్ బాడీ కెమెరాల నుంచి తీసిన వీడియో ఫుటేజీని పాత్రికేయులకు విడుదల చేసింది ఇజ్రాయెల్.

ఈ వీడియోలో హమాస్ మిలిటెంట్లు రోడ్డుపై వెళ్తున్న పౌరులపై కాల్పులు జరుపుతూ ఆనందంతో కేకలు వేయడం కనిపించింది.

అనంతరం వారు కిబ్బుట్జ్‌లోని ఇళ్లలోకి చొరబడి పిల్లలను, వారి తల్లిదండ్రులను చంపారు. ఈ దాడిలో 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులే.

లిఫ్‌షిట్జ్‌‌ దంపతులు శాంతి కార్యకర్తలని, గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులకు తీసుకురావడంలో ఇరువురు సహకరించేవారని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఓడెడ్ జర్నలిస్టు అని, దశాబ్దాలుగా శాంతి భద్రతలు, పాలస్తీనా హక్కుల కోసం పని చేస్తున్నారని ఆయన కుమార్తె షారోన్ బీబీసీకి తెలిపారు.

ఓడెడ్ అల్ హమిష్మార్ వార్తాపత్రికలో పనిచేశారని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ వెల్లడించింది .

1982లో బేరూత్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరంలో జరిగిన మారణకాండను నివేదించిన వారిలో మొదటి వ్యక్తి అని తెలిపింది.

ఓడెడ్ అరబిక్ బాగా మాట్లాడగలరని, గాజాలో ఆయనకు చాలామంది తెలుసని షారోన్ అంటున్నారు.

ఇప్పుడక్కడి పరిస్థితి ఏమిటి?

హమాస్ ఇప్పటివరకు నలుగురు బందీలను మాత్రమే విడుదల చేసింది. వీరిలో శుక్రవారం విడుదలైన అమెరికన్-ఇజ్రాయెల్ తల్లీకూతుళ్లు జుడిత్, నటాలీ రానన్‌ కూడా ఉన్నారు.

హమాస్ 200 మందిని బందీలుగా చేసుకుందని ఇజ్రాయెల్ అంటోంది. సోమవారం రాత్రి న్యూరిట్ కూపర్ విడుదల కాగా, ఆమె భర్త ఇంకా బందీగానే ఉన్నట్లుగా భావిస్తున్నారు.

అక్టోబర్ 7 నుంచి ఇప్పటివరకు గాజాలో 5,791 మంది మరణించారని, గత 24 గంటల్లో 700 మంది చనిపోయారని హమాస్ తెలిపింది.

గాజాలోని 400 కంటే ఎక్కువ లక్ష్యాలపై ఇజ్రాయెల్ నిన్న దాడి చేసినట్లు ఆరోపించింది.

వీడియో క్యాప్షన్, మరో ఇద్దరు మహిళా బందీలను విడుదల చేసిన హమాస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)