చైనా మూడు నెలల్లో రక్షణ, విదేశాంగ మంత్రులను ఎందుకు తప్పించింది?

లీ షాంగ్‌ఫూ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లీ షాంగ్‌ఫూను రక్షణ మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్లు చైనా ప్రకటించింది.
    • రచయిత, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా దాదాపు మూడు నెలల వ్యవధిలో కీలకమైన రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులను పదవుల నుంచి తప్పించింది.

వీరిద్దరూ మొదట ప్రజాజీవితం నుంచి కనిపించకుండాపోయారు. ఆ తర్వాత వీరిపై వేటు పడింది.

వీరిద్దరూ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సన్నిహితులేనని చెబుతారు. వీరిద్దరూ దాదాపు ఏడు నెలలే ఆయా పదవుల్లో ఉన్నారు.

జనరల్ లీ షాంగ్‌ఫూ ప్రజా జీవితం నుంచి కనిపించకుండా పోయిన రెండు నెలల తర్వాత, ఆయన్ను రక్షణ మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్లు చైనా తాజాగా ప్రకటించింది.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పదవి నుంచి క్విన్ గాంగ్‌ను కూడా చైనా జులైలో ఇలానే తొలగించింది.

లీ షాంగ్‌ఫూ, క్విన్ గాంగ్‌లను స్టేట్ కౌన్సిల్‌లలోని పోస్టుల నుంచి కూడా తప్పించింది.

ఈ ఇద్దర్ని తమ పదవుల నుంచి తొలగించేందుకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపినట్లు చైనా ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ తెలిపింది.

ఈ ఇద్దర్ని ఎందుకు తొలగించారన్న విషయంపై ఎలాంటి వివరణను ఇవ్వలేదని న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ చెప్పింది.

ఇటీవల చైనా పలువురు ఉన్నతస్థాయి సైన్యాధికారులపై వేటు వేస్తూ వెళ్తోంది.

లీ షాంగ్‌ఫూ స్థానంలో మరే నేతను చైనా ఇంకా రక్షణ మంత్రిగా నియమించలేదు.

విదేశీ రక్షణ అధికారులకు చైనా ఈ వారంలో ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పదవి ఖాళీ అయింది.

క్విన్ గాంగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, విదేశాంగ మంత్రిగా క్విన్ గాంగ్ ఏడు నెలలే ఉన్నారు.

ఏడు నెలలకే పదవీచ్యుతులైన నాయకులు

విదేశీ వ్యవహారాల శాఖ పదవి నుంచి తీసేసిన క్విన్ గాంగ్‌ను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సన్నిహితుడిగా పరిగణించేవారు.

క్విన్ స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ విదేశీ వ్యవహారాల చీఫ్ వాంగ్ యి భర్తీ చేశారు.

చాలా రోజులుగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన క్విన్ గాంగ్ చివరిసారిగా జూన్ 25న ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించారు.

విదేశాంగ మంత్రి పదవి నుంచి క్విన్ గాంగ్‌ను తప్పించడానికిగల కారణాలను చైనా అప్పట్లో తెలుపలేదు.

జులైలో క్విన్‌ను తప్పించినప్పుడు, ఆయన అప్పటికి ఆ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలే అయ్యింది.

రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్‌ఫూ కూడా పబ్లిక్ ఈవెంట్లలో కనిపించకుండా పోయిన రెండు నెలల తర్వాత, పదవిని పోగొట్టుకున్నారు.

లీ షాంగ్‌ఫూ మార్చి నుంచే ఈ పదవిలో ఉన్నారు.

లీ షాంగ్‌ఫూ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లీ షాంగ్‌ఫూ మార్చి నుంచి రక్షణ మంత్రి పదవిలో ఉన్నారు.

అవినీతి కేసుల్లో షాంగ్‌ఫూపై విచారణ

చివరి సారి ఆగస్టు 29న ఆఫ్రికా దేశాలతో జరిగిన బీజింగ్ సెక్యూరిటీ ఫోరమ్‌లో లీ షాంగ్‌ఫూ కనిపించారు.

అవినీతికి సంబంధించి కేసులలో లీ షాంగ్‌ఫూ విచారణను ఎదుర్కొంటున్నారని గత నెలలో రాయిటర్స్ తెలిపింది.

శాటిలైట్, రాకెట్ లాంచ్ సెంటర్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా లీ షాంగ్‌ఫూ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

మిలటరీ ర్యాంకును, ఆ తర్వాత చైనా రాజకీయ జీవితాన్ని లీ షాంగ్‌ఫూ అవలీలగా అందిపుచ్చుకున్నారు.

క్విన్ మాదిరే ఈయన్నూ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఇష్టమైన వ్యక్తిగా చెబుతుంటారు.

క్విన్‌ తొలగింపుకు కారణాన్ని చైనా చెప్పలేదు. అయితే అమెరికా రాయబారి పదవిలో ఉన్నప్పుడు, వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే కారణంతో క్విన్‌ను చైనా తొలగించిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) రాకెట్ ఫోర్స్ యూనిట్ అధినేత జనరల్ లీ యుచావో, ఆయన డిప్యూటీకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

వారిని తొలగించడానికి కొన్ని నెలల ముందు కూడా ఇలానే ప్రజా జీవితంలో కనిపించకుండా పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)