ఆంధ్రప్రదేశ్: అటు భువనేశ్వరి, ఇటు మంత్రులు...పోటాపోటీ బస్సు యాత్రల్లో అందరి లక్ష్యం ఒకటేనా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త యాత్రలకు తెరలేచింది. ఈసారి తెలుగుదేశం పార్టీ తరుపున నారా భువనేశ్వరి రంగంలో దిగారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ఆమె యాత్ర మొదలెట్టారు.
అదే సమయంలో అధికార పార్టీ కూడా బస్సు యాత్రలు మొదలు పెట్టింది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా మూడుచోట్ల నుంచి ‘‘సామాజిక సాధికారిక యాత్ర’’ పేరుతో ఈ యాత్ర చేపడుతోంది. ఏపీ క్యాబినెట్ మంత్రులు, ఇతర నేతలు ఈ యాత్రలో పాలొంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో చేపట్టిన యాత్ర మధ్యలో ఉండగానే ఆయన అరెస్టు అయ్యారు. చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేష్ యువగళం యాత్ర కూడా నిలిచిపోయింది.
అలాంటి సమయంలో నారా భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశం అవుతోంది. తన తండ్రి, భర్త ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించని భువనేశ్వరి ఇప్పుడు ప్రజల్లోకి రావడం ఆసక్తికరం.
వైఎస్సార్సీపీ నేతలు గత ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. అప్పట్లో బీసీ మంత్రులంతా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ పర్యటించారు. ఈసారి మూడు ప్రాంతాల్లో మూడు బృందాలుగా యాత్ర చేపట్టడం విశేషం.
ఈసారి యాత్రలో బీసీ నేతలతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా కలిసి సాగుతూ సామాజిక సాధికారత గురించి ప్రచారం చేస్తారని ఆ పార్టీ చెబుతోంది.

ఫొటో సోర్స్, UGC
నెలన్నర తర్వాత ప్రజల్లోకి తెలుగుదేశం
దాదాపు ఏడాది కాలంగా టీడీపీ వివిధ రూపాల్లో ప్రజల మధ్యన ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ‘యువగళం’, ‘‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ కి గ్యారంటీ’’ వంటి కార్యక్రమాలు చేపట్టారు. అయితే సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో ఆ యాత్రలకు బ్రేకులు పడ్డాయి.
నెలన్నర రోజులుగా టీడీపీ అడపాదడపా ఆందోళనలు మినహా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సాగలేదు. చంద్రబాబు అరెస్టులను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు.
చంద్రబాబు అరెస్ట్ అయ్యి 46 రోజుల తర్వాత ఎట్టకేలకు భువనేశ్వరి సారధ్యంలో ‘‘నిజం గెలవాలి’’ అంటూ మళ్లీ ప్రజల్లోకి టీడీపీ వెళుతోంది. వారానికి మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని టీడీపీ ప్రకటించింది.
తొలి విడత ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాత్ర ఉంటుందని తెలిపారు. అందుకు అనుగుణంగా చంద్రగిరి నియోజకవర్గంలో అక్టోబర్ 25న యాత్ర మొదలయ్యింది.
చంద్రబాబు అరెస్ట్ కారణంగా కొందరు టీడీపీ కార్యకర్తలు ‘చనిపోయార’ని, వారందరి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చుతారని టీడీపీ చెబుతోంది. అదే సమయంలో రాజకీయ ప్రచారం కోసం సభలు కూడా నిర్వహిస్తున్నారు.
తొలిరోజు చంద్రగిరి అగిరాల సభలో భువనేశ్వరి కూడా రాజకీయ ప్రసంగం చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూనే మరోవైపు రాజకీయంగా టీడీపీని అంతా ఆదరించాలని ఆమె కోరారు.

ఫొటో సోర్స్, YS Sharmila/X
షర్మిల తరహాలోనేనా...
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా వై.ఎస్. జగన్ అరెస్టయ్యారు. అప్పట్లో ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలులో బంధించింది. ఆ సమయంలో వై.ఎస్. షర్మిల పార్టీ బాధ్యతలను నెత్తినెత్తుకున్నారు. ఆమె రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు.
జగన్ జైలులో ఉన్న కాలంలో పార్టీని ప్రజల్లో ఉంచేందుకు షర్మిల చేసిన కృషి ఆ పార్టీకి ఉపయోగపడింది. ఇప్పుడు దాదాపుగా అదే తరహాలో చంద్రబాబు జైలులో ఉండగా ఈసారి ఆయన భార్య తెర మీదకు వచ్చారు.
జగన్ అరెస్టుకు ముందు షర్మిలకి రాజకీయంగా అనుభవంలేనట్టే ఇప్పుడు భువనేశ్వరి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినా ప్రత్యక్ష అనుభవం నామమాత్రమే. దాంతో భువనేశ్వరి యాత్ర ఎలాంటి ఫలితాన్నిస్తుందన్న దానిపై చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంచేందుకు ఈ యాత్ర మేలు చేస్తుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"చంద్రబాబు అరెస్టుని ప్రజలంతా నిరసిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రజలను నియంత్రించాలని చూస్తోంది. అందుకే ప్రజల్లోకి వెళ్లి కార్యకర్తలకు అండగా ఉంటామనే భరోసా కల్పించే ప్రయత్నం భువనేశ్వరి చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారందరికీ టీడీపీ భరోసాగా ఉంటుంది. నిజం గెలవాలి యాత్రకు తొలిరోజు సానుకూల స్పందన వచ్చింది. భువనేశ్వరి ప్రజలు ఆదరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆమెను ఆశీర్వదించి, చంద్రబాబుకి న్యాయం జరగాలని ఆశించారు" అంటూ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.
భువనేశ్వరి యాత్ర టీడీపీ కార్యకర్తలకు మనోధైర్యాన్నిస్తుందని, చంద్రబాబు పట్ల ప్రజల్లో ఆదరణ స్పష్టంగా వెల్లడవుతోందని ఆమె బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
కులాల వారీ సమీకరణాల కోసమే..
చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడమే ప్రధానాంశంగా భువనేశ్వరి యాత్ర ప్రారంభించగా, వివిధ కులాలకు తమ ప్రభుత్వ హయంలోనే ఎక్కువ మేలు జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రాధానాంశంగా వైఎస్సార్సీపీ సిద్ధమయ్యింది.
‘‘సామాజిక సాధికారత’’ పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ పాలనలో అందించిన పథకాలు, అవకాశాల గురించి ప్రచారం చేసేందుకు ఈ యాత్ర సాగుతోంది.
2022 మే నెలలో కూడా ఓసారి రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేపిట్టిన వైఎస్సార్సీపీ ఈసారి అందుకు భిన్నంగా మూడు ప్రాంతాల్లో మూడు యాత్రలు చేపడుతోంది.
ఈ యాత్రల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా పాల్గొనాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ పాలనలో జరిగిన మేలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి తెలియజేయాలని నిర్ణయించింది.
ఉత్తర కోస్తా జిల్లాల యాత్రను ఇచ్ఛాపురంలో, మధ్య కోస్తా జిల్లాల యాత్రను తెనాలిలో, రాయలసీమ ప్రాంత యాత్రను శింగనమలలో ప్రారంభించి, మొత్తం అన్ని నియోజక వర్గాల్లోనూ సాగించాలని షెడ్యూల్ ఖరారు చేశారు.
వివిధ కులాల వారీగా ఉన్న ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగించే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ యాత్రను విజయవంతం చేసే బాధ్యత అందరిపై ఉందని ఇప్పటికే పార్టీ అధినేత వై.ఎస్. జగన్ ఆదేశించారు.
"గతంలో ఏ ప్రభుత్వ హయంలోనూ జరగనంతగా సామాజిక న్యాయం కోసం జగన్ పని చేశారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత దక్కింది. అన్ని పదవుల్లోనూ వారికి ఎక్కువ కేటాయింపులు జరిగాయి. ఈ విషయాలను ప్రజలకు చెప్పి మళ్లీ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరబోతున్నాం." అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు.
జగన్ ప్రభుత్వం బడుగుల కోసమే పనిచేస్తుందనే విషయాన్ని చాటిచెప్పడమే యాత్ర లక్ష్యం అంటూ ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఎన్నికల కోసమే....
నారా భువనేశ్వరి యాత్రను, ఆమె వ్యాఖ్యలను అధికార పక్షం తీవ్రంగా తప్పుబడుతోంది. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు. నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు పాలకపక్ష నేత సామాజిక సాధికారిక యాత్ర మీద టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. సామాజిక వర్గాలకు చేసిన అన్యాయం ఎవరూ మరచిపోలేదని, ఆ యాత్రను అడ్డుకుంటామంటూ కూడా శ్రీకాకుళం ఎంపీ కే రామ్మోహన్ నాయుడు అన్నారు.
"అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారయాత్రల మాదిరిగానే ఈ బస్సు యాత్రలు చేపట్టారు. అధినేతలు దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్రమంతా యాత్రల ద్వారా మహిళా సెంటిమెంట్ రాజేయాలని టీడీపీ, కులాల లెక్కలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైఎస్సార్సీపీ యత్నిస్తున్నాయి. మూడు నాలుగు నెలల్లో ఎన్నికలుండగా ఇంతటి విస్తృత ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం వెనుక తమ రాజకీయ లక్ష్యాల సాధనే కీలకంగా ఉంటుంది." అని సీనియర్ జర్నలిస్టు ఎం.విజయ్ కుమార్ అన్నారు.
మంత్రులను రంగంలో దింపడం ద్వారా జగన్, చంద్రబాబు భార్యను తెరమీదకు తీసుకురావడం ద్వారా టీడీపీ చేస్తున్న యత్నాలకు ప్రజలను ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ యాత్రల ద్వారా ఆయా పార్టీల లక్ష్యాలు ఏమేరకు నెరవేరుతాయన్నది పక్కన పెడితే ఇరు పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించి రంగంలో దిగినట్టు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘ప్రతి భారత సైనికుడూ మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలి’ – బీబీసీ ఇంటర్వ్యూలో మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ
- 'షమీ ఫెర్రారీలాంటి వాడు, గ్యారేజిలోంచి ఎప్పుడు తీసినా స్పీడ్ తగ్గేదే ఉండదు...'
- భారత్, చైనా: సరిహద్దుకు అటూఇటూ మళ్ళీ సేనల మోహరింపు... నాలుగేళ్ళుగా శీతాకాలంలో ఎందుకీ టెన్షన్స్?
- దేవుని వెల్లంపల్లి: ఇక్కడ తరతరాలుగా యానాదులే పూజారులు, ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















