బంగారం దోచుకొచ్చి గొయ్యితీసి దాచే కొడుకులు, బ్యాంకులో కుదువ పెట్టే తల్లి.. పోలీసులకు ఎలా దొరికారు?

తమిళనాడులో బంగారం చోరీల ముఠా
ఫొటో క్యాప్షన్, మధురై పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా

తమిళనాడులో ఒక దొంగల ముఠాను అరెస్టు చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మధురై సబ్ అర్బన్ పరిసరాల్లో మూడేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా తాము దొంగిలించిన బంగారాన్ని దాచి, బ్యాంకుల్లో కుదువపెడుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.

మధురై సబర్బన్ పరధిలో వరుస చోరీలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి.

పోలీసులు రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో గ్లౌజులు, చోరీ కోసం వినియోగించే ఆయుధాలతో పోలీసులకు పట్టుబడిన ఇద్దరు యువకులను విచారించగా, ఈ ముఠా సంగతి బయటపడింది.

విచారణ అనంతరం పోలీసులు ఆ యువకుల ఇంటి ఆవరణలో పలు చోట్ల భూమిలో దాచిపెట్టిన 180 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 9 లక్షల నగదుని వెలికి తీసి, సీజ్ చేశారు.

ఆ ఇద్దరు యువకులతోపాటు చోరీలతో సంబంధం ఉన్న వారి ఇంకో సోదరుడు, తల్లిపై కేసు నమోదు చేశారు.

తమిళనాడులో చోరీలకు పాల్పడిన దొంగలముఠా

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, చోరీలకు పాల్పడిన అసై పొన్ను కుటుంబం

ఈ ముఠాను పోలీసులు ఎలా పట్టుకున్నారు?

మధురై సబ్ అర్బన్ పరిధిలోని సిల్లైమన్, తిరుమంగళం, కరుప్పయూరని పరిసర ప్రాంతాల్లో మూడేళ్లుగా చోరీలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ఈ చోరీలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో, దర్యాప్తు కోసం మధురై ఎస్పీ స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో రెండు వారాల క్రితం సిల్లైమన్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు అందింది.

ఆ చోరీ అనంతరం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాల్మేడు పరిసరాల్లో ఓ ముఠా సంచరిస్తోందన్న సమాచారం వారికి అందింది.

కాల్మేడు పరిసరాల్లో నిఘా ఉంచి, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం మొదలుపెట్టారు.

ఈ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతోపాటు వారి దగ్గర మాస్కులు, గ్లౌజులు, ఆయుధాలు లభించాయి.

ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు వారిని చిన్నస్వామి, సోనసామిలుగా గుర్తించారు. తదుపరి విచారణలో తమ మూడో సోదరుడు పొన్నుసామి, తల్లి అసై పొన్నులతో కలిసి చోరీలకు పాల్పడేవారమని వారు అంగీకరించారు.

సిల్లైమన్, కరుప్పయురాని, తిరుమంగళం ప్రాంతాల్లో మూడేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ముఠా వీరే అని గుర్తించారు పోలీసులు.

ముఠాలోని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన అనంతరం, వారు ఇచ్చిన సమాచారం ప్రకారం వారి ఇంటి పరిసరాల్లో తవ్వకాలు జరిపి, వారు దాచిన బంగారం, నగదుని వెలికితీశారు. అనంతరం నిందితులను మధురై సెంట్రల్ జైలుకు తరలించారు.

పోలీసులు బీబీసీ తమిళం బృందానికి తెలిపిన వివరాల ప్రకారం- చోరీలకు పాల్పడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు సోదరులు చోరీలు చేసి, ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఇంటి ఆవరణలో గొయ్యి తీసి దాచిపెడతారు. అనంతరం వారి మూడో సోదరుడు వాటిని తీసి, తల్లికి ఇస్తాడు. ఆమె వాటిని బ్యాంకుల్లో కుదువ పెడతారు.

సోదాల్లో 30 బ్యాంకు రశీదులు లభించాయని పోలీసులు తెలిపారు. ఆ వివరాలను పరిశీలించి, బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని చట్ట ప్రకారం రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సీజ్ చేసిన రూ.9 లక్షల నగదు

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, రికవరీ చేసిన రూ.9 లక్షల నగదు

‘‘నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంటిపరిసరాల్లో చేపట్టిన తవ్వకాల్లో భూమిలో గొయ్యి తీసి దాచిపెట్టిన 180 సవర్ల బంగారంతోపాటు రూ. 9 లక్షల నగదును సీజ్ చేశాం. దీంతో మధురై సబ్ అర్బన్ పరిసరాల్లో నమోదైన 24 చోరీ కేసులను చేధించాం” అని ఎస్పీ శివప్రసాద్ మీడియాకు చెప్పారు.

సీజ్ చేసిన బంగారు ఆభరణాలు

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, రికవరీ చేసిన బంగారు ఆభరణాలు

పోయిన బంగారమంతా దొరికిందా?

ఈ దొంగలముఠా మూడేళ్లలో 240 సవర్ల బంగారు ఆభరణాలను దొంగిలించింది. అయితే పోలీసులు 180 సవర్ల బంగారు ఆభరణాలను మాత్రమే రికవరీ చేయగలిగారు.

బంగారంతోపాటు రూ.16 లక్షల నగదు కూడా చోరీ చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కానీ రూ. 9 లక్షలు మాత్రమే లభించాయి. మిగిలిన సొమ్ము రికవరీ చేయడం కష్టమే.

అరెస్టైన వారిలో ఒక్కొక్కరినీ లోతుగా విచారిస్తే, ఎన్ని చోరీలకు పాల్పడ్డారో కచ్చితంగా తెలుస్తుందని పోలీసులు అన్నారు.

“ఈ ముఠా ఇంతకు ముందెన్నడూ ఏ కేసులోనూ అరెస్టు కాకపోవడంతో, వీరిని పట్టుకోవడంలో ఆలస్యం అయింది” అని ఎస్పీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)