విమానం గాల్లో ఉండగా ఇంజిన్లు ఆపేయాలని ఆ ‘పైలట్’ ఎందుకు ప్రయత్నించారు? ఆయన తిన్న పుట్టగొడుగులే కారణమా?

అలాస్కా విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలాస్కా విమానం ఫైల్ ఫోటో
    • రచయిత, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రంలోని ఎవరెట్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళుతుండగా కాక్‌పిట్‌లో కూర్చున్న ఓ ఆఫ్‌ డ్యూటీ పైలట్ విమాన ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించారు.

దీనిపై విచారణ కొనసాగుతోంది. ఆఫ్-డ్యూటీ పైలట్ జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ ఎందుకలా చేశారు? దీనికి ఆయన సమాధానం ఏమిటి? ఆ రోజు ఏం జరిగింది?

ఘటన జరిగిన అక్టోబరు 22న ఎమర్సన్ కాక్‌పిట్‌లో కెప్టెన్ వెనుక భాగంలో కూర్చున్నారు.

ఓరేగాన్ కోర్టులో తనపై 83 మందిని హత్యచేయడానికి ప్రయత్నించారనే నేరారోపణలను ఎమర్సన్ అంగీకరించలేదు.

విమానం ఇంజిన్లు ఆపడానికి ప్రయత్నించే ముందు ఎమర్సన్ ‘‘నాకు బాగోలేదు’’ అని పైలట్లకు చెప్పినట్టు కోర్టు పత్రాల్లో ఉంది.

తనకు నరాల బలహీనత ఉన్నట్టు ఆయన చెప్పారని కోర్టు పత్రాలు తెలుపుతున్నాయి.

తాను భ్రాంతి కలిగించే సైడెలిక్ పుట్టగొడుగులను తీసుకున్నట్టు, తాను నిస్పృహలో ఉన్నట్టు ఎమర్సన్ పోలీసులతో చెప్పారు.

ఆయన కాక్‌పిట్‌లో హఠాత్తుగా ఇంజిన్‌లను ఆపేందుకు ప్రయత్నించడంతో ఆయనతో తాము కలబడాల్సి వచ్చిందని, ఎట్టకేలకు ఆయన్ను కాక్‌పిట్ బయటకు పంపగలిగామని, ఈ మొత్తం ఘటన 90 సెకన్లపాటు సాగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఓ పైలట్ చెప్పారు.

ఎమర్సన్‌ను కాక్‌పిట్ నుంచి బయటకు తీసుకువచ్చాక, తనను బంధించకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పారని, విమానం దిగే సమయంలో ఆయన అత్యవసరం ద్వారం దగ్గరకు వెళ్ళేందుకు ప్రయత్నించినట్టు ఆ పత్రాలు పేర్కొన్నాయి.

‘‘అంతా గందగోళం చేస్తాను, అందరీనీ చంపేస్తాను’’ అని ఎమర్సన్ చెప్పారని విచారణాధికారులకు విమాన అటెండెంట్ ఒకరు తెలిపారు.

‘‘నాకు నరాల బలహీనత ఉంది, నలభై గంటలుగా నేను నిద్రపోలేదు. నేనేం చేశానో, దానిని అంగీకరిస్తున్నాను. నాపైన మోపే అభియోగాలపై నేను పోరాడాలనుకోవడంలేదు’’ అని విచారణ సమయంలో ఎమర్సన్ చెప్పారు.

అమెరికా అటార్నీ కార్యాలయ ప్రతినిధి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ- ఘటనా సమయంలో ఎమర్సన్ మత్తుమందుల ప్రభావంలో ఉన్నారా, లేదా అనే విషయంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

హత్యాయత్నం కేసుతో పాటు 83 మంది ప్రయాణికులకు, విమానానికి ఆపద కలిగించారనే అభియోగాలను ఎమర్సన్‌పై మోపారు.

ఎమర్సన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తనకు నరాల బలహీనత ఉన్నట్టు ఎమర్సన్ కోర్టుకు తెలిపారు

వాషింగ్టన్‌లోని ఎవరెట్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు 80 మంది ప్రయాణికులతో ఈ విమానం వెళుతుండగా ఈ ఘటన జరగడంతో విమానాన్ని ఒరేగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్‌కు మళ్ళించారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ రికార్డింగ్ లో ఓ పైలట్ చెపుతున్న మాటలు రికార్డయ్యాయి. ‘‘విమాన ఇంజిన్లు ఆపడానికి ప్రయత్నించిన ఆయన్ను మేం పట్టుకుని కాక్‌పిట్ బయటకు పంపాం. ఆయన మా వెనుక నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సమస్య సృష్టించే వాడిలా కనిపించలేదు. ఆయన లొంగిపోయినట్టుగా కనిపించారు. మేం కిందకు దిగగానే తనను పోలీసులకు పట్టించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు’’ అని అందులో ఉంది.

అలాస్కా ఎయిర్ లైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమానంలో జరిగిన గొడవను ప్రయాణికులకు తెలియకుండా పైలట్లు వృత్తి నైపుణ్యంతో వ్యవహరించారు

విమాన సహాయకురాలు అత్యవసర ల్యాండింగ్ గురించి ప్రకటించేవరకు విమానంలో ఏదో జరుగుతోందనే విషయం తమకు తెలియదని, తరువాత అది తమకు మెడికల్ ఎమర్జెన్సీగా అనిపించిందని విమానంలో ప్రయాణించిన అబ్రే గావెల్లో ఏబీసీ న్యూస్‌కు చెప్పారు.

విమాన సహాయకురాలు అనుమానితుడితో ‘‘పర్వాలేదు, ఏమీ కాదు, నిన్ను విమానం నుంచి దించుతాం’’ అన్న మాటలు తాను విన్నట్టు గావెల్లో చెప్పారు.

‘‘అందుకే నేను నిజంగా అది మెడికల్ ఎమర్జెన్సీ’’ అని భావించానని ఆమె చెప్పారు.

ప్రయాణికులకు ఈ గొడవ గురించి ఏమీ తెలియకుండా విమానంలో జరిగిన మొత్తం ఘటనను వృత్తినిపుణతతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని మరో ప్రయాణికుడు చెప్పాడు.

యూఎస్ విమానాలన్నింటికీ ఫెడరల్ విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలను పంపుతూ- ‘‘అలాస్కా విమానంలో జరిగిన ఘటనకు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ఘటనలకు సంబంధం లేదు’’ అని తెలిపింది.

అలాస్కా విమాన ఘటనను విచారిస్తున్న ఎఫ్‌బీఐ, ‘‘ఈ ఘటన గురించి విమానప్రయాణికులెవరూ భయపడాల్సిన పనిలేదు’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)