ఆ 'దెయ్యం' ఎప్పుడూ అక్కడే, అదే సమయానికి కచ్చితంగా కనిపించడమేంటి... ఏమిటీ రహస్యం?

పాల్డింగ్ లైట్

ఫొటో సోర్స్, Michigan Tech University

    • రచయిత, జాన్ స్కాట్ లూయిన్‌స్కీ
    • హోదా, బీబీసీ ట్రావెల్

మసకమసకగా చీకటి పడుతున్న సమయానికి నార్త్ మిచిగాన్‌లోని పాల్డింగ్‌కి సమీపంలో, అమెరికన్ హైవే-45 పక్కన ఒక మారుమూల ప్రాంతంలో జనాలు గుమిగూడారు. ప్రపంచంలోనే అత్యంత నిక్కచ్చిగా సమయపాలన పాటించే దెయ్యాన్ని చూడడానికే వాళ్ళంతా అక్కడికి వచ్చారు.

స్కాటిష్ సరస్సు అడుగు నుంచి హఠాత్తుగా లేచే డ్రాగన్ అయినా, ఎన్నో అంతర్యుద్ధాలు జరిగిన కోటలో తెల్లని వస్త్రాల్లో తిరిగే స్త్రీ అయినా, అతీంద్రియ శక్తులున్న మరెవరికైనా ఓ అలవాటు ఉంటుంది. అదేమంటే, ఉన్నట్లుండి ఎప్పుడొ ఒకసారి కనిపించడం. అంతేకానీ, ఎప్పుడూ ఒకే సమయంలో కచ్చితంగా కనిపించే అలవాటేమీ వాటికి ఉండదు.

కానీ, మిచిగాన్ ద్వీపకల్పంలోని ఎగువ ప్రాంతంలో ఓ విచిత్రం జరుగుతోంది. అదే ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అక్కడ ఏదో ఉందని నమ్మేవారికి, అటుగా రోడ్డుపై వెళ్తున్న సాధారణ ప్రయాణికులకు ఆ ప్రాంతం ఒళ్లు గగుర్పొడిచే ఒక ఆకర్షణగా మారింది. ఎవరైనా సరే సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వెళ్తే 'పాల్డింగ్ లైట్‌' కనిపిస్తుంది.

ఎముకలు కొరికే చలికాలమైనా, మిచిగాన్ మోకాల్లోతు మంచులో కూరుకుపోయినా, పొగమంచు వ్యాపించినా రాబిన్స్ రోడ్డులోని యూఎస్ 45 హైవేపై ఆ మారుమూల ప్రాంతంలో మాత్రం ప్రతిరోజూ రాత్రి స్థానికులు, విదేశీయులు గుమిగూడి కనిపిస్తారు.

సూర్యాస్తమయ సమయాన, మెలమెల్లగా చీకట్లు మొదలైనప్పుడు కొండకు పక్కగా, దాదాపు ఐదు మైళ్ల దూరంలో తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో మెరుస్తున్న గోళాలు కనిపిస్తాయి. అవి అక్కడ అటూఇటూ తిరుగుతూ ఉంటాయి. వాటి సైజు పెరగదు. తగ్గదు. అవి కనిపించినప్పుడు అనూహ్యంగా కనురెప్పలు కొట్టుకుంటాయి. అసలు అవి ఏంటో తెలుసుకోవాలని దగ్గరికెళ్లేందుకు ప్రయత్నిస్తే అవి ఒక్కసారిగా మాయమైపోతాయి.

వాటిని కనిపెట్టడం అసాధ్యం అనిపించినా, ఆ లైట్లు మాత్రం వెలుగుతూనే ఉంటాయి. తెల్లవారేవరకూ అవి అలా వెలుగుతూ, ఆరిపోతూ కనిపిస్తాయి.

చాలా మంది అక్కడ ఏముందో తెలుసుకోవాలని తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అక్కడ తీసిన ఫోటోల్లో అసలక్కడ ఏముందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయారు.

పాల్డింగ్ లైట్

ఫొటో సోర్స్, Michigan Tech University

అయితే, ఆ వెలుతురు గురించి అక్కడ స్థానికంగా కొన్ని జానపథ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రైలు ప్రమాదంలో చనిపోయి దెయ్యంగా మారిన ఒక రైల్వే బ్రేక్‌మాన్ అక్కడ మరెవరికీ ప్రమాదం జరగకుండా రోజూ లాంతరు పట్టుకుని నిల్చుంటాడనే కథ బాగా ప్రచారంలో ఉంది. కానీ, దురదృష్టమేంటంటే, ఆ ప్రాంతంలో అసలు రైలు మార్గం కానీ, రోడ్డు మార్గం కానీ ఉన్నట్లు ఆధారాలే లేవు.

ఈ పాల్డింగ్ లైట్ గురించి మరిన్ని ప్రచారాలు కూడా ఉన్నాయి. జానపథ కథల్లో చెప్పే 'విల్ - ఒ - విస్ప్'(కొరివి దెయ్యాలు) తప్పిపోయిన తమ పిల్లల కోసం వెతుకుతున్నాయని, లేదంటే చెట్ల పైభాగంలో వెతుకుతూ ఉంటాయనే నమ్మకాలు బలంగా ఉన్నాయి. అక్కడ జరిగేవి సాధారణ విషయాలైతే కావని అక్కడికి వచ్చిన సందర్శకులు నమ్ముతారు. ప్రపంచంలో ఎక్కడా జరగనిది అక్కడ కనిపిస్తోందనేది వారి నమ్మకం.

అక్కడి కథలు ఏమైనప్పటికీ పాల్డింగ్ లైట్ కారణంగా అక్కడ చిన్న ఊరే ఏర్పడింది. కచ్చితంగా సమయానికి కనిపించే దెయ్యాన్ని చూడడానికి స్థానికులు, ప్రయాణికులు వస్తూనే ఉండడంతో అక్కడ రెస్టారెంట్లు, దుకాణాలు వెలిశాయి. రెస్టారెంట్‌లో తిని, తాగి, అక్కడి షాపుల్లో పాల్డింగ్ లైట్ ముద్రించిన టీ షర్టులు, టోపీలు కొనుక్కోవచ్చు.

''పాల్డింగ్ లైట్‌ని నేను చాలాసార్లు చూశాను'' అని అక్కడి బట్టల దుకాణంలో పనిచేసే సారా బ్యాక్కర్ చెప్పారు. ''అదేదో అతీంద్రియ శక్తి అని నేననుకోవడం లేదు. చూడ్డానికి చాలా బావుంటుంది. కొంతమంది కారు లైట్లు కనిపించాయని చెబుతారు. మరికొందరు మాత్రం అక్కడేదో చెప్పలేని విషయం చూశామని చెబుతుంటారు'' అని అన్నారు.

చివరికి, అసలు ఇదేంటో తేల్చేందుకు పరిశోధకులు రంగంలోకి దిగారు. 2010లో జరిగిన ఈ సాహస యాత్రకు మిచిగాన్ టెక్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న జెరెమీ బాస్ నేతృత్వం వహించారు. కెమెరాలు, లైట్‌మీటర్లు, హై పవర్ టెలిస్కోప్‌లతో సిద్ధమయ్యారు. అక్కడి పాల్డింగ్ లైట్ ఎక్కడి నుంచి, ఎలా వస్తుందో ఆధారాలతో నిర్ధారించడమే వారి లక్ష్యం.

ఈ లైటింగ్‌ను పెద్దగా పట్టించుకోని వారు చెప్పే వాదనలకు దగ్గరగానే వారు ఆధారాలను సేకరించారు. ఎక్కడో సుదూరంగా పడుతున్న కారు హెడ్‌లైట్ వెలుతురు అక్కడి వాతావరణ ప్రభావం కారణంగా కళ్లుమిరుమిట్లు గొలిపే ఒక ఎండమావిలాంటి ఒక వెలుతురు కనిపిస్తోందని వారు తేల్చారు.

ఇదే విషయంపై బాస్ పీహెచ్‌డీ కూడా సంపాదించారు. ఇప్పుడాయన మిచిగాన్ టెక్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అక్కడ కనిపించే వెలుతురుకి సంబంధించి స్పష్టమైన వివరణ ఇచ్చేందుకు అతని బృందం ప్రయత్నం చేసినప్పటికీ, ఇప్పటికీ ఆ పాతకథలు అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి.

పాల్డింగ్ లైట్

ఫొటో సోర్స్, Michigan Tech University

''ఆ లైట్‌ను ఎవరు చూశారు. అక్కడ మీకు ఏం కనిపించింది. మీకు ఎలా అనిపించిందని నేను అక్కడి వాళ్లను అడిగాను'' అని బాస్ చెప్పారు.

''ఒకవేళ దాన్ని వివరించమని వాళ్లు నన్నడిగితే తప్పకుండా చెప్తాను. పసుపు, ఎరుపు రంగు లైట్లు అక్కడ కదులుతూ కనిపించాయని ఎక్కువ మంది చెప్పారు. అవి కదులుతూ ఉన్నట్టయితే వాళ్లు చూస్తున్నది కచ్చితంగా ఆటో కైనెటిక్ ఎనర్జీ ప్రభావమే. వేసవిలో కనిపించే ఎండమావులు వంటివే ఇవి కూడా'' అని ఆయన అన్నారు.

వెలుతురుకు సంబంధించిన శాస్త్రీయ వివరణలు కూడా అద్భుతంగానే అనిపిస్తాయని, వాటి గురించి ప్రజలు అనుకుంటున్నట్టుగానే ఉంటాయని మిచిగాన్ టెక్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మైకేల్ సి రోగ్‌మాన్ అన్నారు. ఆయన పాల్డింగ్ లైట్‌పై విద్యార్థుల అన్వేషణకు శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు.

సాధారణ ఎండమావి కూడా వెలుతురే. గాలిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కిరణాలు పైకి, కిందకు కదులుతూ వక్రీభవనం చెంది మీ కంటికి కనిపిస్తాయి. వాటినే ఎండమావిగా భావిస్తామని రోగ్‌మాన్ చెప్పారు. సాయంత్రం పూట ఉష్ణోగ్రతల్లో మార్పులు, అక్కడి కొండలు, వాతారణం, హైవేపై ఎప్పుడూ తిరుగుతూ ఉండే కార్ల వల్ల వెలుతురు భ్రమలాగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

అక్కడ కనిపించేది దెయ్యమో కాదో తెలుసుకోవాలనుకునే వాళ్లు టెలిస్కోప్, లేదా టెలీఫోటో లెన్స్ ద్వారా చూడాలని బాస్ సూచిస్తుంటారు. అప్పుడు మీకు కారు హెడ్‌లైట్లు, బ్రేక్ లైట్లు కనిపిస్తాయని చెబుతారు. అలాకాకుండా అక్కడ దెయ్యం ఉందనే నమ్మకంతో చూసేవాళ్లు ఉంటారు. వారిని మాత్రం నమ్మించలేమని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)