అర్ధరాత్రి గాజాలోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు.. యుద్ధంలో మరో దశ మొదలైందా?

ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు

ఫొటో సోర్స్, IDF

ఫొటో క్యాప్షన్, సరిహద్దులు దాటి గాజాలో ప్రవేశిస్తున్న ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు

హమాస్‌ను తుడిచిపెట్టేంతవరకు పోరు కొనసాగిస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్, తాజాగా గాజాలోకి యుద్ధ ట్యాంకులను పంపించింది.

వైమానిక దాడులు కొనసాగిస్తూనే, ఈ తరహా మెరుపుదాడులకు దిగుతోంది.

అక్టోబరు 25 అర్ధరాత్రి సమయంలో ఉత్తర గాజా ప్రాంతంలో యుద్ధట్యాంకులతో ‘లక్షిత దాడులు’ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది.

యుద్ధట్యాంకులు, బుల్డోజర్లతో ఐడీఎఫ్ అందులో ప్రవేశించింది.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను గురువారం ఎక్స్‌(ట్విటర్)లో విడుదల చేసింది.

అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో తన ప్రసంగంలో- ఐడీఎఫ్ దళాలు గాజాలో భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

గాజాలో ఇజ్రాయెల్ భూతల దాడులు ఇంకా మొదలుపెట్టలేదు. అయితే ట్యాంకులతో చేసిన తాజా దాడిని తమ పోరాటంలో తర్వాతి దశలకు సన్నాహకంగా ఇజ్రాయెల్ చెబుతోంది.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, IDF

ఫొటో క్యాప్షన్, ఈ దాడిని 'తదుపరి పోరుకు సన్నాహకం'గా ఇజ్రాయెల్ పేర్కొంది.

ఇజ్రాయెల్ ఇలా చేయడం ఇదే తొలిసారా?

ఇజ్రాయెల్ తాజా మెరుపుదాడికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

గత వారమే గాజా సిటీలో ఉన్న 11 లక్షల మంది నివాసితులు, ఉత్తర ప్రాంతాల్లో ఉన్న వారిని ఆ ప్రదేశాలను ఖాళీ చేయాల్సిందింగా ఇజ్రాయెల్ సూచించింది.

ఐక్యరాజ్యసమితి సీనియర్ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, ఉత్తర గాజా నుంచి దక్షిణ ప్రాంతాలకు వెళ్లిన పాలస్తీనియన్లు అక్కడ పరిస్థితులు మరింత దిగజారుతుండటంతో తిరిగి వారి నివాసాలకు వస్తున్నారని చెప్పారు.

ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి మెరుపుదాడులకు దిగడం ఇదే తొలిసారి కాదు.

అక్టోబర్ 7న హమాస్ దాడులు మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దళాలు మెరుపుదాడులు చేస్తున్నాయి.

అయితే ఈసారి మెరుపుదాడుల గురించి ఇజ్రాయెల్ సైన్యం వాడిన పదజాలం గతంతో పోలిస్తే ఎక్కువ బలంగా ఉంది. ఈ దాడి హమాస్‌పై తమ పోరాటంలో తర్వాతి దశలకు సన్నాహకంగా ఇజ్రాయెల్ చెబుతోంది.

తాజా దాడి కొన్ని గంటలపాటు సాగిందని, తమ వైపు ఎవరూ గాయపడలేదని ఐడీఎఫ్ చెప్పింది.

ఇజ్రాయెల్-గాజా

ఫొటో సోర్స్, IDF

ఫొటో క్యాప్షన్, హమాస్ స్థావరాలు, యాంటీ-ట్యాంక్ లాంచ్ పోస్టులు ధ్వంసం చేసినట్లు తెలిపిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, IDF

ఫొటో క్యాప్షన్, మెరుపుదాడుల అనంతరం ఇజ్రాయెల్ సరిహద్దులకు చేరుకుంటున్న యుద్ధ ట్యాంకులు
ఉత్తర గాజా ప్రాంతం

ఫొటో సోర్స్, IDF

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 6500 మంది పాలస్తీనియన్లు మరణించారన్న పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ

‘షేపింగ్ ఆపరేషన్’

తాజా మెరుపుదాడిని ఇజ్రాయెల్ ‘షేపింగ్ ఆపరేషన్’గా పిలిచిందని బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ ఫ్రాంక్ గార్డెనర్ అన్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం..

‘‘హమాస్ మిలటరీ సామర్థ్యాన్ని సమూలంగా నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతినబూనింది. అర్ధరాత్రి మెరుపు దాడి దీనికి ప్రారంభంలా కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ నిఘా, భద్రతా వైఫల్యాల కారణంగానే దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతాలపై హమాస్ అక్టోబరు 7న మెరుపు దాడులకు పాల్పడిందన్న విమర్శల నేపథ్యంలో, తమ సామర్థ్యాన్ని మరోసారి చాటేందుకు, హమాస్‌ను తాము దీటుగా ఎదుర్కోగలమని చెప్పేందుకు ఇజ్రాయెల్ పంపుతున్న సందేశాలుగా ఈ దాడులను చూడొచ్చు.

కొన్ని వారాలుగా వందల కొద్దీ ఇజ్రాయెల్ దళాలు ఏ క్షణమైనా గాజాలోకి ప్రవేశించడానికి సరిహద్దుల దగ్గరే వేచి ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి.

ఇజ్రాయెల్ దూకుడుగా ఉండకపోవడానికి కూడా కారణం ఉంది. హమాస్ అపహరించిన 200 మంది పౌరులను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దాడులు ముమ్మరం చేస్తే ఇరువైపులా భారీగా ప్రాణనష్టం తప్పదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది.

గాజాలో ఇజ్రాయెల్ పూర్తిస్థాయి దాడులు మొదలైనందున, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా రక్షణ స్థావరాలపై ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లు డ్రోన్ దాడులు చేస్తారన్న హెచ్చరికల నేపథ్యంలో, యూఎస్ బలగాలను మోహరించడానికి సమయం కావాలని ఇజ్రాయెల్‌కు వాషింగ్టన్ నుంచి ఒత్తిడి ఉంది.’’

వీడియో క్యాప్షన్, గత రాత్రి గాజా లోపలికి చొచ్చుకువెళ్లి దాడి చేశామని ప్రకటించిన ఇజ్రాయెల్...

250 హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు

గత 24 గంటల్లో 250 హమాస్ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, మిసైల్ లాంచ్ స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలను తాము వైమానిక దాడుల్లో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ గురువారం చెప్పింది.

వీడియో క్యాప్షన్, సంఘర్షణ మొదలైనప్పటి నుంచి 2,300 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్న హమాస్

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)