ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్: ఏఐ దెబ్బకు కోట్ల ఉద్యోగాలు గల్లంతవుతాయా... భారత్‌లో ఈ భయాలు ఎలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ (కృత్రిమ మేధ)తో క్షణాల్లో లీగల్ కంటెంట్‌ను ఎలా సృష్టించగలమని దిల్లీలోని ఒక లీగల్ సంస్థలో లీగల్ అసోసియేట్‌గా పనిచేస్తున్న విజయ్(పేరు మార్చాం) ఆశ్చర్యపోయారు.
''చాట్ జీపీటీ గురించి తెలిసినప్పుడు దానిని ప్రయత్నించాలనుకున్నా. ఒక నోటీసు కోసం వాద, ప్రతివాదుల పేర్లు, లీగల్ సెక్షన్, రిఫరెన్సులు, ఎంత మొత్తం పరువు నష్టం దాఖలు చేయాలనే వివరాలు చెప్పి పరువు నష్టం కేసు నోటీసు తయారు చేయాలని అడిగా.
అంతే, క్షణాల్లో నోటీసు నా ముందుంది. నిజంగా చెబుతున్నా. నేను కూడా అంత బాగా రాయలేను. అందులో ఏఐ వాడిన భాష, రాసిన స్టైల్ నాకంటే బాగున్నాయి'' అని బీబీసీ ప్రతినిధి ఆదర్శ్ రాథోడ్‌తో విజయ్ చెప్పారు.
''ఒక్కసారిగా నాకు ఆనందం, ఆందోళన రెండూ కలిగాయి'' అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో 34 ఏళ్ల క్లెయిర్‌కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె లండన్‌లో ఒక పెద్ద కన్సల్టింగ్ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తున్నారు.
బీబీసీ వర్క్‌లైఫ్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, క్లెయిర్‌కి ఆమె ఉద్యోగమంటే ఇష్టం, మంచి జీతం కూడా వస్తోంది. అయితే, గత ఆరు నెలలుగా తన ఉద్యోగ భవిష్యత్తు గురించి ఆమె ఆందోళన చెందుతున్నారు.
''నాణ్యత విషయంలో నాతో సమానంగా పనిచేసే ఏఐ టూల్స్ ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ, చాట్ జీపీటీ రోజురోజుకీ వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరికొన్నేళ్లలో ఆ చాట్‌బోట్స్ నాలాగే పనిచేయడం ప్రారంభిస్తాయి. అప్పుడు నా ఉద్యోగం ఏమవుతుందన్న భయమేస్తోంది'' అని క్లెయిర్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న ఆందోళనలు
రోబోలు, ఏఐ టెక్నాలజీ కారణంగా ఉద్యోగాలు కోల్పోనున్నారన్న వార్తలు ఇటీవల హెడ్‌లైన్స్‌గా మారుతున్నాయి.
ఈ ఏడాది జులైలో బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ 90 శాతం ఉద్యోగాలను ఏఐ చాట్‌బోట్స్‌తో భర్తీ చేసింది. చాట్‌బోట్స్ వినియోగం తర్వాత వినియోగదారుల నుంచి స్పందన పెరిగిందని, ఖర్చు కూడా 85 శాతం వరకూ తగ్గిందని స్టార్టప్ వ్యవస్థాపకులు సుమిత్ షా ట్వీట్ కూడా చేశారు.
మొదటి ఏఐ టూల్ చాట్ జీపీటీ టెక్నాలజీ రంగంలో కొత్త మలుపుగా మారింది. ఇప్పుడు వివిధ రంగాలకు చెందిన చాలా కంపెనీలు ఈ ఏఐ టూల్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఉద్యోగుల్లో ఒక విధమైన అనిశ్చితికి దారితీస్తోంది.
చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ మరిన్ని అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తమ ఉద్యోగాల సంగతేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
''సృజనాత్మకత కలిగిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఏఐ టూల్స్ వచ్చినా కస్టమర్లు మానవ సేవలనే ఇష్టపడతారని అనుకుంటున్నా'' అని బీబీసీ వర్క్‌లైఫ్ రైటర్ జోసీ కాక్స్‌తో ఎలైస్ మార్షల్ అన్నారు.
29 ఏళ్ల మార్షల్ యూకేలోని బ్రిస్టల్‌లో కాపీరైటర్‌గా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏఐతో ప్రమాదమెంత?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భవిష్యత్తులో 30 కోట్ల ఉద్యోగాలను మింగేస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ మార్చిలో ఒక నివేదికను ప్రచురించింది.
రానున్న మూడేళ్లలో టెక్నాలజీ కారణంగా తమ ఉద్యోగాలకు ముప్పు ఉన్నట్లు మూడింట ఒకవంతు మంది ఆందోళన చెందుతున్నట్టు గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ 'ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్' నిర్వహించిన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ సర్వేలో తేలింది.
ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి భారత్‌లో ఇప్పటి వరకైతే లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ జోషి లోహాని అభిప్రాయపడ్డారు. ఆమె దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిధిలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫారెస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
''ఏఐతో ఉద్యోగాలు పోతాయని చెప్పడం ప్రస్తుతానికి అతిశయోక్తే అవుతుంది. ఏఐ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంది. అయినా టెక్నాలజీ మనుషుల స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలిక కాదు. అయితే, ఇది వ్యవస్థలో వేగంగా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. దానితో పాటు కొన్ని ఉద్యోగాలను ప్రభావితం చేయొచ్చు'' అని ఆమె బీబీసీ ప్రతినిధి ఆదర్శ్‌తో అన్నారు.
కరోలిన్ మాంట్రోస్ న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా ఉన్నారు. ఆమె కెరీర్ కోచ్ కూడా. రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో వ్యవస్థల్లో వచ్చే మార్పుల వల్ల కొద్దిగా భయం కలగడం సహజమేనని ఆమె అన్నారు.
బీబీసీ వర్క్‌లైఫ్‌లో ప్రచురితమైన కథనంలో, ''ఏఐ వల్ల భయాందోళన కలగడం సహజమే. ఎందుకంటే, అది రోజురోజుకీ మెరుగవుతోంది. ఇది ఏ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియడం లేదు'' అని మాంట్రోస్ పేర్కొన్నారు.
''అయితే, దీని వల్ల బాధపడాలో, వద్దో తేల్చుకోవాల్సింది ప్రజలే. భయపడడానికి బదులు ఏఐ టెక్నిక్స్‌ని నేర్చుకోవడంపై దృష్టి పెడితే దానిని అదనపు ప్రయోజనంగా మార్చుకోవచ్చు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏఐతో సహవాసం ఒక అవసరం
టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల పనిలో వేగం పెరగడంతో పాటు పని సులభతరం కూడా అవుతుందని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌లో ట్రస్ట్ అండ్ టెక్నాలజీ నిపుణులు స్కాట్ లికెన్స్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా ఆ మార్పుకు అనుగుణంగా మారొచ్చని ఆయన అన్నారు.
ఆయన జోసీ కాక్స్‌తో మాట్లాడుతూ ''ప్రజలు టెక్నాలజీని ఆహ్వానించాలి. వారు చేసే పనికి అనుగుణంగా ఏఐ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. శిక్షణ తీసుకోవాలి. అలా చేయడం ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నట్లు అవుతుంది'' అన్నారు.
''ఉద్యోగులు ఏఐ నుంచి పారిపోవడం మానేసి, దానిని స్వాగతించాలి. దాని నుంచి అవసరమైనవి నేర్చుకోవాలి'' అన్నారు.
టెక్నాలజీ వల్ల వ్యవస్థల్లో మార్పులు రావడం ఇదే మొదటిసారి కాదని, దానికి అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని లికెన్స్ అభిప్రాయపడ్డారు.
కొత్త టెక్నాలజీల వల్ల కొందరు ప్రయోజనం పొందారు కూడా. ఇటీవల జరిగిన పురోగతి వల్ల చాలా మంచి జరిగిందని కరోలిన్ మాంట్రోస్ అభిప్రాయపడ్డారు.
''సమాజ పురోగతిలో టెక్నాలజీది ప్రధానపాత్ర. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో అందుబాటులోకి రావడం మంచి పరిణామమే. అయితే, ఏఐ టూల్స్ గురించి నేర్చుకోవడానికి బదులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఏఐ చేసే హాని కంటే తమకు తామే ఎక్కువ హాని చేసుకుంటున్నారు'' అని మాంట్రోస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభావం తక్కువ, ఆందోళన ఎక్కువ
ఆందోళన నిజమే కానీ భయపడాల్సినంత అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. రోబోల వల్ల కూడా ఉద్యోగాలు భారీగా కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన చెందినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
రోబోలు, ఏఐ కారణంగా ఊహించిన దానికంటే తక్కువ సంఖ్యలోనే ఉద్యోగ నష్టం జరిగిందని అమెరికాలోని ఉతాహ్‌కి చెందిన బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎరిక్ డహ్లిన్ 2012లో నిర్వహించిన ఒక పరిశోధనలో వెల్లడైంది.
అలాగే, రోబోల కారణంగా తమ ఉద్యోగాలు పోతాయని దాదాపు 14 శాతం మంది భయాందోళనకు గురయ్యారని, కానీ జరిగింది వేరని బీబీసీ వర్క్‌లైఫ్ కథనంలో పేర్కొంది.
ఈ పరిశోధనలో భాగంగా, రెండు గ్రూపులతో మాట్లాడారు. రోబోల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారు, ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది లేని వారితో మాట్లాడారు.
నిజానికి, రోబోల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య కంటే, సాధారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే, ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది లేని వారి సంఖ్య, అంచనాలకు మించి రెండింతలు ఉంది.
''టెక్నాలజీని దేనికైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి, అది అన్నింటికీ వర్తిస్తుందని దానర్థం కాదు'' అని ప్రొఫెసర్ డహ్లిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మనిషి సామర్థ్యం
భవిష్యత్తులో మనుషులు, రోబోలు ఇద్దరూ అవసరమేనని జోసీ కాక్స్‌తో మాట్లాడుతూ ఎన్స్ట్ అండ్ యంగ్ కన్సల్టింగ్ సంస్థ పీపుల్ అడ్వైజరీ సర్వీసెస్ బిజినెస్ హెడ్ స్టెఫైన్ కోలెమన్ అన్నారు.
''రోబోలు చేయలేని ముఖ్యమైన పనులు ఎప్పుడూ ఉంటాయి. పని విధానంలో ఇతరులతో సంబంధాలను పెంపొందించుకోవడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, సృజనాత్మకత వంటి మానవ లక్షణాలు అవసరం. పనిలో కనిపించే ఇలాంటి మానవ లక్షణాలు యంత్రాలకు ఉండకపోవడం ఇలాంటి ఆందోళలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది'' ఆమె అన్నారు.
అలాగే, ఏఐ గురించి బాధపడాల్సిన అవసరం లేదని జేఎన్‌యూ ప్రొఫెసర్ లోహాని జోషి అన్నారు. పనిని విభజించడానికి, దాని నాణ్యత పెంచేందుకు ఏఐ రూపొందింది. టెక్నాలజీని చూసి ఇబ్బందిపడడం, భయపడడం అనేవి పరిస్థితిని మరింత కష్టతరం చేస్తాయని ఆమె అన్నారు.
''భవిష్యత్తులో అన్నీ ఏఐ ఆధారంగా పనిచేసే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైతే ఉద్యోగావకాశాలను మెరుగుపరుచుకోవాలని అనుకుంటారో, వారు ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడంపై దృష్టి పెట్టాలి. అయితే, ఏఐతో తన పనిని ఎలా మెరుగుపరుచుకుంటారో చూడాలి'' అన్నారు.
ప్రపంచాన్ని మార్చేయనున్న ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని కైలార్ కొద్దివారాల కిందట నిర్ణయించుకున్నారు.
''అంతకుముందు టెక్నాలజీకి సంబంధించిన పనుల విషయంలో భయపడేదాన్ని. అయితే అది ఎంత మూర్ఖత్వమో తర్వాత అర్థమైంది. ఇప్పుడు దాని గురించి నాకు ఎంత తెలుసు అనేది అర్థం చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు అంత భయం కూడా లేదు'' అని ఆమె చెప్పారు.
లీగల్ అసోసియేట్ విజయ్ కూడా నవ్వుతూ ''ఇప్పుడు నేను కూడా చాట్ జీపీటీ సాయంతో కొన్ని డ్రాఫ్టులు, అగ్రిమెంట్లు రూపొందిస్తున్నా. పూర్తయిన తర్వాత క్షుణ్ణంగా చదివి ఏవైనా తప్పులుంటే సరిచేసుకుంటా. ఇది నాకు సౌకర్యంగా ఉంది. అలాగే, ఆందోళనగానూ ఉంది. అంటే, భవిష్యత్తులో నాలాంటి ఉద్యోగాలు తగ్గిపోతాయేమోనని'' అన్నారు.
ఏఐని ముప్పుగా చూడడం కంటే ఒక ఉపయోగపడే విషయంగా పరిగణించాలని, ఆ టెక్నాలజీని నేర్చుకుని, వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే ఆందోళనలు దూరం కావడంతో పాటు ఈ పోటీ ప్రపంచంలో ముందుంటారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Chat GPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్న సామ్ ఆల్ట్మాన్ ఎవరు?
- అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ చేసిన 22 ప్రతిజ్ఞలు ఏమిటి? అవి హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయా?
- మగవారి కోసం కు.ని. ఇంజెక్షన్ తెచ్చిన ఐసీఎంఆర్, ఇది వైద్య రంగంలో మలుపు అవుతుందా...
- పద్మదుర్గ్: ఛత్రపతి శివాజీ నీళ్ల మధ్యలో ఈ కోటను ఎందుకు కట్టారో తెలుసా?
- అజయ్ జడేజా: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ విజయం వెనకున్న భారతీయుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














