ఇజ్రాయెల్: 'బయటికొస్తే చంపబోమన్నారు.. కానీ నా కూతుర్ని తలలో కాల్చి చంపారు, భర్తను బందీగా తీసుకెళ్లిపోయారు’

- రచయిత, అన్నా ఫోస్టర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గాజాకు బందీగా తీసుకెళ్లే సమయంలో త్సాచి ఇడాన్ చేతులు కూతురు రక్తంతో తడిసిపోయాయి. కుటుంబం కళ్ల ముందే మాయన్ (18)ను చంపేశాడు హమాస్ మిలిటెంట్.
అంతకుముందు కుమార్తె మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని అలాగే కూర్చున్నారు త్సాచి ఇడాన్. అదే సమయంలో ఇంటి బయట పేలుళ్ల శబ్దం ప్రతిధ్వనిస్తోంది.
ఈ కుటుంబం పడుతున్న బాధను, భయాన్ని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రపంచం మొత్తానికి చూపించిందీ హమాస్.
త్సాచి భార్య పేరు గాలీ ఇడాన్. అక్టోబర్ 7న హమాస్ దాడి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.
ఇపుడామె, పిల్లలు కిబ్బుట్జ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ అన్ని రకాల సంరక్షణ, సౌకర్యాలు ఉన్నాయి, కానీ అది వారి ఇల్లు కాదు.
మాయన్‌కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి వాళ్లు ఇంటిలోనే నివసిస్తున్నారు. అదే మయాన్ పెరిగిన ఇల్లు. అక్కడ అందరికీ జ్ఞాపకాలున్నాయి. అదే ఇంట్లో మయాన్ చెల్లెలు, తమ్ముడూ పుట్టారు.
మాయన్ ఇంటిలో పెద్దదని, చాలా సిగ్గు పడేదని, వయసుకు రాగానే, ఆమె చాలా అందంగా తయారైందని పొరుగువారిలో ఒకరు చెప్పారు.
''ఇటీవల ఆమె డ్రైవింగ్ పరీక్షలో పాసయ్యారు. తనకు బోయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. ఆమె చాలా బాగా చదివేది. హత్యకు నాలుగు రోజుల ముందు పుట్టినరోజు జరుపుకొన్న మయాన్ పుస్తకాలు అడిగింది'' అని తెలిపారు పక్కింటివాళ్లు.
మయాన్ ఇక ఎప్పటికీ 18 ఏళ్ల వయసులోనే ఉంటుందని ఆమె తల్లి గాలీ అంటున్నారు.

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
'ఏదో తేడాగా ఉందనుకున్నాం'
చెట్టు నీడలో కూర్చున్న గాలీ ఇడాన్.. ఆ రోజును గుర్తు చేసుకోవడం ఇష్టం లేదని చెప్పారు. "ఆయన తిరిగిరావాలి, అది కూడా బతికే. ఆయన ఇపుడు తిరిగిరావాలి" అని కోరుతున్నారు.
అక్టోబర్ 7న హెచ్చరిక అలారం మోగడంతో త్సాచీ ఇడాన్ కుటుంబసభ్యులు ఒక్కసారిగా నిద్రలేచారు. అది గాజా నుంచి రాకెట్ పడొచ్చని తెలిపే హెచ్చరిక. వాళ్లకు దాని గురించి తెలుసు. కానీ ఆ ఉదయం తేడాగా ఉంది.
"అది అసాధారణంగా, తీవ్రంగా ఉంది, నిరంతరం దాడులు జరిగాయి. మేం బయటకెళ్లి ఊపిరి పీల్చుకోలేకపోయాం. మా ఇంటి లోపలే ఓ గదిలో ఉండిపోయాం. త్సాచి, నేను ఒకరినొకరు చూసుకుని ఇక్కడ ఏదో తేడాగా ఉందనుకున్నాం. అది చాలా భయానకంగా ఉంది" అని గాలీ ఇడాన్ గుర్తుచేసుకున్నారు.
"మాపై దాడి జరగొచ్చని, మమ్మల్ని ఇంటి లోపలే ఉండాలని కిబ్బుట్జ్ అంతర్గత వ్యవస్థ నుంచి మాకు సందేశం వచ్చింది. కిబ్బుట్జ్‌లోకి మిలిటెంట్లు వస్తారనే భయం ఉన్నందున వారు నిశ్శబ్దంగా ఉండమని మాకు చాలాసార్లు చెప్పేవారు. ప్రతీసారి ఇలాగే ఉంటుందని అనుకోవడానికీ లేదు. అది పీడకల లాంటిది. ప్రభుత్వం, సైన్యం వీటిని పరిష్కరిస్తాయి. కానీ, అకస్మాత్తుగా ఆ పీడకల వాస్తవమైంది'' అని ఆమె తెలిపారు.
ఇంటి బయట పేలుడు ఎలా జరిగిందో గాలీ ఇడాన్ వివరిస్తూ- ''కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఇంటి లోపలికి ఎవరో వస్తున్న అడుగుల చప్పుళ్లు వినిపించాయి. ఓ వ్యక్తి ఇంగ్లిష్‌లో ‘వి డోంట్ షూట్(మేం కాల్చం)' అన్నాడు'' అని గుర్తుచేసుకున్నారు.
''త్సాచి తలుపు దగ్గర నిలబడ్డారు, డోర్ తెరిచే అవకాశం వారికివ్వలేదు. అయితే, తలుపుకు తాళం లేకపోవడంతో పిల్లలు కేకలు వేశారు. దీంతో గది లోపల గందరగోళం నెలకొంది. గదంతా చీకటిగా ఉంది, కానీ మాయన్ పరిస్థితి అర్థం చేసుకుంది. మిలిటెంట్లు తలుపులు తెరుస్తారని ఆమెకు అర్థమైంది. వెంటనే తండ్రి దగ్గరికెళ్లి తలుపును గట్టిగా పట్టుకుంది'' అని గుర్తుచేసుకున్నారు గాలీ ఇడాన్.
ఘటన గురించి వివరిస్తుండగా గాలీ ఇడాన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. బయటకొస్తే తమను కాల్చబోమన్నారని, అయినా కాల్పులు జరిపారని ఆమె చెప్పారు.
''మేం కాల్చం అంటూ అరిచారు. కానీ, కాల్చేశారు. ఎవరికి తగిలింది? ఎవరికి తగిలింది? అని త్సాచి అరిచాడు. అది మాయన్. ఆయన పక్కనే ఆమె పడిపోయింది. హమాస్ మిలిటెంట్లు తలుపు తెరవడానికి ప్రయత్నించారు. గట్టిగా అరుస్తున్నారు. తర్వాత లైట్లు వేశారు. మాయన్ రక్తపు మడుగులో పడి ఉంది. నేను తన దగ్గరికి వెళ్లి చూశా, తలకు దెబ్బ తగిలింది. గదిలో నుంచి బయటికి రమ్మని వాళ్లు మాపై అరిచారు. బయటికెళ్లండంటూ పిల్లలకు చెప్పాను'' అని గాలీ ఇడాన్ తెలిపారు.

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
మీటర్ల దూరంలోనే కుమార్తె మృతదేహం
"నా ఇంటి చుట్టూ యుద్ధమే జరుగుతోంది, వారు లోపలే ఉన్నారు" అని గాలీ ఇడాన్ చెప్పారు.
త్సాచి, గాలీ, వారి ఇద్దరు చిన్న పిల్లలు, 11 ఏళ్ల యేల్, తొమ్మిదేళ్ల షాచార్ నేలపై కూర్చున్నారు. వారి చుట్టూ బుల్లెట్ల శబ్దం ప్రతిధ్వనిస్తోంది.
ఒక మిలిటెంట్ గాలీ ఫోన్‌ని తీసుకుని, ఆమె పాస్‌వర్డ్ అడిగారు. అనంతరం ఫేస్‌బుక్ లైవ్ పెట్టి కుటుంబాన్ని చిత్రీకరించడం ప్రారంభించాడు.
వీడియో చాలా బాధాకరంగా ఉంది. 26 నిమిషాలకు పైగా రాకెట్ల మోత వినిపించింది. బుల్లెట్ల వర్షానికి పిల్లలు బయపడి ఏడుపు మొదలుపెట్టారు. ఇదే సమయంలో మయాన్ మృతదేహం వారికి మీటర్ల దూరంలోనే ఉండిపోయింది.
''నా పిల్లలు ధైర్యవంతులు కావడం నా అదృష్టం. వాళ్లు మిలిటెంట్లతో మాట్లాడారు. వాళ్లు ఎలా చేయగలిగారో తెలియదు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకు కాల్చి చంపారు? అని వారిని ప్రశ్నించారు. బహుశా అదే మమ్మల్ని రక్షించింది" అన్నారు గాలీ ఇడాన్.

'అవే చివరి మాటలు'
"త్సాచి గుండె పగిలిపోయింది. కూతురు చనిపోవడం చూశారు. తలపై కాల్చడం, ఆమె ఆయన పక్కనే పడిపోవడం చూశారు. తన 18వ పుట్టినరోజును జరుపుకొని బెలూన్లు, అభినందనలతో నిండిన ఇల్లు ఒక్కసారిగా రక్తంతో తడిచిపోయింది" అని అన్నారు గాలీ.
త్సాచిని నిలబడమని అడిగారు మిలిటెంట్లు. ఆయన చేతులు వీపు వెనుక తీగతో కట్టేశారు. తమ తండ్రిని తీసుకెళ్లవద్దని, చంపవద్దని పిల్లలు వారిపై అరిచారు. అయినా కూడా ఆయన్ను తీసుకెళ్లారు.
దాడి సమయంలో టెల్ అవీవ్‌లో ఉన్న రెండో కుమార్తె షారోన్ (15) తన తండ్రి త్సాచితో టెలిఫోన్‌లో మాట్లాడారు.
"షారోన్, మేం ఇబ్బందుల్లో ఉన్నాం, నేను తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్యూ'' అని చెప్పి ఫోన్ కట్ చేశారు. అవే త్సాచీ చివరి మాటలు.
గాలీ ఇడాన్ తన భర్తతో చెప్పిన చివరి మాటలనూ గుర్తుచేసుకున్నారు.
"ఆయన్ను తీసుకెళ్లే సమయంలో నేను నిన్ను ప్రేమిస్తున్నా, హీరోగా కాదు, తెలివిగా ఉండండి, మీరు ప్రాణాలతో తిరిగి రండి, చాలు అని చెప్పాను" అని గుర్తుచేసుకున్నారు గాలీ ఇడాన్.
"ఆయన నాకు కావాలి. మా దగ్గరికి, ఆరోగ్యంగా, సజీవంగా తిరిగి రావాలి. తన కూతురికి శ్రద్ధాంజలి ఘటించాలి. నేను ఆయన్ను కౌగిలించుకోవాలి" అంటూ రోదించారు గాలీ ఇడాన్.
''వాళ్ల లక్ష్యం ఏమిటో నాకర్థం కావడం లేదు'' అని ఆమె అంటున్నారు.
"వాళ్లను వాళ్లు రాక్షసులుగా మార్చుకోవాలనుకుంటున్నారా? మీరు మా పిల్లలకు వచ్చిన ఓ చెత్త పీడకల. మీరు భయానకం, ఈ గాయం మానుతుందా? వాళ్లు జనాలను వెనక్కు తీసుకురావాలి. వారందరినీ తిరిగి తీసుకురావాలి" అని ఆమె డిమాండ్ చేశారు.

శోక సంద్రంలో కుటుంబీకులు, బంధువులు
ఈ ఇంటికి కొంచెం దూరంలో ప్రశాంతమైన ప్రదేశంలో మాయన్ శవపేటిక ఉంది.
మాయన్‌ను స్మరించుకునేందుకు పూలమాలలు, రంగురంగుల పుష్పగుచ్ఛాలతో వచ్చే వందల మందికి అక్కడ సీట్లు సరిపోవడం లేదు.
స్నేహితులు, కుటుంబ సభ్యులు మాయన్ స్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. అక్కడికొచ్చిన వారితో గాలీ తన కూతురిని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.
9, 11 ఏళ్ల వయసున్న షాచార్, యేల్ ముఖాలు కన్నీళ్లతో నిండిపోయాయి, వారి సోదరి చనిపోయింది, వారిని ఓదార్చడానికి తండ్రి కూడా అక్కడ లేడు.
త్సాచి లేని లోటు అక్కడ కనిపిస్తోంది.
ఆయన విడుదలకు సహాయపడే ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గాలీ ఇడాన్ చెప్పారు.
అక్కడికొచ్చిన చాలామంది మాయన్ ఫోటో గల టీషర్టులు ధరించి కనిపించారు. వారి టీషర్టుల వెనక వైపు 'త్సాచీని తిరిగి తీసుకురండి' అని రాసి ఉంది.
ఇవి కూడా చదవండి
- మగవారి కోసం కు.ని. ఇంజెక్షన్ తెచ్చిన ఐసీఎంఆర్, ఇది వైద్య రంగంలో మలుపు అవుతుందా...
- పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?
- తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే..
- వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగు వారా? శత్రువులు కూడా మెచ్చుకున్న ఆయన్ను ఎందుకు ఉరి తీశారు?
- క్రికెట్ వరల్డ్ కప్: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఎలా గెలిచింది... అదీ చేజ్ చేసి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















