చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు... రిమాండ్‌లో ఉన్న వ్యక్తి గురించి చట్టసభల సభ్యుడు అలా మాట్లాడవచ్చా?

మాధవ్

ఫొటో సోర్స్, Facebook / Gorantla Madhav MP

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

‘‘2024 ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు చస్తారు.’’

ఈ వ్యాఖ్యలు చేసింది హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.

పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా? అసలు ఎవరైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ అతడు చస్తాడని చెప్పడం సంస్కారమేనా?

ఏపీ రాజకీయాల్లో దిగజారుడు వ్యాఖ్యల స్థాయిని గోరంట్ల మాధవ్ మరింత దిగజార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

"ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా సాగుతున్న ధోరణితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అభ్యంతకర దశను దాటి అసహ్యకర పరిణామాలు చూడాల్సి వస్తోంది" అని సీనియర్ జర్నలిస్ట్ ఎం.రాజగోపాల్ అన్నారు.

బహిరంగ సభల్లో నాయకులు హద్దులు మీరుతున్నారని విశ్రాంత న్యాయమూర్తి వి. సోమసుందర్ అన్నారు.

"త్వరలోనే ఒక వ్యక్తి చనిపోతారని చెప్పడం నేరం అవుతుంది. అందులోనూ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న వారి గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదు చేస్తే చట్టపరంగానూ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది" అని ఆయన అన్నారు.

హద్దు మీరుతున్న వ్యక్తిగత దూషణలు

ఇటీవల రాష్ట్ర మంత్రి ఆర్.కె. రోజాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి.

నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఆయా పార్టీల నాయకత్వం అడ్డుకోకపోవడం ప్రజలకు విస్మయం కలిగిస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గతవారం ఎన్‌టీవీ చానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అందరూ చూస్తుండగానే బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్‌ను కుత్బుల్లాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మెడ పట్టుకుని తోశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బూతులు, అసభ్యకర వ్యాఖ్యలు చాలా సాధారణమైపోయాయి. అసెంబ్లీ కూడా ఇలాంటి వాటికి వేదికగా మారుతోంది.

ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందిస్తున్న గోరంట్ల మాధవ్

ఫొటో సోర్స్, Facebook/Gorantla Madhav MP

ఫొటో క్యాప్షన్, మాధవ్‌ లాంటి నేతలను వైసీపీ నాయకత్వం నియంత్రించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

వివాదాల మాధవ్

గోరంట్ల మాధవ్ గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారు. సీఐగా ఉన్నప్పటి నుంచే ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. సీఐగా ఉన్నప్పుడే మాధవ్, మీసం మెలేసి నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సవాల్ విసిరారు .

మాధవ్ ఆ తరువాత వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.

తాజాగా ‘‘సామాజిక సాధికారత’’ యాత్ర పేరుతో వైసీపీ నేతలు, మంత్రులు బస్సులో పర్యటిస్తున్నారు.

రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి ఈ బస్సు యాత్రలు మొదలవ్వగా, రాయలసీమలోని శింగనమలలో గురువారం ప్రారంభమైంది. శింగనమలలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడారు. ‘‘2024లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబునాయుడు చస్తారు’’ అని ఆయన అన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో సెప్టెంబరులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు.

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ తొలి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ఎంపీ మాధవ్ చేసిన వ్యాఖ్యలతో ‘‘అదిగో, మేం చెప్పింది నిజమే’’ అంటూ వారు మరింత గట్టిగా వాదిస్తున్నారు.

మాధవ్ వ్యాఖ్యలపై వివరణ కోసం బీబీసీ ప్రయత్నించినా, ఆయన స్పందించలేదు

చంద్రబాబు

ఫొటో సోర్స్, Facebook / NARA CHANDRABABU NAIDU

ఫొటో క్యాప్షన్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారు.

మందలించేవారే లేరా?

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్న గతంలో నాయకులు ఎంతో కొంత సంయమనం పాటించేవారు. అడపాదడపా ఒకరిద్దరు నోరు జారినా వారిని మందలించి, దారికి తెచ్చే వ్యవస్థ పార్టీల్లో ఉండేది. కానీ ఇటీవల అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుతం వైసీపీ, టీడీపీలకు చెందిన నేతలు కొందరు అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఆ తీరును పార్టీలు అదుపు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఫలితంగా అలాంటి నేతలు ఇంకా రెచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులుగా చేసిన కొడాలి నాని వంటి వారి భాష అత్యంత అభ్యంతకరంగా సాగిపోయేది. చివరకు చంద్రబాబు తన భార్యను అవమానించారంటూ మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకునే వరకూ అసెంబ్లీ పరిణామాలు వెళ్లాయి.

మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి కూడా అదే పంథాలో దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. తీవ్ర విమర్శలు వచ్చినా ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అభ్యంతకర దశను దాటి అసహ్యకర దశకు చేరుకుందని సీనియర్ జర్నలిస్ట్ ఎం.రాజగోపాల్ అన్నారు

"రాజకీయాల్లో ప్రమాణాలు, కొలబద్ధలు ఉండవు. గతంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చావు గురించి బహిరంగసభలో ప్రస్తావించే పరిస్థితి చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో విధానాలు, వ్యవస్థాగత అంశాలపై చర్చలకు అవకాశం లేదనిపిస్తోంది. వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననం కోసం చేసే ప్రయత్నాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీన్ని కేవలం కిందిస్థాయి నేతల దిగజారుడుతనంగా చూడలేం. అధినాయకత్వాలు వాటిని ప్రోత్సహించడమే ఈ దుస్థితికి కారణం" అని రాజగోపాల్ అన్నారు.

ప్రజల్లో పలుచనవుతున్నప్పటికీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సాగడం అనే ధోరణి శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చరించారు.

‘త్వరలోనే ఒక వ్యక్తి చనిపోతారని చెప్పడం నేరం’

వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణల ద్వారానే ప్రచారం వస్తుందని కొందరు నమ్ముతున్నారు. దానికి తగ్గట్టుగానే వారుఅదుపు తప్పి వ్యవహరిస్తున్నారని పరిశీలకుల అభిప్రాయం.

ఏ వ్యవస్థకైనా స్వీయ నియంత్రణ అవసరమని విశ్రాంత న్యాయమూర్తి వి.సోమసుందర్ అన్నారు.

"నాయకులు బహిరంగ సభల్లో ఏం మాట్లాడాలన్నది తెలుసుకుంటే మంచిది. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమే. పార్లమెంట్ సభ్యుడిగా ఇలాంటి తీరు సరికాదు. త్వరలోనే ఒక వ్యక్తి చనిపోతారని చెప్పడం నేరం అవుతుంది. అందులోనూ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న వారి గురించి ఇలా మాట్లాడితే చట్టపరంగానూ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన తన వ్యాఖ్యాలను ఉపసంహరించుకోవాలి" అని సోమసుందర్ అన్నారు.

ఇలాంటివి పునరావృతం కాకుండా నాయకులు జాగ్రత్తలు పాటించాలని, పార్టీ నాయకత్వమే అలాంటి వారిని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సోమసుందర్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)