మార్టిన్ లూథ‌ర్ కింగ్ రివ్యూ: సంపూర్ణేశ్ తెలుగు ఓటరును మెప్పించాడా... ఈ సినిమాకూ ఏపీ రాజకీయాలకూ సంబంధమేంటి?

సంపూర్ణేశ్ బాబు

ఫొటో సోర్స్, Facebook/Ynotstudios

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

త‌మిళ‌నాట మండేలా చిత్రం ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌లు పొందింది. ఈ క‌థ‌ని ఇప్పుడు.. `మార్టిన్ లూథ‌ర్ కింగ్‌` పేరుతో తెలుగులో తీశారు.

ప్ర‌జాస్వామ్యంలో ఓట‌ర్లంతా ఏక్ దిన్ కా సుల్తాన్ లే! ఓటేసే ఆ ఒక్క రోజు.. నేత‌ల‌కు వాళ్లే దేవుళ్లు. కాక‌పోతే.. దేవుళ్లు వ‌రాలిస్తారు. కానీ నేత‌లు మాత్రం ఓట‌రు మ‌హాశ‌యుల‌కే వ‌రాలు కురిపిస్తారు. తాయిలాలు పంచుతారు. కులం పేరు చెప్పి, త‌మ ప‌క్క‌కు లాగేస్తారు. ఆ ఒక్క ఓటూ వేసేశాక‌... ఓటెరెవ‌రో, నేత‌లెవ‌రో. ప్ర‌జాస్వామ్యం తీరు ఇదే. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని సున్నితంగా, వ్యంగ్యంగా, సూటిగా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన క‌థ‌.. `మండేలా`.

త‌మిళంలో యోగిబాబు చేసిన పాత్ర‌లో తెలుగులో సంపూర్ణేష్ బాబు క‌నిపించాడు. అక్క‌డి మండేలాకూ, ఇక్క‌డి మార్టిన్ లూథ‌ర్ కింగ్‌కూ ఉన్న పోలిక‌లేంటి? మండేలా మాదిరే.. కింగ్ కూడా మెప్పించాడా? ప్రేక్ష‌కుల్ని ఆలోచ‌న‌ల్లో ప‌డేశాడా..?

ప‌డ‌మ‌ర పాడు అనే ఓ ఊరి క‌థ ఇది. ఊరి పెద్ద కాశీ విశ్వ‌నాథ్‌కి వ‌య‌సైపోతుంది. ఒంట్లో ఓపిక పోతుంది. త‌దుప‌రి ఆ ఊరికి ఓ ప్రెసిడెంటు కావాలి. త‌న‌కు ఇద్ద‌రు పెళ్లాలు. ఒక్కో భార్య‌కీ ఒక్కో కొడుకు. ఒక‌రు లోకి (వెంక‌టేశ్ మ‌హా), మ‌రొకరు జ‌గదీశ్ (న‌రేశ్‌). ఇద్ద‌రికీ ఒక్క నిమిషం కూడా ప‌డ‌దు. పైగా ఆ ఊర్లో జనం ఉత్త‌రం, ద‌క్షిణం అనే రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఎప్పుడూ కొట్టుకొంటూ ఉంటారు.

అలాంటి ద‌శ‌లో... త‌రువాతి ప్రెసిడెంట్ ఎవ‌రు? అనే స‌మ‌స్య త‌లెత్తుతుంది. లోకి, జ‌గ‌దీశ్ ఇద్ద‌రూ ప్రెసిడెంటు ప‌ద‌వికి పోటీ చేస్తారు. వీరిద్ద‌రిలో ఎవ‌రు గెల‌వాల‌న్నా ఆ ఊర్లోని మార్టిన్ లూథ‌ర్ కింగ్ (సంపూర్ణేష్ బాబు) ఓటు కీల‌కం. మ‌రి.. కింగ్ ఆ ఓటును ఎలా ఉపయోగించుకున్నాడనేది మిగిలిన క‌థ‌.

మార్టిన్ లూథర్ కింగ్ రివ్యూ

ఫొటో సోర్స్, Facebook/Ynotstudios

అంద‌రి క‌థ‌

ప్ర‌జాస్వామ్యం ఎంత అప‌హాస్యం పాల‌వుతోందో, ఓట‌రు విలువెంతో వ్యంగ్య ధోర‌ణిలో చెప్పిన తమిళ క‌థ‌.. `మండేలా`. ఇలాంటి క‌థ‌ల‌కు నేటివిటీ స‌మ‌స్య ఉండ‌దు. ప్ర‌జాస్వామ్యం ఉన్న ప్ర‌తీ చోటా.. ఇలాంటి క‌థ చెప్పొచ్చు.

అందుకే `మండేలా`ని తెలుగులో `మార్టిన్ లూథ‌ర్ కింగ్‌`గా మార్చే ప్ర‌య‌త్నం చేశారు దర్శ‌క, నిర్మాత‌లు. మాతృక‌తో పోలిస్తే.. పెద్ద‌గా మార్పులూ చేర్పులూ చేయ‌లేదు.

ఇది ఒక్క ఓట‌రు క‌థో, ఒక్క ఊరి క‌థో కాదు. మ‌నంద‌రి క‌థ. ఓట్ల పండ‌గ వ‌చ్చిన‌ప్పుడు.. త‌నే రాజ‌ని భావించే ప్ర‌తీ ఓట‌రు క‌థ‌. మ‌రుగుదొడ్డి ఎపిసోడ్ తో ఈ క‌థ‌ని మొదలవుతుంది.

బ‌హిర్భూమికి వెళ్తున్న వాళ్లంద‌రినీ ఓ ట్రాక్ట‌ర్‌లో బ‌ల‌వంతంగా ఎక్కించుకొని కొత్త‌గా క‌ట్టిన‌ మ‌రుగుదొడ్డి ద‌గ్గ‌ర‌కు తీసుకురావ‌డం, తొలుత లోప‌లికి ఎవ‌రు వెళ్లాలి? అనే విష‌యంలో గొడ‌వ‌... చివ‌రికి దాన్ని బ‌ద్ద‌లు కొట్ట‌డం.. ఇలా దాదాపుగా ప‌ది నిమిషాల పాటు సాగింది ఈ ఎపిసోడ్‌. ఈ ఒక్క సీన్‌ని ఇంత వివ‌రంగా చెప్ప‌డం వెనుక కూడా బ‌ల‌మైన కార‌ణం ఉంది. ఈ సీన్‌తోనే ఆ ఊరి ప‌రిస్థితి, లోకీ, జ‌గ‌దీశ్‌ల వ్య‌క్తిత్వాలు, ఊరి పెద్ద బాధ‌.. ఇలా ప్ర‌తీ కోణాన్నీ ఆవిష్క‌రించాల‌ని చూశారు దర్శకురాలు. అక్క‌డే స్మైల్ (సంపూర్ణేష్ బాబు) పాత్ర‌నీ క‌థ‌లోకి తీసుకొచ్చారు.

క‌థానాయ‌కుడు త‌న పేరుని స్మైల్ నుంచి మార్టిన్ లూథ‌ర్ కింగ్ గా మార్చుకొనే ప్ర‌య‌త్నం మ‌రో ప‌ది నిమిషాల పాటు సాగింది. నిజానికి ఈ ఎపిసోడ్‌లో త‌న అస్థిత్వాన్ని వెదుక్కొంటూ వెళ్లిన ఓ సాధార‌ణ మ‌నిషి వ్య‌థ క‌నిపిస్తుంది.

ఎల‌క్ష‌న్ల ఎపిసోడ్ వ‌చ్చేంత వ‌ర‌కూ.. క‌థ‌, క‌థ‌నం నింపాదిగానే సాగాయి. ఎక్క‌డైతే... ఎల‌క్ష‌న్ల హ‌డావుడి మొద‌ల‌వుతుందో అక్క‌డి నుంచి అస‌లైన ఊరి రాజ‌కీయం చూసే అవ‌కాశం ద‌క్కింది.

మార్టిన్ లూథర్ కింగ్ రివ్యూ

ఫొటో సోర్స్, Facebook/Ynotstudios

ఆ పాత్ర‌ల వెనుక మ‌ర్మం ఏమిటి?

ప్రెసిడెంటుగా నువ్వు గెలిస్తే ఏం చేస్తావ్‌..? అని ఊరి పెద్ద అడిగినప్పుడు లోకి `ఊర్లోని బార్‌కి ఏసీ ఏర్పాటు చేస్తా..` అంటాడు. జ‌గదీశ్ అయితే.. `ప్ర‌తీ ఎకౌంట్లోనూ 15 వేలు వేస్తా` అంటాడు. ఈ డైలాగ్స్ ప్ర‌స్తుతం నేత‌ల వాగ్దానాలు ఎలాగున్నాయో వ్యంగ్యంగా చెబుతున్న తీరుకు అద్దం పడుతాయి.

ద‌ర్శ‌కురాలు కూడా ఈ సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కు (లోకీ, జ‌గ‌దీశ్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఇద్ద‌రు ప్రముఖ రాజకీయ నేత‌ల పేర్లు గుర్తుకు వ‌చ్చేలా రాయ‌డం కాక‌తాళియం మాత్రం కాదు అనిపిస్తుంది. `మ‌జ్జిగ‌ తీయ‌గుంట‌ది` అని లోకీ ఓ పాత్ర‌తో అన‌డం, జ‌గ‌దీశ్ క‌నిపించిన ప్ర‌తీ ఒక్క‌రికీ ముద్దులు ఇచ్చేయ‌డం కూడా అలాంటి సంద‌ర్భాలే!

మార్టిన్ లూథ‌ర్ కింగ్ పాత్ర‌లో మూడు కోణాలు క‌నిపిస్తాయి. త‌న అమాయ‌క‌త్వం, అతి మంచిత‌నం, చేత‌కానిత‌నం, వెనుక‌బాటు... వీటితో ఊరి వాళ్లంతా ఆడుకొనే కోణం ఒక‌టి. త‌న ఓటుని అడ్డు పెట్టుకొని, దాని ద్వారా ల‌బ్ది పొందాల‌న్న కోణం ఒక‌టి. చివ‌రికి ఓటు విలువెంతో తెలుసుకొని... దాని ద్వారా ఊరి స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు మార్టిన్ లూథ‌ర్ కింగ్ నుంచి అస‌లైన హీరో బ‌య‌ట‌కు వ‌స్తాడు.

తొలుత అస‌లు క‌థ‌కూ, మార్టిన్ క‌థ‌కూ అస్స‌లు పొంత‌న లేన‌ట్టు క‌నిపించినా, చివ‌రికి... క‌థ‌కి `కింగ్‌` మేక‌ర్ ఈ పాత్రే అయ్యేలా చూసుకోవ‌డం ద‌ర్శ‌కుడి స్క్రీన్ ప్లే టెక్నిక్‌. ఈ పాత్ర‌లో వ‌చ్చే మార్పు.. క‌థ దిశ‌ని మార్చి క‌థ‌నాన్నిప‌రుగులు పెట్టిస్తుంది.

ప‌తాక స‌న్నివేశాలు హృద్యంగా సాగాయి. చివ‌రికి ఆ ఊరి ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన మార్పు... సానుకూల దృక్ప‌థాన్ని పెంపొందిస్తుంది. ప్ర‌తీ ఓట‌రూ ఇలా మారిపోతే, ప్ర‌తీ ఊరూ ఇలానే స్పందిస్తే ఎంత బాగుంటుందో అనే ఆలోచ‌న క‌లిగిస్తుంది.

సంపూర్ణేశ్ బాబు

ఫొటో సోర్స్, Facebook/Ynotstudios

నిజాయితీ ముఖ్యం

ఓటెంత విలువైన‌దో, దాన్ని ఎలా వాడుకోవాలో.. స్పీచులు దంచ‌లేదు. సినిమా చూస్తున్న‌ప్పుడు అంత‌ర్లీనంగా ఆ విష‌యాలు అర్థ‌మ‌వుతూనే ఉంటాయి.

సినిమాలో ఓ చోట‌.. బ్లాక్ బోర్డుపై `ఓటేయ‌డానికి కావ‌ల్సిన‌వి ఓట‌రు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, నిజాయితీ` అనే వాక్యం క‌నిపిస్తుంది. ప్ర‌తీ ఓట‌రూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్య‌మైన విష‌యం అదే అనిపిస్తుంది. నిజాయితీగా ఓటేసిన‌ప్పుడు క‌లిగిన ఆనందం ఎలా ఉంటుందో.. క్లైమాక్స్‌లో ఊరి వాళ్ల ముఖాలు చూస్తే అర్థ‌మ‌వుతుంది.

`అదేంటో..ఈ దేశానికి నేనే రాజైన ఫీలింగ్ వ‌చ్చేసింది` అంటాడు లూథ‌ర్ కింగ్. ఎలాంటి ప్ర‌లోభాలకూ లొంగ‌కుండా, త‌న ఓటు నిజాయితీగా వేస్తే... గెలిచిన వాడు కాదు, త‌న‌ని గెలిపించిన‌వాడే నిజ‌మైన రాజు. ఇదే విష‌యాన్ని అంత‌ర్లీనంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ఈ క‌థ‌లో!

ప్ర‌జాస్వామ్యంపై ర‌చ‌యిత‌ చాలాచోట్ల వ్యంగ్యాస్త్రాలు సంధించిన‌ట్టు అర్థం అవుతుంది. అంగార‌క గ్ర‌హంలో కూడా అభివృద్ది గురించి ఆలోచిస్తున్నాం కానీ, మ‌న దేశంలో చాలాచోట్ల అభివృద్ది అంద‌ని ద్రాక్ష రూపంలోనే ఉంద‌న్న విష‌యాన్ని ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో తీయ‌టి చుర‌క అంటించేలా చెప్పాడు ర‌చ‌యిత‌.

మార్టిన్ లూథర్ కింగ్ చిత్ర బృందం

ఫొటో సోర్స్, Facebook/Ynotstudios

ఏ పాత్రలో ఎవరెలా ఒదిగిపోయారు?

సంపూని ఇప్ప‌టి వ‌ర‌కూ కామెడీ పాత్ర‌ల్లోనే చూసిన‌వాళ్ల‌కు కింగ్ పాత్ర‌లో చాలా కొత్త‌గా క‌నిపిస్తాడు. చూస్తోంది సంపూని అన్న విష‌యం సినిమా మొద‌లైన పది నిమిషాల‌కే మ‌ర్చిపోతాం.

మేక‌ప్ లేని ముఖాలతో చాలా పాత్ర‌లు స్వ‌చ్చంగా, స‌హ‌జంగా క‌నిపించాయి. అందులో సంపూది కూడా ఒక‌టి. ఈ పాత్ర‌లో మూడు కోణాలున్నాయి. మూడు చోట్లా.. మూడు విధాలుగా క‌నిపించి మెప్పించాడు.

పోస్ట్‌మెన్ వ‌సంత పాత్ర‌నీ ద‌ర్శ‌కురాలు చాలా బ‌లంగానే రాసుకొన్నారు. ఆ పాత్రకంటూ ఓ వ్య‌క్తిత్వం ఉంది. ధైర్యం ఉంది.

లోకి, జ‌గ‌దీశ్ పాత్ర‌ల్లో కావ‌ల్సినంత వినోదం, సీరియ‌స్‌నెస్ క‌ల‌బోశారు. ఆ పాత్ర‌లే వినోదాన్ని పంచిపెట్టాయి. అవే పాత్ర‌లు విల‌నిజం చూపించాయి. బాటాగా న‌టించిన అబ్బాయి కూడా త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో వ‌న్నె తీసుకొచ్చాడు. ఊర్లోని మిగిలిన పాత్ర‌ల‌కు కొత్త వాళ్ల‌ని తీసుకోవ‌డం బాగా క‌లిసొచ్చింది.

ఇది ఓ ఊరి క‌థ‌. ఊరి వాతావ‌ర‌ణాన్ని కెమెరా, ఆర్ట్ విభాగాలు బాగా ఆవిష్క‌రించాయి. అయితే ప‌డ‌మ‌ర పాడుని చూస్తున్న‌ప్పుడు మ‌న‌దైన ఊరు అనిపించ‌దు. అదేదో త‌మిళ‌నాట కుగ్రామంలా అనిపిస్తుంది. ఈ విష‌యంలో దర్శకురాలు కాస్త జాగ్ర‌త్త తీసుకొంటే బాగుండేది.

పాట‌లు ఉన్నాయి కానీ, వాటిని బిట్లు బిట్లుగా వాడుకున్నారు. ఓ పాట‌లో శ్రీ‌శ్రీ మ‌హాప్ర‌స్థానం వినిపిస్తుంది. శ్రీ‌శ్రీ గొంతులో మ‌హాప్ర‌స్థానం వింటున్న‌ప్పుడు క‌లిగే ఉద్వేగం మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. క‌థ‌లో లీన‌మైపోతే.. శ్రీ‌శ్రీ గొంతుని, ఆ క‌వితాఝ‌రిని మ‌రింత‌గా ఆస్వాదించొచ్చు.

మాట‌ల్లో వ్యంగ్యం కావ‌ల్సినంత ఉంది. దర్శ‌కురాలు పూజా కొల్లూరుకి ఇదే తొలి చిత్రం. ఓ త‌మిళ కథ‌ని పూర్తిగా అర్థం చేసుకొని, మ‌న సెన్సిబులిటీస్‌కి ద‌గ్గ‌ర‌గా మార్చే ప్ర‌య‌త్నం చేశారామె.

ఇది ఎల‌క్ష‌న్ల సీజ‌న్‌. కాబ‌ట్టి.. ఈ సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశం మ‌న‌కు మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌వుతుంది. అయితే... ఓటేసేముందు నిజాయ‌తీ కూడా ఉండాలి అనే మాటని ఎంత మంది అర్థం చేసుకొని ఆచ‌ర‌ణ‌లో పెడితే.. ఈ సినిమా ల‌క్ష్యం అంత‌గా నెర‌వేరిన‌ట్టు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)