అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బోత్‌రాజ్
- హోదా, బీబీసీ కోసం
''నీ కాళ్ల చెప్పులు విసిరిపారేసెయ్. వీధుల్లోకి వచ్చి పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చెయ్. మనలాంటి పేదోళ్లకు ఆనందం చాలా అరుదు.'' అఫ్గాన్‌లో బాగా ప్రాచుర్యంలో ఉన్న కవిత ఇది.
అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయాలతో అందిస్తున్న అరుదైన ఆనందమిది. ప్రపంచ కప్ పోటీల్లో అఫ్గానిస్తాన్ జట్టు విజయాలతో దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
భౌగోళిక, రాజకీయ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యవస్థాగత లోపాలు, ఇతర అడ్డంకులను అధిగమిస్తూ, క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో పరిణతి చెందిన ఆటను ప్రదర్శిస్తూ ఈ జట్టు అత్యుత్తమంగా రాణిస్తోంది.
అంతర్జాతీయ వేదికపై ఈ స్థాయికి చేరుకోవడానికి అఫ్గానిస్తాన్ జట్టు చాలా ఏళ్లు శ్రమించింది. దేశాభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, వాటిలో బాగా విజయవంతమైంది క్రికెట్ జట్టు మాత్రమే. క్రికెట్ ఆ దేశ ముఖచిత్రాన్నే మార్చేసిందంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఆ జట్టు ప్రతి దశలోనూ గొప్ప ఆటతీరును ప్రదర్శిస్తూ దేశ ప్రజలకు సాంత్వన కలిగించడంతో పాటు స్ఫూర్తిని నింపింది. క్రికెట్‌పై అమితమైన ఆసక్తిని రేపడంతో పాటు మ్యాచ్‌లు చూసేందుకు జనం ఎగబడేలా చేసింది.
అఫ్గానిస్తాన్ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది?
అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్తాన్ జట్టు రాణించడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాత్ర కూడా కీలకం.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సహకారం లేకపోయి ఉంటే అఫ్గానిస్తాన్ క్రికెట్ ఈ స్థాయికి వచ్చేది కాదు. అయితే, ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టునే ఓడించి సంచలనం సృష్టించింది.
19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ క్రికెట్ క్రీడ ఉంది. పాకిస్తాన్‌లోని అఫ్గాన్ శరణార్థి శిబిరాల్లోనూ క్రికెట్‌పై మక్కువ కనిపించేది.
1995లో తొలిసారి అల్లాహ్ దాద్ నూరి కెప్టెన్‌గా జాతీయ జట్టు ఏర్పడింది. పాకిస్తాన్‌లో జరిగిన గ్రేడ్ 2 మ్యాచ్‌లలో అఫ్గానిస్తాన్ జట్టు ఆడింది.

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్ల నుంచి తప్పించుకున్న క్రికెట్
అఫ్గానిస్తాన్ ప్రజలు తమ సొంతదేశానికి తిరిగొచ్చిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సహకారంతో 1995లో అఫ్గానిస్తాన్ క్రికెట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది.
ఈ దేశంలో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఆటల మాదిరిగానే క్రికెట్‌పై కూడా నిషేధం విధించారు. అయితే, ఆ తర్వాత ఏమనుకున్నారో తెలియదు కానీ, ఆ ఒక్క క్రీడకు మినహాయింపు ఇచ్చారు.
తదనంతరం, 2001లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)లో అఫ్గానిస్తాన్ సభ్య దేశమైంది. 2003లో ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోనూ సభ్యదేశంగా మారింది. దాదాపు పదేళ్ల పాటు వివిధ దేశాల్లో క్రికెట్ ఆడిన తర్వాత ఐసీసీలో శాశ్వత సభ్యత్వం పొందింది.
2001 నుంచి 2007 వరకు అఫ్గానిస్తాన్ క్రికెట్‌ను, జట్టును పాకిస్తాన్ జట్టు ఆదరించింది. వారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడింది. ఆ దేశ క్రికెట్ జట్టు ఎదుగుదలకు పాకిస్తాన్ దోహదపడిందన్న విషయం మర్చిపోలేనిది.
2004లో బహ్రెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో అఫ్గాన్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2007లో నవ్రోజ్ మంగల్ కెప్టెన్సీలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ టీ20 చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఈ కప్ విజయంతో దేశంలో క్రికెట్‌పై క్రేజ్ పెరిగింది.
దానితో పాటు, ఐసీసీ ప్రపంచ క్రికెట్ లీగ్ డివిజన్ 5, డివిజన్ 4, డివిజన్ 3 పోటీల్లో విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్
ఈ విజయాల తర్వాత 2011 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో అఫ్గాన్‌కు అవకాశం లభించింది. అయితే, అందులో జట్టు విఫలమైనప్పటికీ తొలిసారిగా 4 ఏళ్ల పాటు వన్డేలు ఆడే అర్హత లభించింది. అఫ్గాన్ క్రికెట్‌లో ఇదో పెద్ద మైలురాయి.
ఆ తర్వాత స్కాట్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లతో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ జట్టు తమను తాము మెరుగుపరుచుకుంది. అప్పటికి పశ్చిమ దేశాల్లో ఉన్న మౌలిక సదుపాయాల్లో సగం కూడా అఫ్గాన్ క్రికెట్ ఆటగాళ్లకు లేవు. తమకున్న పరిమిత సౌకర్యాలనే సమర్థంగా వినియోగించుకుంటూ క్రికెట్ జట్టును తీర్చిదిద్దుకున్నారు.
2010లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఆడిన ఆ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు రూట్ క్లియర్ చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ పోటీల్లో జట్టుకు ప్రపంచంలోని మేటి జట్లతో క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. అయితే, భారత్, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలవడంతో తొలిరౌండ్‌లోనే పోటీల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న అఫ్గానిస్తాన్ జట్టు దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఇంటర్నేషనల్ టీ20 పోటీల్లో స్కాట్లండ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.
2012లో తొలిసారి నవ్రోజ్ మంగల్ కెప్టెన్సీలోని పాకిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. షార్జాలో ఫిబ్రవరి 10న ఈ మ్యాచ్ జరిగింది.
ఆ తర్వాతి ఏడాది ఐసీసీ నుంచి గుర్తింపు పొందిన జట్టు నుంచి అసోసియేట్ మెంబర్‌గా గుర్తింపు పొందింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ కప్ పోటీల్లో..
2011 ప్రపంచ కప్ పోటీల్లో అర్హత సాధించలేకపోయిన అఫ్గాన్, ఆ తర్వాతి 2015 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో పాల్గొంది. ఫైనల్ మ్యాచ్‌లో కెన్యాను 7 వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించింది.
ఆ ప్రపంచ కప్‌లో అపజయాలు వెక్కిరించినా స్కాట్లండ్‌పై విజయం గుర్తుండిపోయింది. ఈ విజయంతో అఫ్గాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.
ఆ తర్వాత జరిగిన 2019 ప్రపంచ కప్ పోటీల్లోనూ అఫ్గాన్ జట్టు పాల్గొంది. అయితే, రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ ఆ దేశం ఓడిపోయింది.
అయితే, ఇప్పుడు 2023 ప్రపంచ కప్ పోటీల్లో జట్టు కొత్త లోగోతో బరిలోకి దిగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అఫ్గాన్ జట్టు మెరుగ్గా రాణిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ప్రపంచ కప్ మాజీ చాంపియన్లు అయిన శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించింది.
పాకిస్తాన్, శ్రీలంకపై సాధించిన చేజింగ్ విజయాలు వారి బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపిస్తున్నాయి.

హమీద్ కర్జాయ్ చొరవ..
తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోక ముందు దేశాధ్యక్షుడిగా ఉన్న హమీద్ కర్జాయ్ అఫ్గాన్ క్రికెట్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చేందుకు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు చొరవ చూపారు.
క్రికెట్ బోర్డును సంస్కరించేందుకు, దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు 2009 జూన్ 2న ఒక ఉత్తర్వు జారీ చేశారు. దాని ద్వారా ఐసీసీ, ఐసీసీ నుంచి అఫ్గాన్ క్రికెట్‌కు ఆర్థిక సాయం లభించింది.
మెరుగైన క్రికెట్ జట్టుగా అవతరించేందుకు అనేక అడ్డంకులను, సామాజిక సమస్యలను ఆ జట్టు అధిగమించింది.
అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఉన్న జట్టు గెలవడం సహజమే. కానీ, తీవ్రమైన రాజకీయ అస్థిరత, పేదరికంతో అల్లాడుతున్న దేశం నుంచి వచ్చిన జట్టు ఇంత అభివృద్ధి సాధించడం విశేషం.
ప్రస్తుత టీమ్‌లో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజిబుర్ రెహమాన్, రహమత్ షా, జద్రాన్, బారుకీ, రహమతుల్లా గుర్బాజ్ వంటి ఆటగాళ్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. వారికి ముందు కులుద్దీన్ నైబ్, మహ్మద్ షెజాద్, మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్, హమీద్ హసన్ వంటి ఆటగాళ్లు అఫ్గాన్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో కృషి చేశారు.
ఐసీసీ టీ20 బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, ఫరూకీ టాప్ 10లో ఉన్నారు.
ఆల్ రౌండర్ విభాగంలో మహ్మద్ నబీ, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10 బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ చోటు దక్కించుకున్నారు. బౌలింగ్‌లో అత్యుత్తమంగా రాణిస్తూ ప్రపంచంలోని మేటి జట్లను సైతం సవాల్ చేయడం ద్వారానే అఫ్గాన్ జట్టు ఇంత గుర్తింపు, ఇన్ని విజయాలు అందుకోగలిగింది.
ఇవి కూడా చదవండి:
- రూపాయిని వెనక్కి నెట్టిన అఫ్గానీ.. పేదరికం, ఆకలితో బాధపడుతున్న దేశంలో ఇదెలా సాధ్యం?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు మహిళల్ని 5 రకాలుగా ఎలా అణిచివేస్తున్నారంటే...
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- బ్యూటీ పార్లర్లపై నిషేధం: అవి మా అందాన్నేకాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి, కానీ ఇప్పుడు....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














