చంద్రబాబుకు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్.. ఆ 5 షరతులు ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో అరెస్టయిన ఆయన, 52 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు అక్టోబరు 30న విచారణ ముగించి, తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెలువరిస్తూ, చంద్రబాబుకు నాలుగు వారాలపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు చెప్పింది.
ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ టి.మల్లికార్జునరావు ధర్మాసనం తెలిపింది. ఐదు షరతులతో ఈ బెయిల్ ఇచ్చింది.
ఈ బెయిలుతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట దక్కినట్లయింది. అయితే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్‌నెట్ కేసులతోపాటు తాజాగా నమోదైన మద్యం కేసులు కూడా ఆయన్ను వెంటాడే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, APHIGHCOURT
మధ్యంతర బెయిలు: ఆ ఐదు షరతులు ఇవే
చంద్రబాబుకు హైకోర్టు పెట్టిన ఐదు షరతులు వివరాలు:
- రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలి. ఇద్దరు వ్యక్తులతో ష్యూరిటీ ఇప్పించాలి.
- కోరుకున్న ఆసుపత్రిలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాలి.
- జైలులో సరెండర్ అయ్యే ముందు పిటిషనర్ తాను చేయించుకున్న చికిత్స వివరాలు, ఆసుపత్రి వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్ కవర్‌లో సమర్పించాలి. జైలు సూపరింటెండెంట్ వాటిని యథాతథంగా ట్రయల్ కోర్టుకు అందించాలి.
- ఈ కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించడం లేదా మభ్యపెట్టడం వంటి చర్యలకు పిటిషనర్ దిగరాదు.
- పిటిషనర్ 28-11-2023న సాయంత్రం 5 గంటలకు స్వయంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలి.
చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలను ఎస్కార్ట్‌గా ఉంచాలన్న ప్రభుత్య అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
జెడ్+ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని న్యాయమూర్తి చెప్పారు.
వైద్య సహాయం పొందేందుకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని, రెగ్యులర్ బెయిల్ కోసం నవంబరు 10న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
మంగళవారం (అక్టోబరు 31) బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకుని ఆయన తరఫు న్యాయవాదులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అందించాక ఆయన విడుదల కానున్నారు.
చంద్రబాబు జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా విజయవాడ చేరుకుంటారని టీడీపీ కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత ఆయన తిరుమల వెళ్తారని, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్లి, చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరుతారని చెప్పింది.
చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టపాసులు కాల్చి ఆనందం పంచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, TDP
న్యాయం గెలిచింది: అచ్చెన్నాయుడు
చంద్రబాబుకు మధ్యంతర బెయిలుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ- ‘‘ఆధారాలు లేకుండా 52 రోజులు బంధించారు. ఎట్టకేలకు న్యాయం గెలిచింది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో చంద్రబాబు పోరాడారు. ఈ కేసులో న్యాయం మా పక్షాన ఉంది’’ అన్నారు.
ఈ అంశంపై ఏపీ సాగునీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ- ‘‘నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు కి బెయిల్ రాలేదు. చంద్రబాబుకు కంటి సమస్యల కారణంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు ఇంకా రెగ్యులర్ బెయిల్ రాలేదు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, hc.ap.nic.in
చంద్రబాబుపై కేసు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఏపీఎస్‌ఎస్‌డీసీను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది నడుస్తుందని తెలిపారు. యువతకు అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశం.
ఇందుకు కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అందులో సీమెన్స్, డిజైన్ టెక్ సిస్టమ్స్ వంటి సంస్థలున్నాయి.
దిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేసే సీమెన్స్ ఇండస్ట్రీయల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో చేసుకున్న ఎంవోయూ ప్రకారం ఏపీలో ఆరు ప్రాంతాల్లో స్కిల్ ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ యువతకు నైపుణ్యం పెంచే దిశలో శిక్షణ అందిస్తారు.
ఇందుకు అయ్యే ఖర్చులో 10 శాతం ప్రభుత్వం పెట్టుకుంటుందని, మిగతా 90 శాతం సీమెన్స్ గ్రాంటుగా ఇస్తుందని నాడు ప్రభుత్వం తెలిపింది.
ఆ తరువాత ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజ్, ఆదిత్యా ఇంజినీరింగ్ కాలేజ్ సహా పలు ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుని ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
2017 నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి సీమెన్స్ సంస్థ పనిచేస్తోంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం సీమెన్స్ సాంకేతిక సహకారం అందించాల్సి ఉంది. కానీ ఆ సంస్థ అందించలేదనేది ఆరోపణ. రికార్డుల్లో మాత్రం టెక్ సహాయం అందించినట్టు రాశారని సీఐడీ రిపోర్టులో పేర్కొంది.
సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో రూ.3,356 కోట్లకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో టెక్ కంపెనీలు 90 శాతం మేర వాటాను భరించాలన్నది ఒప్పందం. కానీ అది ముందుకు సాగలేదు.
మొత్తం ఆరు క్లస్టర్లని ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్ కు రూ. 560 కోట్ల రూపాయల వెచ్చించాల్సి ఉంది. అందుకు గానూ ఏపీ ప్రభుత్వం తన వాటాగా 10 శాతం అంటే సుమారు రూ. 371 కోట్లని చెల్లిస్తుందని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రకటించారు.
దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వ వాటా చెల్లించారు. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ తొలుత 2021 డిసెంబర్ 10న సీఐడీ కేసు నమోదు చేసింది.
సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా రూ. 3,300 కోట్లకు పెంచారంటూ సీమెన్స్ సంస్థ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ సహా పలువురిపై సీఐడీ ఆరోపణలు చేసింది.
ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 371 కోట్లను చెల్లించినప్పటికీ సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సాఫ్ట్‌వేర్ విలువ కేవలం రూ.58 కోట్లుగా సీఐడీ పేర్కొంది.
ఈ ఒప్పందంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తరుపున కీలకంగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా 26 మందిపై కేసు నమోదయ్యింది. వీరిలో 10 మంది వరకూ అరెస్ట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








