వరల్డ్ కప్ 2023: రాహుల్ ద్రావిడ్ తనకు చేదు అనుభవాన్ని మిగిల్చినవాళ్ళకు ఈసారి గట్టిగా బదులిస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
ఒక ఆటగాడిగా అద్భుతంగా రాణించిన రాహుల్ ద్రావిడ్, కెప్టెన్‌గా చేదు అనుభవాలు చూశారు. ముఖ్యంగా 2007 ప్రపంచకప్‌లో భారతజట్టు పేలవ ప్రదర్శన ఆయన కెప్టెన్సీపై నీలినీడలు కమ్మేలా చేసింది.
అప్పటి చేదు అనుభవాలను రాహుల్ ఎలా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇండియన్ టీమ్ హెడ్ కోచ్‌గా ఆయన ఏమి ఆలోచిస్తున్నారు?
2007లో వెస్టిండీస్‌లో జరిగే ప్రపంచకప్ కోసం ఎంపికైన భారతజట్టు ‘‘డ్రీమ్ 11‘‘కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది.
కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, అనిల్‌కుంబ్లే, వీరేంద్రసెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అజిత్ అగార్కర్ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
అప్పట్లో జట్టు కోచ్‌గా గ్రెగ్ చాపెల్ వ్యవహరించారు. భారతజట్టు కోచ్‌గా ఈయన హయాం అంతా వివాదాస్పదంగానే గడిచింది.
ఈ టోర్నమెంట్‌ను బీబీసీ కరస్పాండెంట్ పంకజ్ ప్రియదర్శి కవర్ చేశారు.
‘‘భారత జట్టు సీనియర్ పాతకాపులతో నిండి ఉన్నప్పటికీ జట్టులో ఐక్యత కొరవడినట్టు స్పష్టంగా కనిపించేది. ఫీల్డింగ్ పొజిషన్ల నుంచి బ్యాటింగ్ ఆర్డర్ వరకు అన్నివిషయాలలో కొంతమంది పెద్ద ఆటగాళ్ళ మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్న విషయం డ్రెస్సింగ్ రూమ్ బయటే కనిపిస్తుండేది. ఈ విషయాన్ని చాలామంది ఆటగాళ్ళు తమ పుస్తకాలలో రాశారు. అయితే ఒక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్‌కు వీటిని నియంత్రించడం కష్టంగానే ఉండేది’’ అంటూ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
మహామహులున్న ఈ జట్టు ఆ టోర్నమెంట్‌లో కనీసం నాకౌట్ దశకు కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది.
దీని కారణంగా రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీకి కూడా ముప్పు వచ్చిపడింది. ఓ నెల తరువాత యువ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో యువ ఆటగాళ్ళతో నిండిన భారత టీమ్ దక్షిణ ఆఫ్రికాలో 2007లో జరిగిన టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది.
భారత్‌లో జరిగిన 2011 వరల్డ్‌కప్‌లోనూ ఇదే వరుస కొనసాగి, భారత్ విశ్వవిజేత అయింది.
కానీ, రాహుల్ ద్రావిడ్ ఈ జట్టులో సభ్యుడు కాలేకపోయాడు. పైగా అదే ఏడాది ఆయన తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు.
ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ భారత జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్నారు. గడిచిన రెండేళ్ళుగా జట్టుపై ఆయనకు పూర్తి నియంత్రణ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
దృష్టి అంతా జట్టు ప్రదర్శనపైనే...
2007లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై ఓటమి గురించి కొద్దిరోజుల కిందట ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో గుర్తుచేయగా,
‘‘అదేప్పుడో నేను ఆటగాడిగా ఉన్నప్పటి సంగతి. నిజమేమిటంటే నేను అసలు ఆ మ్యాచ్‌లు ఆడిన విషయమే మరిచిపోయాను. నేనా విషయాన్ని అక్కడే వదిలేశాను. ఇప్పుడు నా దృష్టి అంతా జట్టుపైనే’’ అని నవ్వుతూ రాహుల్ బదులిచ్చారు.
‘‘ద్రావిడ్ లాంటి గొప్ప ఆటగాడికి 2007 నాటి ఫలితాలు పీడకలలాంటివి’’ అని ద్రవిడ్ సమయంలోనే క్రికెట్ ఆడిన శ్రీలంక బ్యాట్స్ మెన్ సనత్ జయసూర్య అన్నారు.
‘‘టెస్ట్ క్రికెట్‌లో క్రీజులో గంటలతరబడి పాతుకుపోయి, అత్యధిక బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చరిత్రలో అటువంటి ఆటగాళ్ళు చాలా అరుదు. ప్రస్తుతం ఒక కోచ్‌గా రాహుల్ విజన్ ఏమిటనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇండియా ప్రపంచకప్ గెలిస్తే రాహుల్ కన్నా సంతోషపడేవారు ఇంకెవరూ ఉండరేమో’’ అని చెప్పారు జయసూర్య.

ఫొటో సోర్స్, Getty Images
సాధన చేయమురా నరుడా...
ఈరోజుకీ ఒక కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నెట్ ప్రాక్టీస్ ను చాలా సీరియస్ గా పరిగణిస్తారు. ఒక ఆటగాడిగా గంటలతరబడి నెట్స్‌లో తానెంతగా సాధన చేశారో అలాగే ఇప్పుడు చేయిస్తున్నారు.
నెట్ ప్రాక్టీస్ దగ్గరకు చేరుకోగానే రాహుల్ ముందుగా ప్రతి ఒక్క ఆటగాడి ప్రాక్టీస్‌ను పరిశీలిస్తారు. వారికి సలహాలిస్తారు. ప్రతి పనిలోనూ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ సారస్ మాంబేను కూడా మమేకమయ్యేలా చేస్తారు.
ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఆటగాళ్ళతో చేయిస్తున్న శ్రమ ఇప్పటిరోజులలో కొన్ని జట్లలో మాత్రమే చూడగలం.
బుధవారం సాయంత్రం భారతజట్టు సాధన కోసం ముంబాయిలోని వాంఖడే స్టేడియానికి చేరుకుంది. ద్రవిడ్ ముందుగా పిచ్‌ను పరిశీలించారు. మంగళవారం నాడు కూడా శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ సాధన చేస్తున్న సమయంలో ద్రవిడ్ అక్కడే గ్రౌండ్ స్టాఫ్‌తో మాట్లాడుతూ కనిపించారు.
వాంఖడే స్టేడియం పిచ్ ఎర్రమట్టితో తయారుచేసింది. దీనివల్ల బంతి కొద్దిగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ ద్రవిడ్ ముందుగా బ్యాట్స్‌మెన్లను ఫాస్ట్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేయించారు. దీంతో సిరాజ్ విరాట్ కోహ్లీ, గిల్‌కు చాలాసేపు బౌన్సీ బంతులు సంధిస్తూ కనిపించాడు.
మొన్న శనివారం నాడు లఖ్‌నవూ ఎక్నా స్టేడియంలో టీమ్ ఇండియా సాధన చేస్తున్నప్పుడు రాహుల్ ద్రవిడ్ అనేకసార్లు స్టేడియంలో పిచ్‌ను పరిశీలించారు. ఆ మట్టిని చేతితో తాకుతూ, బంతిని నేలపై కొడుతూ పిచ్ స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం కష్టమని రాహుల్ భావించినట్టుగానే ఆరోజు జరిగింది. ఇక్కడ జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఇండియా ఇంగ్లండ్‌ను ఓడించింది.
ఏం చేయాలో రాహుల్‌కు తెలుసు

ఫొటో సోర్స్, Getty Images
2022 నవంబరులో టీ – 20 మ్యాచ్ ఆడాకా ఆస్ట్రేలియాలో టీమిండియా జట్టు క్వాంటాస్ ఎయిర్‌వేస్‌లో ఆ దేశ పశ్చిమభాగంలో ఉండే అడిలైడ్‌కు బయల్దేరింది. విమానమంతా నిండిపోయి ఉంది.
ఈ విమానంలో భారతజట్టు ఉంది. అంతకుముందు రోజు వారు దక్షిణ ఆప్రికా చేతిలో ఓటమిపాలయ్యారు. ఆటగాళ్ళందరూ నిరాశలో ఉండి కొంత విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా కనిపించారు. అడిలైడ్‌కు ప్రయాణం నాలుగు గంటలు పడుతుంది.
కానీ రాహుల్ ద్రవిడ్ మాత్రం ఎకానమీ సెక్షన్‌లో ఓ మూల సీట్లో కూర్చుని తన లాప్‌టాప్‌లో భారత జట్టు ఆడబోయే తదుపరి మ్యాచ్ గురించిన ప్లాన్ వేస్తున్నారు.
ఈ టూర్‌లో కోచ్ విమానప్రయాణాలకు సంబంధించి ఒక నిబంధన విధించారు.
ఆస్ట్రేలియా దేశీయ విమానాలలో బిజినెస్ క్లాస్ సీట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి, ఈ సీట్లను బౌలర్లకు కేటాయించాలని నిర్ణయించారు.
రాహుల్ తోపాటు క్రికెట్ ఆడిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఈ ప్రపంచకప్‌కు ముందు బీబీసీతో మాట్లాడుతూ ‘‘రాహుల్ ఇప్పుడు సెట్ అయ్యారు’’ అని చెప్పారు.
‘‘ద్రావిడ్ లా కష్టపడే ఆటగాళ్ళను నేను చూశాను. కానీ, అతను ముందుగా జూనియర్ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. ఇప్పుడు సగం మందికిపై గా స్టార్ క్రికెటర్లు ఉన్న జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఇది నిజంగా పెద్ద సవాలే’’ అని సమీ అన్నారు.
నిజంగానే ఇప్పుడు రాహుల్ దృష్టి అంతా భారత్ జట్టు ప్రపంచకప్‌ను తన చేతుల్లోకి తీసుకునేలా చేయడంపైనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- నారాయణ మూర్తి: వారానికి 70 పని గంటలపై భారత్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?
- గర్భవతిని కాకుండానే నా బిడ్డకు ఎలా పాలిచ్చానంటే...
- పారాసైట్ ఫీటస్: రక్తం తాగుతూ 10 నెలల పాప కడుపులో ఎదగని పిండం, ఎలా తెలిసిందంటే....
- భారత్‌లో గత ఏడాది 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు... ప్రపంచంలో ఒకే ఒక శాతం వాహనాలున్న దేశంలో ఇన్ని ప్రమాదాలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














