నారాయణ మూర్తి: వారానికి 70 పని గంటలపై భారత్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఒక వ్యక్తి వారానికి ఎన్ని గంటలు పని చేయాలి?
గత కొన్ని రోజులుగా భారత్‌లో వినిపిస్తోన్న ప్రశ్న ఇది.
దేశాభివృద్ధికి యువత వారానికి 70 గంటల పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలంటూ సాఫ్ట్‌వేర్ బిలియనీర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించిన తర్వాత పని గంటలపై భారత్‌లో పెద్ద చర్చ జరుగుతోంది.
‘‘భారత్‌లో ఉత్పాదకత ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ’’ అని ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో నారాయణ మూర్తి అన్నారు.
పని ఉత్పాదకతను మనం మెరుగుపర్చుకోకపోతే, అద్భుత ప్రగతి సాధించిన దేశాలతో మనం పోటీపడలేమని నారాయణ మూర్తి అన్నారు.
‘‘అందుకే నేను మన దేశ యువతను విజ్ఞప్తి చేస్తున్నా. ‘ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటల పాటు పని చేసేందుకు నేను సిద్ధం’ అంటూ యువత ముందుకు రావాలి’’ అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో ‘‘విషపూరిత పని సంస్కృతి, ఉద్యోగుల నుంచి యాజమాన్యాలు ఏమి ఆశిస్తాయి’’ అనే అంశాలపై జోరుగా చర్చ జరిగింది. ఈ వ్యాఖ్యల తర్వాత నారాయణ మూర్తికి మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు స్పందించారు.
నారాయణ మూర్తి సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర భారతీయ సాంకేతిక కంపెనీల్లో ఇంజనీర్లకు ప్రారంభ వేతనాలు తక్కువగా ఉండటాన్ని నొక్కి చెబుతూ కొందరు విమర్శలు చేశారు.
విరామం లేకుండా పని చేయడం వల్ల తలెత్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను మరికొందరు ఎత్తి చూపారు.
‘‘కుటుంబంతో గడిపేందుకు సమయం లేదు. వ్యాయామం చేసేందుకు, ఉల్లాసంగా గడిపేందుకు, సంఘంలో కలిసి జీవించేందుకు సమయం లేదు. పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఈమెయిళ్లకు, ఫోన్ కాల్స్‌కు స్పందించాలని కంపెనీలు ఆశిస్తాయి. తర్వాత యువత ఎందుకు గుండెపోటు బారిన పడుతుందంటూ ఆశ్చర్యపోతారు?’’ అని బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి, ట్విటర్‌లో ప్రశ్నించారు.
కొందరు మహిళలు ఇంట్లో, ఆఫీసులో కలిపి మొత్తం వారానికి 70 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తున్నారని కొందరు అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) చెప్పినదాని ప్రకారం, భారతీయులు ఇప్పటికే ఎక్కువ గంటలు పని చేస్తున్నారు.
ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం, కరోనా మహమ్మారికి ముందు భారతీయులు ప్రతీ ఏడాది సగటున 2 వేల గంటలకు పైగా పనిచేశారు. అమెరికా, బ్రెజిల్, జర్మనీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
‘‘ఉత్పాదకతను పెంచడం అంటే ఎక్కువ గంటలు పనిచేయడం మాత్రమే కాదు. చేసే పనిలో మెరుగుపడటం, నైపుణ్యాలను పెంచుకోవడం, సానుకూల పని వాతావరణాన్ని కలిగి ఉండటం, పనికి తగిన వేతనం పొందడం’’ అని ట్విటర్‌లో భారత పారిశ్రామిక వేత్త, సినిమా నిర్మాత రోనీ స్క్రూవాలా రాశారు.
ఎక్కువ గంటలు పని చేయడం కంటే నాణ్యంగా పని పూర్తి చేయడం ముఖ్యమని ఆయన రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఈ అంశం చాలా సున్నితమైనది. ఇక్కడ బలమైన కార్మిక చట్టాలు ఉన్నాయి. కానీ, వాటిని కఠినంగా అమలు చేయడానికి అధికారులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు.
ఫ్యాక్టరీల్లో పని సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడానికి అనుమతించే బిల్లును తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రతిపక్ష నాయకులు ఈ ఏడాది ఆరంభంలో నిరసనలు చేయడంతో తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
2020లో కూడా నారాయణ మూర్తి విమర్శల పాలయ్యారు.
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక మందగమనాన్ని భర్తీ చేయడానికి భారతీయులు రెండుమూడేళ్ల పాటు వారానికి కనీసం 64 గంటల పాటు పనిచేయాలని నారాయణ మూర్తి సూచించారు. దీనికి ఆయన విమర్శల్ని ఎదుర్కొన్నారు.
కెరీర్ ప్రారంభంలో యువత రోజుకి 18 గంటల పాటు పనిచేయాలని సూచించిన మరో భారత సీఈవో మీద కూడా విమర్శలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, కొందరు భారతీయ వ్యాపారవేత్తలు నారాయణ మూర్తి సలహాతో ఏకీభవిస్తున్నారు.
నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను మరింత సమగ్రంగా తీసుకోవాలని ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర సీఈవో సీపీ గుర్నానీ అన్నారు.
‘‘పని గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కంపెనీలకు మాత్రమే పరిమితం కాదని నేను అనుకుంటున్నా. అందులో మీరు, మీ దేశం కూడా ఉంది. కంపెనీ కోసమే 70 గంటలు పనిచేయాలని ఆయన చెప్పలేదు. మీరు పనిచేసే కంపెనీ కోసం 40 గంటలు, మీ కోసం మరో 30 గంటలు పనిచేయండి. ఒక సబ్జెక్టులో మాస్టర్‌గా మారేందుకు 10 వేల గంటలు పెట్టుబడి పెట్టండి. మీ రంగంలో నిష్ణాతులుగా మారేందుకు రాత్రిపూట కూడా పని చేయండి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశానిది అయిదు రోజుల పని సంస్కృతి కాదు’’ అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు.
భారత్‌లో ఎక్కువ పని గంటల గురించి చర్చ జరుగుతుండగా, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం వారానికి నాలుగు రోజుల పని విధానం గురించి ప్రయోగాలు చేస్తున్నాయి.
బెల్జియం 2022లో కార్మికులకు జీతాల్లో కోత విధించకుండా వారానికి నాలుగు రోజుల పాటు పని చేసే హక్కును కల్పించడానికి చట్టాల్లో మార్పులు చేసింది.
మరింత డైనమిక్, ఉత్పాదక ఆర్థిక వ్యవస్థను సృష్టించే ఉద్దేశంతోనే ఈ చర్యను తీసుకున్నట్లు బెల్జియం ప్రధానమంత్రి చెప్పారు.
వారంలో తక్కువ రోజులు పని విధానంపై ప్రచారం చేస్తోన్న ‘4 డే వీక్ గ్లోబల్’ సంస్థ చేపట్టిన ఆరు నెలల ట్రయల్ స్కీమ్‌లో యూకేలోని పలు కంపెనీలు గతేడాది పాల్గొన్నాయి.
ఈ ట్రయల్ ముగింపు నాటికి ఈ పథకంలో పాల్గొన్న 61 కంపెనీల్లో 56 కంపెనీలు తాము ప్రస్తుతానికి వారానికి నాలుగు రోజుల పనివిధానంలో కొనసాగుతామని చెప్పాయి. వాటిలో 18 కంపెనీలు మాత్రం 4 రోజుల పని విధానాన్నిశాశ్వతంగా అనుసరిస్తామని చెప్పాయి.
యూకేలో ఈ పథకం ప్రభావాలను అంచనా వేసే ఒక నివేదిక, ఈ పథకం ముఖ్యంగా ఉద్యోగుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పింది.
మూడు రోజుల వారాంతం త్వరలో కామన్‌గా మారుతుందని నివేదికను రాసిన రచయితలు అభిప్రాయపడ్డారు.
పోర్చుగల్‌లో కూడా ఇప్పుడు ఇలాంటి ప్రయోగమే జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష.. అసలేం జరిగింది?
- పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఎందుకు మారలేదు? 4 ప్రధాన కారణాలు ఇవే...
- ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధానికి దిగుతుందా?
- ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ ఏనాటిది, ఎలా మొదలైంది? 9 పదాల్లో సంక్లిష్ట చరిత్ర
- గాజా ప్రజలను కాపాడండి: ఐక్యరాజ్య సమితిలో కన్నీరు పెట్టుకున్న పాలస్తీనా ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














