గాజా: 'ఇది నా ఏడాదిన్నర బిడ్డ రోసా పైజామా... ఈ బాంబుదాడిలో చనిపోయింది'

ఇజ్రాయెల్ గాజా యుద్ధం
ఫొటో క్యాప్షన్, ఖలీల్ ఖాదర్ తన కుటుంబంలోని 11మందిని కోల్పోయారు
    • రచయిత, ఫెర్గల్ కినే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శిథిలాల మీదుగా నడుస్తున్న ఆయన తాను చూసిన వాటి విషయంలో ఎటువంటి పొరపాటు పడలేదు.

బూడిదరంగు శిథిలాల మధ్యన మెరుస్తున్నట్టుగా ఉన్న గుడ్డముక్కను చేతుల్లోకి తీసుకున్నారు ఖలీల్ ఖాదర్. ఆ దుమ్ముపట్టిన, చిరిగిన పైజామాను చేతుల్లోకి తీసుకోగానే ఆయన దుఃఖంలో కూరుకుపోయారు.

ఆ పైజామా ఆయన కుటుంబంలో ఆఖరి చిన్నారి 18 నెలల రోసాది. ఖలీల్ తన ఫోన్‌లోని వీడియోను చూపించారు. అందులో రోసా తన ఇద్దరు సోదరుల చేతిలో పట్టుకుని కేరింతలు కొడుతోంది. వారు ముగ్గురు రౌండ్‌గా తిరుగుతూ చిందులేస్తున్నారు.

ఆ వీడియోను స్లోమోషన్‌లో చిత్రీకరించారు ఖలీల్. అందుకే ఆ పిల్లలు గాలిలో తేలుతున్నట్టుగా కనిపించారు. వారంతా నవ్వుతున్నారు. అది వారు ఆడుకునే సమయం. యుద్ధం అప్పటికింకా వారి జీవితాలను మింగేయలేదు.

ఖలీల్ వయసు 36 ఏళ్ళు. ఆయన చాలా తక్కువగా మాట్లాడే మనిషి. రఫాలోని అల్-నజ్జర్ హాస్పిటల్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నలుగురు పిల్లలు. 9 ఏళ్ళ ఇబ్రహీం, ఐదేళ్ళ అమల్, రెండున్నరేళ్ళ కినన్‌తోపాటు చివరగా పుట్టిన అమ్మాయి రోసా ఆ నలుగురు.

ఖలీల్ శిథిలాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఇల్లు హాస్పిటల్‌కు నడిచి వెళ్ళేంత దూరంలోనే ఉంది. ఇప్పుడక్కడ ఇంటిసామాగ్రి, పిల్లల బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

అక్టోబరు 20వ తేదీ రాత్రి మిస్సైల్ దాడి జరిగినప్పుడు ఖలీల్ హాస్పటిల్‌లో డ్యూటీలో ఉన్నారు.

‘‘ఇది భారీ బాంబు పేలుడు’’ అని ఖలీల్ సంఘటానాస్థలికి వెళ్ళిన నా బీబీసీ సహచరులలో ఒకరికి చెప్పారు.

‘‘నా ఇరుగు పొరుగువారు హాస్పిటల్‌కు వస్తున్నారు. ‘బాంబు ఎక్కడ పడింది’ అని వారిని అడిగాను. ‘మా ఇంటి పరిసరాల్లోనే పడిందని’ వారు చెప్పడంతో నా కుటుంబానికి ఏమైందో తెలుసుకోవడానికి పరుగుపెట్టాను. ఇంటికి ఫోన్ చేశాను. కానీ ఎవరూ ఫోన్ తీయలేదు. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇల్లంతా పేలిపోయింది’’ అని ఆయన చెప్పారు.

ఖలీల్ కుటుంబంలోని 11 మంది చనిపోయారు.

వారిలో ఖలీల్ నలుగురు పిల్లలు, ఆయన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు, 70 ఏళ్ళ ఆయన తండ్రి, ఆయన సోదరుడు, వదినతోపాటు వారి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి శవాలను హాస్పిటల్ ప్రాంగణంలో తెల్లటి వస్త్రాలతో చుట్టి పెట్టారు.

ఖలీల్ భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె కాలిన గాయాలతోపాటు ఇల్లు కూలిపోయినప్పుడు తగిలిన దెబ్బలకు చికిత్స అందిస్తున్నారు.

ఇజ్రాయెల్ గాజా

ఫొటో సోర్స్, COURTESY OF KHALIL KHADER

ఫొటో క్యాప్షన్, తన పిల్లలతో ఖలీల్ ఖాదర్
వీడియో క్యాప్షన్, గాజా అంతటా హమాస్‌ స్థావరాలపై దాడులు చేస్తున్నామన్న ఇజ్రాయెల్...

యుద్ధం అంటే తెలుసు...

ఖలీల్‌కు గాజాలో ఇంతకుముందు యుద్ధాల గురించి తెలుసు. 365 కిలోమీటర్ల మేర వ్యాపించిన ఈ చిన్నపట్టణంలో దశాబ్దాల తరబడి అంతులేని సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. సంఘర్షణే వారసత్వమైన చోట తన కుటుంబాన్ని సాకడం గురించి ఖలీల్ బెంగపడుతుండేవారు.

‘‘2014 యుద్ధ సమయంలో నా భార్య గర్భవతి.’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా పొరుగింటిపై బాంబుపడింది. నా భార్యకు ఏడోనెల. పేలుడు కారణంగా ఆమె మెట్లపైనుంచి పడిపోయినంత పనైంది. ఇలాంటి జీవితంలోకి నా పిల్లలను ఎలా తీసుకురావాలా అని ఆలోచించేవాడిని’’ అని ఖలీల్ అన్నారు.

కానీ మెరుగైన జీవితం తప్పక దొరుకుతుందని ఖలీల్ భరోసా పెట్టుకన్నాడు.

‘‘ నా పిల్లలందరికీ సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక్కో కలగన్నాను. ఇబ్రహీం స్కూల్లో ఫస్ట్ వస్తుండేవాడు. వాడిని ఏదో ఒకరోజు డాక్టర్‌గా చూడాలనుకున్నాను. అమల్ చాలా క్రియేటివ్. తనకు పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టం. తను గీసిన బొమ్మలు నాకు చూపిస్తుండేది. కొన్నిసార్లు నేను కూడా తనతో కలిసి బొమ్మలు వేసేవాడిని’ అని ఖలీల్ తెలిపారు.

‘‘కినన్ ఆడుతూ పాడుతూ ఉండేవాడు. వాడిని అందరూ ఇష్టపడేవారు. చెల్లెళ్ళను బాగా చూసుకునేవాడు. రోసాను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేవాడు. రోసాను ఎవరూ తాకొద్దని, తను నా బిడ్డ అంటుండేవారు. కానీ ఇప్పుడు వారందరూ వెళ్ళిపోయారు’’ అని ఖలీల్ చెప్పారు.

శిథిలాల మధ్యన తన సోదరి శవం కోసం ఖలీల్ ఇంకా గాలిస్తూనే ఉన్నారు. పిల్లలు చనిపోయారు. మరోపక్క హాస్పిటల్లో ఉన్న భార్యను చూసుకోవాల్సి ఉంది.

ఖలీల్ ఓ ఫోటో చూపించారు. అందులో ఇబ్రహీం, అమల్, కెనిన్, రోసా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కళ్ళలో మెరుపు కనిపించింది.

ఎందుకంటే ఆయన ఎప్పటికీ నాన్నే.

వీడియో క్యాప్షన్, బాంబు పేలుళ్ల మధ్యే బిడ్డకు జన్మనిచ్చిన గాజా జర్నలిస్ట్ జుమానా...

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)