సైనిక పాలనలో ట్రాన్స్‌విమెన్ పై అత్యాచారం, హింస కేసులో 40 ఏళ్ల తర్వాత వాంగ్మూలం...బాధితులు ఏం చెప్పారంటే

ఫొటో సోర్స్, JULIETA GONZALEZ
- రచయిత, అలెజండ్రొ మిలన్ వాలెన్షియా
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
‘‘నియంతృత్వం రాజ్యమేలుతున్న సమయంలో ట్రాన్స్ ఉమెన్స్ కోసం ఎటువంటి చట్టాలు లేవు. అసలు వారి ఉనికినే రాజ్యం గుర్తించేది కాదు’’.
మా సంభాషణ మొదలయ్యాక తన మూడో సిగరెట్ ముట్టించడానికి జులైటా గొంజాలెజ్ నా అనుమతి తీసుకున్నారు. మేం ఫోన్‌లో మాట్లాడుకుంటున్నా, ఆమె నా పర్మిషన్ అడిగారు.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు 30 కిలోమీటర్ల దూరంలోని టిగ్రె పట్టణంలో మా ఇల్లు ఉంది.
గొంజాలెజ్ సిగరెట్లు తాగడాన్ని తెగ ఇష్డపడుతారు. బాగా సిగరెట్లు తాగడం వల్ల ఆమె గొంతు బొంగురుగా మారింది. 1976 నుంచి 1983 మధ్య అర్జెంటీనాలో మిలటరీ పాలనా కాలంలో రహస్యంగా నిర్బంధ ప్రదేశాలలో తనపై అత్యాచారం, హింస ఏస్థాయిలో జరిగిందో ఆ బొంగురు గొంతుతోనే ఏడాది కిందట అర్జెంటీనా కోర్టుకు వివరించారు.
గొంజాలెజ్‌తో పాటు కార్లా ఫాబినా గుటిరెజ్, పౌలా లియోనార్ అలగాస్తినో, అనలియా మార్ట్రైస్ వెలాక్వెజ్, మార్సెలా డానియేల్ వైగాస్ పెడ్రో తదితరులు వాంగ్మూలం ఇచ్చిన మొదటి ట్రాన్స్‌జెండర్ మహిళలు. మిలటరీ పరిపాలనలో సాగిన అకృత్యాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ బృందం తమపై జరిగిన అత్యాచారాలను కోర్టులో వివరించింది.
ఇటువంటి ఘోరాల గురించి 45 సంవత్సరాలుగా తెలిసినప్పటికీ నాలుగేళ్ళ కిందట మాత్రమే వీరి వాంగ్మూలాలు తీసుకునే ప్రక్రియ మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘గతంలో ఇప్పటిలా ట్రాన్స్ ఉమెన్స్ కోసం ఎటువంటి చట్టాలు లేవు. మమ్మల్ని అసలు మనుషులుగానే చూసేవారు కాదు. అందువల్ల మేం ఏం చెప్పినా అరణ్యరోదనే అయ్యేది’’ అని గొంజాలెజ్ తెలిపారు.
ఈ దాష్టీకాలలో ప్రాణాలతో బయటపడినవారు ఇచ్చిన సాక్ష్యాలు ట్రాన్స్ ఉమెన్స్ పై క్రమబద్ధంగా జరిగిన హింసను తెలియజేయడానికి ఉపయోగపడుతోంది.
సైనిక పాలనలో ఎల్‌జీటీబీక్యూ+ కమ్యూనిటీకి చెందిన 400మంది బాధితులుగా మారారని వివిధ మానవహక్కుల సంఘాలు తెలిపాయి.
అయితే వారు అరెస్ట్ అయినప్పుడు ఏదో సాధారణ పోలీసు రైడ్ లాంటిదే అనుకున్నారు కానీ, తాము సైనిక పాలకుల హింసకు గురై బాధితులుగా మారతామని ఊహించలేకపోయారు.
‘‘వారు నన్ను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని ఈ ప్రదేశానికి తీసుకువచ్చారు. జుంటాలపై సాగుతున్న విచారణను టీవీలో చూశాకా నేనీ స్థలాన్ని గుర్తించగలిగాను’’ అని గాంజలెజ్ తెలిపారు.
సైనిక పాలన కాలంలోని మొదటి ముగ్గురు మిలిటరీ అధికారులపై 1985లో ప్రెసిడెంట్ రౌల్ అల్ఫోన్స్ విచారణకు ఆదేశించారు.
మా సంభాషణలో పదో సిగరెట్‌ను వెలిగించిన గొంజాలెజ్ మరో జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు.
‘‘నేను ఇక్కడు వచ్చినప్పుడు ఒకమ్మాయి బాగా దెబ్బలు తిని ఓ మూలన నుంచుని కనిపించింది. తనను అక్కడ వదిలేశారన్నట్టుగా ఆమె చెబుతున్నట్టనిపించింది. ఈ చిత్రం నా మదిలో ఇప్పటికీ అలా నిలిచిపోయి ఉంది’’ అని గొంజాలెజ్ తెలిపారు.

ఫొటో సోర్స్, CARLA FABIANA GUTIÉRREZ
వ్యభిచారం తప్ప మరో దారి లేదు
‘‘మా ఐడెంటిటీ (ట్రాన్స్ వుమన్) కారణంగా మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వాళ్లు హింసించారు. మమ్మల్ని ఒక అంటువ్యాధిలా చూశారు.’’ అని గొంజాలెజ్ చెప్పారు. 1978లో తనను బాన్‌ఫీల్ వెల్‌లో నిర్బంధించినట్టు ఆమె తెలిపారు.
బాన్‌ఫీల్డ్‌వెల్ లో ఏం జరిగిందో వివరించమని తనని అడిగిన వెంటనే ఆమె అంగీకరించారు.
బ్యూనస్ ఎయిర్స్‌కు నైరుతి దిశగా ఉన్న మెటాడెరోస్ లో గొంజాలెజ్ జన్మించారు.
‘‘నా 15 ఏళ్ళ వయసులో నేనో ట్రాన్స్ ఉమెన్‌ను కలిశాను. నాకు కూడా అలా ఉండాలనిపించింది. ఆమె ఏ పని చేస్తుందో నేనూ అదే చేయాలనుకున్నాను. ఆ రోజుల్లో మగ, ఆడ, స్వలింగ సంపర్కులు మాత్రమే ఉండేవారు. మమ్నల్ని ఏమని పిలవాలో కూడా తెలియదు. కానీ నేను ‘గే’గా ఉండదలచుకోలేదు. మహిళగా ఉండాలనుకుంటున్నాను’’ అని గొంజాలెజ్ చెప్పారు.
1976లో అర్జెంటీనాలో తిరుగుబాటు జరిగింది.
‘‘అంతకు ముందు మమ్మల్ని పోలీసులు రైడ్స్ పేరుతో వెంటాడేవారు. అయితే పోలీసులను మమ్మల్ని వెంటాడటానికి , మిలటరీ అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది’’ అని ఆమె తెలిపారు.
‘‘ నాకు 14 లేదా 15 ఏళ్ళ వయసు ఉంటుంది. నన్ను అర్థ నగ్నంగా నిలబెట్టారు. నేను ఏమైనా తినాలంటే ప్రతిఫలంగా ఏదో ఒకటి చెల్లించాలి. ‘సెక్స్’ ద్వారా వారికి కావాల్సింది చెల్లించాను’’ గొంజాలెజ్ గుర్తు చేసుకున్నారు.
‘‘ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోయాను. మొదటిసారిగా దెబ్బలు తిన్నాను. అక్కడున్నంత కాలం నన్ను హేళన చేశారు. వారు అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలిసేది కాదు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, JULIETA GONZALEZ
రక్తపు గుర్తులు చెరిపేయండి..
ఈ వాంగ్మూలాలన్నీ కిందటేడాది ఏప్రిల్ లో కోర్టు ముందు చెప్పారు.
బ్రిగేడ్స్‌గా పిలిచే పోలీసు కమాండోలు హెల్ అని పిలిచే రహస్య నిర్బంధ కేంద్రాలలో వీరిని హింసించేవారు. ఈ నిర్బంధ కేంద్రాలను అర్జెంటీనా సైన్యం, పోలీసులు వేలాదిమందిని హింసించడానికి, అదృశ్యం చేయడానికి, అణచివేతకు ఉపయోగించుకున్నారని, ఇలా సుమారు 30 వేల మందిని హింసించారని మానవ హక్కుల సంఘాలు చెపుతున్నాయి.
బాన్‌ఫీల్డ్ పట్టణంలో బాన్‌ఫీల్డ్‌వెల్‌గా ప్రసిద్ధి పొందిన ప్రాంతంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ బ్రిగేడ్ భవనం ఉండేది.
గొంజాలెజ్ ఈ భవనాన్ని దాని అద్దాల ద్వారా గుర్తించగలిగారు.
‘‘ఈ భవనానికి పెద్ద పెద్ద అద్దాలు ఉండేవి. వాటిని మేం ప్రతిరోజూ శుభ్రం చేసేవాళ్లం. వాటిని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఎందుకంటే అక్కడికి కార్లలో మనుషులను తీసుకు వచ్చేవారు, సైనికులు లోపలకు రావడాన్ని ఈ అద్దాల ద్వారానే చూసేదానిని’’ అని గుర్తు చేసుకున్నారు.
గొంజాలెజ్ బీబీసీతో మాట్లాడుతూ ‘‘ఈ హెల్‌లో వాళ్ళు నన్ను ఎన్నోసార్లు రేప్ చేశారు. ఇక్కడికి వచ్చినవారు భయంతో వేసిన కేకలు నేను విన్నాను. ఈ సెంటర్‌కు మనుషులను తీసుకొచ్చిన కార్లలో రక్తపు మడుగులను నేను ఎన్నోసార్లు శుభ్రం చేశాను. అప్పుడే పుట్టిన పిల్లల ఏడుపులు కూడా విన్నాను’’ అని చెప్పారు.
‘‘ఉన్నతాధికారులు వెళ్ళిపోయాకా, మధ్యస్థాయి అధికారులు మమ్మల్ని జైలు బయటకు తీసుకువెళ్ళి లైంగిక సంబంధం కోసం బలవంత పెట్టేవారు’’అని గుర్తు చేసుకున్నారు.
‘‘నీకు ఇష్టం లేని పని బలవంతంగా చేయించడం నరకం. కానీ ఇది నరకం కూడా కాదు. అంతకుమించి అక్కడ నిరంతరం అరుపులు వినపడుతూనే ఉంటాయి. అక్కడున్న వారందరినీ భయంకరంగా హింసిస్తున్నారని త్వరలోనే నేను అర్థం చేసుకున్నాను. ఈరోజుకీ ఆ అరుపులు నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి’’ అని తెలిపారు.
ఇలా హింసే కాకుండా, ఇంకేదో జరుగుతోందని ఆమెకు మిలటరీ అధికారుల కారును శుభ్రం చేయమని చెప్పినప్పుడు తెలిసింది.
‘‘నేను కారులో రక్తపు మడుగులు తుడిచాను. అవేమీ ఎండిపోయి లేవు. తాజాగా కనిపిస్తున్నాయి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జ్ఞాపకాలు పదిలం చేసుకునేందుకు..
గొంజాలెజ్, గుటిరెజ్ ఈ రహస్య నిర్బంధ కేంద్రంలో నెలకు మించి లేరు. కానీ వారు తమను అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళారో అర్థం చేసుకోలేకపోయారు.
1983లో రౌల్ అల్ఫోసిన్ అర్జెంటీనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మిలటరీ పాలనకు తెరపడింది.
తమ ఐడెంటిటీ కారణంగా పడిన కష్టాలను, జ్ఞాపకాలను నిక్షిప్తం చేసేందుకు ట్రాన్స్ వెస్టైట్, ట్రాన్స్ కలెక్టివ్ సంయుక్తంగా నడుం బిగించారు.
మిలటరీ పాలనలోనూ, ప్రజాస్వామ్యంలోనూ వారెన్ని కష్టాలు అనుభవించారో చెప్పడానికి అనేకమంది నాయకులు, చరిత్రకారులు ముందుకువచ్చి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చారు.
‘‘కొన్నేళ్ళ కిందట ఈ ప్రక్రియలో బాన్ ఫీల్డ్ వద్ద ఏం జరిగిందో చెప్పాను. ఇది విన్నవారు ఈ రహస్య నిర్బంధ కేంద్రాలను నడిపినవారిపై జరుగుతున్న విచారణలో సాక్ష్యం చెప్పాల్సిందిగా పిలిచారు.’’ అని గొంజాలెజ్ తెలిపారు.
దీనివలన అనేకమంది నేరస్తుల గుర్తింపును తెలుసుకోవడానికి, అక్కడ అనేక మంది పిల్లలు జన్మించారనే విషయం నిర్థరించడానికి ఉపయోగపడింది.
వీటన్నింటికీ కారణమైనవారికి త్వరలో శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- గాజాపై దాడులు: ‘పరిస్థితి ఘోరంగా ఉంది, గాజా ఈ భూమితో సంబంధాలు కోల్పోయింది’
- గాజాలో బాంబు పేలుళ్ళ నడుమ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కథ
- ఖతార్‌లో మరణశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులను ఆదుకోగలమా... భారత్ ముందున్నసవాళ్లేంటి?
- వరల్డ్ కప్ 2023: పాక్ జట్టు దుస్థితికి బాధ్యత ఎవరిది, సొంత దేశం నుంచే ఎందుకు విమర్శలు వస్తున్నాయి?
- కెనడా: ఈ మూడు నగరాల్లో శాశ్వత నివాసం కోసం విదేశీయులు ఎందుకు తహతహలాడతారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














