కెనడా: ఈ మూడు నగరాల్లో శాశ్వత నివాసం కోసం విదేశీయులు ఎందుకు తహతహలాడతారు?

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లిండ్సే గాల్లోవే
    • హోదా, బీబీసీ ట్రావెల్

కెనడాలోని వాంకోవర్, కాల్గరీ, టొరంటో నగరాలు గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్-2023లోని టాప్ 10 నగరాల్లో స్థానం పొందాయి.

నగరాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను గణించి ఈ జాబితా‌ను వెల్లడిస్తారు. నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలు ఈ నగరాల్లో అందిస్తున్నారు.

ఈ మూడు నగరాల ప్రజల జీవన ప్రమాణం ఎలా ఉందనేది తెలుసుకోవడానికి బీబీసీ ఈ నగరాల్లో నివసించే వారితో మాట్లాడింది.

యూరోపియన్, స్కాండినేవియన్ దేశాలలోని నగరాలు తరచుగా అగ్రస్థానంలో ఉంటాయి.

పిల్లల సంరక్షణ అక్కడ బాగుంటుంది. కానీ, కెనడా నిశ్శబ్దంగా ఈ రేసులో ముందుకు దూసుకెళుతోంది.

కెనడాకు చెందిన మూడు నగరాలు మొదటి పది స్థానాల్లో నిలవడం విశేషం.

గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్‌లో వాంకోవర్ ఐదవ, కాల్గరీ ఏడో, టొరంటోలు తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఈ నగరాలు వైద్యం, విద్య పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

ప్రగతిశీల రాజకీయాలు, ఆరోగ్య సంరక్షణ కెనడాలో జీవించడానికి గొప్ప ప్రదేశంగా మార్చిందని వాంకోవర్ నివాసి సమంతా ఫాక్ చెప్పారు.

"డాక్టర్‌ దగ్గరికి వెళ్లడానికి, పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి లేదా క్యాన్సర్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందిపడేలా ఉండే దేశంలో జీవించడాన్ని నేను ఊహించలేను" అని ఆమె అన్నారు.

అంతేకాదు కెనడా ప్రజా రవాణా వ్యవస్థలలోనూ భారీగా పెట్టుబడులు పెట్టింది, ఇది ప్రధాన నగరాలకు ప్రయాణం సులభతరం చేసింది.

మాంట్రియల్, కాల్గరీ, టొరంటోలలోనూ నివసించారు సమంతా. ఆమె 24 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేదు.

సమంతా స్నేహితురాలు 53 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. కారు అవసరం లేని విధంగా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. అందుకే ఆమె డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోలేదు.

టాప్ 10లో ఉన్న ఈ మూడు నగరాలు కెనడాలోని ఇతర నగరాల మాదిరిగానే ప్రకృతికి దగ్గరగా ఉన్నాయని సమంతా అభిప్రాయపడ్డారు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

వాంకోవర్

ఈ మూడు నగరాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ముందుగా కెనడా పశ్చిమ తీరంలో ఉన్న వాంకోవర్ గురించి తెలుసుకుందాం.

కెనడాలో వాంకోవర్‌ను అత్యంత నివాసయోగ్యమైన నగరంగా భావిస్తారు. సంస్కృతి, పర్యావరణానికి సంబంధించి వాంకోవర్‌కు ఎక్కువ మార్కులు దక్కాయి.

అందుకే ప్రపంచంలోని మొదటి పది నగరాల్లో వాంకోవర్ ఉంది. దీని కంటే ఆక్లాండ్ మాత్రమే మెరుగ్గా స్కోర్ చేసింది.

ఈ నగరంలోని ప్రకృతి అందాలతో తమకు భావోద్వేగ అనుబంధం ఉందని ఇక్కడి పౌరులు అంటున్నారు.

"సముద్రం, పర్వతాల ప్రత్యేకమైన కలయికతో కూడిన నగరం వాంకోవర్, అందుకే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది" అని సమంతా చెప్పారు.

నగరంలో కమ్యూనికేషన్స్ సంస్థను నడుపుతున్నారు సమంతా.

"నేను ఇరవై ఏళ్లుగా ఈ నగరంలో ఉంటున్నా. అప్పటినుంచి అంతే అందంగా ఉంది" అని సమంతా అన్నారు.

వాంకోవర్ నగరం నడిబొడ్డున 405 హెక్టార్లలో స్టాన్లీ పార్క్ ఉందని, వందేళ్ల నాటి చెట్లు అందులో ఉన్నాయని సమంత చెప్పారు.

ది హాలో ట్రీ అని పిలిచే 700-800 ఏళ్ల పురాతన దేవదారు చెట్టు కూడా ఉంది.

ట్రెక్కింగ్ కోసం 2.9 కి.మీ పొడవైన గ్రాస్ గ్రైండ్ ట్రైల్ ఉంది. ప్రశాంతమైన ప్రదేశాలను ఇష్టపడే వారికి ఇక్కడ మంచి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

"ఫ్యాన్సీ రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులతో పాటు, రైతు మార్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రుచికరమైన ఆహారానికి కొరత లేదు" అని మరో వాంకోవర్ వాసి జేన్ స్టోలర్ అంటున్నారు.

సుషీ రెస్టారెంట్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు జేన్ స్టోలర్. జపాన్ వెలుపల మంచి, నాణ్యమైన సుషీ అంటే వాంకోవర్‌లో మాత్రమే లభిస్తుందని ఆయన చెప్పారు.

అంతేకాదు వాంకోవర్ ప్రజలు ఓపెన్ మైండెడ్ అని అంటున్నారు జేన్ స్టోలర్. వారు కళ, సాంకేతికత, గ్రీన్ క్యాంపెయిన్ అంశాలపై కలిసి రావడానికి ఇష్టపడతారని తెలిపారు.

కెనడాలో ప్రకృతి సౌందర్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడాలో ప్రకృతి సౌందర్యం

కాల్గరీలో 165 భాషల ప్రజలు

అల్బెర్టా పశ్చిమ ప్రావిన్స్‌లోని రాకీ పర్వతాల దిగువ ప్రాంతంలో కాల్గరీ నగరం ఉంది.

ఇక్కడ ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ చిన్న పట్టణంలా అనిపిస్తుందని ఇక్కడి పౌరులు చెబుతున్నారు.

కెనడాలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం కూడా తక్కువ.

లోరా పోప్ వృత్తిరీత్యా ట్రావెల్ బ్లాగర్. లోరా మాట్లాడుతూ "కెనడాలోని అతిపెద్ద నగరాల్లో కాల్గరీ ఒకటి, అయితే ఇది అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ పక్కింటివాళ్లు స్నేహంగా ఉంటారు'' అని అన్నారు.

ఇక్కడ రైతు మార్కెట్‌లు ఉన్నాయని, వాళ్లే సరుకులు విక్రయిస్తారని తెలిపారు.

‘‘వాటితో పాటు తినడానికి అధునాతన ప్రదేశాలున్నాయి. కల్చరల్ ఫెస్టివల్స్ జరుగుతాయి, నైట్ లైఫ్ కూడా ఉంది" లోరా పోప్ వివరించారు.

కాల్గరీ నగరం వైవిధ్యంలోనూ రాణిస్తోంది. ఆ విషయంలో కాల్గరీది కెనడాలో మూడో స్థానం. ఈ నగరంలో 240 కులాల వారు నివసిస్తున్నారు. ఇక్కడ 165 భాషలు మాట్లాడతారు.

కాల్గరీలో చమురు, గ్యాస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, నిర్మాణ నిపుణులు ఈ నగరంలో నివసిస్తున్నారు.

కయాబో అనే పౌరుడు కమ్యూనికేషన్ రంగంలో పనిచేస్తున్నారు . "కాల్గేరియన్లకు డబ్బు ఉంది, వారు దానిని ఖర్చు చేయడానికి ఇష్టపడతారు" అని కయాబో చెప్పారు.

కాల్గరీ స్టాంపేడ్ పండుగను ఇక్కడ జులై మొదటి శుక్రవారం నుంచి వరుసగా పది రోజుల పాటు జరుపుకొంటారు.

ఇందులో పాల్గొనే వ్యక్తులు పాశ్చాత్య దుస్తులు ధరించి పెద్ద పార్టీలు చేసుకుంటారు. ఈ పండుగ కోసం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.

"పట్టణంలో అత్యుత్తమ పర్వతాన్ని చూడాలనుకుంటే మేజర్ టామ్స్‌కు వెళ్లండి" అని మరో స్థానికుడు షానన్ హ్యూస్ చెప్పారు.

కెనడాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, తన సహజరీతి కారణంగా కాల్గరీలో కూడా మంచి జీవన నాణ్యత ఉంటోంది.

ఉత్తర అమెరికాలో అతిపెద్ద, అత్యంత విస్తృతమైన సైకిల్ ట్రాక్‌ కాల్గరీలోనే ఉంది. నడక, సైక్లింగ్ కోసం వెయ్యి కిలోమీటర్లకు పైగా మార్గాలున్నాయి.

"ఈ మార్గాల్లో సైకిల్ తొక్కి నగరంలో చాలా రహస్య ప్రదేశాలను కనుగొన్నా. ఈ అద్బుతమైన దృశ్యాలు ప్రతిరోజూ బయటికి రావాలనే నా కోరికను కూడా తీర్చాయి" అని లోరా అన్నారు.

శీతాకాలంలో ఈ ప్రాంతం మంచుతో కప్పేసి ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు స్కీయింగ్, స్కేటింగ్, ట్యూబింగ్, స్నోషూయింగ్‌ చేస్తూ ఆనందిస్తారు.

ఈ నగరం 1988లో వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు నిర్మించిన సౌకర్యాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

ఇక్కడ శీతాకాలంలో చలి ఎక్కువుంటుంది. మీరు వెచ్చని ప్రాంతాల నుంచి ఈ నగరానికి రావాలనుకుంటే, మంచి శీతాకాలం బట్టలు కొనడం మర్చిపోవద్దు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

టొరంటో ప్రత్యేకత ఏంటంటే?

టొరొంటో కెనడాలో అతిపెద్ద నగరం. టొరంటోకి వస్తే మీరు ఆధునిక నగరం అనుభూతిని పొందుతారు. ఈ నగరంలో 1,500కు పైగా పార్కులు ఉన్నాయి.

ఇక్కడ అద్భుతమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. అందుకే ప్రజల జీవన ప్రమాణాలు సజావుగా కొనసాగుతున్నాయి.

ఇక్కడి ప్రజలు అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ కూడా ఉపయోగిస్తారు. శీతాకాలంలో రోడ్లు మంచుతో కప్పేసుకుపోయినప్పుడు ఈ భూగర్భ రహదారులు ఉపయోగపడతాయి.

టొరంటోలోనే నివసించే బ్లాగర్ 'హోంగ్ అన్ లే' నగరం ప్రత్యేకతలు వివరించారు.

"మేం ఈ భూగర్భ మార్గాలను ఆఫీసు నుంచి విమానాశ్రయం వరకు, రాత్రి భోజనం, షాపింగ్, వైద్యం ఇలా చాలా పనులకు ఉపయోగిస్తాం. శీతాకాలంలో కోటు లేకుండా కూడా బయటికి వెళ్లవచ్చు" అని తెలిపారు హోంగ్ అన్ లే.

"నగరంలో ప్రతిచోటా సైకిళ్లు అద్దెకు లభిస్తాయి" అని మరో స్థానికుడు కైరా మార్క్సెల్ చెప్పారు.

టొరంటో వైవిధ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. నగరంలో నివసిస్తున్న వారిలో 51 శాతం మంది కెనడా వెలుపలే జన్మించారు.

"పశ్చిమ దేశాలలో ఎక్కువ జాతుల వాళ్లు ఉన్న ప్రధాన నగరం ఇదే" అని 'హోస్ట్‌‌అవే' సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు మార్కస్ రాడర్ చెప్పారు.

"మీకు ఇక్కడ విభిన్న సంస్కృతులు, భాషలు కనిపిస్తాయి. కెనడా బహుళ సంస్కృతిని సమర్థిస్తుంది. ప్రజలపై ఎటువంటి ఒత్తిడి ఉండదు" అని ఆయన చెప్పారు.

విభిన్న పండుగలు, వారి ఆహారాలు, కొత్త ఆలోచనలు, జీవన విధానాల వంటి సాంస్కృతిక వైవిధ్యం ఇక్కడి సమాజాన్ని సుసంపన్నం చేస్తోంది.

"ప్రజలు వారి పని, వ్యక్తిగత జీవితాలు, సాంస్కృతిక అలవాట్ల గురించి తెలుసుకోవడం బాగుంటుంది" అని క్యాచ్ కార్నర్ యాప్ సీఈవో జోనాథన్ అజురి అంటున్నారు.

"ఇది నగరం బయటికి వెళ్లకుండానే మీకు అంతర్జాతీయంగా పనిచేసిన అనుభవాన్నిస్తుంది" అని ఆయన చెప్పారు.

టొరంటో పరిశ్రమలకూ ప్రసిద్ధి. గూగుల్, ఫేస్‌బుక్ వంటి పెద్ద కంపెనీలకు ఇక్కడ కార్యాలయాలున్నాయి.

కొత్త స్టార్టప్ కంపెనీలూ చాలానే ఉన్నాయి. న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ తర్వాత, టొరంటోనే ఉత్తర అమెరికాలో అతిపెద్ద టెక్నాలజీ సెంటర్.

ఈ నగరం సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక సంపద ప్రజలకు మంచి అవకాశాలను అందిస్తోంది.

వీడియో క్యాప్షన్, మంచు తుపాన్లు వచ్చే కెనడాలో వడగాడ్పులు..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)