ఖరీదైన స్కూల్‌లో యువతి హత్య... బాత్రూమ్‌లో శవమైన కనిపించిన పోలో కోచ్

ఫొటో సోర్స్, SUPPLIED
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్
సిడ్నీలోని ఖరీదైన ప్రైవేట్ పాఠశాలలోని బాత్రూమ్‌లో యువతి శవం కనుగొన్నారనే వార్తతో గురువారం ఆస్ట్రేలియా నిద్రలేచింది. ఈ వార్త దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించింది.
అర్థరాత్రి కావడానికి కొంచెం ముందు వచ్చిన అత్యవసర ఫోన్‌కాల్‌తో పోలీసులు సెయింట్ ఆండ్రూస్ కెథడ్రిల్ స్కూల్ దగ్గరకు వచ్చారు.
అక్కడ 21 ఏళ్ళ వాటర్ పోలో కోచ్ లీలీ జేమ్స్ చనిపోయి కనిపించారు. ఆమె తలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. కొద్దిగంటల ముందే ఆమె హత్యకు గురై ఉంటారని డిటెక్టివ్‌లు నమ్ముతున్నారు.
ఇది హత్య అని, సుత్తితో మోది ఆమెను చంపి ఉంటారని అజ్ఞాతవ్యక్తుల సమాచారం ఆధారంగా స్థానిక మీడియా కథనాలను ప్రచురించింది.
లీలీ జేమ్స్ స్నానాల గదిలోకి వెళ్ళిన తరువాత, ఆమె సహచరుడు 24 ఏళ్ళ హాకీ కోచ్ పాల్ థిజ్సెన్ కూడా బాత్రూమ్‌లోకి ప్రవేశించినట్టు సీసీటీవీలో నమోదైంది.
ఆ తరువాత అతను ఒక్కడే బాత్రూమ్ నుంచి బయటకు రావడం అందులో కనిపిస్తోంది. అయితే, లీలీ హత్య గురించి అధికారులకు థిజ్సెన్సే సమాచారం అందించారు.
ఈ హత్య వెనుక ఉన్న కారణాలపై పోలీసులు నోరు విప్పకపోయినా, లీలీ, థిజ్సెన్‌తో ఇటీవల తన బంధాన్ని తెంచుకున్నారని, వారిద్దరూ కేవలం ఓ ఐదువారాలుపాటే కలిసి తిరిగారని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
అయితే , పోలీసులకు ఆ సమాచారాన్ని అందించిన తరువాత థిజ్సెన్ కనిపించలేదు. దాంతో, పోలీసులు అతడి కోసం వెతకడం మొదలుపెట్టారు.
హత్యకు ఉపయోగించినట్లుగా భావిస్తున్న వస్తువులను పోలీసులు అక్కడి డస్ట్ బిన్‌లో కనుగొన్నారు. ఆ తరువాత శుక్రవారం ఉదయం పోలీసులు ఓ మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. అది థిజెన్స్‌దని నిర్థారించారు.

ఫొటో సోర్స్, GOOGLE MAPS
మా నుంచి దూరం చేశారు
లిలీ జేమ్స్ హత్యతో ఆమె కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. ఆమె గురించి కుటుంబసభ్యులు, స్నేహితులు తలుచుకుని కుమిలిపోతున్నారు.
లిలీ జేమ్స్ వాటర్‌పోలోతోపాటు నృత్యాన్ని, ఈతను ఇష్టపడేదని, టీనేజర్‌గా ఉన్నప్పుడు ఈరెండింటిని పోటాపోటీగా చేసేదని గుర్తు చేసుకుంటున్నారు. యూనివర్సిటీలో స్పోర్ట్స్ బిజినెస్ డిగ్రీ చదువుతూనే, స్కూల్లో పనిచేస్తున్నట్టు స్నేహితులు తెలిపారు.
‘‘ఆమె ఎంతో హుషారుగా ఉండేది. ఆమె అంటే మా అందరికీ చాలా ఇష్టం’’ అని జేమ్స్ కుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది.
‘‘మా గుండె పగిలిపోయింది. మాకు దిక్కు తోచడం లేదు’’ అని ఆమె కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘జేమ్స్‌ను మాకు దూరం చేశారు’’ అని ఆమె కుటుంబ స్నేహితుడు డానియల్ మాకోవెక్ అన్నారు. ఆయన జేమ్స్ కుటుంబం కోసం విరాళాలు సేకరించే పనిలో ఉన్నారు. ‘‘మేమీ లోటును ఎప్పటికీ భరిస్తూనే ఉండాలి’’ అని ఆయన చెప్పారు.
సెయింట్ ఆండ్రూస్ కెథడ్రల్ పాఠశాల హెడ్ జేమ్స్ హత్యపై ఆమె కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు.
థిజ్సెన్ డచ్ జాతీయుడు. అతను స్కూల్ స్టాఫ్ మెంబర్ కావడానికి ముందు స్పోర్ట్స్ మాజీ కెప్టెన్‌గా ఉన్నారు.
న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ కూడా ఈ హత్యను భయంకరమైనదని అంటూ జేమ్స్ కుటుంబానికి సంతాపం తెలిపారు.
‘నా ప్రజాజీవితంలో నేను చూసిన అతి భయంకరమైన సంఘటనల్లో ఇదొకటి. ఇప్పుడు జేమ్స్ కుటుంబం పరిస్థితి ఎలా ఉందో నేనూహించగలను’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గృహహింస కు పరిష్కారమెక్కడ?
లిలీ జేమ్స్ హత్య గృహహింసకు సంబంధించిన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.
కౌంటింగ్ డెడ్ ఉమెన్ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం ఈ ఏడాది లింగహింస కారణంగా లిలీజేమ్స్ సహా 41మంది మహిళలు మరణించారని తెలిపింది.
గడిచిన పదిరోజులలో వ్యవధిలో దక్షిణ ఆస్ట్రేలియన్ క్రిస్టల్ మార్షల్, మరో గుర్తుతెలియని కాన్‌బెర్రా మహిళ, జేమ్స్ ఇలా ముగ్గురు మహిళలు తమకు తెలిసిన మగవారిచేతిలో పని ప్రదేశంలోనో, ఇంటిలోనో హత్యకు గురయ్యారు.
మహిళలపై హింసకు సంబంధించిన సంస్కరణల ప్రచారకర్త తరంగ్ చావ్లా, "లిలీ జేమ్స్ హత్య మహిళలపై మగవారి హింసను బయటపెట్టింది. మహిళల హత్యలలో చీకటి కోణాన్ని మరోసారి గుర్తు చేసింది" అని చెప్పారు.
చావ్లా సోదరి కూడా 2015లో తన భాగస్వామి చేతిలో హత్యకు గురయ్యారు.
దేశవ్యాప్తంగా భయం అలుముకున్న వేళ, మహిళలు సురక్షితంగా ఉండడం ఎలా అనే ప్రశ్నలు మరోసారి వినిపిస్తున్నాయి.
మహిళల రక్షణ కోసం కిందటేడాది ఓ పదేళ్ళ ప్రణాళికను ప్రవేశపెట్టారు. మహిళలపై హింస విషయంలో వెంటనే స్పందించడం, పోలీసులు, న్యాయస్థానాలు చురుకుగా పని చేసేలా చూడడం, బాధితులకు తగిన ఆరోగ్య సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం 90 శాతానికి పైగా ఆస్ట్రేలియన్లు మహిళలపై హింసను తీవ్ర సమస్యగా గుర్తించారు. అయితే, సగటున పది మందిలో నలుగురు మాత్రం గృహ హింస ఘటననలో ఆడ, మగ ఇద్దరూ కారణమనే భావనతో ఉన్నారు.
న్యూ సౌత్ వేల్స్ గృహహింస నిరోధక మంత్రి జోడీ హరీసన్ జేమ్స్ మృతి నేపథ్యంలో ‘‘అనుచిత ప్రవర్తనపై’’ గొంతు విప్పాలని విజ్ఞప్తి చేశారు.
‘ఇది మనందరి బాధ్యత. ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరు తమకు తాముగా బాధ్యత తీసుకోకపోతే, ప్రభుత్వం దీన్ని నిరోధించేందుకు ఖర్చు చేస్తున్న నిధులన్నీ వృధా అవుతాయి'’ అని చెప్పారు.
గృహహింస నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, నిధులను కూడా పెంచాలని గృహహింస సమస్యపై పోరాడేవారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ: కొచ్చిలోని క్రైస్తవ కమ్యూనిటీ సెంటర్లో బాంబు పెట్టిన వ్యక్తి గురించి పోలీసులు ఏం చెప్పారు?
- 'దమ్ మారో దమ్' హిప్పీలు ఏమయ్యారు?
- కోచి - నరేంద్ర మోదీ: వాటర్ మెట్రో అంటే ఏంటి? ఏం సౌకర్యాలు ఉంటాయి? టికెట్ ఎంత?
- రైలు ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా ఇన్సూరెన్స్ పొందడం ఎలా? 10 ప్రశ్నలు - సమాధానాలు
- గాజాలో బాంబు పేలుళ్ళ నడుమ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కథ
- జలగావ్ సెక్స్ స్కాండల్: ఎగ్జామ్ పేపర్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేశారు? మాజీ ఐపీఎస్ అధికారి రాసిన పుస్తకంలో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














