కిరాణా కొట్టు వ్యాపారి ముసుగులో భారత సైన్యం వివరాలు పంపిస్తున్న పాకిస్తాన్ గూఢచారి

పాకిస్తాన్ గూఢచారి

ఫొటో సోర్స్, V BHATI / GETTY

ఫొటో క్యాప్షన్, ఐవీఎఫ్ చికిత్స కోసం లాభ్‌శంకర్ మహేశ్వరి పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారు
    • రచయిత, భార్గవ్ పరీఖ్
    • హోదా, బీబీసీ కోసం

పాకిస్తాన్‌ గూఢచారిగా పనిచేస్తున్న వ్యక్తిని గుజరాత్‌లో అరెస్టు చేశారు. వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చి గుజరాత్‌లో స్థిరపడిన ఆయన ఇక్కడి పౌరసత్వం కూడా పొందారు. ఆయనను గూఢచర్యం కేసులో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.

గుజరాత్‌లోని తారాపూర్‌కి చెందిన మహిళను పెళ్లి చేసుకున్న పాకిస్తాన్‌ వ్యాపారి చాలా ఏళ్లుగా పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్ (కృత్రిమ గర్భధారణ) చికిత్స కోసం భార్యతో కలిసి పాకిస్తాన్ నుంచి గుజరాత్‌కు వచ్చారు.

ఆ తర్వాత తన మామ సాయంతో ఇక్కడే ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నారు. భారత్ వచ్చిన తర్వాత కూడా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో మరోసారి చికిత్స అవసరమైంది.

తండ్రి అవ్వాలన్న ఆశతో భారత్‌కు వచ్చిన లాభ్‌శంకర్ మహేశ్వరి ఇక్కడి పౌరసత్వం పొందిన తర్వాత, భారత సైనికుల ఫోన్లను హ్యాక్ చేయడంతో పాటు గూఢచార్యానికి పాల్పడ్డారన్న కేసులో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆయన్ను అరెస్టు చేసింది.

ఆనంద్‌ పట్టణానికి సమీపంలోని మరో చిన్న పట్టణం తారాపూర్‌కి చెందిన రాఠీ కుటుంబం ధాన్యం, ఆయిల్ వ్యాపారం చేసేవారు. భారత్, పాకిస్తాన్ విభజన సమయంలో వారిలో కొందరు పాకిస్తాన్‌లో, మరికొందరు భారత్‌లో స్థిరపడ్డారు.

అలా, లాభ్‌శంకర్ మహేశ్వరి తారాపూర్‌కి చెందిన ఒక వ్యాపారి కూతురిని పెళ్లి చేసుకున్నారు.

గుజరాత్ పోలీస్

ఫొటో సోర్స్, V. BHATI

ఫొటో క్యాప్షన్, పోలీస్ అధికారి

'పాకిస్తాన్ వెళ్లాలనుకున్నా వీసా దొరకలేదు'

భారత్‌లో స్థిరపడి, ఇక్కడి పౌరసత్వం పొందిన పాకిస్తానీ డాక్టర్ ఓం మహేశ్వరి బీబీసీతో మాట్లాడుతూ ''వాజ్‌పేయీ హయాంలో భారత్, పాకిస్తాన్ మధ్య మెరుగైన సంబంధాలు కొనసాగుతున్న సమయంలో చాలా మంది వైద్యం కోసం దీర్ఘకాలిక వీసాలతో భారత్‌కు వచ్చారు'' అని చెప్పారు.

''ఆ సమయంలోనే పాకిస్తాన్‌లోని సవాయ్ గ్రామానికి చెందిన లాభ్‌శంకర్ మహేశ్వరి కూడా భారత్‌కు వచ్చారు. అప్పటికే పెళ్లై చాలా ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్ చికిత్స కోసం గుజరాత్‌కి వచ్చారు. చికిత్స పొందినప్పటికీ సంతానం కలగలేదు. ఒకవైపు వైద్య ఖర్చులు, మరోవైపు ఎలాంటి వ్యాపారం లేకపోవడంతో తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. దీంతో అత్తమామలే ఆర్థిక సాయం చేస్తున్నారు.'' అని ఆయన చెప్పారు.

''ఏళ్ల తరబడి చికిత్స తీసుకున్నప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు. ఆయన పాకిస్తాన్ తిరిగి వెళ్లేందుకు 2002లో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాలేదు. అదే సమయంలో ఇక్కడ వ్యాపారం ప్రారంభించారు. దీంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడంతో 2005లో పౌరసత్వం వచ్చింది'' అని డాక్టర్ చెప్పారు.

''ఆ తర్వాత ఆయన కిరాణా హోల్‌సేల్ వ్యాపారంలోకి వెళ్లారు. ఆ తర్వాత నుంచి అతనితో పెద్దగా సంబంధాలు లేవు.''

పాకిస్తాన్ - భారత్

ఫొటో సోర్స్, Getty Images

2022లో పాకిస్తాన్ టూర్

లాభ్‌శంకర్ మహేశ్వరికి కిరాణా వ్యాపారంలో పరిచయస్తుడైన జయేశ్ టక్కర్ బీబీసీతో మాట్లాడారు.

''మొదట్లో వాళ్ల మామతో కలిసి ధాన్యం హోల్‌సేల్ వ్యాపారం చేస్తూ కమిషన్ తీసుకునేవాడు. భారత పౌరసత్వం వచ్చిన తర్వాత తారాపూర్ చౌరస్తా వద్ద సొంతంగా కిరాణా హోల్‌సేల్ దుకాణం పెట్టుకున్నాడు'' అని చెప్పారు.

''ఇక్కడ వ్యాపారం బాగానే నడిచేది. అయితే, అతని తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో ఉన్నారు. అందువల్ల అక్కడికి వెళ్లాలని అనుకున్నాడు.''

''కరోనా సమయంలో కొన్ని నష్టాలొచ్చాయి. అతని బంధవుల్లో ఒకరైన కృనాల్ రాఠీ ధాన్యం, ఆయిల్‌ను కల్తీ చేయడం మొదలుపెట్టారు.'' అని జయేశ్ చెప్పారు.

''అతనిపై ఒక ఫోర్జరీ కేసు కూడా ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్‌లో ఉన్న తన ఆస్తులు అమ్మి గుజరాత్‌లో వ్యాపారంలో పెట్టాలనుకున్నాడు. అందుకోసం 2022లో మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకుని, 45 రోజులు పాకిస్తాన్ వెళ్లొచ్చాడు. కానీ, అతను పాకిస్తానీ గూఢచారి అని మాకు తెలియదు'' అని ఆయన అన్నారు.

లాభ్‌శంకర్ మహేశ్వరి

ఫొటో సోర్స్, V. BHATI

ఫొటో క్యాప్షన్, లాభ్‌శంకర్ మహేశ్వరిని గూఢచర్యం కేసులో ఏటీఎస్ అరెస్టు చేసింది

సైనిక కార్యకలాపాలపై గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణ

టెక్నాలజీ సాయంతో భారత సైనికులపై గూఢచర్యానికి పాల్పడిన కేసులో అరెస్టయిన లాభ్‌శంకర్ మహేశ్వరి వ్యవహారంపై గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎస్పీ ఓ.పి. జాట్ బీబీసీతో మాట్లాడారు.

''2005లో భారత పౌరసత్వం వచ్చిన తర్వాత మహేశ్వరి భారత సైనికులపై గూఢచర్యానికి పాల్పడ్డారు. అతను 2022లో పాకిస్తాన్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వీసా రాకపోవడంతో పాకిస్తాన్‌లో ఉంటున్న తన అత్త కొడుకు కిశోర్ రంవానీకి ఫోన్ చేసి, ఎలాగైనా వీసా త్వరగా వచ్చేలా సాయం చేయాలని కోరాడు.

పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఒక వ్యక్తిని కలవమని అతనికి చెప్పాడు. ఆ తర్వాత వీసా వచ్చింది. అతనే తన సోదరి, బావమరిదికి కూడా పాకిస్తాన్ వీసాలు ఏర్పాటు చేశాడు'' అని చెప్పారు.

''అప్పుడే, పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని పరిచయస్తుడి నుంచి జామ్‌నగర్‌లోని మహమ్మద్ సక్లైన్‌‌కు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత అతను తన పేరు మీద ఒక సిమ్ కార్డు కొన్నాడు.

జామ్‌నగర్‌కి చెందిన అస్గర్ మోదీ ఫోన్‌లో ఆ సిమ్ కార్డు మొదట యాక్టివేట్ అయింది. ఆ తర్వాత తన సోదరి, బావమరిది పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో లాభ్‌శంకర్ ఆ సిమ్ కార్డును పాకిస్తాన్‌కు పంపించాడు'' అని ఎస్పీ తెలిపారు.

''భారత్ నుంచి లాభ్‌శంకర్ పంపించిన సిమ్ కార్డుతో వాట్సాప్ యాక్టివేట్ అయింది. ఆ వాట్సాప్ ఓటీపీని పాకిస్తాన్ వీసా రావడంలో సాయం చేసిన వ్యక్తికి చెప్పారు.

ఆ తర్వాత వాళ్లు ఇండియన్ ఆర్మీ సిబ్బందికి ఫోన్లు చేయడం మొదలైంది. మీ పిల్లలు చదువుకుంటున్న సైనిక్ స్కూల్ నుంచి చేస్తున్నట్లు చెప్పి, స్కూల్‌లో కొత్త రూల్స్, పిల్లలకు స్కాలర్‌షిప్స్‌ కోసం దరఖాస్తులు నింపాలంటూ కొన్ని ఏపీకే ఫైల్స్ పంపుతారు. అప్పటికే ఆ ఫైల్స్ ట్రోజన్ అనే మాల్‌వేర్‌తో రిమోట్ యాక్సెస్ చేసి ఉంటాయి'' అన్నారు.

''దాని తర్వాత, హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ప్రారంభించామంటూ ఇండియన్ ఆర్మీ సిబ్బందికి లింకుతో కూడిన మరో ఏపీకే ఫైల్ పంపుతారు. అది కూడా ట్రోజన్ మాల్‌వేర్‌తో యాక్సెస్ చేసి ఉంటుంది.

ఆ మాల్‌వేర్ ఆర్మీ జవాన్ల ఫోన్‌లోని చొరబడి వాట్సాప్ చాటింగ్, ఫోటోలు, వారి కదలికలను పసిగడుతుంది. అలా అతను కార్గిల్ బోర్డర్‌లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ ఫోన్‌లోకి రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ‌వైరస్‌ను ఎక్కించాడు. దాని ఆధారంగా భారత సైన్యం రహస్య సంభాషణలు పాకిస్తాన్‌కు చేరుతున్నాయి'' అని ఏటీఎస్ ఎస్పీ చెప్పారు.

నిలయ్ మిస్త్రీ

ఫొటో సోర్స్, V. BHATI

ఫొటో క్యాప్షన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మిస్త్రీ

రిమోట్ యాక్సెస్ ట్రోజన్ వైరస్‌తో హ్యాకింగ్

ఈ నేపథ్యంలో, ఆర్మీ ఇంటెలిజెన్స్‌తో కలిసి గుజరాత్ ఏటీఎస్ ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి లాభ్‌శంకర్ మహేశ్వరిని తారాపూర్‌లో అరెస్టు చేసింది.

ఇప్పటి వరకూ అతను ఈ వైరస్ ఫైల్‌ను పలువురు భారత సైనికులకు పంపించినట్లు గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

''రిమోట్ యాక్సెస్ ట్రోజన్ వైరస్‌ కేసుల్లో వెబ్‌సైట్ లింక్, లేదా ఏపీకే ఫార్మాట్ ద్వారా మీ ఫోన్‌లో మాల్‌వేర్‌ లాంటి యాడ్‌వేర్ చొరబడుతుంది'' అని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిలయ్ మిస్త్రీ చెప్పారు.

''ఈ యాడ్‌వేర్ మీ ఫోన్‌లోని డేటా మొత్తాన్ని సేకరించి చిన్న ఫైల్స్ రూపంలో పంపిస్తుంది. అందుకు మీ ఫోన్ ఇంటర్నెట్ డేటా కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది. మీకు తెలియకుండానే అది జరిగిపోతుంది'' అన్నారు.

''ఇది పాసివ్ ట్రోజన్, ఇందులో మరో రకం 'యాక్టివ్ ట్రోజన్' ఉంటుంది. అది మీ ఫోన్‌‌లో జరిగే ప్రతి విషయాన్ని రికార్డ్ చేసి వెంటనే డేటా పంపించేస్తుంది. దానినే స్క్రీన్ మానిటరింగ్ అంటారు. మీ ఫోన్ వాట్సాప్ చాటింగ్, వీడియో, ఏదైనా మెసేజ్ అయినా సరే మీకు తెలియకుండానే మరొకరు చూడొచ్చు.

ఇలా ట్రోజన్ వైరస్‌ యాక్సెస్ ఉన్న లింకులను క్లిక్ చేసినప్పుడు మన ఫోన్‌లోని డేటాను మాత్రమే కాదు, మన కదలికల గురించిన పూర్తి సమాచారం కూడా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు'' అని మిస్త్రీ చెప్పారు.

ఇక, గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసిన లాభ్‌శంకర్ మహేశ్వరిని తారాపూర్ కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ నిమిత్తం అతన్ని 14 రోజుల కస్టడీకి అప్పగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.హెచ్ రాథోడ్ కోర్టును కోరారు.

''లాభ్‌శంకర్‌ ఫోన్‌లో చాలా నంబర్లు ఉన్నాయి. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? సమాచారం ఎవరికి చేరవేస్తున్నాడు? అలాగే, అంత సులభంగా అతనికి సిమ్ కార్డులు ఎవరిస్తున్నారు? వంటి విషయాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది'' అని రాథోడ్ వాదించారు.

ఆయనకు కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించింది. అనంతరం, లాభ్‌శంకర్‌కు పాకిస్తాన్‌లో ఎవరెవరితో సంబంధాలున్నాయి? గుజరాత్‌లో ఉన్న పాకిస్తానీయులు ఎవరు? అనే విషయాలపై విచారణ జరగాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)