జలగావ్ సెక్స్ స్కాండల్: ఎగ్జామ్ పేపర్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేశారు? మాజీ ఐపీఎస్ అధికారి రాసిన పుస్తకంలో ఏముంది?

ఫొటో సోర్స్, MEERA BORWANKAR
- రచయిత, రోహన్ నామ్‌జోషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
జలగావ్ సెక్స్ స్కాండల్ 1990ల్లో అత్యంత సంచలనం కలిగించిన కేసుల్లో ఒకటి. కేవలం మహారాష్ట్ర మాత్రమే కాక, దేశం మొత్తం ఈ కేసుతో వణికిపోయింది.
అప్పట్లో జలగావ్ ప్రధాన నగరాల్లో ఒకటి కూడా కాదు. అక్కడ సామాజిక పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ కేసు వెలుగులోకి తీసుకొచ్చి, నిందితులకు శిక్షించేందుకు విచారణాధికారి, బాధితులతో పాటు తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది.
మాజీ ఐపీఎస్ అధికారి మీరా బోర్వాంకర్ తన ఆటోబయోగ్రఫీ ‘మేడమ్ కమిషనర్’లో జలగావ్ సెక్స్ స్కాండల్‌కు సంబంధించి మొత్తం పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు.
మీరా బోర్వాంకర్‌కు మహారాష్ట్రలో అత్యంత ధైర్యవంతురాలైన పోలీసు అధికారిగా పేరుంది.
ఆమె వృతి జీవితంలో జలగావ్ సెక్స్ స్కాండల్ విచారణ అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచింది.
అజిత్ పవార్, ఎరవాడ భూములకు సంబంధించిన అంశాలు కూడా తన పుస్తకంలో ప్రస్తావించడం మహారాష్ట్రలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఈ విషయం మహారాష్ట్రలో పెద్ద చర్చనీయాంశంగా నిలిచింది. తన వృతి జీవితంలో ఇతర ప్రధాన కేసులను కూడా మీరా బోర్వాంకర్ తన పుస్తకంలో ప్రస్తావించారు.
బోర్వాంకర్ ఆధ్వర్యంలో విచారణ జరిగిన జలగావ్ సెక్స్ స్కాండల్‌ను ఈ పుస్తకంలో ఒక ప్రత్యేక చాప్టర్‌లో వివరించారు.
ఈ స్కాండల్ గురించి మీరా బోర్వాంకర్ తన పుస్తకంలో ఏం వివరించారు, ఏ కేసు పూర్వాపరాలేమిటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

నేరుగా డీజీపీ నుంచి ఫోన్ కాల్
1994లో మీరా బోర్వాంకర్ పుణెలోని నేరాల విచారణ విభాగంలో పనిచేస్తున్నారు.
ఆఫీసులో కూర్చుని ఉన్న సమయంలో ఆమెకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) శివాజీరావు బరావ్కర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో ఆమె జూనియర్ పోలీసు అధికారి.
నేరుగా డీజీపీ నుంచి ఫోన్ రావడం ఆమెను ఆశ్చర్యపరిచింది.
వెంటనే జలగావ్‌కు వెళ్లాలని ఆయన బోర్వాంకర్‌ను ఆదేశించారు.
ఆ సమయంలో బోర్వాంకర్ కొడుకు చాలా చిన్నపిల్లాడు. బాబును, హెల్పర్‌ను తీసుకుని వెంటనే జలగావ్‌కు వెళ్లాలని చెప్పారు.
1994ల్లో జలగావ్‌లో మానవ అక్రమ రవాణా, అత్యాచారం, లైంగిక వేధింపుల రాకెట్ వెలుగులోకి వచ్చింది.
చాలా మంది అమ్మాయిలను, చిన్న పిల్లలని కూడా చూడకుండా అక్రమంగా తరలిస్తూ వారిని వేధిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిసింది.
స్థానిక నేరగాళ్లు, రాజకీయ నేతలే ఈ నేరాలకు పాల్పడుతున్నారనే అనుమానం వ్యక్తమైంది.
ఆ సమయంలో వంద మందికి పైగా అమ్మాయిలు వేధింపులకు గురయ్యారని అంచనాలు ఉన్నాయి.
స్థానిక వార్తాపత్రికలు, ఇతర మీడియా ద్వారా ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత జలగావ్ ప్రాంతం తీవ్ర భయభ్రాంతులకు గురైంది.
అప్పటి అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అర్వింద్ ఇనామ్దార్ ఈ కేసు విచారణపై ఒక కన్నేసి ఉంచారు.
మీరా బోర్వాంకర్ నేతృత్వంలో ఈ కేసు విచారణ చేపట్టనున్నట్టు డీజీపీ శివాజీరావు బరావ్కర్ తెలిపారు.

దర్యాప్తు తొలినాళ్లలో ఏం జరిగింది?
మీరా బోర్వాంకర్ జలగావ్ చేరుకున్న తర్వాత ఈ ఘటనలపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
మహిళా సంస్థలు తమ ఆందోళనలను ప్రారంభించాయి.
ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ చార్టర్డ్ ఆఫీసర్స్ లీనా మెహెందాలే, చంద్ర అయ్యంగర్, మీరా బోర్వాంకర్‌లతో కూడిన ఒక కమిటీని నియమించింది.
మీడియాలో వచ్చిన వార్తలో నిజముందని, బాధిత మహిళలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని కమిటీ తెలిపింది.
ఆ కమిటీ చైర్మన్ లీనా మెహెందాలేతో బీబీసీ మాట్లాడింది. ఆ సమయంలో ఆమె నాసిక్‌కు డివిజనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
‘‘నాసిక్‌లో చేరిన తర్వాత జలగావ్‌కి వెళ్లాను. అన్ని పరిస్థితులను గమనించాను. ఆ సమయంలో అజయ్ భూషణ్ పాండే నాసిక్ కలెక్టర్‌గా ఉండేవారు. ఆయన కూడా మంచి అధికారి. ఆ తర్వాత మీరా బోర్వాంకర్ ఈ విచారణను చేపట్టారు’’ అని చెప్పారు.
‘‘ఇది ఆరుగురు వ్యక్తుల గ్యాంగ్ చేసిన దారుణాలు. ఈ వేధింపులకు చాలా మంది మహిళలు బాధితులయ్యారు. మా ప్రధాన కర్తవ్యం ఏంటంటే.. ఈ మహిళలకు ఊరటనివ్వాలి. కొంత మంది దీనివల్ల తాము బయటికి వస్తామని, కొందరు తమ పేర్లు బయటికి వస్తాయని భయపడ్డారు. కానీ, ఈ కేసు బయటికి రావాలి, కొందరు తమ పేర్లు బయటికి రాకుండా, ఈ కేసు బయటికి రాదని అభిప్రాయపడ్డారు. అందుకే మా ముందున్న ప్రధాన కర్తవ్యం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకుండా ఈ కేసును ఛేదించడం’’ అని అన్నారు.
అదనపు డీజీపీ అర్వింద్ ఇనామ్దార్ కూడా జలగావ్ వచ్చారు.
ప్రజలతో, పోలీసు అధికారులతో తరచూ సమావేశమయ్యారు. వదంతులు వ్యాప్తి చెందుతుండటంతో, బాధితులు బయటికి వచ్చి మాట్లాడలేరని, దీని వల్ల ప్రధాన నిందితులు తప్పించుకుంటారని చెప్పారు.
ఆ సమయంలో జలగావ్‌లో మహిళా పోలీసు అధికారులు చాలా తక్కువ. పక్క జిల్లాల్లో పనిచేసే చాలా మంది మహిళా పోలీసు అధికారులను జలగావ్‌కు పిలిపించారు.
బోర్వాంకర్‌ను నగరం వదిలి వెళ్లాలని అర్వింద్ ఇనామ్దార్ ఆదేశించారు. ఎందుకంటే ఆమె నగరం లోపలే నివసిస్తున్నారు.
బాధిత అమ్మాయిలు ముందుకు వచ్చి వారు పడ్డ వేధింపులను తెలిపితే, వెంటనే నిందితులకు తెలిసిపోతుంది. అందుకే బోర్వాంకర్‌ను నగరానికి బయట ఉండాలని చెప్పారు.
ఆమె ఏడాది వయసున్న కొడుకుతో నగరం బయటనే నివసించారు. ఇది ఈ కేసు విచారణకు చాలా ఉపయోగపడిందని బోర్వాంకర్ తెలిపారు.
ఆ లేఖలో బాధితురాలు ఏం రాశారు?
బోర్వాంకర్ ప్రత్యేక బంగ్లాలోకి మారిన తర్వాత, బాధిత మహిళలు ఆమె దగ్గరకి వచ్చి తమ వేధింపులను చెప్పుకున్నారు.
‘‘మెల్లగా బాధిత అమ్మాయిలు నా దగ్గరకు వచ్చారు. వారికి ఎదురైన వేధింపులు చెబుతూ కన్నీళ్లు పెట్టుకునే వారు. గంటల కొద్దీ నా కొడుకుతో ఆడుకునే వారు. కేసు దాఖలు చేయడానికి మాత్రం వారు ఒప్పుకునే వారు కాదు.
మాతో కలిసి తినడం, ఆడుకోవడం చేశారు. చాలా వరకు ఏడ్చేవారు. కొందరు ఫిర్యాదు దాఖలు చేసేందుకు ఒప్పుకునే వారు. కానీ, వారి కుటుంబాలు ఒప్పుకునేవి కావు. వారి కూతుళ్ల పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులు చాలా భయపడే వారు. మేం చెప్పేది వారు వినే వారు కాదు’’ అని బోర్వాంకర్ తన పుస్తకంలో రాశారు.
ఒకరోజు సమీప గ్రామానికి చెందిన ఒక అమ్మాయి దగ్గర్నుంచి బోర్వాంకర్‌కు ఒక లేఖ వచ్చింది.
‘‘మీరు కచ్చితంగా నా నగ్న చిత్రాలు, వీడియోలు చూస్తారు’’ అంటూ ఆమె ఆ లేఖలో పేర్కొంది. కానీ, తానిప్పుడు పెళ్లి చేసుకున్నానని, పోలీసులు తన వద్దకు రావొద్దని ఆ లేఖలో చెప్పింది.
‘‘ఒకవేళ పోలీసులు నన్ను కలవడానికి ప్రయత్నిస్తే, నేను ఆత్మహత్యకు యత్నిస్తాను’’ అని సదరు అమ్మాయి చెప్పారు.
ఆ సమయంలో బోర్వాంకర్‌కి ఈ కేసు పరిస్థితి అర్థమైంది.
ఆ తర్వాత, పండిట్ సప్కాలే, కార్పొరేటర్ రాజు తడ్వాయ్, మాజీ ఎమ్మెల్యే కొడుకు సంజయ్ పవార్‌లకు వ్యతిరేకంగా కేసు నమోదైంది.
పోలీసు విచారణను వేగవంతం చేశారని తెలుసుకున్న తర్వాత, నిందితులందరూ పరారయ్యారు.
అమ్మాయిల ఫోటోలు కాల్చివేశారు. పోలీసులు ఇద్దరు అమ్మాయిల ఫోటోలను కనుగొన్నారు. వారెవరో కనుగొని, ఆ అమ్మాయిలను సంప్రదించారు. వారిని ఎలా వేధించారో ఆ అమ్మాయిలు, పోలీసులకు తెలిపారు.
నిందితుల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మొత్తం జలగావ్ జిల్లాను జల్లెడ పట్టి, నిందితుల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.
పండిట్ సప్కాలే ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి. గుజరాత్‌లో ఇతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

రూమ్ నంబర్ 206, తిరుపతి హోటల్, జలగావ్
ఎగ్జామ్ పేపర్లు పొందేందుకు చాలా మంది అమ్మాయిలు ఈ సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుపోయారని మెహెందాలే చెప్పారు.
‘‘దీంతో పాటు, సమీపంలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించేందుకు ఈ గ్యాంగ్ విద్యార్థులను ట్రాప్ చేసింది. రాజకీయంగా పలుకుబడి ఉన్న, డబ్బులున్న వారు పెళ్లి పేరుతో అమ్మాయిలను ఆకర్షించేవారు.
ఆ తర్వాత అమ్మాయిలో శారీరక సంబంధం పెట్టుకుని, వాటిని రికార్డు చేసే వారు. వీటిని వారిని బెదిరించేందుకు వాడుకునే వారు’’ అని బోర్వాంకర్ ఆటోబయోగ్రఫీలో వివరించారు.
దీని కోసం జలగావ్‌లో ‘తిరుపతి హోటల్‌లోని రూమ్ నంబర్ 206ను వాడుకునే వారు. ఈ రూమ్‌లో కెమెరాను ఉంచే వారు.
‘‘ఒకసారి అమ్మాయిని ట్రాప్ చేసిన తర్వాత, నిందితుల స్నేహితులతో కూడా సెక్స్‌లో పాల్గొనేలా ఆమెను బలవంతం చేసే వారు. దీని గురించి వారి తల్లిదండ్రులకు ఏం తెలిసేది కాదు’’ అని బోర్వాంకర్ తన పుస్తకంలో తెలిపారు.
ముగ్గురు అమ్మాయిలు చివరికి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఒప్పుకున్నారు.
వారెలా వేధింపులు ఎదుర్కొన్నారో పోలీసులకు వివరించారు. ఒక అమ్మాయికి తన తల్లి ఆపరేషన్‌కు డబ్బులు కావాల్సి ఉంది. దాన్ని అడ్డుగా పెట్టుకుని ఆమెను కార్పొరేటర్ వేధించాడని, ఆమెకు అప్పటికే విడాకులు అయ్యాయని, ఈ వేధింపులు ఎన్నో నెలలపాటు సాగినట్లు ఆ అమ్మాయి తెలిపిందన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ కేసు ఇంకా కోర్టులోనే..
ఈ కేసులన్నింటిపై సీనియర్ పోలీసు అధికారి అర్వింద్ ఇనామ్దార్ ఒక కన్నేసి ఉంచే వారు.
ఈ కేసు కోసం సమర్థుడైన ప్రభుత్వ న్యాయవాదిని ఎంపిక చేశారు. ముంబయిలో ఆయన ప్రముఖ న్యాయవాది. ఆయన చాలా క్రమశిక్షణగలవారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌తో ఆయన అంగీకరించే వారు కాదు. ఆయనతో పనిచేయడం తమ వల్ల కాదని అధికారులందరూ చెప్పిన తర్వాత, అర్వింద్ ఇనామ్దార్ చాలా కోపడ్డారు. ఆయనకు సమానమైన మరో న్యాయవాదిని నియమించారు.
‘‘ఈ కేసులన్నింటిన్నీ దాఖలు చేయడంలో బాగా ఆలస్యమవడంతో, నిందితులకు వెంటనే బెయిల్ వచ్చింది. ఆ తర్వాత వారు బాధితులను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో పుణెలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు.
ఆ సమయంలో జలగావ్‌లో పరిస్థితులు చాలా హీటెక్కించేలా ఉండేవి. చాలా మంది బాధితులకు పుణెలో ఆశ్రయం ఏర్పాటు చేశారు. పుణెలో చాలా కుటుంబాలు వారికి ఆశ్రయమిచ్చేందుకు ముందుకు వచ్చాయి. నా వృత్తిలో పోలీసులు, ప్రజల మధ్య ఇలాంటి సహకారాన్ని మరెప్పుడూ చూడలేదు’’ అని బోర్వాంకర్ తన పుస్తకంలో రాశారు.
ఈ కేసు కోర్టుకు వెళ్లిన తర్వాత, తొలి రెండు కేసుల బాధితులు వారి ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నారు. ఇది మాత్రమే కాక, జలగావ్ పోలీసులు బలవంతంగా ఈ కేసులు దాఖలు చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇది పెద్ద షాక్ ఇచ్చింది.
తొలుత బాధితురాలి తల్లిని సాక్ష్యం ఇచ్చేందుకు పిలిచారు. ఒకవేళ తల్లి నిజం చెబితే, కూతురికి ధైర్యమొస్తుందని న్యాయవాదులు భావించారు. కానీ, అక్కడ అంతా వ్యతిరేకంగా జరిగింది. తల్లి సాక్ష్యమిచ్చారు. అది విని, కూతురు బాగా కోపగించుకుని, తల్లిని దూషించింది.
ఈ కేసులో ఆరు అత్యాచార కేసులు నమోదయ్యాయి. కానీ, 2000లో ఈ కేసులో ప్రధాన నిందితుడు పండిట్ సప్కాలే శిక్షను కోర్టు కొట్టివేసింది. అతనికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంది.
రెండు మూడేళ్ల తర్వాత ఈ కేసులో సాక్ష్యాలు సమర్పించామని లీనా మెహెందాలే చెప్పారు.
సాక్ష్యాధారాలు అంత బలంగా లేవు. ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం, బాధితుల వాంగ్మూలాన్ని ఎంత వీలైతే అంత త్వరగా రికార్డు చేయడం తప్పనిసరి.
మీరా బోర్వాంకర్ కెరీర్‌లో ఈ కేసు అత్యంత ముఖ్యమైంది. ఈ కేసు నుంచి చాలా నేర్చుకున్నానని మీరా బోర్వాంకర్ చెప్పారు.
2018లో మీరా బోర్వాంకర్ ఒక ప్రసంగం ఇచ్చేందుకు వెళ్లారు. చిన్న హాల్‌లో ఆ కార్యక్రమం జరిగింది. పెద్ద హాల్‌లో ఈ కార్యక్రమం చేసేందుకు స్థలం దొరికిందని, కానీ ఆ హాల్ జలగావ్ సెక్స్ స్కాండల్ నిందితుల్లో ఒకరిదని చెప్పారు. అక్కడ మీరెలా ప్రసంగిస్తారని వెన్యూను రద్దు చేసినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- గాజాపై దాడులు: ‘పరిస్థితి ఘోరంగా ఉంది, గాజా ఈ భూమితో సంబంధాలు కోల్పోయింది’
- గాజాలో బాంబు పేలుళ్ళ నడుమ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కథ
- ఖతార్‌లో మరణశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులను ఆదుకోగలమా... భారత్ ముందున్నసవాళ్లేంటి?
- విశాఖలో తొలి విద్యుత్ దీపం ఎప్పుడు వెలిగింది... దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి?
- పాకాల సుగుణాకర్: ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారుల్లో ఒకరైన ఈ విశాఖ వాసి బంధువులు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














