ఖతార్: మరణ శిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపు.. వీరిలో ఒకరైన విశాఖ వాసి పాకాల సుగుణాకర్ నేపథ్యం ఏమిటి?

పాకాల సుగుణాకర్
ఫొటో క్యాప్షన్, పాకాల సుగుణాకర్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు శిక్షను తగ్గించినట్లు భారత విదేశీ వ్యవహారాలశాఖ డిసెంబరు 28న తెలిపింది.

ఈ ఎనిమిది మందిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ ఒకరు.

“ఖతార్‌లో దహ్రా గ్లోబల్ కేసు అప్పీలుపై విచారణలో భాగంగా శిక్ష తగ్గించినట్లు మేము గుర్తించాం. పూర్తి స్థాయి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్ణయించేందుకు మా న్యాయబృందం, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం.

అప్పీలుపై విచారణకు ఖతార్‌లో భారత రాయబారి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ కేసు మొదలైనప్పటి నుంచి మేము వారితో ఉన్నాం. భవిష్యత్‌లోనూ వారికి న్యాయ, దౌత్యపరమైన సాయం కొనసాగిస్తాం.

ఈ అంశాన్ని ఖతార్ అధికారుల దృష్టికి తీసుకెళతాం’’ అని విదేశీ వ్యవహారాలశాఖ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఈ కేసు విషయంలో పాటించాల్సిన సున్నితత్వాన్ని, నిగూఢత(కాన్ఫిడెన్షియాలిటీ)ను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఇంత కంటే ఎక్కువ అంశాలు ప్రస్తావించడం సరైనది కాదని భావిస్తున్నామని ఆ శాఖ తన వెబ్‌సైట్‌లో చెప్పింది.

గూఢచర్యం ఆరోపణలపై ఈ 8 మందికి ‘ఖతార్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టెన్స్‌’ అక్టోబర్ 26న మరణశిక్ష విధించింది.

వీరిలో నవ్‌తేజ్ సింగ్ గిల్, సౌరభ్ వశిష్ట్, బీరేంద్ర కుమార్ వర్మ కెప్టెన్లుగా పని చేయగా, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్ పాల్, రాగేశ్‌లతో పాటు పాకాల సుగుణాకర్ కమాండర్లుగా చేశారు.

భారత నౌకాదళం

ఫొటో సోర్స్, Getty Images

మరణ శిక్ష విధించినప్పుడు సుగుణాకర్ బంధువులు ఏమన్నారు?

ఈ 8 మందికి ఖతార్‌ కోర్ట్‌ మరణ శిక్ష విధించిన నేపథ్యంలో అక్టోబరులో బీబీసీ అందించిన కథనం ఇది.

సుగుణాకర్ సహా వీరంతా ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ ‘అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్’లో పని చేసేవారు.

ఇటలీ నుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్ రహస్య కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్‌కు అందించారనేది వీరిపై వచ్చిన ఆరోపణ.

ఈ కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్ కంపెనీ సీఈవోను కూడా అరెస్ట్ చేసినట్లు పాకాల సుగుణాకర్ బంధువు కపూర్ కల్యాణ చక్రవర్తి బీబీసీతో చెప్పారు.

కపూర్ కల్యాణ చక్రవర్తి సోదరినే భారత నేవీ మాజీ కమాండర్ పాకాల సుగుణాకర్ వివాహం చేసుకున్నారు.

సుగుణాకర్‌పై ఆరోపణలన్నీ అవాస్తవాలేనని, భారత ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పందించి సుగుణాకర్‌తో పాటు మిగతా ఏడుగురిని విడుదల చేయించేందుకు ప్రయత్నం చేయాలని కళ్యాణ చక్రవర్తి కోరారు.

ఖతార్ జైలులో ఉన్న సుగుణాకర్‌తో తన సోదరికి తప్ప మరేవరికి మాట్లాడే అవకాశం లేదని ఆయన తెలిపారు.

పాకాల సుగుణాకర్ ఎవరు? ఈ కేసుకు సంబంధించిన ఇతర వివరాలేంటి? కేసుపై కుటుంబసభ్యుల వాదనేంటి? తదితర వివరాలను కల్యాణ చక్రవర్తి వివరించారు. ఈ విషయాలన్ని ఆయన మాట్లల్లోనే...

‘’సుగుణాకర్ విశాఖపట్నం, ముంబయి, అండమాన్ నికోబార్ దీవులలో భారత నేవీ తరపున పని చేశారు. 2013లో భారత నేవీ నుంచి రిటైరైన సుగుణాకర్ ఆ తర్వాత ఖతార్‌కు చెందిన అల్‌ దహ్రా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఈ కంపెనీలోనే పని చేస్తుండగా గత ఏడాది ఆగష్టులో దోహాలో ఆయన్ను అరెస్టు చేశారు.

తాజాగా అక్టోబర్ 26వ తేదీన వీరికి మరణశిక్ష విధిస్తున్నట్లు అక్కడి స్థానిక కోర్టు ప్రకటించింది. అయితే వీరిపై మోపిన అభియోగాలను బహిరంగ పర్చకుండా సుగుణాకర్‌తో కలిపి మొత్తం 8 మందికి మరణశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించడం ఎంత వరకు న్యాయం?

సుగుణాకర్ పాకాల

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కపూర్ కల్యాణ చక్రవర్తి

ఈ కేసు ఎక్కడిది?

ఈ ఎనిమిది మంది కూడా ఖతార్‌లోని అల్‌ దహ్రా కంపెనీలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కంపెనీ ఖతార్‌ నౌకాదళానికి శిక్షణ, సహకారం అందిస్తోంది. ఇటలీ టెక్నాలజీ ఆధారిత జలాంతర్గాములను నిర్మించే ఒక రహస్య ప్రాజెక్టు కోసం ఈ కంపెనీ ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఉద్యోగులుగా నియమించుకుంది.

అయితే, ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ వీరిని గత ఏడాది ఆగస్టు 30న ఖతార్‌ నిఘా విభాగం అరెస్టు చేసింది. ఆ రోజు అర్థరాత్రి ఇళ్ల నుంచి వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద కొన్ని ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ కేసుపై ఈ ఏడాది మార్చి 29 నుంచి స్థానిక న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. బెయిల్‌ కోసం వారు 8 సార్లు పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది. కాగా, ఈ నెల 26వ తేదీన ‘ఖతార్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టెన్స్‌’ వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

కంపెనీ పాత వెబ్‌సైట్
ఫొటో క్యాప్షన్, అల్ దహ్రా కంపెనీ పాత వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు.

కంపెనీ వెబ్‌సైట్ కనిపించడం లేదు

‘అల్‌ దహ్రా కంపెనీ దోహాలో తన కార్యకలాపాలను గత ఏడాది మే నెలలో నిలిపివేసింది. తాము ఖతార్‌ నౌకాదళానికి శిక్షణ, నిర్వహణ, రవాణాపరంగా సహకారం అందిస్తున్నామని కంపెనీ తాలూకు పాత వెబ్‌సైట్‌లో ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌ ఉనికిలో లేదు. కొత్త వెబ్‌సైట్‌లో ఈ విషయం ప్రస్తావనే లేదు. అరెస్టయిన భారతీయ అధికారుల వివరాలు కూడా అందులో లేవు. కంపెనీ పేరును కూడా దహ్రా గ్లోబల్‌గా మార్చేశారు. నేను ఈ వెబ్‌సైట్‌ను ఎప్పటీ నుంచో ఫాలో అవుతున్నాను. అందుకే ఈ విషయాలను చెప్పగలుగుతున్నాను.

ఈ ఎనిమిది మందిని ఖతార్‌ నిఘా విభాగం గత ఏడాది ఆగష్టులో అరెస్టు చేసింది. భారత రాయబార కార్యాలయానికి దీనిపై నెల రోజుల తర్వాత సమాచారం ఇచ్చారు. అనంతరం సెప్టెంబరు 30న కుటుంబ సభ్యులతో కొద్దిసేపు టెలిఫోన్‌లో మాట్లాడుకోవటానికి ఎనిమిది మందికి అవకాశం ఇచ్చారు.

మేమంతా సుగుణాకర్ ఇతర ఉద్యోగుల అరెస్ట్ విషయంలో అందోళన వ్యక్తం చేయడంతో అక్టోబరు 3న భారత రాయబార కార్యాలయ అధికారి ఒకరు వారిని కలిశారు. ఆ తర్వాత నుంచీ వారానికొకసారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో మాట్లాడటానికి, దోహాలో ఉంటే వారు జైలుకు వచ్చి కలుసుకోవటానికి అనుమతించారు.

వారిపై ఆరోపణలు ఏంటనేది అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాదు ఇజ్రాయెల్ తరపున వారు రహస్య ఏజెంట్లుగా పని చేస్తున్నారంటూ భారత మీడియాలో వస్తున్న వార్తల్లోనూ వాస్తవం లేదు.

నేవీ

ఫొటో సోర్స్, ANI

సుగుణాకర్ పుట్టింది, చదివింది విశాఖలోనే

గూఢచర్యం కేసులో ఖతార్‌ కోర్టు మరణశిక్ష విధించిన ఎనిమిది మందిలో ఒకరైన పాకాల సుగుణాకర్‌ ది విశాఖపట్నమే. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఆ తర్వాత కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. అనంతరం నేవల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యనభ్యసించి నేవీలో చేరారు. కమాండర్‌ స్థాయికి ఎదిగారు. విధుల్లో భాగంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత పదవీ విరమణ చేసి దహ్రా కంపెనీలో చేరారు.

అరెస్ట్ సమాచారం తెలిసిన తర్వాత ఇటీవలే మా సోదరి జైల్లో సుగుణాకర్‌ని కలిశారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం అక్కడ యోగక్షేమాలు తప్ప మరే విషయాలను మాట్లాడనివ్వడం లేదట. అది కూడా చాలా తక్కువ సమయమే అవకాశం కల్పిస్తున్నారు. సుగుణాకర్‌తో మాట్లాడేందుకు, కలిసేందుకు ప్రస్తుతానికి మా సోదరికి తప్ప మరెవరికి ఖతార్ ప్రభుత్వం అవకాశం కల్పించలేదు’’ అని కల్యాణ చక్రవర్తి అన్నారు.

ఖతార్ అమీర్, భారత ప్రధాని

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, ఖతార్ ఎమీర్ (దేశాధినేత) తమీమ్ బిన్ హమద్ అల్ తానీతో భారత ప్రధాని మోదీ

ప్రధాని మాట్లాడితే చాలు

నేవీ మాజీ ఉద్యోగులకు మరణశిక్ష వార్తపై భారత విదేశాంగశాఖ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ కేసుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, తమ ముందు న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొంది.

‘అల్‌ దహ్రా కంపెనీకి చెందిన ఎనిమిది మంది భారతీయ ఉద్యోగులకు మరణశిక్ష విధించారని తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాం. పూర్తి తీర్పు కోసం వేచి చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యులతో, న్యాయబృందంతో సంప్రదింపుల్లో ఉన్నాం. ఖతార్‌ అధికారులతోనూ దీనిపై మాట్లాడతాం’ అని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధాని మోదీ ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడితే వారు విడుదలవుతారనే నమ్మకం ఉందని కళ్యాణ చక్రవర్తి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసు విషయంలో పని చేస్తోందని, అయితే మరింత వేగంగా పని చేయాలని కుటుంబ సభ్యులుగా కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, విరిగి పడుతున్న బ్రిటన్ సముద్రతీరాల్లోని కొండలు

ప్రభుత్వ స్పందనేంటి?

కేసు విషయమై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావును సుగుణాకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు విశాఖపట్నంలో కలిశారు. అందరినీ విడుదల చేసేలా భారత ప్రభుత్వం కృషి చేసేలా చూడాలని ఆయనను కోరారు. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, ఖతార్‌లోని భారత రాయబారి విపుల్‌తో మాట్లాడినట్లు జీవీఎల్ చెప్పారు.

ఖతార్‌లోని కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను తెలుసుకున్నారు ఎంపీ జీవీఎల్. స్థానిక కోర్టు రెండు లైన్ల ఉత్తర్వును మాత్రమే కోర్టులో చదివిందని, పూర్తి తీర్పు ఆదివారం నాటికి అందుబాటులోకి వస్తుందని అన్నారు.

తీర్పుపై 15 రోజులలోపు "కోర్ట్ ఆఫ్ అప్పీల్"లో అప్పీల్ చేసే అవకాశం ఉంటుందని, కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పు తర్వాత, ఖతార్‌లో అత్యున్నతమైన "కోర్టు ఆఫ్ కాసేషన్" ప్రక్రియ కూడా ఉంటుందని జీవీఎల్ గుర్తుచేశారు. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని, నేవీ మాజీ ఉద్యోగులను విడుదల చేసేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

నేవీ మాజీ ఉద్యోగులకు న్యాయం జరిగేందుకు భారత ప్రభుత్వం, ప్రత్యేకించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందని జీవీఎల్ తెలిపారు. జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ ఎంపీయే కాకుండా విదేశాంగ వ్యవహారాల కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు.

వీడియో క్యాప్షన్, పాకాల సుగుణాకర్: ఖతార్‌లో మరణశిక్ష ఈ విశాఖ వాసి బంధువులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)