ఖతార్‌లో మరణశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులను ఆదుకోగలమా... భారత్ ముందున్నసవాళ్లేంటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ ఉద్యోగులకు గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో విధించిన మరణ శిక్ష భారత్‌కు అతిపెద్ద సవాలుగా మారింది.
వీరికి విధించిన శిక్షపై భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
ఈ కేసుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, తమ ముందు న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొంది.
ఖతార్ కోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేయడం, ఈ నౌకాదళ మాజీ ఉద్యోగులను మరణ శిక్ష నుంచి కాపాడటం భారత్‌కు అతిపెద్ద దౌత్యపరమైన సవాలు.
మరణశిక్ష పడిన వారిలో నవ్‌తేజ్ సింగ్ గిల్, సౌరభ్ వశిష్ట్, బీరేంద్ర కుమార్ వర్మ కెప్టెన్లుగా పని చేయగా, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్ పాల్, రాగేశ్‌లతో పాటు విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ కమాండర్లుగా చేశారు.
వీరంతా ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ ‘అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్’లో పని చేసేవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మోదీ ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి
ఈ విషయంలో జోక్యం చేసుకుని, వారిని విడిపించేందుకు అవసరమైన ప్రయత్నాలన్ని చేయాలని మోదీ ప్రభుత్వంపై భారత్‌లో ఒత్తిడి పెరుగుతోంది.
ఈ విషయంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ఖతార్‌లో 8 మంది మాజీ నౌకాదళ అధికారుల సంబంధించిన బాధాకరమైన పరిణామాలపై ఇండియా నేషనల్ కాంగ్రెస్ తీవ్ర విచారాన్ని, బాధను, దు:ఖాన్ని వ్యక్తం చేస్తోంది" అని ఆయన అన్నారు.
"ఖతార్ ప్రభుత్వంతో ఉన్న రాజకీయ పలుకబడిని, దౌత్యపరమైన సంబంధాలను కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత స్థాయిలో ఉపయోగించి వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తుందని మేం ఆశిస్తున్నాం. దీంతో అప్పీలుకు వెళ్లేందుకు అధికారులకు తగినంత మద్దతు లభిస్తుంది. ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా వారిని విడిపించేందుకు ప్రభుత్వం ముందున్న ప్రతి ప్రయత్నాన్ని చేపట్టాలి’’ అని కూడా జైరాం రమేశ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాశారు.
ఈ విషయంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ మాజీ అధికారులందర్ని వెనక్కి తీసుకురావాలి. ఖతార్‌లో చిక్కుకున్న మాజీ నౌకాదళ ఉద్యోగుల సమస్యను నేను ఆగస్ట్‌లోనే లేవనెత్తాను. ఈ రోజు వారికి మరణ శిక్ష పడింది. ఇస్లామిక్ దేశాలు తననెంత ప్రేమిస్తున్నాయో ప్రధాని మోదీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మాజీ అధికారులందర్ని తిరిగి వెనక్కి తీసుకురావాలి. వీరు మరణ శిక్ష ఎందుర్కొంటుండటం నిజంగా దురదృష్టకరం’’ అని ఒవైసీ విచారం వ్యక్తం చేశారు.
‘‘ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే మాజీ నౌకాదళ ఉద్యోగులకు సాయం చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పుడు, ఖతార్ దానికి లొంగలేదు. ఎందుకంటే, ఈ కేసును ఖతార్ ఒక బేరసారాల చిప్‌గా వాడుకోవాలనుకుంటోంది. తుర్కియే, ఇరాన్‌తో పాటు ఖతార్ కూడా ఒక పెద్ద ఆట ఆడుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాతో భారత్ స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను ఇవి ఇష్టపడటం లేదు’’ అని సీనియర్ జర్నలిస్ట్ షీలా భట్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ కేసు ఎక్కడిది?
ఈ ఎనిమిది మంది కూడా ఖతార్‌లోని అల్ దహ్రా కంపెనీలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కంపెనీ ఖతార్ నౌకాదళానికి శిక్షణ, సహకారం అందిస్తోంది.
ఇటలీ టెక్నాలజీ ఆధారిత జలాంతర్గాములను నిర్మించే ఒక రహస్య ప్రాజెక్టు కోసం ఈ కంపెనీ ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఉద్యోగులుగా నియమించుకుంది.
అయితే, ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ వీరిని గత ఏడాది ఆగస్టు 30న ఖతార్ నిఘా విభాగం అరెస్టు చేసింది.
ఆ రోజు అర్థరాత్రి ఇళ్ల నుంచి వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద కొన్ని ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ కేసుపై ఈ ఏడాది మార్చి 29 నుంచి స్థానిక న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. బెయిల్ కోసం వారు 8 సార్లు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది.
కాగా, ఈ నెల 26వ తేదీన ‘ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్’ వీరికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నౌకాదళ మాజీ అధికారులకు, ఈ కంపెనీలో పొజిషన్లేంటి?
మరణ శిక్ష పడిన వారిలో ఒకరు కమాండర్ పూర్ణేందు తివారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసేవారు.
భారత్, ఖతార్‌ల మధ్య సంబంధాలు మెరుగుపర్చడంలో ఈయన అందించిన సహకారానికి గుర్తింపుగా ఈయనకు 2019లో ప్రవాసి భారతీయ సమ్మాన్‌తో సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని భారతీయ సాంస్కృతిక కేంద్రం నిర్వహించింది.
ఈ సమయంలో భారతీయ రాయబారి కార్యాలయానికి డిఫెన్స్ అటాచ్ అయిన కెప్టెన్ కౌశిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరణ శిక్ష పడిన ఈ భారతీయులు, అరెస్ట్‌కు ముందు నాలుగు నుంచి ఆరేళ్లుగా దహ్రాలో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కుటుంబ సభ్యులు ఏం చెప్పారు?
కిందటేడాది వీరిని అరెస్ట్ చేసిన తర్వాత కమాండర్ పూర్ణేందు తివారీ సోదరి డాక్టర్ మీతూ భార్గవ, కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్ సోదరుడు నవదీప్ గిల్ మాట్లాడారు.
వీరిని విడిపించాలని ఆ సమయంలో మోదీ ప్రభుత్వాన్ని తాము కోరినట్లు మీతూ భార్గవ చెప్పారు.
తన సోదరుడు సీనియర్ సిటిజన్ అని, ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 63 ఏళ్ల వయసులో, ఆయనను ప్రత్యేక చెరలో ఉంచారని, ఎన్ని ఇబ్బందులను ఆయన ఎదుర్కొంటున్నారో తలుచుకోవడమే కష్టంగా ఉందన్నారు.
జైలు నుంచే తన సోదరుడు పూర్ణేందు తివారీ తన 83 ఏళ్ల తల్లితో మాట్లాడినట్లు ఆమె చెప్పారు. కొడుకు క్షేమం గురించి తన తల్లి చాలా బాధపడుతుందన్నారు.
సెప్టెంబర్ 6న పుట్టిన రోజు సందర్భంగా వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపినప్పటికీ తమ సోదరుడి నుంచి సమాధానం రాకపోవడంతో ఏదో అనుమానాస్పందంగా అనిపించిందని కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్ సోదరుడు నవదీప్ గిల్ చెప్పారు.
ఆ తర్వాత ఫోన్ కాంటాక్ట్ కూడా ఆగిపోయిందన్నారు.
కంపెనీని సంప్రదిస్తే, ఖతార్ సెక్యూరిటీ సర్వీసు వారిని అరెస్ట్ చేసిందని తెలిసిందని చెప్పారు.
సోదరుడికి ఆరోగ్య సమస్యలున్నాయని నవ్‌దీప్ గిల్ తెలిపారు. పదవీ విరమణ అయ్యేంత వరకు భారతీయ నౌకాదళంలో తన సోదరుడు పనిచేశారన్నారు.
‘‘నా సోదరుడిని విడిపించి, తిరిగి భారత్‌కు తీసుకురావడం ప్రభుత్వం కర్తవ్యం. అరెస్ట్ అయిన భారతీయులను వెనక్కి తీసుకురావడం ప్రభుత్వ ప్రాధాన్యత అని గత ఏడాది డిసెంబర్‌లో విదేశాంగ వ్యవహారాల మంత్రి జై శంకర్ తెలిపారు’’ అని గుర్తుకు చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌కు అతిపెద్ద సవాలు ఏంటి?
భారత్‌కు ఇది పెద్ద రాజకీయ సవాలుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించి, మాజీ నౌకాదళ అధికారులను విడిపించేందుకు భారత్ ఏం చేయగలదు? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వెస్ట్ ఏషియన్ స్టడీస్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ ముదాసర్ ఖమర్ బీబీసీ హిందీతో మాట్లాడారు.
‘‘దౌత్య స్థాయిలో చర్చలు జరగకపోతే, ఈ సమస్య దేనికి దారితీయనుందో చెప్పనుందో కష్టమే. అవును, భారత్‌లో ప్రజాభిప్రాయంపై ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
మాజీ నౌకాదళ అధికారులపై వస్తోన్న ఆరోపణలపై అటు భారత్ కానీ, ఇటు ఖతార్ కానీ బహిరంగంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఇది చాలా సున్నితమైన విషయం.
ఇలాంటి సున్నితమైన విషయాలు ప్రమేయమున్నప్పుడు, దేశాల మధ్యనున్న స్నేహపూర్వకమైన సంబంధాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.
ఇది చాలా సున్నితమైన విషయం అయినందునే ఇరు దేశాలు కూడా వెంటనే స్పందించలేదని అర్థమవుతోంది’’ అని ప్రొఫెసర్ ఖమర్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌కు ఇది అతిపెద్ద దౌత్యపరమైన సమస్యనా?
దీన్ని దౌత్యపరమైన సవాలుగా చెప్పడం కష్టమేనని ఖమర్ అన్నారు. ఎందుకంటే, శిక్ష పడిన వారు భారతీయ మాజీ నౌకాదళ ఉద్యోగులు. కానీ, వీరు ఎలాంటి ప్రభుత్వ పనిపై అక్కడ పనిచేయడం లేదు. వీరు ప్రైవేట్ కంపెనీ కోసం పనిచేసేవారు.
దీన్ని దౌత్యపరమైన సవాలుగా చెప్పడం కష్టమే. ఇది కొంత రాజకీయ, దౌత్యపరమైన ప్రభావాన్ని చూపనుంది. కానీ, ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే’’ అని ఖమర్ చెప్పారు.
‘‘ఈ విషయం కోర్టులో ఉన్నందున్న, ఎలాంటి పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ బయటికి రాలేదు. విదేశీ విధానం కింద సంయమనంతో దీన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆ వివరాలను భారత ప్రభుత్వం తెలుపాలి. అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందో లేదో చూడాలి. ఖతార్‌లో దీనిపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంటే, దీని నుంచి ఎంత మేర ప్రయోజనం పొందవచ్చో చూడాలి’’ అని తెలిపారు.
ఈ విషయాన్ని అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లవచ్చా లేదా అనే విషయాన్ని కూడా పరిగణిస్తున్నారని చెప్పారు.
ఈ విషయంలో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు.
చర్చల ద్వారా ఈ సమస్యను ఇరు దేశాల ప్రభుత్వాలు పరిష్కరించుకుంటాయో చూడాల్సి ఉందన్నారు.
భారత్, ఖతార్ సంబంధాలు
భారత్, ఖతార్‌కు స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. కానీ, 2022 జూన్‌లో ఈ సంబంధాలు తొలిసారి ఈ సంబంధాలకు బీట్లు వారాయి.
ఒక టీవీ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, ప్రవక్త మహమ్మద్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంతో తొలిసారి వివాదం చెలరేగింది.
ఆ సమయంలో భారత్ నుంచి ‘బహిరంగ క్షమాపణ’ కోరిన తొలి దేశంగా ఖతార్ నిలిచింది.
ఇస్లామిక్ ప్రపంచంలో పెరుగుతోన్న కోపోద్రిక్తులను శాంతింపజేసేందుకు బీజేపీ వెంటనే నుపుర్ శర్మను తొలగించింది.
ప్రస్తుతం 8 మంది మాజీ నౌకాదళ ఉద్యోగులకు విధించిన మరణ శిక్ష భారత్-ఖతార్ సంబంధాలకు మరో పెద్ద సంకటంగా నిలుస్తోంది.
8 నుంచి 9 లక్షల మంది భారతీయులు ఖతార్‌లో పనిచేస్తున్నందున్న భారత ప్రభుత్వం భారతీయుల ప్రయోజనాలకు, పరిరక్షణకు ఎలాంటి హానీ కలుగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అలాగే, సహజ వాయువును కూడా ఎక్కువగా ఖతార్ నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఎగుమతి దేశంగా ఉంది.
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల దాడి భీకరంగా సాగుతోన్న ఈ సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్యలో ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో హమాస్ చెరలో ఉన్న మరింత మంది అమెరికా బందీలు బయటపడేందుకు వీలవుతుంది.
ఇవి కూడా చదవండి:
- విడాకులకూ పెళ్లంత ఘనంగా మేళతాళాలతో వేడుక, ఈ తండ్రి ఎందుకిలా చేశారంటే....
- కెనడా: ఈ మూడు నగరాల్లో శాశ్వత నివాసం కోసం విదేశీయులు ఎందుకు తహతహలాడతారు?
- 'దమ్ మారో దమ్' హిప్పీలు ఏమయ్యారు?
- పాకాల సుగుణాకర్: ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారుల్లో ఒకరైన ఈ విశాఖ వాసి బంధువులు ఏమంటున్నారు?
- గుజరాత్: మోర్బీ వంతెన విషాదానికి ఏడాది... సిట్ దర్యాప్తులో ఏం తేలింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














