విడాకులకూ పెళ్లంత ఘనంగా మేళతాళాలతో వేడుక, ఈ తండ్రి ఎందుకిలా చేశారంటే....

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
- రచయిత, ఆనంద్ దత్తా
- హోదా, బీబీసీ కోసం
జార్ఖండ్ రాజధాని రాంచీలో నివసించే ప్రేమ్ గుప్తా గురించి కొన్ని రోజుల క్రితం వరకు ఎవరికీ అంతగా తెలీదు.
ఇటుకబట్టీల వ్యాపారం నిర్వహించే ప్రేమ్ గుప్తా ఫొటోలు, వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
విడాకులు తీసుకోవాలన్న తన కూతురి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేళ తాళాలతో ఊరేగింపుగా తన కూతురిని పుట్టింటికి తీసుకురావడమే ఇందుకు కారణం
తన ఒక్కగానొక్క కుమార్తె సాక్షిగుప్తాకు కొన్ని నెలల క్రితమే వివాహమైంది. కొన్ని కారణాల వలన తన వివాహ బంధాన్ని ముగించాలని అనుకున్నారు సాక్షి గుప్తా.
తన నిర్ణయాన్ని తండ్రికి తెలపగా, ఆయన మద్దతుగా నిలవడమే కాకుండా, ఊరేగింపుగా ఆమెను తన ఇంటికి తీసుకుని వచ్చారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
సమాజానికి చెప్పాలనుకున్నా..
ప్రేమ్ గుప్తా రాంచీలోని కిశోర్‌గంజ్ ప్రాంతంలో నివసించేవారు.
పెళ్లి చేసి మెట్టినింటికి పంపేటప్పుడు ఎంత వేడుకగా, ఊరేగింపుగా పంపామో, అంతే వేడుకగా తన కూతురిని పుట్టింటికి తీసుకురావాలని తానే నిర్ణయించినట్లు తనదేనని ప్రేమ్ గుప్తా అన్నారు.
సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బీబీసీకి చెప్పారు.
“నా కూతురు వివాహానికి చాలా ఖర్చు చేశా. కానీ, అత్తారింట్లో తన పరిస్థితి తెలిశాక, నా కూతురు ఏ తప్పు చేయలేదని అర్థమైంది. అలాంటప్పుడు తననెందుకు సగౌరవంగా ఇంటికి తిరిగి తీసుకురాకూడదు? అనిపించింది. ఇలా చేయడం ద్వారా నా కూతురిదే తప్పని, వివాహ బంధాన్ని నిలుపుకోలేకపోయిందని సమాజం అనే అవకాశం ఇవ్వకూడదని అనుకున్నాను” అని చెప్పారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతున్నప్పుడు సాక్షి గుప్తా కూడా అక్కడే ఉన్నారు.
తన తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా రావడాన్ని చూసినప్పుడు తానేమని అనుకున్నారో బీబీసీతో చెప్పారు.
‘‘ఆ రోజు నవరాత్రులు మొదలైన తొలిరోజు. అదే రోజునే మహాలక్ష్మిని తీసుకువెళతానని నాన్న నాతో చెప్పారు. ఆయన ఆడపిల్లలను మహాలక్ష్మిలుగా భావిస్తారు. ఎంతో ప్రేమిస్తారు. ఆ డ్రమ్ముల శబ్దాలు వింటున్నప్పుడు నేను సామాన్లు సర్దుతున్నాను. పెళ్లి ఊరేగింపు జరుగుతోందని అనుకున్నాను. బయటకు వచ్చి చూడగా నా తండ్రి, కుటుంబం ఊరేగింపుతో కనిపించడంతో ఆశ్చర్యపోయాను” అన్నారు.
“అక్కడి నుంచి బయల్దేరేటప్పుడు నా పెళ్లి ఫొటోలను చూసుకున్నాను. అవి చూశాక చాలా బాధగా అనిపించింది. అన్నింటినీ చింపేశాను. నేను బయటకు వచ్చినప్పుడు నా తండ్రి, నా భుజంపై చేయి వేశారు. ఆయన ముఖంలో నవ్వు చూశాను. ఆయన బాధపడట్లేదని, సంతోషంగానే ఉన్నారని నాకు అనిపించింది” అన్నారు.
“నా తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి తండ్రి తన కూతురు విషయంలో తీసుకోవాలి” అన్నారు సాక్షిగుప్తా.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
భవిష్యత్తుపై ఆశతో..
"నాన్న నా అప్పగింతలప్పుడు ఎంతగానో ఏడ్చారు. కానీ నన్ను తిరిగి తీసుకురావడానికి నవ్వుతూ వచ్చారు. దీంతో విడాకుల వలన వచ్చే ఒత్తిడి కొంతమేర తగ్గినట్టనిపించింది" అని సాక్షి చెప్పారు.
‘‘నేనీ రోజు ఎక్కడికి వెళ్ళినా, గర్వంగా అనిపిస్తోంది. నా తల్లిదండ్రులు నాకు ఇంతకు మునుపులాంటి సాధారణ జీవితాన్నిఇచ్చారు. వివాహబంధంలో నా తప్పేమీ లేదు. గతాన్ని మరిచిపోలేకపోతున్నాను. కానీ ఆ బాధ చాలా తక్కువ. అది ముగిసిపోయింది’’ అని తెలిపారు సాక్షి.
భవిష్యత్ గురించి అడగ్గా తాను ఆర్థికంగా తన కాళ్ళపై తాను నిలబడాలనుకుంటున్నాని సాక్షి చెప్పారు.
"ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేశాను. తిరిగి నా చదువును కొనసాగించాలనుకంటున్నాను. సొంత బొటిక్ తెరవాలనే ఓ చిన్న కల ఉంది. వస్త్రాల డిజైన్ల విషయంలో నాకెంతో ఆసక్తి ఉంది" అని తెలిపారు.
‘‘నాలాంటి ఎంతోమంది యువతుల నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు అనేక సందేశాలు వస్తున్నాయి. నేను ఎంతోమంది యువతులకు దారి చూపాను. ఇది భవిష్యత్తులో కూడా చేస్తాను’’ అని సాక్షి చెప్పారు.
‘‘నేను ఇటువంటి అమ్మాయిలకు చెప్పదలుచుకున్నదేమిటంటే, మీ సమస్యలను మీరు మీ తల్లిదండ్రులకు చెప్పండి, వారు మీకు మద్దతుగా నిలుస్తారు’’ అని ప్రేమ్ గుప్తా చెప్పారు.
ఇవి కూడా చదవండి..
- స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చదివితే మెదడుకు ఏమవుతుంది?
- ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ పర్యటనకు వస్తే స్కూల్స్ ఎందుకు మూసేస్తున్నారు?
- టెన్నిస్ ఆటగాళ్ల చేతి ఎముక మిగతా వారికంటే ఎందుకు పొడవు ఉంటుంది?
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















