ప్రపంచంలో సమ్మెకు దిగిన తొలి ప్రధాన మంత్రి ఈమె, ఎందుకు చేశారంటే...

ఫొటో సోర్స్, REUTERS
దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి సమ్మెలో పాల్గొనడం ఏ దేశ రాజకీయ చరిత్రలోనైనా చాలా అరుదు. కానీ, ఐస్‌లాండ్‌లో ఇది జరిగింది. యూరప్‌లో ఒక చిన్న దేశం ఐస్‌లాండ్.
ఐస్‌లాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ యాకోబ్స్‌డోట్టిర్‌తో సహా వేల మంది మహిళలు అక్టోబర్ 24న ఒక రోజు సమ్మెకు దిగారు.
సమ్మెలో పాల్గొన్న తొలి ప్రధానమంత్రిగా ఆమె చరిత్రలోకి ఎక్కారు.
వేతనాల్లో ఉన్న అసమానతలు, జెండర్ ఆధారితంగా జరుగుతోన్న హింసకు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు సమ్మె చేపట్టారు.
ప్రధానమంత్రితో పాటు వేలాది మహిళలు ‘ఉమెన్స్ డే ఆఫ్’ తీసుకున్నారు. అంటే మంగళవారం మహిళలెవరూ పనిచేయలేదు.
ఐస్‌లాండ్‌లో విద్య, వైద్య రంగాల్లో పనిచేసే చాలా మంది మహిళలు ఈ సమ్మెకు దిగారు. దీంతో ఈ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఒక రోజు సమ్మెలో పాల్గొన్న మహిళలు అన్ని పనులకూ దూరంగా ఉన్నారు. గృహిణులు కూడా ఈ సమ్మెలో పాలుపంచుకున్నారు.
ఐస్‌లాండ్‌లో మంగళవారం ప్రీ, ప్రైమరీ స్కూల్స్ మూతపడ్డాయి. ఒకవేళ ఏమైనా తెరుచుకున్నా...వాటిల్లో సరిపడినంత మంది ఉద్యోగులు లేరు.
ఈ సమ్మె ప్రభావం మ్యూజియంలు, లైబ్రరీలు, జూలలో కూడా కనిపించింది.

ఫొటో సోర్స్, WOMEN'S HISTORY ARCHIVES
‘‘ఈ రోజు నేను పనిచేయను’’ – ప్రధానమంత్రి
సమ్మెలో పాల్గొన్న ఐస్‌లాండ్ ప్రధానమంత్రి.. ‘‘ ఈ రోజు నేను పనిచేయను’’ అని మంగళవారం చెప్పారు.
కేబినెట్‌లో ఉన్న మహిళలందరూ కూడా పనిచేయరని ఆశిస్తున్నానని తెలిపారు.
విద్యా రంగంలో ప్రతి స్థాయిలో ఎక్కువగా మహిళలే పనిచేస్తున్నారని ఐస్‌లాండ్ టీచర్స్ యూనియన్ తెలిపింది.
వీరిలో 94 శాతం మంది టీచర్లు చిన్న పిల్లలకు బోధించే వారని పేర్కొంది.
వైద్య రంగం గురించి మాట్లాడుకుంటే.. ఐస్‌లాండ్‌లో అతిపెద్ద ఆస్పత్రి నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్. దీనిలో పనిచేసే 80 శాతం ఉద్యోగులు మహిళలే.
‘‘ఐస్‌లాండ్‌లో లింగ సమానత మెరుగుపడింది. కానీ, మహిళలకు వ్యతిరేకంగా జరుగుతోన్న హింస మాత్రం ఇంకా సమస్యగానే ఉంది’’ అని సమ్మెకు నాయకత్వం వహిస్తున్న క్రిస్టీన్ బీబీసీతో చెప్పారు.
‘‘వాస్తవంగా మరింత లింగ సమానత్వం, తక్కువ హింస ఉండాలి. కానీ, అలా జరగడం లేదు’’ అని ఆమె అన్నారు.
మహిళలకు వ్యతిరేకంగా జరుగుతోన్న హింస తమ సాంస్కృతిక మూలాల్లో పాతుకుపోయి ఉందన్నారు.
మహిళలకు వ్యతిరేకంగా జరుగుతోన్న హింసపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన గ్లోబల్ డేటాలో, ఐస్‌లాండ్‌లో 22 శాతం మంది మహిళలు తమ భాగస్వామి చేతిలో శారీరక, మానసిక హింసను ఎదుర్కొంటున్నారని తెలిసింది.
అంతేకాక, 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో హింసను భరించారని ఆ నివేదికలో ఉంది.
ఐస్‌లాండ్ చరిత్ర
యూరప్‌లో అతి చిన్న దేశం ఐస్‌లాండ్. దీని రాజధాని రెక్యావిక్.
ఈ దేశ జనాభా 3 లక్షల కంటే కాస్త ఎక్కువ.
ఈ దేశంలో మహిళలు చాలా వరకు విద్య, వైద్య రంగాల్లో పనిచేస్తుంటారు.
వరుసగా 14 ఏళ్ల నుంచి లింగ సమానత జాబితాలో ప్రపంచంలోని ఉత్తమ దేశాల్లో ఒకటిగా ఐస్‌లాండ్ ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలిపింది.
ఈ దేశానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 91.2 శాతం స్కోరును ఇచ్చింది.
ఈ దేశానికి ‘‘ఫెమినిస్ట్ హెవెన్’’ లేదా ‘‘హెవెన్ ఫర్ ఉమెన్’’ అంటే స్త్రీలకు స్వర్గధామం అనే పేరు కూడా ఉంది.
కానీ, ఇంకా తమ దేశంలో లింగ అసమానత ఉందని, దీని కోసం ఎమర్జెన్సీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంగళవారం సమ్మెలో పాల్గొన్న ఒక మహిళ అన్నారు.
ఐస్‌లాండ్‌లో లింగ అసమానతపై మహిళలు తమ గొంతుక వినిపించడం ఇదే తొలిసారి కాదు. చరిత్రలో ఇలాంటి నిరసనలు జరిగాయి.

ఫొటో సోర్స్, WOMEN'S HISTORY ARCHIVES
1975లో తొలిసారి, దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఒక రోజంతా సమ్మెలో పాల్గొన్నారు.
1975 అక్టోబర్ 24న దేశంలో 90 శాతం మంది మహిళలు లింగ సమానత్వాన్ని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు.
ఆఫీసుకు వెళ్లి పనిచేయడం, ఇంటి పనులు చేయడం, పిల్లల్ని చూసుకోవడం వంటి అన్ని బాధ్యతలను పక్కన పెట్టి, వీధుల్లోకి వచ్చి మహిళలు నిరసన తెలిపారు.
వేల మంది మహిళలు పోగై, చేతుల్లో బ్యానర్లు పట్టుకుని, పురుషులతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలని కోరారు.
ఈ రోజును ఐస్‌లాండ్‌లో ఉమెన్స్ డే ఆఫ్‌గా చెబుతుంటారు.
ఐస్‌లాండ్‌లో 1915లో మహిళలు ఓటు హక్కును పొందారు. 1975లో ఆ దేశ పార్లమెంట్‌లో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ఎంపీలుగా ఉండేవారు.
ప్రస్తుతం ఆ దేశ పార్లమెంట్‌లో 30 మంది మహిళా ఎంపీలున్నారు.
1970ల్లో ఏర్పాటైన మహిళల సంస్థ రెడ్ స్టాకింగ్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.
కొంతమంది మహిళలు అప్పట్లో ఈ సమ్మెను వ్యతిరేకించారు.
కానీ, ఈ సమ్మె పేరును ‘ఉమెన్స్ డే ఆఫ్’గా మార్చినప్పుడు, ప్రతి ఒక్కరూ దీనికి సహకరించారు.
ఒక గృహిణి, ఇద్దరు ఎంపీలు, మహిళా ఉద్యమానికి చెందిన ప్రతినిధి, మహిళా కార్మికురాలు ఈ ర్యాలీలో స్పీకర్లుగా వ్యవహరించారు.
ఈ ఉద్యమం గురించి అప్పటి ప్రధానమంత్రి విగ్డిస్ ఫిన్‌బోగాడోట్టిర్‌ను బీబీసీ క్రిస్టీ బ్రూవర్ ఇంటర్వ్యూ చేశారు. దీన్ని పురుషులు ఎలా స్వీకరించారని అడిగారు.
‘‘తొలుత దీన్ని ఒక జోక్‌గా అనుకున్నారు. ఎవరైనా దీన్ని కోపగించుకున్నారా? అన్నది నాకు గుర్తు లేదు. ఒకవేళ ఈ ఉద్యమాన్ని నేను వ్యతిరేకించినా లేదా తిరస్కరించినా.. పాపులారిటీ కోల్పోతానేమో అనిపించింది’’ అని విగ్డిస్ తెలిపారు.
1975లో ఈ సమ్మె జరిగిన తర్వాత, సమాన వేతనాలకు సంబంధించిన చట్టాన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది.
1975లో సమ్మె మహిళల స్వాతంత్య్రం కోసం పడిన తొలి అడుగని 2015లో మాజీ ప్రధానమంత్రి విగ్డిస్ చెప్పారు.
ఆ తర్వాత 1980లో, ఐస్‌లాండ్‌కు తొలి మహిళ ప్రధానమంత్రి అయ్యేందుకు విగ్డిస్‌కు మార్గం సుగమమైంది.
ఇవి కూడా చదవండి:
- నీళ్ల కోసం వెళ్తే మొసళ్ల దాడులు.. వీటిని ఇండోనేషియా ఎందుకు ఆపలేకపోతోంది?
- ‘ప్రతి భారత సైనికుడూ మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలి’ – బీబీసీ ఇంటర్వ్యూలో మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ
- 'షమీ ఫెర్రారీలాంటి వాడు, గ్యారేజిలోంచి ఎప్పుడు తీసినా స్పీడ్ తగ్గేదే ఉండదు...'
- భారత్, చైనా: సరిహద్దుకు అటూఇటూ మళ్ళీ సేనల మోహరింపు... నాలుగేళ్ళుగా శీతాకాలంలో ఎందుకీ టెన్షన్స్?
- దేవుని వెల్లంపల్లి: ఇక్కడ తరతరాలుగా యానాదులే పూజారులు, ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















