గాజాపై దాడులు: ‘పరిస్థితి ఘోరంగా ఉంది, గాజా ఈ భూమితో సంబంధాలు కోల్పోయింది’

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గాజాలో దారుణ పరిస్థితులు
    • రచయిత, రెడిషియాన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముండో

ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ఇప్పటి వరకు చేసిన దాడులతో పోలిస్తే, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జరిపిన బాంబు దాడులకు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

అదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడిని విస్తృతం చేస్తూ, పాలస్తీనా భూభాగంలోకి ప్రవేశించింది.

శనివారం అక్కడి పరిస్థితులపై బీబీసీ జర్నలిస్ట్ రష్దీ అబు అలౌఫ్ ఖాన్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నుంచి రిపోర్ట్ చేశారు.

శనివారం గాజా అంతటా భయం, ఆందోళనలే కనిపించాయని, గాజాలో ఇంతటి తీవ్రస్థాయిలో బాంబుల దాడులను అంతకుముందెన్నడూ చూడలేదని అన్నారు.

ఈ దాడుల్లో వందల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయి, వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, గాజాలో పౌరుల భద్రతకు ఐడీఎఫ్ చర్యలు తీసుకుంటుందన్న బెంజమిన్ నెతన్యాహు

యుద్ధం కొనసాగిస్తాం-బెంజమిన్

తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు స్పందించారు. దాడులకు సంబంధించిన వివరాలు, తదుపరి వ్యూహాలపై శనివారం ప్రకటనలు విడుదల చేశారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ గల్లాంట్ మాట్లాడుతూ, "యుద్ధంలో రెండో దశకు చేరుకున్నాం. క్షేత్రస్థాయిలో దాడులను విస్తృతం చేస్తూ ముందుకు సాగుతాం" అని చెప్పారు.

ప్రధాని నెతన్యాహు టీవీ చానెల్‌ ప్రసంగంలోనూ ఇదే మాట చెప్పారు.

"దళాలు గాజా అంతటా విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ యుద్ధంలో రెండో దశ మొదలైంది. హమాస్‌ నిర్మూలన, హమాస్ చెరలో ఉన్న వారిని విడిపించి, తిరిగి తీసుకువచ్చే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం, ఇది దీర్ఘకాలం కొనసాగే సంక్లిష్టమైన యుద్ధం" అన్నారు.

ఐడీఎఫ్ పౌరుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని , హమాస్ సంస్థ పౌరులను రక్షణ కవచాలుగా మార్చుకుని నేరాలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు అన్నారు .

హమాస్‌ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటలో ఇప్పటివరకు 7700 మంది చనిపోయారని తెలిపింది. శుక్రవారం జరిగిన దాడుల్లో మరణించిన వారిలో 40% మంది పిల్లలు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అక్టోబర్ 7న హమాస్ సంస్థ జరిపిన దాడుల్లో 1400 మంది చనిపోగా, వారిలో ఎక్కువ మంది పౌరులే. మరో 200మందిని బందీలుగా తీసుకుని వెళ్లింది ఆ సంస్థ.

ఉత్తర గాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర గాజాలో బాంబు దాడులు

బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేసి..

ఉత్తర గాజా నుంచి ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ సైన్యం సూచించడంతో అక్కడి వారంతా దక్షిణ గాజాలో తలదాచుకుంటున్నారు. ఇప్పడు అక్కడ కూడా దాడులు జరుగుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.

బాంబు దాడుల తర్వాత గాజా స్ట్రిప్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడం ఆగిపోయింది. దీంతో గాజాలోని పౌరులు, ఆసుపత్రి సిబ్బంది, సహాయక సిబ్బంది, జర్నలిస్టులు బయటి ప్రపంచంతో సంప్రదింపులు జరపలేకపోయారు.

"గత రాత్రి ఉన్నట్లుండి అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయాయి’’ అని మధ్య గాజాలోని డెయిర్ అల్ బలాహ్ నగరానికి చెందిన వ్యక్తి బీబీసీతో అన్నారు. అక్కడి పరిస్థితి గురించి ఆయన శనివారం మధ్యాహ్నానికి గానీ, తన వాయిస్ నోట్‌ను బీబీసీకి పంపలేకపోయారు.

‘‘ఇప్పుడు మళ్లీ దాడి జరుగుతోంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ప్రజలంతా భయాందోళనల్లో ఉన్నారు. గాజా ఈ భూమితో సంబంధం కోల్పోయింది " అని వాయిస్ నోట్‌లో ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్ భూతల దాడుల్లో వేలమందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

"ఈ బాంబు దాడులు హింసాత్మకమైనవి. సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయి. గాజా 56 ఏళ్ల చరిత్రలో ఈ బాంబుదాడుల ఫలితంగా చోటుచేసుకునే పరిణామాలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి. వేలకొద్దీ పౌరులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది" అన్నారు.

గాజా ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాంబు దాడులతో గాజాలో వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి

హమాస్ లక్ష్యంగా యుద్ధం

శుక్రవారం అర్ధరాత్రి జరిగిన వరుస బాంబుల దాడుల్లో హమాస్‌కు చెందిన 150 స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఈ దాడుల కోసం సుమారు 100 ఫైటర్ జెట్స్‌ను వినియోగించినట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ గిలాద్ కెయినన్ తెలిపారు.

ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగరీ రాయిటర్స్ ఏజెన్సీతో, దళాలు క్షేత్రస్థాయిలో ముందుకు సాగుతున్నాయని మాత్రమే చెప్పారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం భూతల దాడులను పెంచడం ద్వారా శత్రువును బలహీనపర్చాలన్న వ్యూహం కనిపిస్తోంది. అందులో భాగంగానే వేలకొద్దీ ఇజ్రాయెల్ సైనికులు గాజా సరిహద్దుల వద్ద, యుద్ధ ట్యాంకులు, ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు.

ఇజ్రాయెల్ శాశ్వత సైన్యంలోని 1.6 లక్షల మందితోపాటు మరో 3 లక్షల మంది యుద్ధంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరోవైపు 25 వేల మిటలరీ సైన్యం, గాజా అంతటా విస్తరించిన 500 కిలోమీటర్ల పొడవైన సొరంగాలతో ఇజ్రాయెల్ సైన్యాన్ని ఎదుర్కొంటామని హమాస్ అంటోంది.

రోమ్ నగరం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, పాలస్తీనియన్లకు మద్దతుగా రోమ్‌ నగరంలో ప్రదర్శనలు

ప్రపంచ వ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతు

గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా శనివారం యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియాల్లో వేలకొద్దీ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. లండన్‌లో భారీసంఖ్యలో ప్రజలు మార్చ్ నిర్వహించారు.

తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో అధ్యక్షులు తయ్యిప్‌ ఎర్దొవాన్ భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంలో, ఇజ్రాయెల్‌ను ఆక్రమిత దేశంగా ఆరోపిస్తూ, హమాస్‌ను టెర్రరిస్ట్ సంస్థగా గుర్తించబోమన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారు.

హమాస్ మిలిటెంట్ సంస్థను స్వాతంత్య్ర సమరయోధులుగా వర్ణిస్తూ, ఇజ్రాయెల్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

కౌలాలంపూర్, బాగ్దాద్, రోమ్, స్టాక్‌హోమ్, కోపెన్‌హెగన్‌లలో కూడా భారీ ప్రదర్శనలు జరిగాయి.

గాజా ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, Israel Defense Forces

ఫొటో క్యాప్షన్, గాజా మొత్తం సైన్యాన్ని దింపామని ఇజ్రాయెల్ వెల్లడించింది.

గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర మొదలైందా?

గాజాలో నెలకొన్న తాజా పరిస్థితులపై జెరూసలెం నుంచి బీబీసీ ఇంటర్నేషనల్ న్యూస్ ఎడిటర్ జెరెమి బోవెన్ అందించిన విశ్లేషణ ప్రకారం..

ఉత్తర గాజాలోకి ప్రవేశించిని ఇజ్రాయెల్ సైన్యం, బెయిత్ హనౌన్‌పై దృష్టిసారించి, ఆ తరువాత దక్షిణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

హమాస్ సొరంగాలను గుర్తించి, వైమానిక దాడులతో వాటిని ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్తోంది ఇజ్రాయెల్ మిలటరీ.

ఇప్పటివరకు 3 లక్షల మంది ఇజ్రాయెల్ తరపున పోరాటానికి ముందుకు వచ్చారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది.

శనివారం ఇజ్రాయెల్ సైన్యం చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, ప్రతీకారం దిశగానే సాగుతున్నట్లు అనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులను భారీ మిలటరీ ఆపరేషన్‌గా చెప్పొచ్చు.

వీడియో క్యాప్షన్, పాలస్తీనా ప్రత్యేక దేశం కాలేకపోవడానికి 4 ప్రధాన కారణాలివే...

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)