విజయనగరం రైలు ప్రమాదం: 13కు చేరిన మృతుల సంఖ్య, అసలు ఇదెలా జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, ANI
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ మధ్య ఆగివున్న పలాస ప్యాసింజర్‌ను అదే ట్రాక్‌పై వచ్చిన రాయగడ ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 13 మంది మరణించారని, ఇందులో 11 మందిని గుర్తించారని, మిగతా వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం తెలిపారు.
ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడ్డారు.
ఘటనా స్థలం నుంచి బీబీసీ ప్రతినిధి లక్కోజు శ్రీనివాస్ అందిస్తున్న కథనం ఇది.
కంటకాపల్లి-అలమండ గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఈ రెండు గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, రైల్వే సిబ్బంది రాక ముందు వారే సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
బోగీలను కోసి బాధితులు ఎవరైనా ఉన్నారేమో గుర్తించేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

బాలాసోర్ ప్రమాదాన్ని గుర్తుకు తెస్తోంది
ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకునేందుకు కంటకాపల్లి నుంచి చిన్న మట్టి రోడ్డుపై కిలోమీటరున్నర దూరం పొలాలు, తోటలు దాటుకుంటూ నడవాలి. కిలోమీటరు దూరం వెళ్తే ఎరుపు, నీలం లైట్లు వెలుగుతున్న అంబులెన్సులు పది వరకు కనిపించాయి. వాటి మధ్య నేల మీద పడుకోబెట్టిన రెండు మృతదేహాలు కనిపించాయి.
మరికొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో మూడు మృతదేహాలు కనిపించాయి. అప్పటికే ఐదు మృతదేహాలు కనిపించడంతో ఈ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థమైంది.
అక్కడ నుంచి మరో పావు కిలోమీటరు రైల్వే ట్రాక్‌ను ఆనుకుని నడిచి వెళ్తే ప్రమాద స్థలం కనిపించింది. కొంచెం దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తే ఈ ఏడాది జూన్ 2న దేశంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం గుర్తుకు వస్తోంది.
బాలాసోర్‌లో మాదిరిగానే రైలు బోగీలు ట్రాక్ నుంచి కిందకు జారి కనిపించాయి. అదే తరహాలో ఇక్కడ కనిపించింది.
అధికారులతో మాట్లాడుతుంటే వారు దీనిని బాలాసోర్ రైలు ప్రమాదంతోనే పోలుస్తున్నారు.

మరో ఐదు నిమిషాల్లో రైలు దిగుతాడనగా...
ఈ ప్రమాద మృతుల్లో కంటకాపల్లి వాసి రవి ఒకరు. కంటకాపల్లి సమీపంలోనే ఉండటం, ఆ గ్రామస్థులు, రవి సోదరుడు, స్నేహితులు అక్కడికి చేరుకోగానే ముందుగా మరణించిన వారిలో రవిని గుర్తుపట్టారు.
“రవి మేం అంతా కలిసి రోజూ పలాస ప్యాసింజర్ ఎక్కి విశాఖపట్నం వెళ్తాం. అక్కడ మా పనులు ముగించుకుని సాయంత్రం మళ్లీ పలాస ప్యాసింజర్ లోనే మా కంటకాపల్లికి చేరుకుంటాం. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశానికి మా ఊరు కేవలం రెండు కిలోమీటర్లే. మరో ఐదు నిముషాల్లో మా ఊర్లో ట్రైన్ ఆగుతుంది. రవి దిగేస్తాడు. కానీ ఈ ప్రమాదం వలన మాకు రవి దూరమైపోయాడు..” అని ఆయన స్నేహితుడు గౌరీ నాయుడు కన్నీళ్లు పెట్టుకుంటూ బీబీసీతో చెప్పారు.
బీబీసీ ఘటనా స్థలానికి వెళ్తున్నప్పుడు గౌరీ నాయుడు, మరికొందరు స్నేహితులు రవి మృతదేహం వద్ద వేచి చూస్తూ కనిపించారు.

ఆదివారమే అయినా పనికి వెళ్లక తప్పలేదు
కంటకాపల్లిలోని చాలా మంది యువకులు విశాఖలోని కాంట్రాక్టర్ల వద్ద వివిధ పనులు చేస్తుంటారు. అందులో రవి కూడా ఒకరు. సోమవారం నుంచి శనివారం వరకు పని. ఆదివారం సెలవు. కానీ ప్రమాదం జరిగిన నాడు ఆదివారం. అయినా కూడా రవి పనికి వెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడంటూ అతని సోదరులు కన్నీరు పెట్టుకున్నారు.
“రవి విశాఖలోని ఎలక్ట్రికల్ కాంట్రక్ పనులు చేసే సంస్థలో పని చేస్తుంటాడు. ఎప్పుడూ లేనిది ఇవాళ కంపెనీ నుంచి ఆదివారం రవికి ఫోన్ వచ్చింది. అర్జెంట్ పని ఉంది రావాలని, ఈ సెలవు మరో రోజు తీసుకోవచ్చునని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు.
పదేళ్ల నుంచి చేస్తున్న సంస్థ కావడంతో రవి వెంటనే పనికి వెళ్లాడు. రవి లాగే మరికొందరు కూడా అలా కంపెనీ తరపున ఎప్పుడూ పిలిచినా కూడా వెళ్తుంటారు. అలా ఉదయం వెళ్లిన రవి, సాయంత్నానికి ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఎంత దురదృష్టం” అంటూ గ్రామస్థులు రవిని తల్చుకుంటున్నారు.
చీపురుపల్లి నుంచి నాగేశ్వరరావు, ఆయన బావ రోజూ విశాఖపట్నానికి తాము చేసే కంపెనీలో పని కోసం వస్తుంటారు. గత ఏడేళ్లుగా పలాస నుంచి విశాఖకు పలాస ప్యాసింజర్ రైల్లోనే వస్తుంటారు. కంటకాపల్లిిక చెందిన రవిలాగే నాగేశ్వరావు, ఆయన బావకి ఇవాళ ఆదివారమైనా కూడా పనికి రావాలంటూ పిలుపు వచ్చింది. దాంతో వెళ్లిన వీరిద్దరూ ఈ ప్రమాదానికి గురికాగా, నాగేశ్వరరావు బావ మరణించారు. నాగేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు.
“మేమంతా తాపీ మేస్త్రీలం. ట్రైయిన్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చింది. ఏంటని చూస్తే అంతా పడిపోయి ఉన్నాం. ఆ శబ్దం, దానితో పాటు వచ్చిన పెద్ద కుదుపుకు మా బావ రైల్లోంచి బయటకు పడిపోయాడు. అలాగే చనిపోయాడు. మాలో మేం ఒకొక్కరం సాయం చేసుకుని బయటపడ్డాం. మా బోగీలో ఉన్న మరో ముగ్గురు కనిపించడం లేదు. ఇంకో నలుగురు ఆసుపత్రిలో ఉన్నారు” అని నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
కనిపించకుండా పోయిన తన తోటి మేస్త్రీలను వెతికే పనిలో ఉన్నారు నాగేశ్వరరావు.

‘ఒక్కొక్కరిని బయటకు తీశాం’
రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే తాను మరికొందరిని తీసుకుని ఇక్కడికి వచ్చినట్లు అలమండకు చెందిన అప్పలరాజు చెప్పారు.
అలమండ నుంచి ప్రమాద స్థలం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
“మేంఘటన స్థలానికి వచ్చే సరికి పరిస్థితి భయంకరంగా ఉంది. అసలేం చేయాలో తెలియడం లేదు. తేరుకుని బోగీలలో చిక్కుకున్నవారిని ఒక్కొక్కరిని బయటకు తీయడం ప్రారంభించాం. బయటకు తీసిన వారిని మిగతా వారు ఘటన స్థలం నుంచి రోడ్డుపైకి తీసుకుని వెళ్లారు. అక్కడ నుంచి గాయాలైన వారిని ఆసుపత్రికి, మిగతా వారిని వారు చెప్పిన అడ్రస్ ప్రకారం ఇళ్లలకు పంపించే విధంగా వాహనాలను ఏర్పాటు చేశాం. పోలీసులకు, రైల్వే వాళ్లకు సమాచారం ఇచ్చాం. వాళ్లు వచ్చే వరకు మేం రైలు బోగీలలో చిక్కుకున్న వారికి సహాయం అందిస్తూనే ఉన్నాం” అని అప్పలరాజు బీబీసీతో చెప్పారు.

నేడు ట్రాక్ పునరుద్ధరణ
సహాయ చర్యల్లో భాగంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్లను పంపించారు. వీటిలో ట్రాక్ మరమ్మతులు, ప్రమాద సహాయ చర్యల సామగ్రి ఉన్నాయి.
విజయవాడ, విశాఖ నుంచి కూడా డీఆర్‌ఎంలు తమ సిబ్బందితో ఘటనా ప్రదేశానికి ప్రత్యేక రైలులో బయల్దేరి వచ్చారు. విశాఖ మీదుగా సామర్లకోట వైపు రావాల్సిన పలు రైళ్ల రాక తీవ్ర ఆలస్యం అవున్నట్లు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.
మరణించిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున సహాయం అందించాలని సూచించారు
మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి రూ.రెండు లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నారు.
క్షత్రగాత్రులకు రూ.50,000 చొప్పున సహాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
ప్రమాద స్థలంలో సహాయ చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నానికి ట్రాక్ ను పునరుద్దరించి, రాకపోకలను సాగించేందుకు వీలుగా పనులు చేస్తున్నట్లు రైల్వే సిబ్బంది చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















