పసిఫిక్ మహాసముద్రంలో 38 రోజులు ఒక చిన్న తెప్ప మీద ఆ కుటుంబం ప్రాణాలు ఎలా కాపాడుకుంది?

ఫొటో సోర్స్, DOUGLAS ROBERTSON
డౌగ్లాస్ రాబర్ట్‌సన్ చాలా భయంతో వణికిపోయారు. ఈ భయానికి కారణం నడుము లోతు నీళ్ళల్లో మునిగిపోవడం. నెలకు పైగా తమకు ఆశ్రయం కల్పిస్తూ వస్తోన్న ఒక చిన్న తెప్ప ఎప్పుడు మునుగుతుందో తెలియని పరిస్థితి. కిల్లర్ వేల్స్ (తిమింగలాల) వారున్న చిన్న తెప్ప కిందే అటుఇటూ తిరుగుతున్నాయి.
ప్రపంచమంతా చుట్టేయాలని సముద్రయానం చేస్తోన్న కుటుంబానికి ఎదురైన పరిస్థితి ఇది. ఆ సముద్రయానం వారికి ఒక పీడకలగా మారింది.
‘‘నాకు ఇప్పటికీ ఆ భయం గుర్తుంది. నీటి ఉపరితలంపై చంపుకుతినే తిమింగలాలు ఎలా తిరిగేవో మేం చూశాం. ఒకటి నోరు తెరిచినప్పుడు సముద్రంలోకి రక్తం చిమ్మింది’’ అని ఆ నాటి సంఘటనను డౌగ్లాస్ 50 ఏళ్ల తర్వాత గుర్తుకు చేసుకున్నారు.
ఓడ ప్రమాదం తర్వాత 1972ల్లో డౌగ్లాస్, ఆయన కుటుంబం 38 రోజుల పాటు ఒక చిన్న తెప్పపైనే పసిఫిక్ మహాసముద్రంలో గడిపింది. కేవలం తాబేళ్ల మాంసాన్ని తిని కడుపు నింపుకుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు వారి వద్ద కనీసం సరిపడ తాగునీరు కూడా లేదు.
1969లో సహచరులు లేకుండా ఓడలో ప్రపంచాన్నంతా చుట్టేసిన బ్రిటీష్ వ్యక్తి రాబిన్ నాక్స్ -జాన్‌స్టన్ ఘనతనుసాధించాలన్న తన తండ్రి డౌగల్ రాబర్ట్‌సన్ కోరిక తమకెలా పీడకలగా మారిందో వివరించారు డౌగ్లాస్ రాబర్ట్‌సన్.
మూడేళ్ల పాటు ప్లాన్ చేసిన తర్వాత డౌగ్లాస్ తండ్రి సెంట్రల్ ఇంగ్లాండ్‌లో తమకున్న భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ డబ్బులతో 13 మీటర్ల పొడవైన ఒక చిన్న బోటు లూసెట్‌ను కొనుగోలు చేశారు. ఆ చిన్న బోటు చాలా పాతదని, కానీ మంచి కండీషన్‌లోనే ఉందని డౌగ్లాస్ గుర్తుకు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, NATIONAL MARITIME MUSEUM
లూసెట్ చివరి సముద్రయానం
1970ల్లో పదవీ విరమణ పొందిన నేవి కెప్టెన్ డౌగల్ రాబర్ట్‌సన్ తన భార్య లిన్, 16 ఏళ్ల కొడుకు డౌగ్లాస్, 17 ఏళ్ల కూతురు అన్నెతో, 9 ఏళ్ల కవల పిల్లలు నీల్, సాండీలతో కలిసి ఇంగ్లాండ్‌లోని లీక్‌లో ప్రాంతంలో తమకున్న డెయిరీ ఫామ్‌లో నివసిస్తూ ఉండేవారు.
డెయిరీ ఫామ్‌లో నివసించడం అంత తేలిక కాదని డౌగ్లాస్ గుర్తుకు చేసుకున్నారు. ఇది తమ కుటుంబమంతా కలిసి ప్రపంచాన్ని చుట్టాలనే ఆలోచనకు దోహదం చేసిందన్నారు.
‘‘ఈ ప్రయాణం తన పిల్లలకు యూనివర్సిటీ జీవితంలో విద్యను అందించడానికి ఒక మార్గంగా నిలుస్తుందని నా తండ్రి భావించారు. మా అమ్మ వల్లే నాన్న కూడా వృతిపరమైన జీవితంలో ఉండేవారు. మా అమ్మ నర్సుగా పనిచేసే వారు’’ అని డౌగ్లాస్ చెప్పారు.
అనుకున్న మాదిరిగినే ఈ ప్రయాణానికి కాస్త సమయం, డబ్బులు కావాల్సి ఉంటుంది. బంధువులు ఎన్ని మాటలు అంటున్నప్పటికీ డౌగల్ తన పొలాన్ని అమ్మేసి, ఈ ప్రయాణం చేసేందుకు అనువైన ఓడను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
‘‘మేం ప్రపంచాన్ని చుట్టుముట్టాలని మా తండ్రి కోరుకున్నారు. మేం నివసిస్తున్న తీరుకు అది భిన్నమైన జీవితం’’ అని డౌగ్లాస్ గుర్తుకు చేసుకున్నారు.
తమ ప్రయాణంలో తొలుత పోర్చుగల్‌లోని లిస్బన్‌కు వెళ్లారు. ఆ తర్వాత కానరీ దీవుల్లోని టెనెరిఫేకి వెళ్లారు.
ఈ ప్రయాణం చేస్తోన్న సమయంలో కేవలం 18 ఏళ్లున్న ఒక టినేజర్‌కు కానరీ దీవుల్లో సూర్యున్ని చూడటం నిజంగా ప్రపంచమంతా తాము ప్రయాణిస్తున్నామని అర్థం చేసునేందుకు సహకరించింది.

ఫొటో సోర్స్, HE LAST VOYAGE OF THE LUCETTE (BOOK BY DOUGLAS ROBERTSON)
15 నిమిషాల భయానక సంఘటన
కరేబియన్‌లోని బహమాస్ చేరుకున్న తర్వాత, 20 ఏళ్ల అన్నా అనే వ్యక్తిని కలుసుకున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. వారి కుటుంబం జమైకా దాటి, పనామా కాలువ గుండా ప్రయాణించింది.
ఈ ప్రయాణంలో ఆ సందర్భంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుకు చేసుకున్నారు డౌగ్లాస్. ‘‘15 మీటర్ల పొడవున్న పెద్ద తిమింగలం వారి బోటు దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించింది. దాని కుహరం నుంచి వచ్చిన భయంకరమైన వాసన నాకింకా గుర్తుంది. కుళ్లిన బ్రస్సెల్స్ మొలకలు వాసన మాదిరి ఉంది. దీని వాసన బోటు అంతా వ్యాపించింది. ఆ తర్వాత అది వెళ్లిపోయింది’’ అని చెప్పారు.
15 నిమిషాల పాటు ఈ భయానక సంఘటన జరిగింది. ఆ తర్వాత గాలాపాగోస్ దీవుల్లో, అక్కడి నుంచి ఫ్రెంచ్ పాలినేషియాలోని మార్క్వెసాస్ దీవుల్లో 45 రోజుల పాటు ప్రయాణం సాగించినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఓర్కాస్ దాడి
‘‘ఆ రోజు 1972 జూన్ 15 ఉదయం పది అవుతుంది. బ్యాంగ్, బ్యాంగ్, బ్యాంగ్ అనే అరుపులను మేం విన్నాం. మమ్మల్ని ఏం తాకిందో మేం గుర్తించలేకపోయాం’’ అని డౌగ్లాస్ గుర్తుకు చేసుకున్నారు.
తాను, తన సోదరుడు బోటు అంచుపై కూర్చున్నప్పుడు, ఓర్కాస్(కిల్లర్ వేల్స్) సమూహం ఒకటి నీటిలో నుంచి బయటకి రావడం చూశాం. బోటును ఢీకొన్న తర్వాత ఒక దాని తలకు అయిన గాయం నుంచి రక్తం చిమ్ముతుంది. అది బోటును నీటిలో పూర్తిగా పైకి ఎత్తి పూర్తిగా కదిలించింది’’ అని డౌగ్లాస్ చెప్పారు.
డౌగ్లాస్ పరిగెత్తుకుంటూ తన తండ్రి కోసం వెతికారు. బోటు మునిగిపోతుందని చెప్పేలోపే, అప్పటికే వారి నడుము వరకు నీరు చేరిందని గుర్తుకు చేసుకున్నారు.
‘‘బోటును విడిచిపెట్టు అని నాన్న చెప్పారు. కానీ బోటును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లాలి?’’ అని డౌగ్లాస్‌కు అర్థం కాలేదు.
ఆ ప్రమాద షాక్ నుంచి బయటికి వచ్చి, కానరీ దీవుల్లో తాము కొన్న రెండు తెప్పల వైపుకి పరిగెత్తానని డౌగ్లాస్ చెప్పారు. బోటు పూర్తిగా మునిగిపోవడానికి పట్టిన కొన్ని నిమిషాల్లోనే, బోటు బిల్లు, కత్తి, 10 ఆరెంజ్‌లు, 6 నిమ్మకాయలు, మంట అంటించేవి చేతికి అందినవి పట్టుకుని తన తల్లి లిన్ తెప్పపైకి ఎక్కారు.
‘‘తెప్పైకి వెళ్లిన చివరి వ్యక్తి నేనే. కవల పిల్లలు ఏడుస్తున్నట్లు నేను చూశాను. కానీ, వారు భయంతో ఏడవలేదు. లూసెట్‌ను పోగొట్టుకున్నందుకు వారు ఏడుస్తున్నారు’’ అని లిన్ అప్పట్లో చెప్పారు.
ఓర్కాస్ పూర్తిగా వారికి దూరంగా వెళ్లిపోయినప్పుడు, ఆ కుటుంబం రెండు చిన్న తెప్పలపై పసిఫిక్ మహాసముద్రంలో ఒక తెలియని ప్రదేశంలోకి చేరింది.

ఫొటో సోర్స్, DOUGLAS ROBERTSON
కఠినమైన వ్యక్తిత్వం
తన తండ్రి డౌగల్ రాబర్ట్‌సన్ వ్యక్తిత్వాన్ని డౌగ్లాస్ గుర్తుకు చేసుకున్నారు. ఆయనెంత కఠినమైన మనిషో చెప్పారు.
సముద్రంలో ప్రతీది కోల్పోయిన తర్వాత, దైవభక్తి కలిగి ఉన్న లిన్ తన పిల్లలతో కలిసి దేవుణ్ని ప్రార్థించారు.
వారి ప్రార్థనలలో డౌగల్ రాబర్ట్‌సన్ చేరలేదు. ప్రార్థనలు చేసుకునేందుకు రావాలని పిలిచినప్పుడు, తన తండ్రి స్పందన ఎంత కఠినంగా ఉందో గుర్తుకు చేశారు. ‘‘నేను నాస్తికుడిని, దేవుణ్ని నమ్మను అని చెప్పారు’’ అని అన్నారు.
ప్రార్థనల తర్వాత, మునిగిపోయిన బోటు నుంచి కొన్ని వస్తువులను తాము పొందగలిగామని చెప్పారు.
అవి నీటి ఉపరితలంపైన తేలియాడేందుకు సాయపడ్డాయన్నారు.
ఈ ప్రమాదకరమైన క్షణాలను అధిగమించిన తర్వాత, నాన్నా మనం బతుకుతామా? అని డౌగ్లాస్ అడిగారు.
‘‘మా తండ్రి మమ్మల్ని చూసి, ఇలాంటి సమయంలో నా కుటుంబానికి అబద్ధం చెప్పే అర్హత నాకు లేదన్నారు. మాకు నిజం చెప్పాల్సి ఉందన్నారు. మనం బతికి ఉన్నామంటే మనమంతా అదృష్టవంతులమని చెప్పారు. కానీ, మనం ఎక్కువ కాలం ఇలా ఉండలేం అన్నారు’’ అని డౌగ్లాస్ చెప్పారు.
డౌగ్లాస్ తన తండ్రి సాధ్యమైనంత వరకు తమకు పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆయన అంచనా ప్రకారం వారి వద్ద 10 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉందన్నారు. అలాగే తమకొక ప్లాన్‌ను వివరించారని చెప్పారు.
‘‘కొన్ని కంటైనర్ల నీటిని తీసుకుని, చిన్న తెప్పలలో ఒకదానిలో గాలాపాగోస్ దీవుల వైపుకి వెళ్లమని చెప్పారు. మా పరిస్థితిని వివరించమని చెప్పారు’’ అని గుర్తకు చేసుకున్నారు.
కానీ, ఇది సరైన ఆప్షన్ కాదని డౌగ్లాస్‌కు అర్థమైంది. వెంటనే డౌగ్లాస్.. ‘‘నాన్న నేను అలా చేయను. ఒంటరిగా వెళ్లడం కంటే మీతో పాటు ఇక్కడే చనిపోతాను. ఆయన నన్ను కొడతారని అనుకున్నాను. కానీ, నన్ను చూసి, క్షమించి డౌగ్లాస్. ఇలా చేయమని నేనిప్పుడూ నిన్ను అడగను అన్నారు’’ అని చెప్పారు.
తన జీవితంలో తొలిసారి కొడుకును క్షమాపణ కోరారని డౌగ్లాస్ తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎలా బతికి బయటపడ్డారు..?
ఈ పరిస్థితుల్లో వారు మనుగడ సాధించడానికి నీరు అవసరం ఉంది. కేవలం 10 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఆ కుటుంబం వద్ద ఉంది. కానీ, గాలాపాగోస్ దీవులకు వెళ్లేందుకు 20 రోజులు పడుతుంది. ఆ సమయంలో వారికి వరంగా వర్షం పడింది.
తెప్పకు దగ్గరకు వచ్చిన తాబేలు వారికి ఆహారంగా మారింది. కానీ, అదంతా సులభంగా జరగలేదు.
మళ్లీ నీటి కొరత ఏర్పడినప్పుడు, తెప్పపై ఉన్న రక్తం, గ్రీస్‌తో కలిసిన మురికి వర్షపు నీటిని తాగాలని వారి అమ్మ సూచించారు. ఎనిమాల ద్వారా వాటిని తీసుకోవాలని చెప్పారు.
ఎనిమా ద్వారా అలా ఆ నీటిని తీసుకోగలిగామని డౌగ్లాస్ చెప్పారు. ఇలా తీసుకున్నప్పుడు కడుపు విషపూరితమైన వాటిని గ్రహించదని తెలిపారు. ఇది అచ్చం ఫిల్టర్ మాదిరి పనిచేస్తుందన్నారు.
అప్పుడు బతికేందుకు తాము నేర్చుకున్న అంశాలతో తిరిగి వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్ తెరుస్తామని జోక్ చేసేవాళ్లమన్నారు.
‘‘మేం కోస్టా రికాకు వెళ్లేటప్పుడు, ఎలా బయటపడాలనే ఆలోచనను పూర్తిగా మర్చిపోయాం. రెస్టారెంట్ గురించే మాట్లాడుకుంటూ వచ్చాం’’ అని గుర్తుకు చేసుకున్నామన్నారు.
ఆ సమయంలో ఒక ఓడ తమ్మల్ని రక్షించడానికి వచ్చిందనే దాదాపు మర్చిపోయామన్నారు. తిరిగి వెంటనే తాము ఎలా బయటపడాలి, కోస్టా రికాకు ఎలా చేరుకోవాలనే దానిపై దృష్టిపెట్టామని తెలిపారు.
‘‘డౌగల్ లేచి మంటలు వెలిగించేందుకు వెళ్లారు. కానీ, మొదటిసారి మంటలు వెలిగించినప్పుడు, ఆ ఓడ తన ప్రయాణాన్ని సాగిస్తోంది. రెండోసారి వెలిగించాం. ఓడ తన ప్రయాణం మార్చుకుందని అర్థమైంది. అది 20 డిగ్రీలకు మరిలింది. కానీ, మా వైపుకి కాదు. వెంటనే మరో 20 డిగ్రీలు మరిలింది. ఎలాంటి కారణం లేకుండా ఇలా ఒక బోటు సముద్రంలో ఇలా తిరగదు అని నాకనిపించింది. అప్పుడే హారన్ మోగింది’’ అని డౌగ్లాస్ తెలిపారు.
"వారు మమ్మల్ని రక్షించడానికి వస్తున్నారు. మేము 38 రోజులుగా ఎదురుచూస్తున్న క్షణమది" అని గుర్తుకు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, DOUGLAS ROBERTSON
వారు తిరిగి పనామా నగరానికి చేరుకున్నప్పుడు, అంతర్జాతీయ మీడియాకు వారి స్టోరీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత వారు ఒక రెస్టారెంట్‌కి వెళ్లి, కడుపు నిండా తిన్నారు. సరైన ఆహారం, నీరు లేనప్పటికీ, ఆశ్చర్యకరంగా ఆ కుటుంబం పూర్తి ఆరోగ్యంగా ఉంది.
కొన్ని రోజుల తర్వాత వారు బోటులోనే తిరిగి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు.
తన తల్లిదండ్రులు తమల్ని ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంచడం వల్ల ఆ బాధ నుంచి బయటపడలేకపోయారని, ఆ కారణంతోనే విడాకులు తీసుకున్నారని డౌగ్లాస్ భావిస్తారు.
లిన్ తిరిగి తమ పొలానికి వెళ్లిపోతే, డౌగల్ తమ ఈ ప్రయాణం గురించి ఒక పుస్తకం రాశారు. మధ్యధరా సముద్రంలో పడవలో తన మిగిలిన జీవితాన్ని గడిపారు.
డౌగ్లాస్ నౌకాదళంలో చేరారు. ఆ తర్వాత పడవలను విక్రయించారు. తన సముద్రయానం గురించి ‘‘ది లాస్ట్ వాయేజ్ ఆఫ్ ది లూసెట్’’ అనే పుస్తకం రాశారు. సముద్రంపైన తాను నేర్చుకున్న అంశాలు తన మిగిలిన జీవితానికి మార్గనిర్దేశం చేశాయన్నారు.
ఇవి కూడా చదవండి:
- గాజాపై దాడులు: ‘పరిస్థితి ఘోరంగా ఉంది, గాజా ఈ భూమితో సంబంధాలు కోల్పోయింది’
- గాజాలో బాంబు పేలుళ్ళ నడుమ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కథ
- ఖతార్‌లో మరణశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులను ఆదుకోగలమా... భారత్ ముందున్నసవాళ్లేంటి?
- విశాఖలో తొలి విద్యుత్ దీపం ఎప్పుడు వెలిగింది... దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి?
- పాకాల సుగుణాకర్: ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారుల్లో ఒకరైన ఈ విశాఖ వాసి బంధువులు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














