జెహోవా విట్‌నెస్: ఇంగ్లిష్ టీచర్ ఎందుకు బాంబులు పెట్టారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళలోని కోచి సమీపంలో 'జెహోవా విట్‌నెస్' సమావేశంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. బాంబు పెట్టినట్లు చెప్పి, లొంగిపోయిన వ్యక్తి నేపథ్యం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేసిన ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని, ఎవరితోనూ గొడవలు పెట్టుకోరని, కూతురి పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవారని తెలిసిన వారు చెబుతున్నారు.
అలాంటి వ్యక్తి బాంబు పెట్టేంత దూరం ఎలా వెళ్లగలిగారు? అసలు ఈ 'జెహోవా విట్‌నెస్' చరిత్ర ఏంటి?
ఏం జరిగింది?
కేరళలోని కోచి సమీపంలోని కలమచ్చేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో అక్టోబర్ 27 నుంచి 'జెహోవా విట్‌నెస్' సమావేశాలు నిర్వహించారు.
ఆ రోజు ఉదయం 9.40 గంటలకు పేలుళ్లు సంభవించినప్పుడు దాదాపు 2,500 మంది ప్రజలు అక్కడ ఉన్నారు.
పేలుడులో కుమారి పుష్పన్ అనే 54 ఏళ్ల మహిళ మరణించడంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
"ఇంత సీరియస్ అనుకోలేదు. ఇక్కడికి వచ్చాక మా అమ్మ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాసేపటికి మా అమ్మను చూపించారు. ఆమె శరీరం 90 శాతం కాలిపోయింది. శ్వాస కూడా తీసుకోలేకపోయింది. ఆమె కిడ్నీ పాడైపోయింది. రక్తపోటు తగ్గిపోయింది. ఎక్కువసేపు బతకదని అర్థమైపోయింది" అని ఏడుస్తూ చెప్పారు పుష్పన్ కొడుకు శ్రీరాజా.
కుమారి పుష్పన్ స్వస్థలం ఇడుక్కి జిల్లా తోటుపుజా. వారిది హిందూ కుటుంబం. అయితే కుటుంబంలో ఆమె మాత్రమే 'జెహోవా విట్‌నెస్' విశ్వసించారు.
"నాకు ఏ మతంపైనా పెద్దగా విశ్వాసం లేదు. మా అమ్మకు కుటుంబం నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆమెకు ఇక్కడ ఓదార్పు, సంతోషం దొరికింది. అది ఆమె వ్యక్తిగత విషయంగా వదిలేశాం" అని శ్రీ రాజా తెలిపారు.

షాక్‌లోనే బాధితులు
ఈ ప్రమాదంలో పెంబవూరు ఇరింగోళకు చెందిన లియోనా పాలోస్ కూడా మరణించారు. ఆమె మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాన్ని అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రమాదంలో 12 ఏళ్ల లిపినా అనే బాలిక కూడా మృతి చెందింది. ఘటనలో ఆమె తల్లి, సోదరుడు కూడా గాయపడ్డారు. అయితే ఇరువురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.
ఘటన జరిగినపుడు అక్కడున్న ప్రజలు ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు.
ఆ సమయంలో ఘటనా ప్రాంతంలో ఉన్న క్వీన్ రిచర్డ్ అనే వ్యక్తి బీబీసీతో మాట్లాడారు. మొదట పేలుడు శబ్ధం వినిపించిందని, తర్వాత మంటలు వ్యాపించడంతో షార్ట్ సర్క్యూట్ అనుకున్నానని క్వీన్ రిచర్డ్ అన్నారు.
''అప్పుడు ఉదయం 9:38 గంటలు అయింది. మేం లోపల కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో ప్రార్థన మొదలైంది. అలా కళ్లు మూసుకొని ప్రార్థన చేస్తుండగానే, హాల్ మధ్యలో ఒక్కసారిగా పేలుడు జరిగింది.
చాలా పెద్ద మంటలు వచ్చాయి. అయితే మేం దాన్ని షార్ట్ సర్క్యూట్ అనుకున్నాం'' అని చెప్పారు.
ఆ ఘటన నుంచి ఎలా తప్పించుకున్నారో క్వీన్ రిచర్డ్ వివరిస్తూ ''మాకేం అర్థం కాలేదు. భయంకరమైన పొగ ఆవహించింది. నా భర్త వికలాంగుడు, చాలా కష్టంగా బయటపడ్డాం. అలా బయటికి రాగానే కళ్లు తిరిగి పడిపోయా.
ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చినా శరీరమంతా నొప్పిగా ఉంది. ఇది ఇప్పటికీ బాధిస్తోంది'' అని తెలిపారు.
కలమచేరికి చెందిన జాషువా కూడా ఘటనా సమయంలో అక్కడున్నారు.
"నేను యెహోవాను నమ్ముతాను. ప్రార్థన ప్రారంభించిన కొద్దిసేపటికే పేలుడు జరిగింది. ఆ సమయంలో ఎవరికీ ఏమీ తెలియదు. నేను మెయిన్ గేట్ దగ్గరకు రాగానే మరో బాంబు పేలింది. కాసేపటి తర్వాత అది పేలుడు అని అర్థమైంది" అన్నారు జాషువా.
ఆ షాక్ నుంచి మెల్లగా తేరుకుంటున్న ‘జెహోవా విట్‌నెస్’ విశ్వాసులు కన్వెన్షన్ హాల్ నుంచి వాహనాలను తీసుకెళ్లడం మొదలుపెట్టారు.
ఈ కేసును కేరళ పోలీసులతో పాటు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. 8 మంది సభ్యుల బృందం ఆధారాలు సేకరించేందుకు పేలుడు స్థలానికి చేరుకుంది.

విచారణ ఏ దశలో ఉంది?
కొచ్చిలోని తమ్మనం ప్రాంతానికి చెందిన డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి పేలుడు తానే చేశానని ఆదివారం మధ్యాహ్నం లొంగిపోయారు.
దీంతో దర్యాప్తు బృందం ఆయనను అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించారు.
డొమినిక్ గత రెండేళ్లుగా కేరళకు రాలేదు. ఆయన ఎవరిని కలిశారు, విదేశాల్లో ఉండి ఏం చేస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుంటున్నారు పోలీసులు.
డొమినిక్ ఫేస్‌బుక్ పోస్టులను పరిశీలిస్తున్నారు. స్నేహితులు, బంధువులను విచారిస్తున్నారు. కాగా, తమ ప్రాంతంలో తిరిగే వ్యక్తి ఈ పనికి పాల్పడ్డారంటే ఆ ప్రాంత వాసులు నమ్మలేకపోతున్నారు.
నిందితుడు ఒక ఇంగ్లిష్ టీచర్
డమ్మామ్‌లోని ఇరుకైన వీధిలో ఇల్లు అద్దెకు తీసుకొని డొమినిక్ మార్టిన్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఘటనపై డొమినిక్ మార్టిన్ ఇంటి యజమాని బీఏ జలీల్ షాకయ్యారు.
"డొమినిక్ ఐదారేళ్ల క్రితం ఇక్కడికి మారారు. ఆయన ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేసేవారు. కరోనా కాలంలో పని లేకపోవడంతో విదేశాలకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చి రెండు నెలలే అయ్యింది. ఇరుగుపొరుగు వారితో కూడా ఆయన ఎప్పుడూ గొడవలు పెట్టుకోలేదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. డొమినిక్ భార్యే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు” అని జలీల్ చెప్పారు.ఆదివారం ఒక్కసారిగా తన ఇంటికి పోలీసులు రావడంతో జలీల్ కూడా షాకయ్యారు.
‘‘రెండు మూడు రోజుల క్రితం గ్రిల్ ఓవెన్ కొన్నారు డొమినిక్. ఎందుకని అడిగితే.. తన కూతురికి చికెన్ గ్రిల్ ఇష్టం కాబట్టి కొన్నానన్నారు. ఆమెకి కొన్ని నెలల క్రితం డెంగ్యూ వచ్చింది. అందుకే విదేశాల నుంచి తిరిగి వచ్చారు డొమినిక్'' అని అన్నారు జలీల్.
డొమినిక్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు యూకేలో ఉన్నారు. కూతురు కొచ్చిలో ఉద్యోగం చేస్తున్నారు. డొమినిక్ ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో స్కూటర్ వేసుకొని ఇంటి నుంచి బయలుదేరారు.
"ఆయనది క్రిస్టియన్ మతం. ఏ వర్గానికి చెందినవాడో తెలియదు. యాహోవా గురించి నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఫేస్‌బుక్‌లో మాట్లాడిన తర్వాత, ఇలా చేశారని ఆయన భార్యకు మాత్రమే తెలుసు" అని జలీల్ చెప్పారు.

నిందితుడికీ 'జెహోవా విట్‌నెస్' గ్రూప్‌కు సంబంధమేంటి?
డొమినిక్ 16 ఏళ్ల క్రితం 'జెహోవా విట్‌నెస్' గ్రూపులో చేరారు. ఆరేళ్లుగా గ్రూపుపై అసంతృప్తితో ఉన్నానని అందుకే ఇలా చేశానన్నారు.
''మత విశ్వాసాలని చెబుతూ ఈ గ్రూపు తప్పు చేస్తున్నట్టు అనిపించింది. అలాగే, వాళ్లు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా సరికాదు. దేశ వ్యతిరేక బోధనలు చేస్తున్నారు'' అని డొమినిక్ ఆరోపించారు.
''ఒకసారి తన క్లాస్‌మేట్ మిఠాయి ఇస్తే తీసుకోవద్దని నాలుగేళ్ల చిన్నారికి చెప్పారు. అంత చిన్న వయసులో క్లాస్‌మేట్స్‌పై ద్వేషం నింపడం, పసి మనసులను విషపూరితం చేయడమే'' అని డొమినిక్ అన్నారు.
డొమినిక్‌ని అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటన గురించి మీడియాతో మాట్లాడేందుకు 'జెహోవా విట్‌నెస్' సభ్యులు నిరాకరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ 'జెహోవా విట్‌నెస్' గ్రూపు ఎలా ఏర్పడింది?
'జెహోవా విట్‌నెస్' గ్రూపు వాళ్లు తమను తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు. అయితే ఇతర క్రిస్టియన్లు వారిని క్రైస్తవులుగా అంగీకరించడం లేదు.
జెహోవా విట్‌నెస్ ప్రజలు యెహోవాను తప్ప మరెవరినీ తమ దేవుడిగా అంగీకరించరు. వాళ్లు యేసుక్రీస్తునూ అంగీకరిస్తారు. కానీ, ఆయనను పూజించరు. యెహోవాను మాత్రమే ఆరాధించాలనేది వారి నమ్మకం.
వీళ్లు క్రిస్మస్ జరుపుకోరు. శిలువను పూజించరు. తండ్రి, దేవుడు, పవిత్రాత్మను అంగీకరించరు. క్రైస్తవ మతంలోని ఇతర వర్గాల వారు బైబిల్ పూర్తిగా అర్థం చేసుకోలేదని ఆరోపిస్తుంటారు. వీళ్లు 1961 వరకు కింగ్ జేమ్స్ అనువాదం చేసిన బైబిల్ చదివేవారు. ఈ అనువాదం సరిగా లేదని ఆరోపిస్తూ ఆ తర్వాత 'న్యూవరల్డ్ ట్రాన్స్ లేషన్' వర్షెన్ చదవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
1870లలో అమెరికాలో చార్లెస్ డే రస్సెల్ అనుచరుల ఆధ్వర్యంలో బైబిల్ విద్యార్థి ఉద్యమంగా ఇది ప్రారంభమైంది.
1881లో ఈ శాఖ సభ్యులు ఇంగ్లండ్ వెళ్లారు. 1900లో లండన్‌లో మొదటి విదేశీ శాఖ ప్రారంభించారు. తరువాత కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాతో సహా వివిధ దేశాల్లో దీని శాఖలు ఏర్పాటుచేశారు.
1916లో రస్సెల్ మరణానంతరం ఆ గ్రూపులో విభజనలు ఏర్పడ్డాయి. జోసెఫ్ రూథర్‌ఫోర్డ్ నేతృత్వంలోని విభాగం ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది.
అనంతరం గ్రూపులో అనేక సైద్ధాంతిక మార్పులు వచ్చాయి. 1931లో ఆ వర్గానికి 'జెహోవా విట్‌నెస్' అని పేరు పెట్టారు.
ఈ కాలంలోనే రక్తదానం నిషేధించారు. మంచి చెడుల మధ్య మహాయుద్ధం రాబోతోందని కూడా ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రూపుపై చాలా దేశాల్లో నిషేధం
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ, సోవియట్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియాలలో ఈ శాఖలను నిషేధించారు. వారిపై అనేక దాడులు జరిగాయి.
కోర్టుల జోక్యంతో వారి పుస్తకాలను ఇంటింటికీ పంపిణీ చేసే హక్కును పొందారు. జెండా వందనం చేయని హక్కు కూడా వారికి లభించింది. అయితే, చాలా దేశాలు ఈ గ్రూప్‌పై కొన్ని ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మంది ఈ వర్గానికి చెందిన వారున్నట్లు అంచనా. ఈ గ్రూపు ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
తాము ఎలాంటి రాజకీయ వైఖరిని తీసుకోబోమని ఈ వర్గాలు తేల్చిచెప్పాయి. అదేవిధంగా ఓటు వేయడం లేదన్న ఆరోపణా వీరిపై ఉంది.
1985లో కేరళలో ఈ గ్రూప్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ గీతం ఆలపించకపోవడంతో వారిని స్కూల్ నుంచి తొలగించారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో వారికి మళ్లీ అడ్మిషన్ దొరికింది.
ఇవి కూడా చదవండి
- పాకిస్తాన్ నుంచి మనుషుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్‌తో స్మగ్లర్ ఆజం చెప్పిన సీక్రెట్స్...
- గాజాపై దాడులు: ‘పరిస్థితి ఘోరంగా ఉంది, గాజా ఈ భూమితో సంబంధాలు కోల్పోయింది’
- గాజాలో బాంబు పేలుళ్ళ నడుమ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కథ
- ఖతార్‌లో మరణశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులను ఆదుకోగలమా... భారత్ ముందున్నసవాళ్లేంటి?
- విశాఖలో తొలి విద్యుత్ దీపం ఎప్పుడు వెలిగింది... దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














