గాజా: ‘ఆకలితో ఉన్నాం... మాకు మరో దారి లేదు’

ఫొటో సోర్స్, AFP
‘పరిస్థితి చేయి దాటి పోతోంది.’
గాజాలో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి చేసిన వ్యాఖ్య ఇది.
ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సహాయ సామగ్రి గోడౌన్లపై గాజాకు చెందిన వేలమంది ప్రజలు ఆదివారం నాడు దాడి చేశారు.
పిండి, గోధుమలు, సబ్బుల వంటి నిత్యావసర వస్తువులున్న గోడౌన్‌ను ప్రజలు దోచుకున్నారని పాలస్తీనియన్ల కోసం పని చేసే ఐక్యరాజ్య సమితి సహాయ సంస్థ (యూఎన్ రిలీఫ్ ఏజెన్సీ) తెలిపింది.
గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్యలను ముమ్మరం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
గాజా స్ట్రిప్‌లో ఉన్న దాదాపు 24 లక్షలమంది ప్రజలలో సగానికి పైగా ప్రజలు స్వస్థలాల నుంచి నుంచి వెళ్లిపోయారని, వేలాది భవనాలు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడులను నిర్వహిస్తోంది.

నిరాశా నిస్పృహల్లో ప్రజలు
గాజా ప్రజలకు ఐక్యరాజ్య సమితి అందించే సహాయ సామాగ్రిని నిల్వ ఉంచే గోడౌన్ గాజా స్ట్రిప్‌లోని డీర్ అల్-బలాలో ఉంది. ఈ గోడౌన్‌కు ఐక్య రాజ్య సమితి నిరంతరం సహాయ సామాగ్రిని చేరవేస్తుంటుంది.
గాజాలో ఐక్యరాజ్య సమితి నిర్మించిన డిపోల్లో రెండో పెద్ద డిపో ఇది.
అయితే, జనం ఒక్కసారిగా ఎగబడి ఇందులో ఉన్న పిండి, గోధుమలు, డిటర్జెంట్లు, పౌడర్లను ఎత్తుకెళ్లారని యూఎన్ ఏజెన్సీ వెల్లడించింది.
‘‘జనం ఎంత అసహనంగా ఉన్నారో గోడౌన్ల దోపిడీ వ్యవహారం చెప్పకనే చెబుతోంది’’ అని ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) సీనియర్ ప్రతినిధి అబీర్ ఎటెఫా బీబీసీతో అన్నారు.
‘‘ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జనం నిరాశగానూ, అసహనంగానూ, ఆకలితోనూ ఉన్నారు’’ అని ఎటెఫా అన్నారు.
ఇక్కడి నుంచి సరుకులను ఎత్తుకెళుతున్న కొందరు వ్యక్తులు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘మాకు పిండి లేదు, సహాయం అందడం లేదు, నీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు’’ అని అన్నారు.
"మా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రపంచ ప్రజలు మాకు సాయం చేయాలని కోరుతున్నాం. అన్ని అంతర్జాతీయ శక్తులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. సరైన సమయంలో మాకు సాయం అందితే ఇలా చేసే పరిస్థితి వచ్చేది కాదు’’ అని గాజా నివాసి అబ్దుల్‌రహ్మాన్ అల్-కిలానీ అన్నారు.

సహాయాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్
తమపై హమాస్ దాడి తర్వాత గాజాలోకి సహాయ సామగ్రిని రానివ్వడం లేదు ఇజ్రాయెల్. సహాయ సామగ్రిని లోపలికి అనుమతిస్తే హమాస్ వాటిని వాడుకునే అవకాశం ఉంటుందన్నది ఇజ్రాయెల్ ఆందోళన.
అయితే, రాబోయే రోజుల్లో స్ట్రిప్‌లోకి మరింత సహాయ సామాగ్రిని అనుమతిస్తామని తాజాగా ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు.
ఈజిప్ట్, అమెరికాల నుంచి వచ్చే మానవతా సహాయాన్ని ఆదివారం నుంచి గాజాలోకి మరిన్ని ప్రాంతాలకు వెళ్లేలా చూస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రకటనలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి అన్నారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఆయన ఇవ్వలేదు.
భద్రతా తనిఖీల పేరుతో గాజాకు వెళ్లే సహాయ సామాగ్రిని ఇజ్రాయెల్ అడ్డుకుంటోందని ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ అబు జైద్ ఆరోపించారు.
ఇదిలావుండగా, గాజా ప్రజలలో గంటగంటకు అసహనం, నైరాశ్యం పెరిగిపోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.
"20 లక్షలకు పైగా ప్రజలు ఎక్కడికి వెళ్లే మార్గం లేకుండా మూసేసి, కనికరం లేకుండా బాంబు దాడులు జరుపుతున్నారు. వారికి ఆహారం, నీరు, ఇల్లు, వైద్యాలను అందకుండా చేస్తున్నారు. బాధ్యత కలిగిన వారంతా ఇలాంటి పరిస్థితుల నుంచి గాజా ప్రజలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి’’అని ఐక్యరాజ్య సమితి అధిపతి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ: ఏ తప్పూ చేయకున్నా 54 రోజులు జైలు... వ్యక్తి జీవితంతో ఆడుకున్న 'సీసీటీవీ ఫోటో'
- కేరళ బోటు ప్రమాదం: 'మా కుటుంబంలో 11 మంది చనిపోయారు.. వాళ్లంతా చివరి క్షణంలో పడవ ఎక్కారు'
- కోచి - నరేంద్ర మోదీ: వాటర్ మెట్రో అంటే ఏంటి? ఏం సౌకర్యాలు ఉంటాయి? టికెట్ ఎంత?
- తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















